
ఆంధ్రమహాభారతంలోని 18 పర్వాలలో 15 పర్వాలను రచించిన ‘కవిబ్రహ్మ’ తిక్కన సోమయాజికి గురునాథుడు లేఖకుడు. తిక్కన ఆశువుగా పద్యాలను చెప్తూవుంటే గురునాథుడు తాటాకుల మీద రాస్తూ ఉంటాడన్నమాట.
ఒక సందర్భంలో తొమ్మిదవ పర్వమైన శల్యపర్వ రచన జరుగుతున్నది. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన ఉన్న వీరులు చాలామంది మరణించారు. దుర్యోధనుడు ఒంటరివాడైనాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడు ఈ విషయాన్ని చెప్తూ– పలపలని మూకలో కాల్/ నిలువక గుర్రంబు డిగ్గి నీ కొడుకు గదా/ కలిత భుజుండై ఒక్కడు/ తొలగి చనియె’(నీ కుమారుడైన దుర్యోధనుడు పల్చబడిపోయిన సైన్యంలో నిలిచి ఉండలేక తన గుర్రం నుండి దిగి, గదను భుజాన పెట్టుకొని రణరంగం నుండి బయటకు వెళ్లిపోయాడు) అంటాడు.
ఇది కంద పద్యం. మూడు పాదాలు ఐపోయినై. నాలుగవ పాదంలో ఉండవలసిన ఐదు గణాలలో ఇంకా మూడు గణాలు రావలసి ఉన్నది. వాక్యం మాత్రం పూర్తి ఐంది కనుక ‘ఏమి చెబుదామా?’ అని ఆలోచిస్తూ– ‘ఏమి చెప్పుదుం గురునాథా’ అన్నాడు తిక్కన పరాకుగా. ‘బాగుంది. తర్వాత పద్యం చెప్పండి’ అన్నాడు గురునాథుడు. ‘పద్యం పూర్తి కాకుండానేనా?’ అన్నాడు తిక్కన. గురునాథుడు విస్తుబోయి ‘కురునాథా (ఓ ధృతరాష్ట్ర మహారాజా)! ఏమి చెప్పుదున్ (ఏమని చెప్పేది?) అని మీరే చెప్పారు కదా! నాలుగవ పాదం పూర్తి ఐంది. యతి కూడా సరిపోయింది’ అన్నాడు. లేఖకోత్తముడైన గురునాథుడి తెలివిని మెచ్చుకొంటూ తర్వాతి వచనాన్ని ప్రారంభించాడు తిక్కన.
కురునాథుడు సంధి వలన గురునాథుడు కావటమూ, అది లేఖకుడి పేరు కావటమూ ఈ సందర్భంలోని విశేషం!
-డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment