
అలెగ్జాండర్ సోల్జెనిత్సిన్ (1918–2008) రష్యన్ నవలా రచయిత, కథకుడు, చరిత్రకారుడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సోల్జెనిత్సిన్ తల్లి పెంపకంలో పెరిగాడు. సోవియట్ ప్రభుత్వాన్నీ, కమ్యూనిజాన్నీ నిశితంగా విమర్శించాడు. ప్రభుత్వ బలవంతపు కార్మిక క్యాంపుల వ్యవస్థ ‘గులాగ్’ వైపు మిగతా ప్రపంచం దృష్టిసారించేట్టు చేశాడు. సైన్యంలో పనిచేసిన సోల్జెనిత్సిన్, జర్మన్ మహిళలపై రెడ్ ఆర్మీ చేసిన దురాగతాలను ‘ప్రష్యన్ నైట్స్’ కవితలో వర్ణిస్తాడు. ‘మనమేమైనా మంచివాళ్లమా?’ అని కూడా ‘ద గులాగ్ ఆర్కిపెలగో’లో ప్రశ్నిస్తాడు. ‘బాస్’ (స్టాలిన్)ను విమర్శించడం, సోవియట్ వ్యతిరేక ప్రచారం చేయడం కారణాలతో ఆయనకు కారాగార శిక్ష పడింది. జైల్లో ఏది దొరికితే దానిమీదే రాశాడు.
ఆయన కొన్ని రచనలు కృశ్చేవ్ హయాంలో మాత్రమే ప్రచురణకు నోచుకున్నాయి. కృశ్చేవ్ పదవీచ్యుతుడైన తర్వాత సోల్జెనిత్సిన్ మళ్లీ తన సృజన స్వేచ్ఛ కోల్పోయాడు. 1970లో నోబెల్ బహుమతి వరించినప్పటికీ, దేశం విడిచి వెళ్తే తిరిగి రానివ్వరేమో అన్న భయంతో స్వీకరించడానికి వెళ్లలేదు. అయినా నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం ఆయన్ని దేశం నుంచి బహిష్కరించింది. సోవియట్ రష్యా పతనం తర్వాత ఇరవయ్యేళ్లకు 1994లో మాత్రమే తిరిగి మాతృదేశంలో పాదం మోపగలిగాడు. 89వ ఏట చనిపోయేవరకు అక్కడే నివసించాడు. ‘వన్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇవాన్ డెనిసోవిచ్’, ‘ఆగస్ట్ 1914’, ‘కేన్సర్ వార్డ్’ ఆయన ప్రసిద్ధ రచనలు.