ద లోలాండ్
పుస్తక శీర్షిక ‘ద లోలాండ్’ రెండు చెరువుల మధ్యనున్న చిత్తడి నేలని ఉటంకిస్తుంది. దృష్టికోణాలని మారుస్తూ, ఫ్లాష్‌బ్యాకులని ఉపయోగించిన కథనం మూడు తరాల మిత్రాల కుటుంబాన్ని చూపిస్తుంది. ఈ నవల ‘మాన్ బుకర్ ప్రైజు’కి షార్ట్‌లిస్ట్ అయింది.
ఝుంపా లాహిరి రాసిన ‘ద లోలాండ్‘, కలకత్తా పొలిమేరల్లో రెండు చెరువులు మధ్యనున్న, రెండెకరాల చిత్తడినేల వర్ణనతో ప్రారంభం అవుతుంది. మిత్రాల కుటుంబంలో ఇద్దరన్నదమ్ములు పెరుగుతుంటారు. సుభాష్ 13 ఏళ్ళవాడు. తమ్ముడు ఉదయన్ 15 నెలలు చిన్నవాడు. ఇద్దరికీ మధ్య సాన్నిహిత్యంతో పాటు పోలికలూ బాగానే ఉన్నప్పటికీ, స్వభావాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకం. సుభాష్ జాగ్రత్త పాటించేవాడు. అమెరికా వెళ్ళి చదువుకుంటాడు. ఉదయన్ నిర్లక్ష్య ధోరణి కనపరిచేవాడు. పగటిపూట ఉపాధ్యాయుడిగా పని చేస్తూ, రాత్రుళ్ళు నక్సలైటు ఉద్యమాల్లో పాల్గొంటాడు. ఫిలొసొఫీ విద్యార్థిని అయిన గౌరితో ప్రేమలో పడి, పెళ్ళి చేసుకుంటాడు.
ఆ చిత్తడి నేలమీదే ఉదయన్‌ను ఒక రోజు పోలీసులు కాల్చి చంపేస్తారు. సుభాష్ ఇంటికి తిరిగి వచ్చి, తల్లీ తండ్రీ ఇష్టపడని గౌరిని పెళ్ళి చేసుకుని, ‘మధ్యలో ఆగిపోయిన నీ చదువు కొనసాగించవచ్చు’ అని ప్రలోభపెట్టి, అమెరికా తీసుకెళ్తాడు. అప్పటికే ఆమె గర్భవతి. బేలా పుడుతుంది. ప్రసవం తరువాత సుభాష్, గౌరి మొట్టమొదటిసారి లైంగిక సంబంధంలో పాల్గొన్నప్పుడు– ఇద్దరికీ సంతృప్తి కలగదు. వారి వివాహం కేవలం పరస్పర తాత్కాలిక ఆకర్షణ మీదా, ఇద్దరికీ దగ్గర అయిన ఉదయన్ జ్ఞాపకాల మీదా ఆధార పడినది అయి ఉండటం వల్ల, కొత్త భర్తనే కాక తను కోల్పోయిన ఉదయన్ జ్ఞాపకాలతో ముడిపడిన బేలాని కూడా ప్రేమించలేకపోతుంది గౌరి. ‘ఉదయన్ చోటు సుభాష్ భర్తీ చేయడం అన్నది దుద్దుల జతలో ఒకటి పోతే, రెండోదాన్ని జాగ్రత్తగా దాచుకోవడం వంటిదే’ అనుకుంటూ, జీవితంతో రాజీపడలేకుండా ఇద్దరినీ వదిలి కాలిఫోర్నియా వెళ్ళి, తన రంగంలో మంచి పేరు తెచ్చుకుంటుంది.
లోర్నా అన్న స్త్రీతో సమలైంగిక సంబంధాన్ని ఏళ్ళకొద్దీ సాగిస్తుంది. సుభాష్ బేలాని పెంచుతాడు. వీటన్నిటినీ చూసిన బేలా పెద్దయి, ఏ నిబద్ధతకీ కట్టుబడి ఉండక, ఊరూరూ తిరుగుతుంది. తన బిడ్డ మేఘనాని తానే పెంచుతుంది.విడాకులు కావాలని సుభాష్ గౌరికి మెయిల్ పంపినప్పుడు, గౌరి ఒప్పుకుంటుంది. సుభాష్– బేలా టీచర్ ఎలీజ్‌ను పెళ్ళి చేసుకుంటాడు.ఆఖరి అధ్యాయం ఉదయన్ మరణించిన దినాన్ని గుర్తు చేసుకున్నది. అందరి దృష్టిలో దేవుడైన ఉదయన్, గతంలో జరిగిన ఒక హత్యలో పాలు పంచుకుంటాడు. ఇది తెలిసిన సుభాష్– ‘తనకి గౌరి ముందే అర్థం అయి ఉంటే, తన జీవితం వేరేగా గడిచేది’ అని గ్రహిస్తాడు.
నవల– యువతకుండే తెగువ, మొండిధైర్యం, వ్యామోహం గురించినది. పశ్చాత్తాపం, తమని తాము క్షమించుకోలేకపోవడం, ఒక వ్యక్తి మరణం ఎంతమంది జీవితాలమీద ఎంత ప్రభావం చూపిందో అన్న అంశాలు నిండి ఉన్నది. ప్రధానపాత్ర చనిపోయిన తరువాత కూడా, కథనం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కథాకాలం 1960లలో.పుస్తక శీర్షిక రెండు చెరువుల మధ్యనున్న చిత్తడి నేలని ఉటంకిస్తుంది. దృష్టికోణాలని మారుస్తూ, ఫ్లాష్‌బ్యాకులని ఉపయోగించిన కథనం మూడు తరాల మిత్రాల కుటుంబాన్ని చూపిస్తుంది. 2013లో వచ్చిన నవల అదే సంవత్సరం, ‘మాన్ బుకర్ ప్రైజుకీ’కీ, ‘బెయిలీ వుమన్స్ ప్రైజు’కీ షార్ట్‌లిస్ట్ అయింది. పులిట్జర్ గ్రహీత అయిన రచయిత్రి రాసిన ఈ రెండవ నవల కూడా ఆమె ఇతర పుస్తకాల్లాగే అమెరికా, ఇండియాలని నేపథ్యంగా తీసుకుని రాసినది. ఆడియో పుస్తకం ఉంది. ...కృష్ణ వేణి
ఝంపా లాహిరి
Comments
Please login to add a commentAdd a comment