నీట రాసిన పేరొక్కటి కాలగతిని మార్చింది | john keats poems | Sakshi
Sakshi News home page

నీట రాసిన పేరొక్కటి కాలగతిని మార్చింది

Published Mon, Feb 22 2016 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

జాన్ కీట్స్

జాన్ కీట్స్

తనకు కలిగిన విస్మయానందాలనే కాదు, అనుభవించిన విషాదాన్ని కూడా మధురిమగా మార్చి, పాతికేళ్లకే ప్రపంచాన్ని అబ్బురపరచి, పండి, రాలిపోయిన ఒక మహాకవి, తనకు తానే స్మృతి వాక్యం చెప్పుకున్నాడట, తన సమాధిపైన శిలా ఫలకం మీద, ఈ మాటను రాయమన్నాడట.
 

 "Here lies One whose name is writ in water."
 

 ఈ పదును, ఈ వేదన, ఈ నైరాశ్యం, ఈ ఆత్మనిస్పృహ మూర్తీభవించిన ఈ వాక్యాన్ని, తెలుగులో ఎలా చెప్పాలో తెలియక ఒక రోజంతా కొట్టుమిట్టాడాను. ‘వాక్యమే దైవం’ అనే సంస్కృతికి చెంది, ఈ మాటను అక్షరాలా నమ్మే యువకవి, తన మూర్తిమత్వాన్నంతా ఆ వాక్యంలోనే నిక్షిప్తం చేసుకొన్నాడు. అందుకే బిబ్లికన్ స్ఫురణ కలిగేలా ’గిటజ్టీ’ అనే మాటను అప్రయత్నంగా వేసుకొన్నాడు. ఆ మాట పదును, అందులోని నిర్వేదం చెడకుండా తన ‘స్మృతి వాక్యాన్ని’ మరో భాషలోకి తేవడం సాధ్యమవుతుందా? అందులోనూ భిన్న సంస్కృతి సంప్రదాయానికి చెందిన తెలుగులోకి! తెలుగులో ఆ మాటల అర్థమైనా, తేటదనం చెడకుండా తెలుసుకోవాలనేవారి సౌలభ్యం కోసం, తాత్కాలికంగా, ఆ భావాన్నిలా తెలుగులో పెడుతున్నాను.

‘‘ఇట నుండె నొకడు నీట రాసిన పేరుగలవాడు’’.
 

 భయంకరమైన క్షయవ్యాధి పాలై, జీవితంలో ఆశించినదేదీ పొందకుండా, అసలు జీవితాన్నే చూడకుండా, మృత్యుగహ్వరంలోకి వెళ్లిపోతున్న ఒక కవి, పాతికేళ్లు నిండీ నిండని వాడు, అలా తన గూర్చి తాను ‘స్మృతి వాక్యం’ పలికాడంటే, తన పేరొక నీటిపై రాతగా మారిపోతున్న స్థితిని అనుభవించాడంటే, అ క్షణంలో అతనను భవించిన వేదన ఎంతటిదో ఒక్కక్షణం మనం ఊహించుకొన్నా చాలు, ఇప్పటికీ కరిగి కన్నీరవుతాము. జీవితమంతా ఆ కన్నీటిని రుచి చూస్తూనే, అక్షరాల పన్నీటిని లోకంపై చల్లి, నిష్ర్కమించిన ఆ మహాకవి పేరు జాన్ కీట్స్!
 

 ఆంగ్ల సాహిత్య విద్యార్థిగా బియ్యే చదువుతున్నప్పుడు మా విశ్వనాథం మేష్టారు, కీట్స్ పాఠం చెబుతూ "My Heart aches, and

a drowsy numbness pains"  అనే మాటల్లో ఆ "aches"  (బాధపడుతోంది) అనే పదాన్ని, "drowsy numbness" (మగత కమ్మిన జడత) అనే పదాలను అలా సుతారంగా నొక్కుతూ, లయబద్ధంగా పలుకుతోంటే, ఏదో తెలియని పారవశ్యంలో మా గుండెలూ మూలిగేవి, క్షణంసేపు మాగన్నుగా మారేవి...
 

 కీట్సును సాంతం చదవాలని ఆశ... కాని అర్థమయ్యేది కాదు... అక్షరమక్షరంలోనూ కరిగించే అనుభూతితో పాటు, అడుగడుక్కూ అర్థంకాని భావనిధి! పురాగాథ ముడి! వాటిని తెలుసుకొనే లోపు, అనుభూతి జారి పోతుంటుంది. ధారగా చదువుకోవడానికి కుదిరేది కాదు... శాశ్వతానందమిచ్చే కీట్స్ కవితామృతాన్ని తెలుగు పలుకుల్లో ఏ మహానుభావుడైనా సాంతం అందించకూడదా; అని వెర్రిగా ఆశపడే తెలుగువారు అసంఖ్యాకులున్నారు.
 

 ఇదిగో, ఇంతకాలానికి, ఒక మహానుభావుడు, మూడు పాతికలు దాటిన వయసులో, పాతికేళ్ల గుండె మృదు మధుర ‘ధ్వని’ని పట్టుకొని, ఇలా తెలుగుతో శ్రుతి పరచి ‘సాంతం’ అందిస్తున్నారు... కీట్స్ కవితల సమగ్ర అనువాదం ఇది. నిజానికి దీన్ని అనువాదం అనడం తప్పు; ఇది అనుశ్రుతి! ఓ భాషా రచన మరో భాషా వచనంలోకి వస్తుంటే అది అనువాదమవుతుంది; కాని, ఓ కావ్యరచన మరోభాషలో అవతరిస్తుంటే అది ‘అనుశ్రుతి’ అవుతుంది. ఓ భాషాకవి గుండెతో మరో భాషాకవి తన గుండెను శ్రుతిపరిస్తే అది అనుశ్రుతి అవుతుంది. భాషల మధ్య అనుశ్రుతి, భాషాతీత భావన కోసం!
 

 నాగరాజు రామస్వామి గారి ప్రస్తుత కావ్యంలో సరిగ్గా అదే జరుగుతున్నది. తన్ను ప్రేమించే వారికోసం, కీట్స్ తెలుగు నేర్చుకొని, తెలుగులో తన గొంతు శ్రుతి పరచుకొన్నాడు.
 

 ప్రతి రచన ఒక తపస్సే. ఈ దారిలోని అనుసృజన ఉగ్రతపస్సు. మాట మాటకూ అర్థం వెదుక్కోవడం కాదు కష్టమైనది, దాని వెనుక ఉన్న అర్థం- ఉద్దేశితార్థం+ అనుద్దేశంగానే ధ్వనించే అర్థం- కలిపి పట్టుకోవడం చాలా కష్టం. కవితలో శబ్ద సౌందర్యాన్ని గ్రహించడం కొంత సులువే. కాని శబ్దంలోని ధ్వనిని పారమ్యంగా గ్రహించడం మహాకష్టం. ఆనందవర్ధనుల వారు ‘ధ్వని’కున్న మూడు ప్రధాన పార్శ్వాలనూ ఆవిష్కరించారు. ‘వస్తువు’కున్నది మూడు పార్శ్వాలే కనుక, వస్తు దృష్టితో ఆయన మూడు పార్శ్వాల వద్దనే ఆపారు. కాని ‘ధ్వని’కి గల పార్శ్వాలు అనంతం. అసలు ఆ ‘అనంతమే’- శబ్దం ధ్వనించగా మిగిలిన నిశ్శబ్దం- అదే ఒక గొప్ప పార్శ్వం. ‘వస్తువు’లోని మూడు పార్శ్వాలను మించిన ‘పరావస్తువే’ అసలైన గొప్ప ధ్వని. అలాంటి అనంత శక్తిమంతమైన ధ్వనిని ఎంతో కొంత ప్రతి సత్కవి తన కవితలో ఉపలక్షిస్తుంటాడు. భౌతికేంద్రియాల స్థాయిలోని సంవేదన రగిలించడంలో పేరు పడ్డ- ఐంద్రిక కవి, ‘సెన్షువల్ పొయెట్’గా గుర్తింపబడ్డ- కీట్స్, అలా భౌతికేంద్రియ స్థాయిలో కవిత రాస్తూ రాస్తూనే, అద్భుతమైన ఆత్మ రహస్తీరాల్లోకి  తీసుకుపోతాడు. చెప్పిన వాటికంటే, చెప్పటి వాటి సౌందర్యాన్ని గుండెల్లో నింపేస్తాడు. ఆధ్యాత్మికతకు నిజమైన అర్థమే అది. సౌందర్యం, ఆధ్యాత్మికతకు మరోపేరు అవుతున్నదే అక్కడ! దాన్ని+దాన్ని ధ్వనించేదాన్ని పట్టుకోవడమెలా సాధ్యం?
 

 కీట్స్ చెప్పుకున్న ఒక స్మృతి వాక్యాన్ని తెలుగులో చెప్పడానికి, ఒక్క రోజంతా కొట్టుమిట్టాడాను, అయినా ఆ అందం, పదును పొరపాటున కూడా తొంగిచూడలేదు. మరి ఈ నలభై ఒక్క గీతాల సమగ్ర అనుశ్రుతిని వెలువరించడానికి నా.రా.గారు ఎంత తపించి ఉంటారు.
 

 ‘‘మలి సంజలో వికసిస్తున్నవి మేఘ మాలికలు

 పశ్చిమాకాశంలో పూస్తున్నవి గులాబీలు

 ఏటిగట్టున చిరు చిమ్మటల చిరు బృందగానం

 కొండకొమ్మున గొర్రె మందల కోలాహలం

 గుబురు పొదలలో గొల్లభామల గీతం’’
 

 ఈ మాటల్ని చదువుతూంటే, ఇదో ఆంగ్ల కవితకు తెలుగు సేతగా అగుపించదు. ‘గొర్రెమందల కోలాహలం’ అన్నదగ్గర కాస్త భ్రుకుటి ముడిపడ్డా, ‘గొల్లభామల గీతం’ అనగానే నెన్నుదురు విప్పారుతుంది.
 

 మనది కాని సంస్కృతి పరిసరాన్ని, మన మాటల్లోకి దించినప్పుడు కూడా ఆ మాటల పోహళింపువల్ల మనతనం అనుభూతి విడిపోదు.
 

 ‘‘తమసు పులుముకున్న పొదల మృదుల తావులు

 మధు శీధువు నిండిన వనకస్తూరి రోజా పరిమళాలు

 రెల్లుగరికల, రేగుపళ్ల, రేతిరి పూల సుగంధాలు,

 వేసవి సాయంత్రాలలో వెంటాడే ఈగల రొదలు’’
 

 మృదువైన ఈ మాటల కూర్పు మనల్ని వెంటనే తమలోకి తీసుకువెళ్తాయి. అయితే అందులో వర్ణితమైన వస్తువులు, ఆ ‘వస్తు’ పరిసరం మనకు చాలా అపరిచితమైనవి. అవి మన కావ్యసీమ మర్యాదకి చెందినవి కావు. వనకస్తూరి పరిమళాల మధ్య రోజా ఉండదు. రెల్లుగరికలు, రేగుపళ్లు మనకు కొత్తవి కాకపోయినా వాటిని రేతిరి పూల సుగంధాలతో ఎవరు కలబోయరు. వేసవి సాయంత్రాలలో ఏ తెలుగు రసికకవి, ఈగల రొదలని వినిపించలేదు. మన కావ్యభాషలో మనది కాని వస్తు ప్రపంచాన్ని కూడా మనదిగా మార్చేస్తున్నారు నా.రా.
 

 కీట్సంటేనే ‘గుండెమూలిగే’ మాలాంటి వారు, ఇప్పుడు కీట్సును చదువుకోవచ్చు, అమ్మ ఉగ్గుపాల నుడిరుచితో.
 

 (జాన్ కీట్స్ కవితలను నాగరాజు రామస్వామి ‘ఈ పుడమి కవిత్వం ఆగదు’ పేరిట తెలుగులోకి తెచ్చారు. ఫోన్: 040-23112625)

 ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ,  9441809566

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement