ప్రకృతి వ్యవసాయ కరదీపిక!
కొత్త పుస్తకం
‘‘కంచెల మంచు జల్లెడల కన్పడు శిల్పము ఉషఃకుమారి సృష్టించినది అబ్జబంధువు పసిండిమొలా మొనరించినవాడు; నీవు ఇంచుక దృష్టి నిలుపుము; ఇట ఎన్ని చిత్రములున్నవి, అన్నీ వర్ణించుట నాతరంబె? గమనించెడు హాలికులెంత ధన్యులో’’ అంటారు ఏటుకూరి వేంకటనర్సయ్య ‘క్షేత్రలక్ష్మి’ పద్యకావ్యంలో. రైతుకు ప్రకృతిమాతతో ఉన్న బలమైన బంధాన్ని అద్భుతంగా వర్ణించాడు కవి.
ఇప్పుడు రైతు బతుకు చిత్రం మారింది. రైతు బతుకు ఛిద్రమవడానికి, అతని చితిలో చితుకులు వేసిన చేతులు బహుళం. ‘అన్న మిడుటకన్న అధిక దానంబులనెన్ని చేయనేమి వాటిని యెన్నబోరు’ అన్న పరిస్థితి నుంచి అన్నదాతే అన్నమో! రామచంద్రా అన్న పరిస్థితికి వచ్చాడు. అయితే, మూలాలను తిరగదోడితే దీనికి పరిష్కారం లభిస్తుందని పలువురు వ్యవసాయ శాస్త్రనిపుణులు అన్వేషణలో పడ్డారు.
అలా మార్గాన్ని చూపిన అనేక మందిలో సుభాష్ పాలేకర్ ఒకరు. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో పుట్టిన ఈ వ్యవసాయ శాస్త్ర పట్టభధ్రుడు తన ఉద్యోగాన్ని వదిలి రెండేళ్ల కాలం అడవులు పట్టుకు తిరిగి, విత్తు మొలిచి మొక్క మానుగా ఎదుగుతున్న క్రమాన్ని అధ్యయనం చేశారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని రూపొందించారు. 50 లక్షల మంది రైతులు ఆ విధానంలో అత్యుత్తమ దిగుబడులు సాధిస్తున్నారు. ఇందులో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన త్రినాధ్ వాస్తవాలను వెలుగు తీసి నలుగురికి పంచడానికి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలనకు పూనుకున్నాడు. ప్రకృతి వ్యవసాయం అనుసరిస్తున్న అనేక మంది రైతుల పొలాలకు వెళ్లి వారి సాగు మెళకువలను, పెట్టుబడులను, దిగుబడులను నమోదు చేశాడు. ఎకరాకు దాదాపు వంద టన్నుల చెరుకు పండించిన బన్నూరు కిష్టప్ప(కర్నాటక) నుంచి.. దానిమ్మలో అతి తక్కువ కాలంలో అత్యధిక దిగుబడి సాధించిన నరసింహప్ప(అనంతపురం) వంటి ప్రకృతి వ్యవసాయదారుల కృషిని నమోదు చేశాడు.
కేవలం ఒక ఆవు పేడ, మూత్రాలతో 30 ఎకరాలను కొద్దిపాటి ఖర్చుతో సాగు చేసి ఫలితాలను సాధించిన రైతుల విజయాలను సంకలనంగా కూర్చాడు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు, వ్యవసాయ రంగంలో కాలుబెట్టాలనుకుంటున్న ఔత్సాహికులకు ఇది ప్రకృతి వ్యవసాయం కరదీపిక! ప్రతులకు: త్రినాథ్: 89770 97405, 0866-2550688
- జిట్టా బాల్‌రెడ్డి