1981లో ‘అమెరికన్ డెర్విష్’ కథ మొదలయేటప్పటికి హయాత్ షా వయసు పది సంవత్సరాలు. తల్లిదండ్రులు పాకిస్తాన్ నుండి వచ్చి, మిల్వాకీ (అమెరికా) లో స్థిరపడినవారు. డాక్టర్ అయిన తండ్రి నావీద్, మతం మీద నమ్మకం లేని వ్యక్తి. తల్లి మునీర్ ముస్లిమ్ అయినప్పటికీ మొహమ్మదీయ పురుషులు వంచకులన్న నమ్మకం నాటుకుపోయి ఉన్న స్త్రీ. ‘నేను నిన్ను యూదునిగానే పెంచుతున్నాను. వారికే స్త్రీలను గౌరవించడం తెలుసు,’ అని కొడుక్కి బోధిస్తుంటుంది.
నావీద్‌కి ఆడ పిచ్చి. నవలంతటా తాగుతూ, భార్యని మోసం చేస్తూనే కనిపిస్తాడు. ఒకరోజు క్లినిక్‌లో తండ్రి నర్స్‌తో ఉండగా హయాత్ చూసి, ‘ఆమె మాట్లాడుతుంటే, యీయన డ్రింక్ సిప్ చేస్తూ తన శరీరాన్ని నర్సుకి తాకిస్తూ, ఆమెను ముద్దు పెట్టుకున్నాడు’ అంటాడు. నావీద్ స్నేహితుడైన నాథన్, తన భార్యని మోసగిస్తుండటం గురించి తల్లి, హయాత్‌కు చిన్నప్పటినుండీ నూరిపోస్తూ, నావీద్‌ని కూడా తిడుతుంటుంది. తన తల్లిదండ్రుల సంబంధాన్ని హయాత్ వర్ణిస్తాడు. ‘ఇప్పుడు వాళ్ళు ముందటికన్నా ఎక్కువ పోట్లాడుకుంటున్నారు. తిట్టుకుంటూ, తలుపులు బాదుకుంటూ, ఒకరినొకరు విడిచిపెడతామంటూ బెదిరించుకుంటున్నారు. నాన్న ఎన్నోసార్లు రాత్రుళ్ళు ఇంటికే రాడు.’
మీనా, మునీర్ స్నేహితురాలు. తన కొడుకు ఇమ్రాన్‌తో పాటు పాకిస్తాన్లో అయిన తన విడాకుల విషాదాన్ని తప్పించుకోడానికి ‘షా’ ల ఇంటికి వస్తుంది. ఆమె తెలివైనదీ, అందమైనదీ. హయాత్‌కు ఖురాన్‌ను పరిచయం చేస్తుంది. ఆమె పక్కన కూర్చుని చదువుతూ, పిల్లవాడు మీనాతో ప్రేమలో పడతాడు. ‘ఆమె గొంతంటే నాకు పిచ్చి. ఆమెకి సమీపంలో కూర్చోవడం నాకిష్టం. రాత్రిపూట ఆమె చెప్పే కథల చుట్టూనే నా రోజులు తిరుగుతాయి’ అంటాడు. కొడుక్కు ఇష్టమైన ఆ గ్రంథాన్ని తగలబెట్టి, మతంపైన కొడుక్కు ఉన్న నమ్మకాన్ని దూరం చేయాలనుకుంటాడు నావీద్.
మీనా, నాథన్‌తో ప్రేమలో పడుతుంది. హయాత్ ఈర్ష్యతో రగిలిపోయి, మీనా మాజీ భర్తకి వివరాలు తెలుపుతూ, టెలిగ్రామ్ ఇస్తాడు. అప్పుడు ఆమె కుటుంబం స్పందించిన తీరు చూసిన నాథన్, బోస్టన్ వెళ్ళిపోతాడు. తను చేసిన తప్పుకి, తన్ని తాను క్షమించుకోలేకపోయి శేషజీవితమంతా అపరాధభావంతో గడుపుతాడు హయాత్.
ఆ తరువాత మీనా పాకిస్తానీ అయిన సునిల్‌ను పెళ్ళి చేసుకుంటుంది. అతని చేతుల్లో దెబ్బలు తింటూ, అల్లా మీద నమ్మకంతో భరిస్తుంది. ఎనిమిదేళ్ళ తరువాత మీనా క్యాన్సర్‌తో చనిపోబోతున్నప్పుడు, తను పంపిన టెలిగ్రామ్ గురించి హయాత్ ఆమెకి చెప్తాడు. మీనా అతడిని క్షమిస్తుంది. ఆమె మరణం తరువాత నాథన్, ‘నేను మీ ‘ఆంటీ’ని ఎప్పుడూ మరచిపోలేదు. జీవితంలో నేను ప్రేమించినది ఆమెని మాత్రమే’ అని హయాత్‌తో అంటాడు.
పుస్తకంలో ప్రధాన భాగం ముస్లిమ్ సమాజంలో స్త్రీలకుండే స్థానం గురించినది. కథనం సాఫీగా ఉంటుంది. ‘నావీద్ వంటి వ్యక్తులు తమ సంస్కృతిని వదిలించుకుని అమెరికన్లలా ఉందామనుకుంటారు. మీనా వంటి వ్యక్తులు రెండు సంస్కృతులనీ తమవే చేసుకుంటారు. ఏ ఒక్క దారి కూడా సంతోషానికి దారి తీయదు’ అని అంటారు రచయిత అయాద్ అఖ్తర్.
కుటుంబ సంఘర్షణ గురించిన సంప్రదాయక కథలో, కిషోర ప్రాయపు ఆరాటం గురించి ఉన్న వివరాలు విశదమైనవి. ఇస్లామ్‌కున్న సంక్లిష్టతనీ, అమెరికన్ సమాజంలో తనకున్న ఉనికినీ అర్థం చేసుకునే ప్రయత్నం చేసే పిల్లవాడి మనోభావాలని చక్కగా వర్ణిస్తారు అఖ్తర్. 9/11కి ముందు, అమెరికాలో– యూదులకూ, ముస్లిమ్సుకూ మధ్యన ఉండిన ఉద్రిక్తతలను సూక్ష్మంగా వివరిస్తారు.
2012లో పబ్లిష్ అయిన రచయిత యీ తొలి నవలలో– చమత్కారం, వ్యంగ్యం, ఆధ్యాత్మికత కూడా పుష్కలంగా కనబడతాయి.
-కృష్ణ వేణి
Published Mon, Oct 15 2018 12:24 AM | Last Updated on Mon, Oct 15 2018 12:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment