Bellary raghava
-
జీవించి భయపెట్టారు
రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడైన బళ్లారి రాఘవ స్టేజీ మీద వచ్చే అవాంతరాలను తన సమయస్ఫూర్తితో సులువుగా దాటేసేవారని చెబుతారు. ఆయనోసారి ‘విజయనగర సామ్రాజ్య పతనం’ లో నటిస్తున్నారు. ఆయన వేస్తున్న వేషం పఠానుగా. చివరి సీనులో ఆషాబీని చంపాలి. మరి దేనితో చంపాలి? అదేదో స్టేజీ మీద పెట్టడం మరిచారు. సంభాషణలు చెబుతూ ఆ విషయం గమనించిన రాఘవ ఏమాత్రం తడబడకుండా, అదే ఊపును కొనసాగిస్తూ అక్కడే బల్లపై ఉన్న గాజుగ్లాసును తీసుకొని దాన్ని బద్దలుకొట్టి, తన చేతిని కొంత గాయపరుచుకుని, అదే రక్తపు చేయితో ఆషాబీ గొంతు నులిమినట్టు నటించారు. చూస్తున్న ప్రేక్షకులు నిజంగానే రాఘవ చంపేస్తున్నాడేమో అన్నంత భ్రాంతికి లోనయ్యారట. చంద్రగుప్త నాటకంలో చాణక్యుడిగా వేస్తున్నప్పుడు కూడా ఉన్నట్టుండి స్టేజీ మీదకు వచ్చిన కుక్కను ఉద్దేశించి రాఘవ, ‘శునకమా, వచ్చితివా, రమ్ము. ఈ శ్మశాన వాటిక నాదే కాదు నీది కూడా’ అని సందర్భోచితంగా పలికి సన్నివేశాన్ని రక్తి కట్టించారు. -
‘అనంత’ రంగస్థల ఆణిముత్యం
సందర్భం – నేడు బళ్లారి రాఘవ జయంతి అనంతపురం కల్చరల్: ‘మీరు మా దగ్గరికి రావడమెందుకు.. మేమే మీ దగ్గరకు రావాలి.. మీరు ఇంగ్లండులో పుట్టి ఉంటే షేక్స్ఫియర్ కంటే గొప్పవారయ్యే వారు’ అని ప్రఖ్యాత కవి జార్జ్ బెర్నార్డ్‌షా అనంత వాసి బళ్లారి రాఘవను ప్రçశంసించారంటే అది ఎంత గొప్ప విషయమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాటక రంగానికి విఖ్యాత సేవలందించిన బళ్లారి రాఘవ మాత్రం వాటిని పొగడ్తలుగానే తీసుకుని తన నిరాడంబరతను చాటుకున్నారు. బుధవారం బళ్లారి రాఘవ జయంతి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. బళ్లారి రాఘవ అనంతపురం జిల్లా తాడిపత్రిలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో శేషమ్మ, నరసింహాచార్యుల దంపతులకు 1880 ఆగస్టు 2న జన్మించారు. ఆయన చిన్న తనం నుంచే సకల కళలను పుణికి పుచ్చుకుని మహానటునిగా ఆవిర్భంచడం తెలుగు వారి అదృష్టం. ఆంధ్రనాటక పితామహునిగా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణాచార్యులు స్వయానా మేనమామ కావడంతో నాటకరంగంపై ఆసక్తి పెంచుకుని తనకు మాత్రమే సొంతమైన నటనతో నాటక రంగానికి కొత్త వెలుగు తెచ్చాడు. ప్రసిద్ధ పౌరాణిక పాత్రలైన హరిశ్చంద్రుడు, దుర్యోధనుడు, మాయల మరాఠి వంటి పాత్రలకు రాఘవ జీవం పోశాడు. తెలుగు నాటకాలతో పాటు ఇంగ్లిషులో సుప్రసిద్ధమైన షేక్స్ఫియర్ నాటకంలోని షైలాక్, హామ్లెట్, సీజర్ వంటి పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి అక్కడి వారి మన్ననలు అందుకున్నారు. జాతీయోద్యమంలో తన వంతు కృషి చేసి దేశభక్తిని చాటుకున్నారు. అరుదైన గౌరవం నాటక రంగంతో పాటు సినీ రంగంలోనూ బళ్లారి రాఘవ చేసిన చిరస్మరణీయ సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన పేరుపై పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పిన మహనీయుల సరసన ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించింది. జిల్లాకు ఎనలేని కీర్తిని తెచ్చిన రాఘవ ఏప్రిల్ 16న నటరాజులో లీనమైపోయినారు. అంతటి మహానటుడిని, ఆయన పేరిట నెలకొల్పిన పురస్కారాలకు జిల్లాకు చెందిన కళాకారులు రాము, సంగాల నారాయణస్వామిని ఎంపిక చేశారు. ఈనెల చివరి వారంలో నగరంలోని లలిత కళా పరిషత్తులో జరిగే పురస్కారోత్సవంలో వారు అవార్డులందుకోనున్నారు. -
ఆగస్టు 2,3 తేదీలలో బళ్లారి రాఘవ జయంతోత్సవాలు
బళ్లారి : కర్ణాటక, ఆంధ్రా నాటక పితామహుడు బళ్లారి రాఘవ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాఘవ మెమోరియల్ అసోసియేషన్ నిర్ణయించింది. ఆగస్టు 2,3 తేదీలలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు రాఘవ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్దనగౌడ తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా బళ్లారి రాఘవ పేరు మీదుగా తెలుగు, కన్నడ కళాకారులకు రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు ఇవ్వనున్నారు. తెలుగు, కన్నడ భాషలలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన పలువురు కళాకారులను ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిలో ఎస్.నాగన్న, ప్రేమా పాటిల్ ఉన్నారు. జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికైన వారిలో ఆళ్ల వెంకటరెడ్డి, జెటి.ప్రవీణ్‌కుమార్, కె.మధుసూధన్‌రావ్, కె.సురేంద్ర బాబు, సీజీ లతాశ్రీ, ఎం.ఎల్.రంగస్వామీ, నాగభూషణ నాగళ్లి, పత్తార్ ఖాదర్‌సాబ్, రమేష్‌గౌడ పాటిల్, వీ.ఎన్.గిరిమల్లప్ప ఉన్నారు. జయంతోత్సవం రోజున వారికి నగదు బహుమతితోపాటు ఓ మొమెంటోను బహూకరిస్తారు.