రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడైన బళ్లారి రాఘవ స్టేజీ మీద వచ్చే అవాంతరాలను తన సమయస్ఫూర్తితో సులువుగా దాటేసేవారని చెబుతారు. ఆయనోసారి ‘విజయనగర సామ్రాజ్య పతనం’ లో నటిస్తున్నారు. ఆయన వేస్తున్న వేషం పఠానుగా. చివరి సీనులో ఆషాబీని చంపాలి. మరి దేనితో చంపాలి? అదేదో స్టేజీ మీద పెట్టడం మరిచారు. సంభాషణలు చెబుతూ ఆ విషయం గమనించిన రాఘవ ఏమాత్రం తడబడకుండా, అదే ఊపును కొనసాగిస్తూ అక్కడే బల్లపై ఉన్న గాజుగ్లాసును తీసుకొని దాన్ని బద్దలుకొట్టి, తన చేతిని కొంత గాయపరుచుకుని, అదే రక్తపు చేయితో ఆషాబీ గొంతు నులిమినట్టు నటించారు. చూస్తున్న ప్రేక్షకులు నిజంగానే రాఘవ చంపేస్తున్నాడేమో అన్నంత భ్రాంతికి లోనయ్యారట. చంద్రగుప్త నాటకంలో చాణక్యుడిగా వేస్తున్నప్పుడు కూడా ఉన్నట్టుండి స్టేజీ మీదకు వచ్చిన కుక్కను ఉద్దేశించి రాఘవ, ‘శునకమా, వచ్చితివా, రమ్ము. ఈ శ్మశాన వాటిక నాదే కాదు నీది కూడా’ అని సందర్భోచితంగా పలికి సన్నివేశాన్ని రక్తి కట్టించారు.
Comments
Please login to add a commentAdd a comment