మదర్ థెరిస్సా బాటలో నడుద్దాం
అనంతపురం కల్చరల్: సేవా కార్యక్రమాలతో ప్రపంచానికి మదర్‌థెరిస్సా సరికొత్త వెలుగులను అందించారని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. అమ్మ సంస్థ తరఫున చేపడుతున్న సామాజిక సేవలు అభినందనీయమని కొనియాడారు. మదర్‌థెరిస్సా జయంతి సందర్భంగా అమ్మ సంస్థ తరిమెల రమణారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను ఎస్పీ, సీనియర్ న్యాయవాది శైలజ, ఆచార్య హేమచంద్రారెడ్డి, డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంత కొడుకులు, బంధువులే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలించుకుంటుంటే.. తరిమెల రమణారెడ్డి వంటి వారు అనాథల పట్ల చూపుతున్న కరుణ వెలకట్టలేనిదన్నారు. తమ పరిధిలో అనాథలకు సేవలందిస్తున్న వారికి అండగా నిలుస్తామన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పలు వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లోని 300 మందికి నూతన వస్త్రాలు, రైస్ కుక్కర్లతో పాటు నిత్యావసర వస్తువులను ఎస్పీ చేతుల మీదుగా అందించారు. అనంతరం అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో కాపు జాక్ నాయకులు భవానీ రవికుమార్, హర్ష, ఆదరణ శైలజ, కృష్ణారెడ్డి, ప్రమీళమ్మ తదితరులు పాల్గొన్నారు.