బుకర్ ప్రైజ్ అంచున...కొంచెం నక్సల్బరీ... కొంత రోడ్ ఐల్యాండ్...
జుంపా లహరి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గతంలో తన తొలి కథా సంపుటి ‘ఇంటర్ప్రెటర్ ఆఫ్ మలాదీస్’తో పులిట్జర్ అవార్డ్ గెలుచుకొని లోకం దృష్టిని ఆకర్షించిన జుంపా ఆ వెంటనే తొలి నవల ‘ది నేమ్‌సేక్’తో కూడా (మీరా నాయర్ సినిమా గుర్తుంది కదా) ఆకట్టుకున్నారు. ఇప్పుడు తన నవల ‘ది లోల్యాండ్’తో బుకర్ ప్రైజ్‌కు చేరువయ్యారు. తాజాగా వెలువడిన బుకర్ ప్రైజ్ ఆశావహుల షార్ట్‌లిస్ట్‌లో ఆమె పేరు ఉంది. తనతో పాటు పోటీలో ఉన్న ఇతర ఐదుగురు రచయితలను దాటగలిగితే ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆమెనే వరించవచ్చు.ఇంతకీ ఈ సంవత్సరమే విడుదలైన ఈ ‘ది లోల్యాండ్’లో ఏముంది? ఇంతకు ముందులాంటి కథే.
జుంపా తన భారతీయ మూలాలను మర్చిపోకుండా- భారత్‌లో పుట్టి అమెరికాలో పెరిగిన, అక్కడ స్థిరపడిన భారతీయుల జీవితాలను రాసినట్టే ఈ నవలలోనూ అలాంటి కథనే తీసుకున్నారు. కాకపోతే ఈసారి నక్సల్బరీ మీద ఆమె దృష్టి పడటం విశేషం. ‘దున్నేవాడిదే భూమి’ నినాదంతో 1967లో బెంగాల్‌లో దావానలంలా వ్యాపించిన ఈ ఉద్యమం ఈ కథకు కీలక నేపథ్యం. ఆ సమయంలోనే, అంటే నక్సల్బరీ ఉద్యమం దేశం నలుచెరగులా వ్యాపిస్తున్న సమయంలోనే యవ్వనంలో ఉరకలెత్తే ఇరువురు అన్నదమ్ముల కథ ‘ది లోల్యాండ్’. ఈ పేదరికం, దారిద్య్రం పోవాలంటే తుపాకీ పట్టుకోక తప్పదు అని నమ్మిన ఆ అన్నదమ్ముల్లో ఒకడు చాలా త్వరగా ఇందులో ఉన్న ప్రమాదాన్ని గ్రహిస్తాడు.
ఉద్యమంలోని కష్టనష్టాలను గమనించి తను విరమించుకుని అమెరికాకు వెళ్లిపోతాడు. మరొకడు నక్సలైట్‌గా కొనసాగి బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోతాడు. ఈ వార్త విని అమెరికా నుంచి సోదరుడు తిరిగి వచ్చేసరికి ఇటీవలే అతడి జీవితంలో ప్రవేశించిన భార్య. పైగా గర్భవతి. ఆమె దైన్యస్థితిని అర్థం చేసుకున్న సోదరుడు ఆమెను వివాహం చేసుకొని అమెరికా(రోడ్ ఐల్యాండ్)కు తీసుకువెళతాడు. అక్కడ ఆమెకు కుమార్తె పుడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇరువురూ ఆ పాపకు అసలు నిజం చెప్పకుండా పెంచి పెద్ద చేస్తారు. కాని రాను రాను భార్యకు అతడితో ఉన్న వైవాహిక సంబంధం నచ్చదు. పెళ్లి వీగిపోతుంది. చివరకు ఏమయ్యింది అనేది కథ.
జుంపా తన సహజమైన రచనా ప్రావీణ్యంతో ఈ నవలను పరుగెత్తించారని విమర్శకుల ప్రశంస. ‘ఇంతకూ ఈ కథ ఏం చెప్తుంది’ అని సన్నాయి నొక్కులు నొక్కేవారు కూడా జుంపా శిల్పంలో వంక పెట్టలేక ‘సరే కానివ్వండి’ అంటున్నారు. బుకర్ పుణ్యమా అని ‘ది లోల్యాండ్’ మంచి చెడ్డలు ఇక మీదట విస్తృతంగా చర్చకొచ్చే అవకాశం ఉంది.