jhumpa lahiri
-
ఇరువురు సోదరుల వేరు దారుల కథ
పుస్తక శీర్షిక ‘ద లోలాండ్’ రెండు చెరువుల మధ్యనున్న చిత్తడి నేలని ఉటంకిస్తుంది. దృష్టికోణాలని మారుస్తూ, ఫ్లాష్‌బ్యాకులని ఉపయోగించిన కథనం మూడు తరాల మిత్రాల కుటుంబాన్ని చూపిస్తుంది. ఈ నవల ‘మాన్ బుకర్ ప్రైజు’కి షార్ట్‌లిస్ట్ అయింది. ఝుంపా లాహిరి రాసిన ‘ద లోలాండ్‘, కలకత్తా పొలిమేరల్లో రెండు చెరువులు మధ్యనున్న, రెండెకరాల చిత్తడినేల వర్ణనతో ప్రారంభం అవుతుంది. మిత్రాల కుటుంబంలో ఇద్దరన్నదమ్ములు పెరుగుతుంటారు. సుభాష్ 13 ఏళ్ళవాడు. తమ్ముడు ఉదయన్ 15 నెలలు చిన్నవాడు. ఇద్దరికీ మధ్య సాన్నిహిత్యంతో పాటు పోలికలూ బాగానే ఉన్నప్పటికీ, స్వభావాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకం. సుభాష్ జాగ్రత్త పాటించేవాడు. అమెరికా వెళ్ళి చదువుకుంటాడు. ఉదయన్ నిర్లక్ష్య ధోరణి కనపరిచేవాడు. పగటిపూట ఉపాధ్యాయుడిగా పని చేస్తూ, రాత్రుళ్ళు నక్సలైటు ఉద్యమాల్లో పాల్గొంటాడు. ఫిలొసొఫీ విద్యార్థిని అయిన గౌరితో ప్రేమలో పడి, పెళ్ళి చేసుకుంటాడు. ఆ చిత్తడి నేలమీదే ఉదయన్‌ను ఒక రోజు పోలీసులు కాల్చి చంపేస్తారు. సుభాష్ ఇంటికి తిరిగి వచ్చి, తల్లీ తండ్రీ ఇష్టపడని గౌరిని పెళ్ళి చేసుకుని, ‘మధ్యలో ఆగిపోయిన నీ చదువు కొనసాగించవచ్చు’ అని ప్రలోభపెట్టి, అమెరికా తీసుకెళ్తాడు. అప్పటికే ఆమె గర్భవతి. బేలా పుడుతుంది. ప్రసవం తరువాత సుభాష్, గౌరి మొట్టమొదటిసారి లైంగిక సంబంధంలో పాల్గొన్నప్పుడు– ఇద్దరికీ సంతృప్తి కలగదు. వారి వివాహం కేవలం పరస్పర తాత్కాలిక ఆకర్షణ మీదా, ఇద్దరికీ దగ్గర అయిన ఉదయన్ జ్ఞాపకాల మీదా ఆధార పడినది అయి ఉండటం వల్ల, కొత్త భర్తనే కాక తను కోల్పోయిన ఉదయన్ జ్ఞాపకాలతో ముడిపడిన బేలాని కూడా ప్రేమించలేకపోతుంది గౌరి. ‘ఉదయన్ చోటు సుభాష్ భర్తీ చేయడం అన్నది దుద్దుల జతలో ఒకటి పోతే, రెండోదాన్ని జాగ్రత్తగా దాచుకోవడం వంటిదే’ అనుకుంటూ, జీవితంతో రాజీపడలేకుండా ఇద్దరినీ వదిలి కాలిఫోర్నియా వెళ్ళి, తన రంగంలో మంచి పేరు తెచ్చుకుంటుంది. లోర్నా అన్న స్త్రీతో సమలైంగిక సంబంధాన్ని ఏళ్ళకొద్దీ సాగిస్తుంది. సుభాష్ బేలాని పెంచుతాడు. వీటన్నిటినీ చూసిన బేలా పెద్దయి, ఏ నిబద్ధతకీ కట్టుబడి ఉండక, ఊరూరూ తిరుగుతుంది. తన బిడ్డ మేఘనాని తానే పెంచుతుంది.విడాకులు కావాలని సుభాష్ గౌరికి మెయిల్ పంపినప్పుడు, గౌరి ఒప్పుకుంటుంది. సుభాష్– బేలా టీచర్ ఎలీజ్‌ను పెళ్ళి చేసుకుంటాడు.ఆఖరి అధ్యాయం ఉదయన్ మరణించిన దినాన్ని గుర్తు చేసుకున్నది. అందరి దృష్టిలో దేవుడైన ఉదయన్, గతంలో జరిగిన ఒక హత్యలో పాలు పంచుకుంటాడు. ఇది తెలిసిన సుభాష్– ‘తనకి గౌరి ముందే అర్థం అయి ఉంటే, తన జీవితం వేరేగా గడిచేది’ అని గ్రహిస్తాడు. నవల– యువతకుండే తెగువ, మొండిధైర్యం, వ్యామోహం గురించినది. పశ్చాత్తాపం, తమని తాము క్షమించుకోలేకపోవడం, ఒక వ్యక్తి మరణం ఎంతమంది జీవితాలమీద ఎంత ప్రభావం చూపిందో అన్న అంశాలు నిండి ఉన్నది. ప్రధానపాత్ర చనిపోయిన తరువాత కూడా, కథనం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కథాకాలం 1960లలో.పుస్తక శీర్షిక రెండు చెరువుల మధ్యనున్న చిత్తడి నేలని ఉటంకిస్తుంది. దృష్టికోణాలని మారుస్తూ, ఫ్లాష్‌బ్యాకులని ఉపయోగించిన కథనం మూడు తరాల మిత్రాల కుటుంబాన్ని చూపిస్తుంది. 2013లో వచ్చిన నవల అదే సంవత్సరం, ‘మాన్ బుకర్ ప్రైజుకీ’కీ, ‘బెయిలీ వుమన్స్ ప్రైజు’కీ షార్ట్‌లిస్ట్ అయింది. పులిట్జర్ గ్రహీత అయిన రచయిత్రి రాసిన ఈ రెండవ నవల కూడా ఆమె ఇతర పుస్తకాల్లాగే అమెరికా, ఇండియాలని నేపథ్యంగా తీసుకుని రాసినది. ఆడియో పుస్తకం ఉంది. ...కృష్ణ వేణి ఝంపా లాహిరి -
ఝంపా లాహిరికి అమెరికా పురస్కారం
వాషింగ్టన్: పులిట్జర్ అవార్డు విజేత అయిన భారతీయ అమెరికన్ ఝంపా లాహిరి 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అమెరికా జాతీయ హ్యూమనిటీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ నెల పదిన వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆమెకు అవార్డు ఇస్తారు. మానవ సంబంధాలను అద్భుతరీతిలో ఆవిష్కరించినందుకుగాను ఈ అవార్డుకు ఆమెను ఎంపిక చేసినట్టు వైట్‌హౌస్ తెలిపింది. తన సృజనాత్మక రచనల ద్వారా ఆమె భారతీయ అమెరికన్ల అనుభవాలను అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించింది. -
బుకర్ ప్రైజ్ అంచున...కొంచెం నక్సల్బరీ... కొంత రోడ్ ఐల్యాండ్...
జుంపా లహరి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గతంలో తన తొలి కథా సంపుటి ‘ఇంటర్ప్రెటర్ ఆఫ్ మలాదీస్’తో పులిట్జర్ అవార్డ్ గెలుచుకొని లోకం దృష్టిని ఆకర్షించిన జుంపా ఆ వెంటనే తొలి నవల ‘ది నేమ్‌సేక్’తో కూడా (మీరా నాయర్ సినిమా గుర్తుంది కదా) ఆకట్టుకున్నారు. ఇప్పుడు తన నవల ‘ది లోల్యాండ్’తో బుకర్ ప్రైజ్‌కు చేరువయ్యారు. తాజాగా వెలువడిన బుకర్ ప్రైజ్ ఆశావహుల షార్ట్‌లిస్ట్‌లో ఆమె పేరు ఉంది. తనతో పాటు పోటీలో ఉన్న ఇతర ఐదుగురు రచయితలను దాటగలిగితే ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆమెనే వరించవచ్చు.ఇంతకీ ఈ సంవత్సరమే విడుదలైన ఈ ‘ది లోల్యాండ్’లో ఏముంది? ఇంతకు ముందులాంటి కథే. జుంపా తన భారతీయ మూలాలను మర్చిపోకుండా- భారత్‌లో పుట్టి అమెరికాలో పెరిగిన, అక్కడ స్థిరపడిన భారతీయుల జీవితాలను రాసినట్టే ఈ నవలలోనూ అలాంటి కథనే తీసుకున్నారు. కాకపోతే ఈసారి నక్సల్బరీ మీద ఆమె దృష్టి పడటం విశేషం. ‘దున్నేవాడిదే భూమి’ నినాదంతో 1967లో బెంగాల్లో దావానలంలా వ్యాపించిన ఈ ఉద్యమం ఈ కథకు కీలక నేపథ్యం. ఆ సమయంలోనే, అంటే నక్సల్బరీ ఉద్యమం దేశం నలుచెరగులా వ్యాపిస్తున్న సమయంలోనే యవ్వనంలో ఉరకలెత్తే ఇరువురు అన్నదమ్ముల కథ ‘ది లోల్యాండ్’. ఈ పేదరికం, దారిద్య్రం పోవాలంటే తుపాకీ పట్టుకోక తప్పదు అని నమ్మిన ఆ అన్నదమ్ముల్లో ఒకడు చాలా త్వరగా ఇందులో ఉన్న ప్రమాదాన్ని గ్రహిస్తాడు. ఉద్యమంలోని కష్టనష్టాలను గమనించి తను విరమించుకుని అమెరికాకు వెళ్లిపోతాడు. మరొకడు నక్సలైట్‌గా కొనసాగి బూటకపు ఎన్కౌంటర్లో చనిపోతాడు. ఈ వార్త విని అమెరికా నుంచి సోదరుడు తిరిగి వచ్చేసరికి ఇటీవలే అతడి జీవితంలో ప్రవేశించిన భార్య. పైగా గర్భవతి. ఆమె దైన్యస్థితిని అర్థం చేసుకున్న సోదరుడు ఆమెను వివాహం చేసుకొని అమెరికా(రోడ్ ఐల్యాండ్)కు తీసుకువెళతాడు. అక్కడ ఆమెకు కుమార్తె పుడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇరువురూ ఆ పాపకు అసలు నిజం చెప్పకుండా పెంచి పెద్ద చేస్తారు. కాని రాను రాను భార్యకు అతడితో ఉన్న వైవాహిక సంబంధం నచ్చదు. పెళ్లి వీగిపోతుంది. చివరకు ఏమయ్యింది అనేది కథ. జుంపా తన సహజమైన రచనా ప్రావీణ్యంతో ఈ నవలను పరుగెత్తించారని విమర్శకుల ప్రశంస. ‘ఇంతకూ ఈ కథ ఏం చెప్తుంది’ అని సన్నాయి నొక్కులు నొక్కేవారు కూడా జుంపా శిల్పంలో వంక పెట్టలేక ‘సరే కానివ్వండి’ అంటున్నారు. బుకర్ పుణ్యమా అని ‘ది లోల్యాండ్’ మంచి చెడ్డలు ఇక మీదట విస్తృతంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. -
బుకర్ ప్రైజ్ తుది జాబితాలో ఝంపా లహరి
లండన్: భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి(46) ప్రతిష్టాత్మక ‘బుకర్ ప్రైజ్’ తుది జాబితాలో చోటు సాధించారు. గతంలో ఆమె పులిట్జర్ బహుమతి సాధించారు. కోల్‌కతా నేపథ్యంలో ఆమె రాసిన ‘ద లో లాండ్’ రచనకుగానూ మన్ బుకర్ ప్రైజ్-2013 తుది జాబితాలో ఎంపికైనట్లు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు.