వ్యాపారాంశంగా మారింది : సినీ ప్రముఖడు అమోల్ పాలేకర్
మూస కథలకు విభిన్నంగా తీయడం ఇష్టం: ఇంద్రగంటి
సంస్కృతి, కట్టుబాట్లు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదు : సినీతార హుమా ఖురేషి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సినిమా వాణిజ్యపరమైన అంశమని, ఈ కారణం చేత సక్సెస్ కోసమే కమర్షియల్ హంగులతో నిర్మిస్తున్నారని ప్రముఖ భారతీయ నటులు, దర్శకులు అమోల్ పాలేకర్ అన్నారు. డిజిటల్ టెక్నాలజీ యుగంలో సినిమా దర్శకుడు ఇతర సినిమా బృందం కన్నా సాంకేతికత పైనే ఎక్కువ ఆధారపడుతోందన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్‌లో భాగంగా ప్లీనరీలో అమోల్ పాలేకర్ తన సతీమణి సంధ్య గోఖలేతో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకులు మోహనక్రిష్ణ ఇంద్రగంటితో తాను రాసిన నూతన పుస్తకం ‘వ్యూ ఫైండర్’ పై చర్చించారు.
‘నా వరకూ సినిమా అంటే అందరిలా కాకుండా విభిన్నంగా తీయడమే నచ్చుతుందన్నారు. మెయిన్ స్ట్రీంలో సినిమా రంగానికి నియమాలు, నిబంధనలు, పరిమితులు వంటి సంస్కృతిలో ఇమడలేకపోయానన్నారు. ఎంత పెద్ద విజయం సాధించినా, నిర్మించగలిగినా ఆ క్రెడిట్ మొదట రచయితకే చెల్లుతుంది. ప్రస్తుత సినిమా వందల కోట్ల అంశంగా మారింది. ఒక పెద్ద నిర్మాత నాతో ఇలాంటి సినిమాలే తీయాలని సంప్రదించాడు, అలాంటి పది సినిమాల్లో 9 రిజక్ట్ చేసేవాడిని’ అని అన్నారు. ‘ఒక సినిమా షూట్‌లో భాగంగా తోటి నటి స్మితను నిజంగా కొట్టాల్సి వచ్చింది, దర్శకుడి ప్రోద్భలంతో ఆ సీన్ బాగా పండించడానికి ఇష్టం లేకున్నా కొట్టాల్సి వచ్చింది.
ఆ సీన్‌లో స్మిత మంచి నటన కనబర్చింది. అనంతరం క్షమాపణ కోరినా, నేను కొట్టడం వల్లే మరింత వాస్తవంగా నటించగలిగానని ఆమె చెప్పడంతో ఆశ్చర్యపోయాను’ అన్నారు. ‘70లలో అద్భుతమైన మధ్య తరగతి సినిమాల ప్రస్తావన రావడంతో.. నాటి జీవితాలకు, ప్రస్తుత జీవన శైలికి తేడా ఉందని, ఇప్పుడు అలాంటి కథలను ఊహించలేం. కానీ ఈ మధ్య అలాంటి కథే ‘సత్యం సుందరం’ నన్నెంతో హత్తుకుంది. నా సినీ మిత్రుడు ఉత్పల్ దత్ ఎంత మంచివాడో నాకే తెలుసు, కానీ దేశంలోనే మొట్టమొదటి సెడేటివ్ కేసుతో అరెస్టు అయ్యాడు’ అని గుర్తు చేసుకున్నారు.
నాస్తికులుగా బతకడం కష్టం..
‘నా భార్యను కలవక ముందు జీవితం, ఆ తరువాతి జీవితం అనేంత ప్రభావం చూపించింది. సతీమణి సంధ్యను కలువక ముందు ఐదేళ్లకు ఒక సినిమా తీస్తే, ఆమెను కలిశాక ఏడాదికో సినిమా తీయగలిగాను. తన పుస్తకం వ్యూ ఫైండర్ మా ఇద్దరి ప్రయాణం క్లైమాక్స్ వంటిది’ అని మోహన క్రిష్ణ ఇంద్రగంటితో చమత్కరించారు. ‘నా చివరి ఎనిమిది సినిమాలకూ నా భార్యే రైటర్. మేమిద్దరమూ నాస్తికులమే, సామాజికంగా నాస్తికులుగా సాగడం అంత సులువు కాదు’ అన్నారు.. ‘నేను సినిమా రంగానికి చెందిన వ్యక్తిని కాదు, 2000 సంవత్సరంలో అమోల్ పాలేకర్ సినిమాకు మొదటి సారి పనిచేశాను’ అని సంధ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment