రాయలసీ కన్నీటి పాట పెన్నేటి పాట
‘వినిపింతునింక రాయలసీమ కన్నీటి పాటకోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజెరి కొట్టుకొనుచు’ అంటూ విద్వాన్ విశ్వం గానం చేసిన ‘పెన్నేటి పాట’ రాయలసీమ కరువు నేపథ్యంగా (1954లో) వచ్చిన తొలి కావ్యం. నదిలా ప్రవహించినప్పుడు పరిపూర్ణమైనట్టే, ఎండిపోయినప్పుడు జీవితం స్తంభించిపోతుంది. ఎండిపోయిన పెన్నానది ఇసుకతో నిండిపోయి ఆ ప్రాంతపు జీవన వాస్తవికతను ఈ కావ్యంలో విశ్వం కళ్లకు కట్టినట్టు చూపించారు.
‘ఇదే పెన్న! ఇదే పెన్న! నిదానించి నడు
విదారించు నెదన్, వట్టి ఎడారి తమ్ముడు!
ఎదీ నీరు? ఎదీ హోరు? ఎదీ నీటి చాలు?
ఇదే నీరు! ఇదే హోరు! ఇదే ఇసుక వాలు!’ అంటూ సాగే పంక్తులతో రాగయుక్తంగా కావ్యగానం చేసే వారు ఈ సీమలో ఇప్పటికీ ఉన్నారు.ఈ కావ్య కథానాయకుడు రంగడు ఒక పెద్ద రైతుకు పుట్టిన ఏకైక సంతానం. ఆస్తినంతా తండ్రి పోగొట్టగా రంగడికి మిగిలింది శారీరక శ్రమ మాత్రమే. అతను అడవినుంచి కట్టెలు కొట్టితెచ్చి అమ్ముకునే కూలి. అతని భార్య గంగమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో ఒడ్లో, అటుకులో దంచి నూకలు, తవుడు తెచ్చుకుంటుంది. ఇద్దరి పరస్పర ప్రేమ, పరోపకార బుద్ధి, అంతులేని దారిద్య్రం, గంగమ్మ గర్భవతి కావడం, విశ్రాంతి లేకపోవడం, రంగడు నిస్సహాయుడై పోవడం ఇందులోని కథాంశం.
‘దైవమా; ఉంటివా? చచ్చినావ నీవు?
హృదయమా; మానవుడు నిన్ బహిష్కరించె!
చచ్చె నీలోకమున నాత్మసాక్షి యనుచు
నెత్తినోరిడు కొట్టుకోనిండు నన్ను’ అంటూ నిర్వేదంతో కావ్యం ముగుస్తుంది. ఈ కావ్యంలో కథ రేఖామ్రాతమే కానీ, పేదరికం వల్ల కలిగే విధ్వంసానికి ప్రాధాన్యమిచ్చిన తొలి సంపూర్ణ కావ్యం. రాయలసీమలో ప్రవహించే ప్రధానమైన పెన్నానది, ఇక్కడి ప్రకృతి, గ్రామాలు, జీవన సరళి, శ్రమ వంటి వన్నీ ఈ కావ్యంలో ప్రతిబింబిస్తాయి. ఈ కావ్యం ప్రాచీన ఆధునిక రీతుల మేలు కలయిక. ఇందులో సీస పద్యాలున్నాయి, గేయాలున్నాయి, వృత్తాలున్నాయి, వచనంలా భాసించే పంక్తులున్నాయి. ఇందులో దస్త్రము, జీవాలు, సందకాడ, ఎనుము వంటి మాండలికాలున్నాయి. గంపంత దిగులు, అంబటిపొద్దు వంటి తెలుగు నుడికారాలూ ఉన్నాయి.
రాఘవశర్మ
Comments
Please login to add a commentAdd a comment