అవగాహనాలోపం వల్లే దేశంలో వివిధ అనారోగ్య సమస్యలు
ప్రజల్లో అవగాహన పెంచడం సామాజికవేత్తలు, శాస్త్రవేత్తల బాధ్యత
‘సాక్షి’తో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ డా.సౌమ్యా స్వామినాథన్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య అక్షరాస్యత అవసరమని ప్రముఖ వైద్యురాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ సైంటిస్ట్ డా.సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో రెండోరోజైన శనివారం నిర్వహించిన పలు చర్చాగోష్టుల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..
రోగాలపై సరైన సమాచారమేదీ?
వ్యాక్సిన్ వల్ల అనారోగ్యాలు ఆఖరికి మరణాలు సైతం అపోహల దగ్గర నుంచీ ప్రస్తుతం వైద్య ప్రపంచం తీవ్రంగా ఆందోళన చెందుతున్న యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్
(ఏఎమ్‌ఆర్) దాకా చాలా సమస్యలకు కారణం అవగాహన లోపమే కదా. అంతేకాదు అనారోగ్యానికి కారణాలు తెలియకపోవడం వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువవుతున్నాయి. నీటి ద్వారా వ్యాపించే రోగాలేమిటి? గాలి ద్వారా వ్యాపించేవి ఏమిటి? వైరస్ ద్వారా వచ్చేవి ఏమిటి? సరైన తిండి తినకపోతే ఎలాంటి వ్యాధులు వస్తాయి? ఏది సరైన తిండి? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడా లభించవు. అందువల్ల జనం వాట్సాప్ మొదలు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హెల్త్ ఎడ్యుకేషన్ ఆవశ్యకతను గుర్తించి అందరూ ముందుకు రావాలి. అనారోగ్యాలపై ప్రజల్లో అవగాహన పెంచడం సామాజికవేత్తలు, శాస్త్రవేత్తల బాధ్యత.
ఇంటర్నెట్‌లోని సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి
ఇంటర్నెట్ ఓ అద్భుతమైన సమాచార సేకరణ మార్గం. ఆరోగ్య అక్షరాస్యతకు ఉపకరించే అత్యున్నత మార్గం. అయితే టెక్నాలజీ వల్ల మంచితోపాటు చెడు కూడా జరుగుతోంది. తీవ్రమైన అనారోగ్య విషయాలపైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. కాబట్టి ప్రజలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వాటిలో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి.
మన మహిళలకు మల్టీటాస్కింగ్ కొట్టిన పిండే..
ఇంటి పని, వంట పని, బయటి పని... ఇలా పలు పాత్రలు పోషించే మల్టీ టాస్కింగ్ భారతీయ మహిళలకు స్వతహాగానే వచి్చంది. అదే సమర్థతతో ఇప్పుడు అనేక వృత్తుల్లో అతివలు రాణిస్తున్నారు. అయితే ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నట్లుగానే మన దగ్గర కూడా ఇప్పటికీ లింగ వివక్ష ఉంది. దీన్ని మనం అధిగమించాల్సి ఉంది.
మితాహారం.. వ్యాయామం నా ఆరోగ్య రహస్యం
నేను క్రమబద్ధమైన జీవనశైలిని పాటిస్తా. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలపాటు వ్యాయామం చేస్తా. రోజూ రాత్రి 7
గంటలకే నిద్రపోతా. అన్ని రకాల ఆహారపదార్థాలను మితంగా తింటా. మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు నవ్వు ఓ మార్గం. మన చుట్టూతా ఎల్లప్పుడూ మంచి స్నేహితులతోపాటు ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణం ఉండటం మనసును ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రభుత్వ విధానాలు స్పష్టంగా ఉండాలి
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రభుత్వాల విధివిధానాలు స్పష్టంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ డా.సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ఒక విధానాన్ని రూపొందించేటప్పుడు బహుళ రంగాల నిపుణులను భాగస్వాములను చేయాలని సూచించారు. అప్పుడే పటిష్టమైన విధానాలు రూపొందుతాయన్నారు. వాటిని ఆచరణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో వాతావరణ పరిరక్షణ సదస్సులో పాల్గొన్న సౌమ్య స్వామినాథన్, పంకజ్ సెఖ్సారియా, సుల్తాన్ ఇస్మాయిల్‌లు పాలసీ పర్‌స్పెక్టివ్స్ అండ్ ద ప్లానెట్ అనే అంశంపై చర్చించారు. ఆహారం, ఆరోగ్యం, మహిళలు, పిల్లల అంశాన్ని సౌమ్యా స్వామినాథన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వాతావరణ మార్పుల ప్రభావం ప్రజారోగ్యంపై తీవ్రంగా ఉంటోందని.. శిశువుల్లో జన్యు లోపాలకు ఇది ఒక కారణం అవుతోందన్నారు. కృత్రిమ ఎరువుల వాడకంతో పండించే పంటల్లో పోషకాలు తగ్గిపోవడం, పంట ఉత్పత్తులను రుచిగా మార్చుకొనే క్రమంలో కృత్రిమ రసాయనాల వాడకం పెరగడం కూడా ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోందని చెప్పారు. రసాయన ఎరువులు మట్టిని, పంటలను నిస్సారం చేస్తుంటే, ఎరువుల తయారీ పర్యావరణానికి హాని చేస్తోందని సౌమ్యా స్వామినాథన్ చెప్పారు. అయితే భారతదేశపు మట్టి పరిపూర్ణమైనదని.. ఆ మట్టిని కాపాడుకుంటే మన దేశం ప్రపంచ దేశాలకు అవసరమైన ఆహారాన్ని పండించగలిగే దేశంగా ఎదుగుతుందన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment