‘అనంత’ ఆశాజ్యోతి | today father vincent ferrer birth anniversary | Sakshi
Sakshi News home page

‘అనంత’ ఆశాజ్యోతి

Published Sat, Apr 8 2017 10:56 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

‘అనంత’ ఆశాజ్యోతి - Sakshi

‘అనంత’ ఆశాజ్యోతి

ఆయన ఎక్కడో ఉన్న స్పెయిన్‌లో పుట్టారు. చిన్నప్పటి నుంచే పేదలకు సేవ చేయాలనే తపన మెండుగా ఉండేది. ఇందుకు సరైన ప్రాంతం కోసం అన్వేషించారు. మన దేశంలోని పేదరికం గురించి తెలిసింది. మరో ఆలోచన లేకుండా ఇక్కడికొచ్చేశారు. అందులోనూ అనంతపురం జిల్లా వెనుకబాటుతనం, కరువు ఆయన్ను కదిలించాయి. దీంతో జిల్లాలోనే స్థిరపడిపోయి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదల పాలిట ఆశాజ్యోతి అయ్యారు. ‘అనంత’ ప్రజల హృదయాల్లో ‘ఫాదర్‌’గా స్థిరపడిపోయారు. ఆయనే రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (ఆర్డీటీ) వ్యవస్థాపకులు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌. నేడు ఆయన జయంతి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.

- కరువు నేలకు ఆపన్నహస్తం అందించిన మహనీయుడు
- పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆపద్బాంధవుడు
- నేడు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ జయంతి


అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (ఆర్డీటీ) గురించి జిల్లాలో తెలియనివారు ఉండరు. జిల్లాతో పాటు కర్నూలు, ప్రకాశం, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లోనూ ఈ సంస్థ సేవలందిస్తోంది. పేదరిక నిర్మూలన, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజలకు విద్య, వైద్యం తదితర రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సంస్థ స్థాపనకు మూలకారకుడు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌. ఈయన 1920 ఏప్రిల్‌ 9న స్పెయిన్‌ దేశంలోని బార్సిలోనాలో జన్మించారు. స్పానిష్‌ ఆర్మీలో సైనికుడిగా పనిచేశారు. 1952లో మనదేశానికి వచ్చారు.

1958లో  రూరల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ పేరుతో ఉత్తర బొంబాయిలోని మన్మాడ్‌ ప్రాంతంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు.12 ఎకరాల్లో పాఠశాలను నెలకొల్పడంతో పాటు బావులను తవ్వించారు. అప్పట్లో ఆయన సేవా కార్యక్రమాలకు కొందరు ఆటంకాలు సృష్టించారు. 1968లో ‘గోబ్యాక్‌ ఫెర్రర్‌’ నినాదంతో  ఆందోళనలు జరిగాయి. దీంతో ఆయన అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని కలిశారు. అదే సమయంలో అక్కడున్న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి.. ఫెర్రర్‌తో మాట్లాడుతూ అనంతపురం జిల్లా దుర్భిక్ష పరిస్థితుల గురించి వివరించారు. దీంతో ఫెర్రర్‌ 1969లో ఆర్డీటీ ద్వారా ‘అనంత’లో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటికీ ఈ సంస్థ సేవలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి.

- బత్తలపల్లి, కళ్యాణదుర్గం, కణేకల్లు, అనంతపురంలోని ఆర్డీటీ ఆస్పత్రులు నిత్యం వేలాది మందికి వైద్యసేవలు అందిస్తున్నాయి.
 - అనంతపురం నగర శివారులో 32 ఎకరాల విస్తీర్ణంతో 2002లో ప్రారంభించిన స్పోర్ట్స్‌ సెంటర్‌ (అనంత క్రీడాగ్రామం) క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, జూడో, టెన్నిస్‌ తదితర క్రీడల్లో జాతీయ, అంర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తోంది.
- 1,433 సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా 2,801 ప్రాజెక్ట్‌ గ్రామాల్లో ఆర్డీటీ విద్యను అందిస్తోంది. అలాగే పేద విద్యార్థుల ఉన్నత చదువుకు తోడ్పాటునిస్తోంది.
- 8,122 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది.
- దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు, వికలాంగులకు వేలసంఖ్యలో పక్కాగృహాలను నిర్మించి ఇచ్చింది.
     ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా జిల్లా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ 2009లో ‘అనంత’లో  కన్నుమూశారు. ప్రస్తుతం ఆర్డీటీ నిర్వహణను ఆయన సతీమణి అన్నే ఫెర్రర్‌, కుమారుడు మాంఛో ఫెర్రర్‌ చూస్తున్నారు. ‘ఫాదర్‌’ చూపిన బాటలోనే సంస్థ సేవలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.
 
ఫాదర్‌ ఫెర్రర్‌ను వరించిన అవార్డులు
- 1998లో ప్రిన్స్‌ ఆఫ్‌ స్పెయిన్‌ అవార్డు. అదే ఏడాది ‘యూనివర్సల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది పీస్‌’ అవార్డు.
- 2000లో జనరల్‌ ఇటాట్‌ ఆఫ్‌ క్యాటలోనియా అవార్డును సెయింట్‌ జార్జ్‌ క్రాస్‌ అందించింది.
- 2001లో యూనెస్కో ‘లీడింగ్‌ ఫిగర్‌ ఇన్‌ ది హిస్టరీ ఆఫ్‌ ది 20 సెంచరీ’ అవార్డుతో సత్కరించింది.
- 2009లో స్పానిష్‌ ప్రభుత్వం ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ సివిల్‌ మెరిట్‌’ అవార్డుతో సత్కరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement