తెలుగు భాషకు చిరునామాలు గ్రామాలు | villages Addresses to Telugu Language | Sakshi
Sakshi News home page

తెలుగు భాషకు చిరునామాలు గ్రామాలు

Published Mon, Nov 6 2017 1:09 AM | Last Updated on Mon, Nov 6 2017 1:09 AM

villages Addresses to Telugu Language - Sakshi

రాబోవు పుస్తకం

ఒక భాషకు సంబంధించిన స్వీయ అస్తిత్వం ఆ భాషకు చెందిన దేశి పదాల్లో వ్యక్తమవుతూ వుంటుంది. తెలుగులోనికి వచ్చి చేరిన సంస్కృతాంగ్ల ఉర్దూ మొదలైన భాషా పదాలతో తెలుగు సుసంపన్నం అయితే కావచ్చుగాక కానీ ఆ పదాల్లో తెలుగుదనం వుండదు. తల్లి, తండ్రి, ఊరు, పేరు, రాయి, రప్ప వంటి దేశి శబ్దాలు తెలుగు భాషా స్వరూప స్వభావాన్ని వెల్లడించే పదాలు. ఈ అసలు సిసలు తెలుగు పదాలు తెలంగాణ గ్రామీణ ప్రాంత భాషా వ్యవహారంతో అత్యంత సహజంగా అల్లుకుపోయాయి. ఎక్కడో నిఘంటువుల్లో చోటుచేసుకొని వున్న ఈ తెలుగు మాటలు నిసర్గ సుందరంగా పల్లీయుల నాల్కలపై నర్తిస్తాయి. అలాంటి కొన్ని మాటలు ఇక్కడ

‘మెయి’ పదమ్మీద ముందు దృష్టి పెడితే, దానికి దేహమనే అర్థం వుందని తెలుస్తుంది, ఇతర అర్థాలు సరేసరి. ఇది తెలంగాణలో పెయి అయింది. పెయికాక అంటే జ్వరం. పెయిసబ్బు అంటే టాయిలెట్‌ సోప్‌. స్నానం చేయడాన్ని పెయి కడుక్కునుడు అంటారు. ‘‘ఒళ్ళూ పై తెలియకుండా మాట్లాడుతున్నాడు’’ వంటి జాతీయంలోని పై తెలంగాణ పెయే!

‘‘వాన్ని ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్లకు చూపిచ్చినా మెరమెర పోతలేదు’’ వాక్యంలోని మెరమెర ఏమిటి? రోగం తాలూకు భయసందేహాదులు మెరమెర. ‘‘మనసుల ఊకే అదే విషయం మెరమెర  వుంటే ఎవడు బాగుపడ్తడు’’ వంటి మాటల్లోని మెరమెర అంటే కూడా మనోవ్యధ, సంశయాదులే! శబ్దరత్నాకరం పై అర్థాల్ని ఖరారు చేసింది మరి!

వర్షాకాలంలో ఉరుములు మెరుపులు సహజం. తెలంగాణ మారుమూల పల్లెల్లో మెరుపును మెరుము అంటారు. ‘‘ఉరుములు మెరుములు పాడుగాను! పిడుగులు మీదనే పడేటట్లు వున్నయి’’లోని మెరుము మెరుపే! నిఘంటువుల్లో మెరుపు, మెరుము రెండు పదాలూ చోటు చేసుకున్నాయి.

‘మెల్ల’ అంటే చూపు కంటి కడకు ఒరిగినది అని నైఘంటికార్థం. మెల్ల కన్ను ఉన్నవాణ్ణి మెంటకన్నోడు అంటారు. ఈ మెంటకన్ను ఎలా వచ్చింది? అది ముందు మెల్లట కన్ను. పుల్లటి కూర పుంటికూర (గోంగూర) అయినట్లు, తొల్లిటి చేయి తొంట చేయి (ఎడమ చేయి) అయినట్లు, మెల్లట కన్ను మెంట కన్నుగా మారింది. కన్నుచూపు  కంటిచూపుగానూ, చన్ను పిల్లగాడు చంటి పిల్లగాడుగానూ, పన్ను నొప్పి పంటినొప్పి గానూ మారినట్లే మెల్లకన్ను  మెంటగా అవతరించింది.

వెనుకట వేసవి వచ్చిందంటే చాలు వీధి బాగోతాలు వేసేవారు. ‘‘అండ్ల నీది ఏమేషంరా? ఉత్తేషమా మేటేషమా?’’ అని అడిగేవారు. మేటేషం అంటే మేటి వేషం. మేటి ఎంత చక్కటి తెలుగు మాట. ప్రధాన పాత్రధారుణ్ణి మేటేషకాడు అనేవారు.

పిల్లలు ఒకచోట చేరి ఆడుకుంటూ వుంటే ‘‘ఎంత సేపాయెరా ఈడ మాల్లెం బెట్టి. మీ అమ్మలు పిలుస్తున్నరు పోండ్రి’’ అంటారు పెద్దలు. ఇందులోని మాల్లెం మేళం నుండి వచ్చింది. దీన్ని ఉభయపదంగానూ, దేశ్య శబ్దంగానూ శబ్దరత్నాకరం పేర్కొంది. ఈ ప్రత్యేక సందర్భంలో మేళం అంటే సమ్మేళనం వంటి కలయిక.

‘మొక్కరము’ అనే పదానికి అర్థం స్తంభము అని. మరో అర్థం గడెమ్రాను. తెలంగాణలో ఈ మొక్కరాన్ని  మొగురం అంటారు. ఇంటినిర్మాణంలో మొగురాలూ, వాటి మీద దూలాలూ, వాసాలూ, పెండెకట్టెలూ, సట్టమూ చాలా ముఖ్యమైనవి. ఈనాటి పిల్లర్సు చేసే పనిని ఈ మొగురాలు చేస్తాయి. మొగురము నిఘంటువుల్లో  మొక్కరము, మొకరము రూపాల్లో కనిపిస్తుంది.

‘మొగులు’ ఎంత మంచి తెలుగు! తెలంగాణలో మేఘాలు కమ్ముకుంటున్న సందర్భాన్ని ‘మొగులైంది’ అంటారు.  మొగులు అంటే మేఘం అని. ఇక ‘మొత్తు’ అనే దేశ్య సకర్మక క్రియ గురించి. దీనికి అర్థం కొట్టు అని. మొహం మొత్తడం తెలుసు మనకు. ఇది తెలంగాణలో ‘మొకం గొట్టుడు’. ఒకే ఆహార పదార్థాన్ని అదే పనిగా తిన్నప్పుడు మొకం గొడుతుంది మరి!

తెలంగాణలో మూర్ఖుణ్ణి, మొండివాణ్ణి, పెడసరం మాటలు మాట్లాడేవాణ్ణి ‘మోర్దోపు మనిషి’ అంటారు. మోర్దోపు పదానికి యింకా ఎక్కువ అర్థ ఛాయలున్నాయి. కొన్ని పదాలకు పూర్తి వివరణ యివ్వలేని అర్థ స్ఫురణ వుంటుంది. శబ్దరత్నాకరంలో ‘మోర త్రోపు’ అని వుంది. మోర అంటే పశ్యాదుల దీర్ఘముఖమే గాక మనిషి ముఖం కూడాను. త్రోపు అంటే అటూ యిటూ ఊపడం. ఏ పని చెప్పినా నకారాత్మకంగా తన ముఖాన్ని ప్రక్కకు త్రోపడమే  మోరత్రోపు. మనుషుల్నే గాక పశువుల్ని వుద్దేశించి కూడా ‘‘దీని పాడుగాని. ఇది మోర్దోపు ఎద్దు’’ అంటుంటారు.

బోనాలు పండుగ సందర్భంలో ‘రంగం’ చెప్పడం ఒక ఘట్టం. మరి ఈ పదార్థం ఏమిటి! సోదె అని. భవిష్యత్తులో  ఏం జరగనుందో రంగం ద్వారా బహిరంగం అవుతుంది.

‘‘బస్సు మస్తు రువ్వడి మీద పోతున్నది.’’ ఈ రువ్వడి ఏమిటి? వేగమే రువ్వడి. రువ్వు, వడి అనే రెండు పొడి  పదాలు కలిసి రువ్వడి అయ్యింది. వడి అంటే వేగమే. రువ్వు అంటే విసిరేయడం–రువ్వడం. రువ్వితే ఎంత వడితో పోతుందో అంత వేగం అన్నమాట రువ్వడి.

కలహశీలుర్ని ‘‘అరేయ్‌ రేగుతున్నాదిరా నీకు?’’ అని ప్రశ్నిస్తుంటారు. రేగు అంటే చెలరేగడం, ప్రకోపించడం. కోపతాపాదులు చెలరేగుతున్నాయా అని అడగడం!
‘రొప్పు’ క్రియకు నిఘంటువులు కూయు, తరుము మొదలైన అర్థాలిచ్చాయి. తెలంగాణలో రొప్పడం అంటే   బండి నడపడం. నిఘంటువు చెప్పిన ‘తరుము’ అర్థానికి కొంత దగ్గరి అర్థము ఈ నడపడం.

‘‘వీడా! లండు పోరడు’’ వాక్యంలోని లండు మెండు తెలుగు దేశ్య పదమే! వాడెవడో సరిగా మాటవినడని అర్థం.  నిఘంటువులు మాత్రం కుత్సితుడు అని అర్థం చెప్పాయి.
‘‘వానికి లత్త కొట్టింది’’ లోని లత్తకు దరిద్రం అని అర్థం. నిఘంటువుల్లో దెబ్బ, ఆపద అని రెండు అర్థాలున్నాయి. లత్త అంటే నష్టం అని కూడా కావచ్చును.
‘‘ఏమో లావు మాట్లాడుతున్నవేంది?’’ అన్న ప్రశ్నలోని లావుకు అర్థం అ«ధికంగా మాట్లాడ్డం అనే!
‘‘నా దగ్గర లిబ్బి ఉన్నదా ఏంది? ఏమో ఊకూకె పైసలు అడుగుతున్నవ్‌’’లో లిబ్బి అంటే ధనము, రాశి, నిధి అని!
ఎండు చేపల్ని తెలంగాణలో ‘వట్టిచాపలు’గా వ్యవహరిస్తారు. యివి ‘వట్టు’ చేపలు. వట్టు అంటే ఇంకు, కృశించు అని. అంటే ఎండిపోయిన అని కదా!
‘‘ఈ పువ్వులు వల్లి పోయినై’’ లోని వల్లి పోవుడు ఏంది? అది వడలిపోవుడు. ‘వడలు’ క్రియ నుండి వర్ణ సమీకరణంలో వల్లు ఏర్పడుతుంది. పుష్పాదులు వాడిపోవడమే వడలడం– వల్లడం.
కొన్ని సామాజిక వర్గాల్లో ‘వడుక లగ్గం’ అని అసలు లగ్గానికి ముందు చేస్తారు. ఈ వడుక వడుగు నుండి అడుగులు వేసింది. వడుగు అంటే బ్రహ్మచారి అని అర్థం. అతనికి చేసే ఉపనయనమే వడుక లగ్గం.
‘‘ఈ అంగిలాగులు ఒదలొదలు అయినై. సరింగ కుట్టలేదు’’ అనే వాక్యంలోని ఒదలు తెలుగులోని వదులు పదం నుండి వదలకుండా వచ్చింది. వదులు అంటే బిగువు తప్పడం, సడలడం, ఆంగ్లభాషలోని లూజ్‌గా వుండడం.

‘వరకు’ అనే దేశ్యపదానికి శబ్దరత్నాకరం ‘బంగారము లోనగువాని రేకు’ అని ఓ అర్థాన్ని వివరించింది. తెలంగాణలో మాత్రం పాలిథీన్‌ పేపర్ని వరకు కాయిదం అంటారు. వర్షానికి తడవకుండా వుండాలంటే అటువంటి  వరకు కాగితాల్లో చుట్టచుట్టుకొని పెట్టుకునేవారు పూర్వం. బంగారు మొదలగువాని రేకులలో పాలిథీన్‌ పేపర్‌ రేకు కూడా ఒకటి అన్నమాట!

పుస్తకాన్ని పూర్వం తెలంగాణలో ‘వయ్యి’ అనే వాళ్ళు. నిఘంటువులు ఈ ఉభయమూ దేశ్యమూ అయిన పదానికి లెక్క పుస్తకము, పుస్తకము, విధము మొదలైన అర్థాల్ని అందించాయి. ఈ వయ్యినే బెంగాలీలో ‘బయి’ అంటారు. ‘వహీ’ అంటారు మరాఠీలో. ఒరియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో బయి అంటారు. తెలంగాణలో  మాత్రం ‘పుస్తకము’ అనే పదం వయ్యిని మొత్తంగా మింగిపారేసింది.

డాక్టర్‌ నలిమెల భాస్కర్‌
9704374081

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement