కిన్నెరసాని వచ్చిందమ్మా.. వెన్నెల పైటేసి.. మరిచి పోలేని పాట. విశ్వనాథ కవితలై లోతు కైతల ఊటలై వచ్చినవి కిన్నెరసాని పాటలు. భూమ్మీద మూడువంతుల నీరు ఒకవంతు మాత్రమే నేల ఉంది కదా. పుడమి తల్లి బిడ్డలమైన మన తనువుల్లో మూడువంతుల రక్తం, ఒకవంతు ఎముకలూ ఉన్నాయి. పాట గానరసమై మన రక్తంలో ప్రవేశించి ప్రవహిస్తుంది. హృదయాణువుల్ని కదుపుతుంది.
విశ్వనాథ సత్యనారాయణ ఒకవైపు ‘పాషాణ పాకి’ అని శ్రీశ్రీచే చెప్పబడ్డ కవి. సర్వసాహితీ ప్రక్రియల్లో శిఖరాయమాన రచనలు చేసిన దిట్ట శ్రీమద్రామాయణ కల్ప వృక్షం వంటి ప్రౌఢ పద్య కావ్య నిర్మాత విశ్వనాథ జానపదుని అవతారమెత్తి జానపద పాటలా అన్నంతగా కిన్నెరసాని పాటల్ని తెలుగు పలుకుబడి అనే అందచందాల వేదికపై గాయకుడై గానం చేశా రు. ఆధునిక సమాజానికి ఆయన భావజాలం అవసరం లేదుగాని.. ఆయన కవిత్వ ఇంద్రజాల ఉన్నత ప్రదర్శనలు అందరికీ అవసరమే. అలాంటి కవితా ప్రదర్శన కిన్నెరసాని పాటలు, సాహిత్య సభల్లో ఆయన రామాయణ కల్పవృక్ష పద్యాలు వినిపించడానికి వస్తే మాకు కిన్నెరసాని పాటలు వినిపించండి అని ప్రజలు కోరేవారంటేనే వారెవ్వా ఆ పాటల మజా గ్రహించవచ్చు. లయబద్ధ పదాలు సుళ్లు తిరుగుతాయి. భావాలు ఎక్కడికో తీసుకుపోతాయి. వాక్యాలు రసరమ్యాలౌతాయి. పాఠకుడు లేక శ్రోత గోదావరిని సంగమించే కిన్నెరగా మారి పోయే రసస్థితి.
గోదావరి జాలి గుండె గూడులు కదలి/
సాదుకిన్నెరకెదురుపోయీ/
ఆమె-లోదిగులు తరగ చేదోయీ.
ఇలా సాగుతుందా కిన్నెరసానిని గోదారి ఆ ప్యాయంగా తనలో కలవడానికి ఆహ్వానిస్తుంది.
గోదావరి పేద గుండె లోతులు కలిగి.../
గోదావరి జాలిగుండె ప్రేగులు తడిసి.../
గోదావరి ఎడ ద కోసలను కోతపడి../
గోదావరి దేవి కోసమనసులో వొరసి/
కిన్నెరసానిని పిలిస్తే ఆమె వచ్చి కలుస్తుంది.
ఆదుకొను, పాదుకొను, తలిరుమల్లికలు, పొలుచుటలు/
కోరగించుటలో ఇటువంటి తెలుగు మాటల ప్రయోగాల్లో కిన్నెరసాని గోదావరిలో కలిసిపోతుంది.
గోదావరి దేవి గొప్ప వంశపు రాణి అని, ఆమె ఏమ న్నా కాదనేందుకు వీల్లేదని, అసలు ఆమె కాదంటే ఏ పనీ చేయరాదని భావించింది కిన్నెరసాని నీటిదొరసానిగా. గోదావరి కిన్నెర కలసిపోయాక సమ్మేళనమైన జలం.
గోదావరి నీరు కూడి కిన్నెర నీరు/ఏది ఏదో తెలియనంతగా మారిపోయిందట. గోదావరి దేవిని కిన్నెరసాని కూడిన తర్వాత కిన్నెరసానికి దిగులే లేదట. ఏదైనా దిగులున్న ఎడదలున్న వారెవరైనా కిన్నెరసాని పాటలు చదువుతుంటే, పాడుకుంటే ఆనందం అర్ణవమవుతుంది వేవేల వర్ణాల వర్ణనా శోభతో.
-సన్నిధానం నరసింహశర్మ