సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య భారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివృద్ధికి పునాది పడుతుందని గుర్తుచేశారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆన్‌లైన్ వేదికగా ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పౌష్టికాహార లోపం ఓ సవాల్‌గా మారిందని, దీన్ని అధిగమించడం ద్వారానే దేశ భవిష్యత్ అయిన చిన్నారులను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని తెలిపారు. దేశ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, వ్యూహాత్మక, సమష్టి కార్యాచరణ అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఉన్న 15.9 కోట్ల ఆరేళ్లలోపు చిన్నారుల్లో 21 శాతం మందిలో పోషకాహార లోపం, 36 శాతం మంది తక్కువ బరువుతో ఉండడం, 38 శాతం మందికి టీకాలు అందడం లేదని పుస్తకంలో ఉన్న అంశాలు ప్రస్తావించారు. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment