పురాతన వీధిలో నుంచి నన్ను పిలవకు
బాధలో మునిగిన విషాదగీతం వినిపించకు
అశ్రుపూరితమైన కవిత వినిపించకు
విరిగిన మనసును ఇంకా విరగ్గొట్టకు
గతించిన దినాల జ్ఞాపకాలలో
పురాతనమైన రాగాన్ని నేను మరచాను
ఒక కొత్త మజిలీకి నేను చేరుకున్నాను
పాత ఉనికి నేను మరచాను
ఆ పురాతన హృదయాన్ని విడిచాను
ఆ పురాతన ధర్మాన్ని విడిచాను
పాప ప్రక్షాళన చేసుకున్నాను
పురాతన బంధనాలు తెగిపోయాయి
ఏ సంకెళ్లూ నా కాళ్లకు లేవు
అద్దంలాంటి మనసులో ఏ బొమ్మా లేదు
అన్నిటినుంచి విముక్తి పొందాను
జీవితం మారిపోయింది
ప్రపంచం మారిపోయింది
మనసుకు విలువైన జ్ఞాననిధి దొరికింది
నాలో నాకే కొత్త మనిషి ఆవిష్కరించాను
కొత్త దారిలో పయనం కొనసాగిస్తున్నాను
మలినం కడిగేసుకున్నాను
శాంతి మంత్రం జపిస్తున్నాను
ఇపుడు నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను
-అరుణ డేనియల్
అరహస్యం
-ఎమ్వీ రామిరెడ్డి
1
ఆఖరి నూలుపోగును కూడా ఒలిచేశారు
గోచిపాతల్ని ఎప్పుడో ఊడబెరికారు
వస్త్రాపహరణాన్ని చట్టబద్ధం చేశారు
తలుపులు తగలబెట్టి, బూడిద వీథుల్లో చల్లారు
గవాక్షాల ఇనుప ఊచలకి చెదలెక్కించి తినేశారు
రహస్యమనే పదం
నిఘంటువు గోడలు దూకి చావుసవారీ చేస్తోంది
2
తీర్పులివ్వటం పాపం
వార్తాప్రసారం పాపం
హక్కుల గురించి అరవటం
అధికారాల గురించి గర్జించటం
మహా పాపం
ప్రశ్నల కొడవళ్లకు సానబెట్టడమూ
నినాదాల కత్తులు నూరటమూ గూఢచర్యమే
గూఢచర్యం మహా పాపాతి పాపం
పాపప్రక్షాళన ఏలినవారి తక్షణ కర్తవ్యం
పాపుల నగ్నత్వాన్ని విముక్తం చెయ్యటానికి
గ్లోబల్ టెండర్లే గత్యంతరం
3
మన నిలువెల్లా మొలుచుకొచ్చిన
సరికొత్త సాంకేతికావయవాలు
స్పైవేర్ జ్వరంతో వణుకుతుంటాయి
అత్యాధునిక సమాచార స్వర్గధామాలు
మరుగుతున్న నూనెలో వేగుతుంటాయి
గేట్లు బార్లా తెరిచి రక్తపరీక్షల ఫలితాలను
బహిరంగ మార్కెట్లో ప్రదర్శనకు పెడుతుంటాయి
సమస్త గుట్టుమట్టుల్నీ మట్టుబెట్టడమే
రట్టు చెయ్యటమే అనాది వారసత్వం
4
రాజముద్రల కనుసైగలతో
సర్వర్లు శరసంధానం చేస్తాయి
చీమునెత్తుర్ల దేహలక్ష్యాలను చీల్చుకుంటూ
చీకటి సహజత్వాన్నీ హ్యాకింగ్‌లో ఉరితీస్తాయి
ఉపగ్రహాల ఉచ్ఛ్వాసనిశ్వాసలు
పడకగదుల్లోనూ ప్రతిధ్వనిస్తాయి
ఉన్నపళంగా ఉన్ని కోల్పోయిన గొర్రెల్లా
ఎముకలు మాత్రమే మిగిలిన చర్మావృతులు
కనీసం కప్పుకొనే కంబళ్ల కోసం
కంఠనాళాలను ప్లకార్డుల్లా ధరించి
రాజప్రాసాదాలను ముట్టడిస్తారు
5
ఆఖరి నూలుపోగును కూడా ఒలిచేశారు
అనాచ్ఛాదిత రహస్యమే ఇక అంతా
Comments
Please login to add a commentAdd a comment