జీవితాలను మార్చిన ఒక్క ప్రయత్నం | One Attempt That Changed Lives | Sakshi
Sakshi News home page

హుండీ విప్లవం..అక్షర దీపం

Published Fri, Jun 21 2019 8:52 AM | Last Updated on Fri, Jun 21 2019 8:53 AM

One Attempt That Changed Lives - Sakshi

ఇది సామాన్యుడు చిందించిన స్వేదం. ఆ స్వేదమే వేల కుటుంబాల జీవితాల్లో అక్షర వెలుగులు విరజిమ్మేందుకు కారణమైంది. రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ) వ్యవస్థాపకులు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ ఆశయాలకు అనుగుణంగా సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ పిలుపు మేరకు ‘స్పందించు సాయమందించు’ అనే కార్యక్రమానికి ఆ స్వేదమే కొత్త ఊపిరిని అందించింది.  స్పందించే హృదయముంటే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఎందరో అభాగ్యులను ఆదుకోవచ్చని నిరూపించింది.  హుండీ ఉద్యమం విప్లవంలా ఎగిసి పడేందుకు ఆ స్వేదమే కారణమైంది. చేసే సాయం చిన్నదా పెద్దదా అని ఎవరూ ఆలోచించ లేదు. ఒక్క రూపాయి మొదలు... వందల రూపాయలను హుండీలో వేస్తూ నిరుపేద కుటుంబాల్లో అక్షర జ్యోతులు వెలిగించేందుకు ఎందరో గ్రామీణులు ముందుకు వచ్చారు. సేవ చేయడమే జీవన సారంగా భావించిన ఆర్డీటీ వ్యవస్థాపకుల స్ఫూర్తితో సాగుతున్న ఈ హుండీ మహాయజ్ఞం గురించి ‘సాక్షి ఫోకస్‌’  మీ కోసం.         – అనంతపురం సప్తగిరి సర్కిల్‌  

సేవకు ప్రతిరూపంగా నిలిచిన ఆర్డీటీ సంస్థ జిల్లాలో 1969 నుంచి కార్యకలాపాలను ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకూ జిల్లా వ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించిన ఆర్థిక వనరులను స్పెయిన్‌ దేశస్తులు సమకూరుస్తూ వచ్చారు. ఆ దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇక్కడి ఆర్డీటీ కార్యకలాపాలపై పూర్తి స్థాయి అవగాహన ఉందంటే సంస్థ ఎంత పారదర్శకంగా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సంస్థ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సొంతింటి కల సాకారం, వ్యవసాయం, క్రీడా, సామాజిక కార్యక్రమాలు నిర్వఘ్నంగా సాగిపోతున్నాయంటే అక్కడి వారి సహాయ సహకారాలు ఎంత గొప్పవో ఊహించుకోవచ్చు.

  
మేము నిజం చేశాం..  
హుండీ ఉద్యమం ప్రారంభించిన తొలిరోజుల్లో దీని గురించి ఎక్కడా ప్రచారం అనేది లేదు. గ్రామాల్లో ఆర్డీటీ చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సమయంలో మాత్రమే కేవలం మాటల రూపంగా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ జయంతిని పురస్కరించుకుని 2012, ఏప్రిల్‌ 9న పెద్దవడుగూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్, డైరెక్టర్‌ సుధీంద్రరావు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడ ఫాదర్‌ విగ్రహం చుట్టూ గ్రామస్తులు తమ ఇళ్లలో ఉంచుకున్న హుండీలను తీసుకువచ్చి ఉంచారు. ఇలా మొత్తం 127 హుండీలు అక్కడ ఉండడాన్ని గమనించిన మాంఛో ఫెర్రర్‌ ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ.. ఏమిటిది అని స్థానికులను ప్రశ్నించారు. ‘మీరు చెప్పారు.. మేము నిజం చేశాం’ అంటూ స్థానికులు సమాధానమిస్తూ.. రోజు వారి కూలి పనుల ద్వారా తాము సంపాదించిన మొత్తంలో నుంచి కొంత హుండీలో వేస్తూ వచ్చినట్లు వివరించారు.

అలా ప్రారంభమైన ఈ ఉద్యమం తర్వాతి కాలంలో జిల్లా అంతటా పాకింది. జిల్లా వ్యాప్తంగా తొలిసారి రూ. 84 లక్షలు సమకూరాయి. ఈ బృహత్తర కార్యక్రమానికి ‘ఇండియా ఫర్‌ ఇండియా’ అంటూ ఆ రోజున మాంఛో ఫెర్రర్‌ నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ హుండీ ఉద్యమం కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించింది.
 
గ్రామీణుల నుంచి ఉద్యోగుల వరకూ..  
ఇలా ప్రజల నుంచి సేకరించిన నిధుల వినియోగంపై గ్రామాల్లో కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించి స్థానికులతో మాంఛో ఫెర్రర్‌ నేరుగా చర్చించారు. అనాథ పిల్లలను ఆదుకోవాలని జిల్లా వ్యాప్తంగా అందరూ ప్రతిపాదించడంతో, ప్రజానిధి వినియోగంపై ఓ ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారు.  హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రత్యేకమైన ఖాతాలో జమా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో పొగైన మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమా చేసి, ఆ రసీదును ఆర్డీటీ కార్యాలయంలో అందజేస్తే ఆ విరాళానికి సంబంధించిన రసీదును అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లనూ చేశారు.

సమాజంలో ఇది ఎంత మార్పు తెచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ కార్యాలయంలో, వ్యాపార సముదాయాల వద్ద, ఇళ్లలోనూ హుండీలు ఉంచుకునేలా చేసింది. తర్వాతి రోజుల్లో ఉద్యోగులు ప్రతి నెలా తమ వ్యక్తిగత ఖాతా నుంచి కొంత మొత్తాన్ని నేరుగా ఆర్డీటీ ప్రజానిధి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ ఉద్యమంలో 10,032 మంది ఉద్యోగులు భాగస్వాములయ్యారు. వీరిలో 2,518 మంది ఆర్డీటీ సంస్థలో పనిచేస్తున్నవారే ఉన్నారు. ఏటా ఉద్యోగులు తమ వ్యక్తిగత ఖాతాల్లోంచి ప్రతి నెలా రూ.9 లక్షలను అందిస్తున్నారు.
 
సమకూరుతున్న రూ. కోట్లు 
2012లో 127 హుండీలతో ప్రారంభమైన ఈ ఉద్యమం 2013 నాటికి 43,817కు చేరుకుంది.  ఈ సంఖ్య 2015 నాటికి లక్ష హుండీలకు చేరుకుంది. 2013లో హుండీల ద్వారా రూ.97,63,021 పోగయ్యాయి. 2012 నాటికి ఇది రూ. 2 కోట్లకు దాటింది. గత ఏడాది ఏకంగా రూ. 6,58,72,775 కోట్లకు చేరుకుంది.  2013–18 ఆర్థిక సంవత్సరాలకు కలిపి ఇండియా ఫర్‌ ఇండియా కార్యక్రమానికి రూ, 24,94,16,578 కోట్లు సమకూరాయి. గత ఐదేళ్లలో వివిధ సేవకార్యక్రమాలకు రూ.18,87,40,036 కోట్లు ఖర్చు చేశారు. 2013లో 289 మందికి పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు సమకూర్చారు. 2014లో 413కు మందికి సేవలను విస్తరింపజేశారు. 2015 నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లోని చెంచులకు పౌష్టికాహారాన్ని అందించడం ప్రారంభించారు. ఆ ఏడాది 701మంది అనాథలను ఆదుకుంటూనే, ఐదు వేల మందికి పౌష్టికాహారాన్ని అందించారు.  2018 నాటికి 1,590 మంది అనాథలను, 5,550 మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.  

జీవితాలను మార్చిన ఒక్క ప్రయత్నం
ఆర్టీటీ నిర్వాహకులు అందిస్తున్న స్ఫూర్తిదాయక సేవాకార్యక్రమాలను చూసిన స్పెయిన్‌ దేశస్తుల్లో కొత్త ఆలోచనా విధానం రేకెత్తింది. దానిని వారు ఆర్డీటీ వ్యవస్థాపకులతో పంచుకున్నారు. పేదరికంతో మగ్గిపోతున్న అనంతపురం జిల్లా వాసుల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలంటే కేవలం చదువు ఒక్కే మార్గమని భావించి ఆ దిశగా రూపొందించిన కార్యాచరణపై తొలుత పెద్ద ఎత్తున మల్లాగుల్లాలు పడ్డారు. చివరకు ‘మీ ప్రయత్నం మీరు చేయండి. ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో తర్వాత చూద్ధాం’ అంటూ స్పెయిన్‌ దేశస్తులు భరోసానివ్వడంతో హుండీ కార్యక్రమానికి ఆర్డీటీ వ్యవస్థాపకులు రూపకల్పన చేశారు. తర్వాతి రోజుల్లో ఈ కార్యక్రమం ఓ విప్లవమై ఎగిసిపడింది.  

మా ఇద్దరికీ మీరందరూ..  
కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు, వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె జన్మించారు. తమ బాధ్యత తీరిపోయిందనుకుని మురిసిపోతున్న ఆ వృద్ధ దంపతుల జీవితంలో అనుకోను పెనుదూమారం రేగింది. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ బాధ భరించలేక కోడలు ఎటో వెళ్లిపోయింది. వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న అల్లుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మనస్థాపంతో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. వృద్ధులపై ఆ ఇద్దరు చిన్నారుల భారం పడింది. పూరిగుడిసెలో అత్యంత దయనీయంగా బతుకీడుస్తున్న ఆ వృద్ధ దంపతులు.. చిన్నారుల పొట్ట నింపేందుకు నానా తిప్పలు పడ్డారు.

సాయమందించే వారు లేక అర్ధాకలితో జీవించసాగారు. అలాంటి సమయంలోనే వారికి ఆర్డీటీ గురించి తెలిసింది. అయితే ఆర్టీటీ సంస్థ నుంచి సాయం ఎలా పొందాలో కూడా తెలియదు. చెప్పేవారూ లేరు. దీంతో తన దీనస్థితిని వివరిస్తూ ఓ కార్డు ముక్క రాసి ఆర్డీటీ చిరునామాకు పోస్టు చేశారు. స్పందించిన సంస్థ నిర్వాహకులు వెంటనే తన ప్రతినిధులను పోరుమామిళ్లకు పంపింది. వృద్ధ దంపతులను అక్కున చేర్చుకుంది. చిన్నారులను అనంతపురం నగర శివారులోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చేర్పించింది. వీరిద్ధరే కాదు.. ఆ స్కూల్‌లో మరో 128 మంది అనాథలను ఆర్డీటీ సంస్థ చేర్పించి విద్యాబుద్ధులు చెప్పిస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారులను కదిపితే.. ‘నాకు నా తమ్ముడు.. వాడికి నేను.. మా ఇద్దరికీ మీరందరూ’ అంటూ చెమర్చిన కళ్లతో అంటుంటే చూసే వారి హృదయాలు ద్రవించిపోతున్నాయి.  

మేము అనాథలం కాదు.. 
మాది కదిరి. నాన్న ఆనంద్‌... విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తూ మూడున్నరేళ్ల క్రితం కిడ్నీల వ్యాధితో మరణించారు. అమ్మ బాలాజీమణి మానసికరోగి. ఆమె ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు. నాన్న మరణించిన రోజు.. మా చేతిలో చిల్లిగవ్వ లేదు. బంధువులందరూ కలిసి అంత్యక్రియలు జరిపించి వెళ్లిపోయారు. ఇంటిలో నేను, నా చెల్లి సాయిశరణ్య తప్ప ఎవరూ లేరు. దిక్కు తోచలేదు. ఆ సమయంలో ఆర్డీటీ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి మమ్మల్ని ఆదుకున్నారు. మా విషయం తెలుసుకున్న తర్వాత మమ్మల్ని సంస్థ ద్వారా చదివిస్తున్నారు. నేను హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్నా.. నా చెల్లి పీజీలో జాయిన్‌ కావాల్సి ఉంది. ఇప్పుడు మేము అనాథలం కాదు.. మాకు ఓ మహోన్నత కుటుంబం ఉందనే భరోసాతో జీవిస్తున్నాం.                    – సాయికృప, హౌస్‌ సర్జన్, అనంతపురం 

ఆర్డీటీనే చదివిస్తోంది 
మాది యాడికి మండలం పుప్పాలగుత్తి. నాన్న గుండెపోటుతో 1998లో మరణించాడు. తల్లి అశ్వత్థమ్మ 2008లో కిడ్నీ వ్యాధితో మరణించింది. పెద్దవడుగూరుకు చెందిన మారుతీప్రసాద్‌ అప్పటి నుంచి సాయం చేస్తూ వచ్చారు. డిగ్రీ వరకూ ఆయనే చదివించారు. ఆర్డీటీ వారికి ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారు ఇండియా ఫర్‌ ఇండియా పథకం ద్వారా సాయం చేస్తామన్నారు. గత ఏడాది నుంచి వర్సిటీ ఫీజులు, హాస్టల్‌ ఫీజు వారే చెల్లించారు. ల్యాప్‌టాప్‌ కూడా ఇచ్చారు. ప్రతి నెలా ఖర్చుల కోసం రూ.2,500 ఇస్తున్నారు. ఆర్డీటీ సంస్థ లేకుంటే మాలాంటి వారికి బతుకు ఉండేది కాదు.                
 – రాజశేఖర్, ఎంసీఏ విద్యార్థి, జేఎన్‌టీయూ, అనంతపురం 

పేదలూ సాయం చేయగలరు 
స్పందించే హృదయాన్ని కదిలిస్తే ఎదుటి వారి గుండెల్ని కదిలిస్తుందనడానికి ఈ మహత్కార్యామే నిదర్శనం. పేదలకు సాయం పొందడమే తెలుసు అని అంటారు కానీ వారు సాయం చేయగలరని ఈ హుండీ ఉద్యమం ద్వారా బహిర్గతమైంది. వారు అందించింది ఒక్క రూపాయే అయినా.. అది వేలమందికి చేయూతనందించడంలో తిరుగులేనిదిగా నిరూపితమైంది. ఓ మెరుగైన సమాజ నిర్మాణానికి కారణమైంది.  
– సుధీంద్రరావు, ఆర్డీటీ డైరెక్టర్‌  

ఉప్పెనలా మారింది
సాయం చేసేందుకు అవధుల్లేని సమాజాన్ని రూపొందించాం. ఇది చినుకుగా మొదలై నేడు ఉప్పెనలా మారింది. ఇది ఫాదర్‌ ఫెర్రర్‌ ఆశయం. ఈ ఆశయానికి రూపునిచ్చింది ఈ జిల్లా వాసులే. దీనిని మహావృక్షంగా భావిస్తే ఆ వృక్షానికి నీటిని అందిస్తోంది సాయం చేస్తున్న వారే. సాయం పొందుతున్న వారందరూ ఆ వృక్షం నీడలో ఉన్నవారే.  
– మాంఛోఫెర్రర్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ 

సాయం చేసేందుకు సంప్రదించాల్సిన చిరునామా 
డైరెక్టర్, ఇండియా ఫర్‌ ఇండియా,  
రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్, 
బెంగుళూరు హైవే, అనంతపురం–515001, సెల్‌ : 98496 42334 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

హుండీలతో ఆర్‌డీటీ సిబ్బంది

2
2/4

ఆర్‌డీటీ కార్యాలయానికి చేర్చిన హుండీలు

3
3/4

హుండీలను పగలగొడుతున్న అన్నే ఫెర్రర్‌

4
4/4

హుండీలను పగలగొడుతున్న మాంచో ఫెర్రర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement