చర్చలో మాట్లాడుతున్న సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్. చిత్రంలో సునీతారెడ్డి
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్
పార్టీ ఫిరాయిస్తే పదేళ్లదాకా మంత్రి కాకుండా నిషేధం తేవాలి
నేటి రాజకీయ నాయకత్వానికి రోజు వారీ ‘మైక్రో మేనేజ్‌మెంట్’ అవసరం
ప్రస్తుత పరిస్థితుల్లో వాట్సాప్‌లో
ఎన్నికలు జరుగుతున్నట్టుగా ఉందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంస్కరణల్లో భాగంగా.. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఎవరైనా సరే, అధికారంలో ఉన్నవారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా, ప్రజలు కోరుకున్నట్టు పనిచేయకపోయినా వారిని తొలగించే హక్కు (రైట్ టు రీకాల్) తీసుకురావాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పారు. అదేవిధంగా ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే పదేళ్లదాకా మంత్రి కాకుండా నిషేధం, ‘ప్రభుత్వ నిధి’ (స్టేట్ ఫండ్)తో ఎన్నికల నిర్వహణ వంటివి రావాలన్నారు. ఇటువంటి వాటిపై రాజకీయవేత్తలు ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. శనివారం ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’లో రాజ్‌దీప్ కొత్త పుస్తకం ‘2024: ఎలక్షన్ దట్ సర్‌ప్రైజ్డ్ ఇండియా’పై చర్చాగోష్టి నిర్వహించారు. దీనికి సమన్వయకర్తగా వ్యవహరించిన హెచ్‌ఎల్‌ఎఫ్ కోర్ గ్రూపు సభ్యురాలు సునీతారెడ్డి ఈ పుస్తకంపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమకాలీన రాజకీయాలు, రాజ్‌దీప్ పుస్తకంలోని అంశాలు, ఇతర విషయాలను ప్రస్తావిస్తూ ప్రశ్నలు వేశారు.
సంస్థాగతంగా బలంగా ఉండటం అవసరం
మోదీ గత పదేళ్లలో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేయలేదని రాజ్‌దీప్ చెప్పారు. రాజకీయ వేత్తగా రాహుల్‌గాంధీ మంచివాడే అయినా అది సరిపోదన్నారు. నేటి రాజకీయ నాయకత్వానికి రోజువారీ ‘మైక్రో మేనేజ్‌మెంట్’ ముఖ్యమని.. అందుకు వ్యూహాలు, సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండటం అవసరమని స్పష్టం చేశారు. అధికారమనేది విషం అనే మాటను అధికారం కోరుకుంటున్న పార్టీ నేత రాహుల్‌గాంధీ పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించారు.
సీట్ల సంఖ్యపై ముందే చెప్పా..
‘2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచాయా?’ అని సునీతారెడ్డి ప్రశ్నించగా రాజ్‌దీప్ మిశ్రమంగా స్పందించారు. ‘‘గత ఏడాది రామమందిర ప్రారంభం, మోదీ ఇమేజీని ఒక్కసారిగా పెంచేయడం, అబ్‌కీ బార్ చార్ సౌ(400) పార్ అంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వంటివి కొంత అయోమయానికి గురిచేశాయి. అయితే 2024 మే 12న (ఫలితాలు రావడానికి ముందు) బీజేపీ 270 సీట్ల వద్ద ఆగిపోవచ్చని నా వీడియో బ్లాగ్‌లో పేర్కొన్నాను. అది రికార్డెడ్‌గా ఉంది’’ అని రాజ్‌దీప్ చెప్పారు. ఎన్నికల కవరేజీ నిమిత్తం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న క్రమంలో.. ఓటర్లు, ముఖ్యంగా మహిళలు విభిన్నంగా స్పందించారని ఆయన తెలిపారు.
నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి తదితర అంశాలను గురించి ప్రస్తావించారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ పార్టీ, బ్రిటన్‌లో రిషి సునాక్ వంటి వాళ్లు ఓటమిని చవిచూసినా.. ఇక్కడ మోదీ మాత్రం పూర్తి మెజారిటీ రాకపోయినా గెలవగలిగారని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే సామాజిక మాధ్యమాల్లో, మరీ ముఖ్యంగా వాట్సాప్‌లో ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
భారీ మార్పులు రావాలి
చర్చాగోష్టిలో సభికులు అడిగిన ప్రశ్నలకు రాజ్‌దీప్ స్పందిస్తూ... ‘ఒక దేశం.. ఒక ఎన్నిక ’ వంటి సంస్కరణలను ‘వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ (సామూహిక హనన ఆయుధాలు)’గా తాను భావిస్తానని రాజ్‌దీప్ చెప్పారు. పార్లమెంట్, న్యాయస్థానాలు, మీడియా వంటి వ్యవస్థలతోపాటు ప్రజాస్వామ్య సంస్థల్లో సంస్థాగతంగా భారీ మార్పులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యూరోక్రసీ కూడా ఓ అడ్డుగోడగా మారుతున్నందున, ఇది కూడా మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో ఓ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థి రూ.75 కోట్లు ఖర్చుచేశారని.. ఇంత భారీగా ఎన్నికల ఖర్చు వంటి విష వలయం నుంచి కూడా దేశం బయటపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment