‘అనంత’ రంగస్థల ఆణిముత్యం
సందర్భం – నేడు బళ్లారి రాఘవ జయంతి
అనంతపురం కల్చరల్: ‘మీరు మా దగ్గరికి రావడమెందుకు.. మేమే మీ దగ్గరకు రావాలి.. మీరు ఇంగ్లండులో పుట్టి ఉంటే షేక్స్‌ఫియర్ కంటే గొప్పవారయ్యే వారు’ అని ప్రఖ్యాత కవి జార్జ్ బెర్నార్డ్‌షా అనంత వాసి బళ్లారి రాఘవను ప్రçశంసించారంటే అది ఎంత గొప్ప విషయమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాటక రంగానికి విఖ్యాత సేవలందించిన బళ్లారి రాఘవ మాత్రం వాటిని పొగడ్తలుగానే తీసుకుని తన నిరాడంబరతను చాటుకున్నారు. బుధవారం బళ్లారి రాఘవ జయంతి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
బళ్లారి రాఘవ అనంతపురం జిల్లా తాడిపత్రిలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో శేషమ్మ, నరసింహాచార్యుల దంపతులకు 1880 ఆగస్టు 2న జన్మించారు. ఆయన చిన్న తనం నుంచే సకల కళలను పుణికి పుచ్చుకుని మహానటునిగా ఆవిర్భంచడం తెలుగు వారి అదృష్టం. ఆంధ్రనాటక పితామహునిగా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణాచార్యులు స్వయానా మేనమామ కావడంతో నాటకరంగంపై ఆసక్తి పెంచుకుని తనకు మాత్రమే సొంతమైన నటనతో నాటక రంగానికి కొత్త వెలుగు తెచ్చాడు. ప్రసిద్ధ పౌరాణిక పాత్రలైన హరిశ్చంద్రుడు, దుర్యోధనుడు, మాయల మరాఠి వంటి పాత్రలకు రాఘవ జీవం పోశాడు. తెలుగు నాటకాలతో పాటు ఇంగ్లిషులో సుప్రసిద్ధమైన షేక్స్‌ఫియర్ నాటకంలోని షైలాక్, హామ్లెట్, సీజర్ వంటి పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి అక్కడి వారి మన్ననలు అందుకున్నారు. జాతీయోద్యమంలో తన వంతు కృషి చేసి దేశభక్తిని చాటుకున్నారు.
అరుదైన గౌరవం
నాటక రంగంతో పాటు సినీ రంగంలోనూ బళ్లారి రాఘవ చేసిన చిరస్మరణీయ సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన పేరుపై పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పిన మహనీయుల సరసన ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించింది. జిల్లాకు ఎనలేని కీర్తిని తెచ్చిన రాఘవ ఏప్రిల్ 16న నటరాజులో లీనమైపోయినారు. అంతటి మహానటుడిని, ఆయన పేరిట నెలకొల్పిన పురస్కారాలకు జిల్లాకు చెందిన కళాకారులు రాము, సంగాల నారాయణస్వామిని ఎంపిక చేశారు. ఈనెల చివరి వారంలో నగరంలోని లలిత కళా పరిషత్తులో జరిగే పురస్కారోత్సవంలో వారు అవార్డులందుకోనున్నారు.