కొత్త పుస్తకం: హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్.. సాహిత్యాభిమానులను మూడు రోజులు మురిపించి నిన్నటితో ముగిసింది.. వచ్చేయేటి పండగ వరకు ఇది మధుర జ్ఞాపకమై ‘కొత్త పుస్తకం’గా పుస్తకప్రియుల మదిలో పదిలంగా ఒదగనున్నది. మూడు రోజుల ముచ్చట్లపై వీక్షణం..
- సాక్షి, సిటీప్లస్
శుక్రవారం సాయంకాలం ప్రముఖ కవి, రచయిత జావేద్ అఖ్తర్ చేతుల మీదుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రారంభమైన లిటరరీ ఫెస్టివల్‌కు 26 సాయంకాలం ప్రముఖ నాట్యకళాకారిణి, సెన్సార్‌బోర్డ్ మాజీ చైర్‌పర్సన్, కళాక్షేత్ర డెరైక్టర్ లీలా సామ్‌సన్ ముగింపు పలికారు. మొదటిరోజు ఉర్దూసాహిత్య సంప్రదాయ ప్రక్రియ ‘దాస్తాన్‌గొయి’ ప్రధాన ఆకర్షణ అయితే చివరి రోజు మహాత్మాగాంధీ ‘హింద్ స్వరాజ్’ మీద ‘అన్‌బౌండ్’ పేరుతో ప్రణబ్‌ముఖర్జీ ఇచ్చిన ప్రదర్శన ఫెస్టివల్ ఇమేజ్‌ను పెంచింది.
కీ నోట్ టు కల్చరల్ ప్రోగ్రామ్ దాకా..
24వ తేదీ ఉదయం.. తన పుస్తకం ‘ఇన్ అదర్ వర్డ్స్’ అనువాదకుడు అలి హుస్సేన్ మీర్‌తో జావేద్ అఖ్తర్ సంభాషణ, పాఠకులతో ముఖాముఖి.. ఛలోక్తులు హెచ్‌ఎల్‌ఎఫ్ ప్రారంభానికి ఊపునిచ్చాయి. విజువల్‌స్టోరీ టెల్లింగ్, స్పేస్ అండ్ సెన్సిబిలిటీస్ వర్క్‌షాప్స్ పిల్లలకు ‘ఫన్’డగ మూడ్‌ని తెచ్చాయి. ఇంకా పర్యావరణ, సామాజిక సమస్యలకు కొంచెం వ్యంగ్యం, ఇంకాస్త కామెడీ జోడించి తీసిన డాక్యుమెంటరీ, ఫీచర్ ఫిల్మ్స్ స్క్రీనింగ్ ఆ రోజు హైలైట్! టామ్ అల్టర్ నాటక ప్రదర్శన ‘పర్‌చాయియా’ సాహిర్ లూధియాన్విని కళ్లముందుకు తెచ్చింది.
25.. ఆదివారం
హైదరాబాద్ హాలీడేని ఆహ్లాదంగా మలిచిన రోజు. ఉర్దూ షాయరీలు, కవిత్వంలో మహిళల గళం వినిపించిన రోజు. తెలంగాణ కవిత్వమూ తన పుటను తెరిచింది. పిల్లల కోసం సాగిన ‘ది సిటీ వి నీడ్’ అనే స్టోరీ రైటింగ్ సెషన్ పెద్దలనూ ఆకట్టుకుంది. జర్మన్ డెరైక్టర్, కొరియోగ్రాఫర్ జాన్ జబీల్ ఆధ్వర్యంలోని యాక్టింగ్ వర్క్‌షాప్ అందరినీ నటింపచేసింది. ‘యూనివర్సల్ యాక్సెస్ టు ప్రింట్ అండ్ లిటరేచర్’ ప్రోగ్రామ్‌కు ఔత్సాహికుల హాజరు ఫుల్‌గానే పడింది. జీఎన్ డెవీ ప్లీనరీతో ఉత్సాహంగా మొదలై.. ప్రముఖ కథక్ నర్తకి మంగళాభట్ ‘ఆజ్ కి షామ్ దక్కన్ కె నామ్’ అభినయంతో హ్యాపీగా ఎండ్ అయింది.
26..రిపబ్లిక్ డే
హెచ్‌ఎల్‌ఎఫ్‌కి పబ్లిక్ డే!. ఆఖరి రోజూ వేడుకకు విశేష స్పందన లభించింది. అదీగాక ‘కల్చరల్ అండ్ క్రియేటివ్ ప్లురలిజమ్ ఇన్ మోడర్న్ ఇండియా’ అనే ప్లీనరీని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత మహేష్‌భట్, డాన్సర్ లీలాసామ్‌సన్ నిర్వహించడం ప్రధాన ఆకర్షణ. పలు రంగాల ముఖ్యులు ఈ సెషన్‌లో పాలుపంచుకున్నారు.
సినిమాలు, వాటిపై ఆంక్షలు మొదలు సెన్సార్‌బోర్డ్ సభ్యులపై ఒత్తిడి, ఘర్‌వాపసి వంటి మతపర వివాదాలు, సాహిత్యం, పత్రికల్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ప్రశ్నార్థకంగా మారిన వైనం వరకు అన్నిటినీ చర్చించారు. సెన్సార్ బోర్డ్ పదవికి రాజీనామా చేయడంపై లీలాసామ్‌సన్‌ను ప్రశ్నిస్తే.. ‘ఇట్స్ అవుట్ ఆఫ్ టాపిక్’ అంటూ తప్పించుకున్నారు. ‘హైదరాబాద్‌తో మీకున్న అనుబంధం’ చెప్పండి అని మహేష్‌భట్‌ను అడిగితే ‘మిర్చీకా సాలన్’ అని నవ్వుతూ కారెక్కారు.
చర్చలే చర్చలు..
హెచ్‌బీటీ గీతా రామస్వామి నిర్వహించిన ‘కాస్ట్ అండ్ జెండర్’పై చర్చ కొత్త ఆలోచనలను రేకెత్తించింది. ఇందులో యంగ్‌రైటర్, యాక్టివిస్ట్ మీనా కందస్వామి, నది పల్‌షికర్ పాల్గొన్నారు. మీనా కందస్వామి కొత్త రచన జిప్సీ గాడెస్ కూడా చర్చకు వచ్చింది. ఇండియన్ ఎలక్షన్స్ .. ఎ కాన్వర్జేషన్ పేరుతో జయప్రకాశ్‌నారాయణ్, ఎస్‌వై ఖురేషీ మధ్య సాగిన సంభాషణ సోసోగా నడిచింది. ‘ది ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ థియేటర్ ట్రైనింగ్’ అనే థియేటర్ యాక్టింగ్ వర్క్‌షాప్‌ను పెద్దలు బాగా ఎంజాయ్ చేశారు.
ఆఖరి రోజున తెలుగువాళ్లను బాగా ఆకట్టుకున్న కార్యక్రమం.. ముస్లిమిస్ట్ పొయెట్రీ ఇన్ తెలుగు. భరతనాట్య కళాకారిణి ఆనందశంకర్ జయంతి నిర్వహించిన ‘ది డ్రామా ఆఫ్ డ్యాన్స్’ కార్యక్రమంలో లీలాసామ్‌సన్‌తో పాటు ప్రముఖ ఆర్ట్ క్రిటిక్ అండ్ ఆర్ట్ లవర్ సునీల్ కొఠారీ, వీణ బసవరాజయ్య పాల్గొన్నారు. ఇక, సినిమా రైటింగ్‌పై సాగిన ‘రీమ్స్ అండ్ రీల్స్’ సెషన్‌లో యంగ్ రైటర్స్ బాగా పార్టిసిపేట్ చేశారు. ఉర్దూ సాహిత్యంలో ప్రధాన పాత్ర పోషించిన మాధ్యమం రేడియోపై జరిగిన ‘దక్కన్ రేడియో అండ్ ఉర్దూ కల్చర్’ సెషనూ బాగా ఆకట్టుకుంది.
ఉర్దూకి ప్రాధాన్యమివ్వడం బాగుంది
ఈసారి హైదరాబాద్ ఫెస్టివల్‌లో ఉర్దూ భాషకు ప్రాధాన్యమివ్వడం చాలా బాగుంది. తెలుగు కవిత్వంలో ఉన్న ముస్లిం కవులకు ఓ వేదిక కల్పించడం సంతోషం. జావేద్ అఖ్తర్, మహేష్‌భట్ లాంటివాళ్లు ఈ ఫెస్టివల్‌కి రావడం వల్ల దీని స్థాయి పెరిగింది.
- యాకూబ్, కవి
పిల్లల కోసమని వస్తే..
ఈ ఫెస్టివల్ స్టార్టయిన సెకండ్ డే తెలిసింది. అసలు మా బాబు కోసం వచ్చాం కానీ వచ్చాక పెద్దలకూ ఇది యూజ్‌ఫుల్ అని అర్థమైంది. స్టోరీ టెల్లింగ్ సెషన్స్ పిల్లల కన్నా మాకే ఎక్కువ ఉపయోగం. నేనైతే వంటల పుస్తకాలను కొన్నా. మా బాబుకీ మంచి పుస్తకాలు దొరికాయి.
- అనురాధ, గృహిణి
మహిళలకు శక్తినిస్తుంది
ఐదేళ్లుగా ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నాను. కళకు స్త్రీకి ఉన్న అనుంబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ సాధన మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడమే కాక ఓ శక్తిగా నిలబెడుతుంది.
- ఆనంద శంకర్‌జయంతి, నృత్యకారిణి
పేరు లేని హీరో కథ
నేను రాసిన ఇంగ్లిష్ నవల ‘అనాటమీ ఆఫ్ లైఫ్’. ఇది ఓ కవి జీవన ప్రస్థానానికి సంబంధించినది. ఇందులో మన దేశంలోని మెట్రోనగరాలన్నిటి ప్రస్తావన ఉంటుంది. కానీ వాటి పేర్లు, హీరో పేరు ఎక్కడా ఉండవు. ఇది లండన్ వాళ్లు అన్‌పబ్లిష్డ్ నవలకు ఇచ్చే ‘టిబోర్ జోన్ సౌత్‌ఏషియా’ అవార్డ్‌కి నామినేటైంది.
- దేవ్‌దాన్ చౌదరి, బెంగాలీ రైటర్
తరచుగా నిర్వహిస్తేనే ఫలం
లిటరరీ యాక్టివిటీ అనేది దక్కన్‌సంస్కృతి. తెలుగు, ఉర్దూకి ప్రాధాన్యమివ్వడం, నేషనల్, ఇంటర్నేషనల్ రచయితలు రావడం, ప్రశ్నోత్తర సెషన్స్.. ఇవన్నీ అందరినీ ఒక్కచోటకు చేరుస్తాయి. తెలంగాణను సాధించుకున్న క్రమంలో జరిగిన ఈ ఈవెంట్ మన ఐకమత్యాన్ని బలపరుస్తోంది. గంగాజమున తెహ్‌జీబ్‌ను పునరుద్ధరిస్తోంది. లిటరరీ ఫెస్టివల్ ప్రపంచానికి సంబంధించింది కాబట్టి.. దీన్ని ఇయర్లీగా కాకుండా చిన్నచిన్న మీట్స్‌గా చేసి వారాంతాలకో, పదిహేను రోజులకు ఒకసారో ఏర్పాటు చేస్తే, వీలైతే జిల్లాలకూ తీసుకెళ్తే బాగుంటుంది. తెలుగు సాహిత్యాన్ని ఉర్దూ, పర్షియన్, హిందీ, ఇంగ్లిష్‌లలోకి, అట్లాగే ఆయా భాషల్లో ఉన్న సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తే విభిన్న సంస్కృతులు వెల్లివిరుస్తాయి.
- వేదకుమార్, సామాజికవేత్త