Child Development
-
పసితనంలోనే పొదుపు పాఠాలు.. ఎందుకంటే..
కొందరు ఎంత సంపాదించినా నెలాఖరుకు ఏమీ మిగిల్చరు. కొద్దిమంది జీతం అంతంతమ్రాతం అయినా సరైన ఆర్థిక ప్రణాళికతో నగదు పోగు చేస్తారు. డబ్బు నిర్వహణ గురించి తెలియకపోతే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న మనీ మేనేజ్మెంట్ను పిల్లలకు చిన్నప్పుడే పరిచయం చేయాలి. సరైన ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్పించాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కల్పిస్తే అంత మంచిది. చిన్న వయసులో పిల్లలకు నేర్పాల్సిన కనీస అంశాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. జీవితంలో డబ్బు పాత్ర ఎంటో వారికి వివరించాలి. ఎలా సంపాదిస్తారు? అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారు? వంటి అంశాల్ని వారికి తెలియజేయాలి. ఈ దశలోనే అవసరాలు.. సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో ఉదాహరణతో చెప్పాలి. ‘రూపాయి ఆదా చేస్తే.. రూపాయి సంపాదించినట్లే..’ ఈ సూత్రం పిల్లలకు చిన్నప్పుడే నేర్పించాలి. అప్పుడే వారికి ప్రతి రూపాయి విలువ అర్థమవుతుంది. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా చూపించాలి. వారితో పొదుపు చేయించి వారికి కావాల్సిన వస్తువుల్ని వాటితోనే కొనివ్వండి. అప్పుడు వారికి ఇంకా సులభంగా అర్థమవుతుంది. పొదుపు గురించి వారికి అర్థమవుతుందనే దశ వచ్చిన తర్వాత నెమ్మదిగా పెట్టుబడుల గురించి వివరించాలి. దీర్ఘకాలికంగా వారికి చేకూరే ప్రయోజనాలను తెలపాలి. ఇంట్లో మీరు చేసిన పెట్టుబడిని.. దాని వల్ల కలిగిన లాభాల్ని వారికి ప్రత్యక్షంగా చూపించాలి. పోస్టాఫీసులు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవర్చండి. ఇదీచదవండి: నంబర్ ప్లేట్‌కే రూ.141 కోట్లు.. కారు విలువ ఎంతంటే.. చాలా మంది ఖర్చు చేసిన తర్వాత మిగిలిన సొమ్ముతో పొదుపు చేస్తారు. కానీ పొదుపు చేసిన తర్వాత అవసరాలకు వెచ్చించాలి. ఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలనే సూత్రాన్ని పిల్లలకు వివరించాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో తెలియజేయాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. ఎంత పొదుపు చేస్తున్నాం అనే విషయాలను చూపించాలి. వారికి కూడా ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయాలి. దానికి అనుగుణంగానే ఖర్చు చేయమని చెప్పాలి. అత్యవసర సమయంలో మన ఆర్థిక అవసరాల నిమిత్తం తీసుకునే రుణాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఎలాంటి సమయంలో అప్పు తీసుకోవాలి? ఎప్పుడు ఇతరులకు ఇవ్వాలి అనే విషయాలను వివరించాలి. సకాలంలో చెల్లించకపోతే ఉండే రిస్క్‌ను తెలియజేయాలి. అలాగే మార్కెట్లో ఉన్న వివిధ రకాల రుణ సదుపాయాలు, వాటి లబ్ధిని చెప్పాలి. ప్రజలు ఎదో ఒక పనిచేసి సంపాదిస్తుంటారు. మరి ప్రభుత్వానికి ఎలా ఆదాయం సమకూరుతుందనే అనుమానం పిల్లలకు ఉంటుంది. సర్కార్‌కు ఎలా ఆదాయం వస్తుందో వివరించాలి. పన్నుల విధానం ఎలా ఉంటుందో తెలపాలి. వాటిని ఎలా వసూలు చేస్తారో చెప్పాలి. పిల్లలు కాస్త పెద్ద వారైతే జీఎస్టీ విధానంపై అవగాహన కల్పించాలి. ఇదీచదవండి: విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన డబ్బు నిర్వహణ, ఆదాయ-వ్యయాల నమోదు, ఆర్థిక ప్రణాళిక కోసం అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని పిల్లలకు పరిచయం చేయాలి. అవి ఎలా వినియోగించాలో వివరించాలి. ఈఎంఐ, ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి వాటిని లెక్కించేందుకు ఉన్న కాలిక్యులేటర్లను పరిచయం చేయాలి. వివిధ పేమెంట్ యాప్స్ పనితీరును వివరించాలి. ఈ-పేమెంట్స్ వల్ల కలిగే లాభాలను తెలియజేయాలి. -
ఇది గమనించారా? మీ చిన్నారికి 20 నెలల వయసొచ్చినా మాటలు రావడం లేదా?
పిల్లలు మెల్లమెల్లగా పాకుతున్న, బుడిబుడి అడుగులు వేస్తున్న, ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న ఆ చర్యలన్నీ వాళ్ల వికాసానికి సూచన. ఈ పనుల్ని వారు సరిగా చేయలేకపోతే వారిలో శారీరకంగా, మానసికంగా తగినంత వికాసం లేదని తెలుసుకోవచ్చు. నెలలు నిండకముందే పుట్టడం, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి ఏవైనా ఆరోగ్య సమస్యలు రావడం, బేబీ పుట్టాక జాండీస్, ఇన్ఫెక్షన్స్ వంటివి రావడం, కొన్ని జన్యుపరమైన కారణాలతో నడక, మాట్లాడటం కొంత ఆలస్యం కావచ్చు. పిల్లలు 11 నుంచి 16 నెలల మధ్య బుడిబుడి అడుగులతో నడక మొదలుపెడతారు. 18 నెలల పిల్లలు నడవడంతో పాటు, చేతికి దొరికినదేదైనా పట్టుకుని లాగేయడం, వస్తువులను దూరంగా నెట్టడం, పుస్తకం చేతికిస్తే... పేజీలు తిప్పడం, క్రేయాన్స్‌తో నేలమీద, గోడలపై రాయడం, నీళ్ల టబ్ దగ్గర ఉంచితే... చేత్తో నీటి మీద తపతప తట్టడం వంటివి చేస్తుంటారు. రెండేళ్లు వచ్చే సరికి తలుపులు తెరవడం, సొరుగులు లాగడం, మెట్లు ఎక్కడం చేస్తుంటారు. కొందరిలో ఈ ప్రక్రియలు కొంత ఆలస్యం కావచ్చు. (చదవండి: ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే..) ఇక మాటల విషయానికి వస్తే 15 నెలలు నిండాక వారు... రకరకాల శబ్దాలతో పాటు ముద్దుమాటలు (బాబ్లింగ్స్) పలుకుతుంటారు. ఒకటి రెండు నిజశబ్దాలూ పలకగలరు. 18 నుంచి 24 నెలల వయసుకు వాళ్లు 15–20 పదాలు పలకడంతో పాటు తల్లిదండ్రుల సూచనలకు రెస్పాండ్ అవుతుంటారు. అయితే 18–20 నెలల వయసు వచ్చేటప్పటికి కొద్దిగా కూడా మాటలు రాకపోతే, శబ్దాలకు రెస్పాండ్ కాకపోతే, అలాంటి పిల్లల్లో వికాసం ఆలస్యమైందని అనుమానించాలి. అలాంటి పిల్లలను పీడియాట్రీషియన్‌కు చూపించి, వారి సూచనల మేరకు అవసరమైన తదుపరి చర్యల (ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్)తో వారిని చక్కదిద్దాలి. ఒకసారి వాళ్లలో డెవలప్మెంట్ డిలే ఉందని తెలిశాక... ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్‌ను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలి. (చదవండి: తరుచూ పిల్లల్లో చెవినొప్పి.. ఇలా చేస్తే..) -
చిన్నారుల మానసిక ఎదుగుదలకు ఇంటి వాతావరణమే కీలకం
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల మానసిక ఎదుగుదలకు ఇంటి వాతావరణం అత్యంత కీలకమని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞాపరాన్డే పేర్కొన్నారు. ఆదివారం సక్షమ్, యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఆర్యజనని’ప్రారంభ కార్యక్రమంలో ఆమె వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. బాలల సంరక్షణ కార్యక్రమాల్లో తండ్రి కూడా భాగస్వామిగా ఉండాలన్నారు. మహిళలు గర్భిణిగా ఉన్నప్పటి నుంచే యోగా, ధ్యానం చేయాలని, దీంతో శిశువు సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తల్లిపాలను తప్పనిసరిగా పట్టించడం తల్లి బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, రామకృష్ణ మఠం చైర్మన్ స్వామి శితికంఠానంద, సక్షమ్ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుకుమార్ పాల్గొన్నారు. -
దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య భారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివృద్ధికి పునాది పడుతుందని గుర్తుచేశారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆన్లైన్ వేదికగా ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పౌష్టికాహార లోపం ఓ సవాల్‌గా మారిందని, దీన్ని అధిగమించడం ద్వారానే దేశ భవిష్యత్ అయిన చిన్నారులను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని తెలిపారు. దేశ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, వ్యూహాత్మక, సమష్టి కార్యాచరణ అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఉన్న 15.9 కోట్ల ఆరేళ్లలోపు చిన్నారుల్లో 21 శాతం మందిలో పోషకాహార లోపం, 36 శాతం మంది తక్కువ బరువుతో ఉండడం, 38 శాతం మందికి టీకాలు అందడం లేదని పుస్తకంలో ఉన్న అంశాలు ప్రస్తావించారు. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్షించారు. -
తృణమో పణమో తిందాం తప్పక
సాక్షి, హైదరాబాద్: జొన్నలు, సజ్జలు, రాగుల వంటి తృణధాన్యాలతో కూడిన ఆహారం పిల్లల శారీరక ఎదుగుదలను ఎక్కువ చేస్తుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) నేతృత్వంలో జరిగిన ఒక పరిశోధనలో వెల్లడైంది. మూడు నెలలపాటు తృణధాన్యాలతో కూడిన భోజనం తినడం ద్వారా విద్యార్థుల ఎదుగుదలలో 50 శాతం వృద్ధి కనిపించిందని ఈ పరిశోధన లో స్పష్టమైంది. ఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉద్దేశించిన సాధికార సంస్థ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ దళవాయి ఈ పరిశోధన వివరాలను వెల్లడించారు. ‘స్మార్ట్‌ఫుడ్ స్టడీ’పేరుతో ఇక్రిశాట్ కర్ణాటకలో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేసే అక్షయపాత్రతో కలిసి ఈ పరిశోధన చేపట్టింది. బెంగళూరు పరిసరాల్లోని నాలుగు గ్రామాల్లో కొంతమంది విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపునకు తృణధాన్యాలతో తయారుచేసిన ఇడ్లీ, కిచిడీ, ఉప్మా, బిసిబేళేబాత్లను అందించారు. బియ్యం స్థానంలో సజ్జలు, రాగులు, సామలను ఉపయోగించారు. ఇదే సమయంలో మరో గ్రూపు విద్యార్థులకు సాంబార్ అన్నం ఆహారంగా ఇచ్చారు. నిర్దిష్ట కాలం తర్వాత రెండు గ్రూపుల్లోని పిల్లల ఎదుగుదలను పోల్చి చూశారు. తృణధాన్యాలు ఆహారంగా తీసుకున్న వారి శరీర కొలతలు ఇతరుల కంటే చాలా మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. మధ్యాహ్న భోజన పథకంలో తృణధాన్యాల ఆహారంపై శాస్త్రీయంగా జరిగిన తొలి అధ్యయనం ఇదేనని ఇక్రిశాట్‌కు చెందిన న్యూట్రిషినిస్ట్ డాక్టర్ ఎస్.అనిత తెలిపారు. కేవలం తృణధాన్యాలను వాడటం కాకుండా ఏ రకమైన తృణధాన్యాన్ని ఉపయోగిస్తున్నాం? ఎలా వండుతున్నాం? ఏ ఇతర ఆహార పదార్థాలతో కలిసి తింటున్నాం? అన్న అంశాలూ ముఖ్యమేనని స్పష్టం చేశారు. పోషకాహార లోపాలకు చెక్.. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్రం ఆలోచన సాకారం కావాలంటే తృణధాన్యాల సాగుకు ప్రోత్సాహం అవసరమని ఈ పరిశోధన చెబుతోందని డాక్టర్ అశోక్ దళవాయి తెలిపారు. ఇక్రిశాట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌తో కలిసి మెరుగైన వంగడాల సృష్టికి కృషిచేస్తోందని ఇక్రిశాట్ డైరెక్టర్ డా. పీటర్ కార్బెర్రీ తెలిపారు. పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో తృణధాన్యాలను చేర్చడం ద్వారా పోషకాహార లోపాలను సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. చౌక ధర దుకాణాల ద్వారా తృణధాన్యాల పంపిణీ చేపడితే రైతు లకూ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మరిన్ని పోషకాలు ఉన్న తృణ ధాన్యాలను గుర్తించి వాటి సాగుకు ప్రోత్సాహకాలు అందించడం అవసరమన్నారు. -
తండ్రుల ఒత్తిడి వల్ల పిల్లలకూ సమస్యలే!
మీరు తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారా? మీ పిల్లల దగ్గర కూడా మీ అసహనం ప్రదర్శిస్తున్నారా? తండ్రుల మానసిక ఒత్తిడి పిల్లల వికాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు పరిశోధకులు. పారాడే వయసులోనూ పిల్లలు తండ్రుల ఒత్తిడిని గ్రహించగలరని వెల్లడించారు మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న తండ్రులను గమనిస్తూ ఉండే పిల్లలు ఆ తర్వాత పెరుగుతూ ఉండే క్రమంలో తమ భావవ్యక్తికరణ సరిగా జరపలేరని పేర్కొంటున్నారు ఈ అధ్యనానికి నేతృత్వం వహించిన టామీషా హేర్‌వుడ్. ఇలాంటి తండ్రులు వెంటనే పిల్లల సమక్షంలో తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచిస్తున్నారు. ‘‘ఒత్తిడిని నియంత్రించుకోకపోవడం వల్ల తండ్రులు తాము డిప్రెషన్‌కు లోనుకావడంతో పాటు తమ పిల్లల వికాసానికీ ప్రతిబంధకమవుతారు’’ అంటూ హెచ్చరిస్తున్నారు ఆ అధ్యయనంలో పాలుపంచుకున్న మానసిక నిపుణులు. -
కొత్త అమ్మాయి...సరికొత్త రచన
ఇంగ్లిష్ సాహిత్యంలో తాజా భారతీయ సంచలనం ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’. యువ పాఠకులను సమ్మోహపరచి, వారి తల్లిదండ్రుల హృదయాలలో సైతం చోటు సంపాదించుకున్న ఈ నవలలో.. చదవడానికి ఎంత ఉందో, రచయిత్రి గురించి చెప్పుకోవడానికీ అంతే ఉంది! అమెరికాలోని బ్రౌన్ యూనివ ర్శిటీ నుంచి బీయస్సీ సైకాలజీ, ‘శిశు అభివృద్ధి’ ప్రధాన అంశంగా ఎం.ఎ. చేసిన రాధికా ధరీవాల్ తొలి నవల ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’. అమ్మానాన్నల నుంచి దృఢచిత్తాన్ని, సంకల్పబలాన్ని వారసత్వంగా కాక, ఒక స్ఫూర్తిగా అందిపుచ్చుకున్న ఈ ఢిల్లీ అమ్మాయి, ప్రచురణ రంగంలో ఉన్న తండ్రి వృత్తి రీత్యా చిన్న వయసులోనే ప్రపంచంలోని భిన్న సంస్కృతులను చూడగలిగారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, హంగేరి, ఫిలిప్పీన్స్, అమెరికాలలో కొన్నాళ్లు ఉండి వచ్చారు. 1868 నాటి ‘లిటిల్ ఉమన్’ నవలలోని స్త్రీవాద భావాలు గల ప్రధాన పాత్ర జోసెఫైన్ మార్చ్‌తో తనను తను తరచు పోల్చుకునే రాధిక.. ఒక మనిషి ఉనికిని తెలిపేది వారి వ్యక్తిత్వమేనంటారు. ఇదే విషయాన్ని ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’లో అందంగా, ఆహ్లాదంగా, ఆకట్టుకునేలా చెప్పారు. ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’లో ప్రధానంగా మూడు పాత్రలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన పాత్ర ఉడుత. తర్వాతి రెండు పాత్రలు ఒక కుక్క, ఒక కాకి. కుక్కకి ‘డెస్’ అని, కాకికి ‘అజుల్ఫా’ అని పేర్లు ఉన్నాయి కానీ, రచయిత్రి ఎందుకనో ఉడతకి ‘ఉడత’ (ఇంగ్లిష్‌లో ‘స్క్విరల్’) అనే పేరును ఉంచేశారు. ఈ టీనేజ్ స్క్విరల్ ఎంతో అందమైనది, ఒద్దిక గలది. కష్టపడి పనిచేస్తుంటుంది. విధేయంగా ఉంటుంది. ఇంతకీ ఇది పనిచేసేది ఒక ముంగీస దగ్గర. ఇక పని ఏమిటంటే పెట్పోస్టింగ్. ఉత్తరాలు బట్వాడా చేయడం. బద్దకస్తుడైన ముంగీస బాసు దగ్గర స్క్విరల్.. ఒక బానిస మాదిరిగా వెట్టి చాకిరీ చేస్తుంటుంది. తన శక్తిసామర్థ్యాలు తనకు తెలియక అలా పడి ఉంటుంది. ఆ క్రమంలో జరిగిన ఒక చిన్న సంఘటన పర్యవసానంగా స్క్విరల్ తనెంత ధైర్యవంతురాలో, ఎంత గొప్ప వ్యక్తిత్వం గలదో తెలుసుకుంటుంది. రెండో పాత్ర ‘డెస్’. ఇది పగ్, బీగిల్ జాతి లక్షణాలు కలగలిసిన శునకం. దీని వయసు, స్క్విరల్ వయసు ఒకటే. దీని దృష్టి ఎప్పుడూ తిండి మీదే. రచికరమైన భోజనం అంటే పడిచస్తుంది. తిన్నంత తిని, తాగినంత తాగుతుంది. డెస్ కూడా స్క్విరల్లా అందమైనదే కానీ, అనాథ మాత్రం కాదు. ఎంతగానో ప్రేమించే కుటుంబం ఉంటుంది. ముగ్గురు అక్కలుంటారు. స్క్విరల్ పరిచయం అయీ కాగానే దానికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. మూడోది ‘అజుల్ఫా’. ఇదొక కాకి. పరిమాణంలో పెద్దది. బలమైనది. చిన్న కళ్లు, సన్న గొంతు. వయసులో స్క్విరల్, డెస్ల కన్నా పెద్ద. ఒక సంఘటనతో ఇవి మూడూ మంచి ఫ్రెండ్స్ అయిపోతాయి. ఇక కథలోకి వెళ్తే.. అనాథ అయిన స్క్విరల్కి ఓ రోజు అనూహ్యంగా పెళ్లి పిలుపు అందుతుంది! అది ఆశ్చర్యపోతుంది. వెళ్లాలని నిశ్చయించుకుంటుంది. పెళ్లి జరుగుతున్నది సంపన్నులైన వధూవరులకు. ఆ పెళ్లిలోనే వధువు సోదరుడైన డెస్తో స్క్విరల్కి పరిచయం అవుతుంది. కొద్దిసేపట్లోనే ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. స్క్విరల్ మనసు విప్పుతుంది. తనో అనాథనని చెబుతుంది. డెస్ హృదయం కరిగిపోతుంది. స్క్విరల్ను ఓదార్చుతాడు. ఆ సందర్భంలో అనుకోకుండా.. పెళ్లయినవాళ్లు మాత్రమే తాగవలసిన ‘వెడ్డింగ్ వైన్’ను ఇవి రెండూ సేవిస్తాయి. డెస్కి ఏమీ అవదు కానీ, ఆ ప్రభావంతో స్క్విరల్కు తీవ్రమైన తలనొప్పి ప్రారంభం అవుతుంది. చనిపోయిన తల్లి తనతో ఏదో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే పెళ్లింటిపై కాకుల గుంపు దాడి చేస్తుంది. ఆ గుంపులో మంచిదైన ‘అజుల్ఫా’ సహాయంతో స్క్విరల్, డెస్ తప్పించుకుంటాయి. ఈ క్రమంలో ఈ మూడూ కలసి అనేక సాహసాలు చేస్తుంటాయి. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంటాయి. ఒక దుష్ట మార్జాలం సూచనతో కాకుల గుంపు, తేనెటీగల గుంపు తమపై దాడి చేస్తున్నాయని గ్రహించి వాటితో పోరాడుతుంటాయి. ఆ తరుణంలో స్క్విరల్కు ఓ మంత్రదండం గురించి తెలుస్తుంది. దాన్ని కనుక సంపాదిస్తే ఎవరినైనా ఇట్టే బానిసలుగా చేసుకోవచ్చు. లేదా ఎవరికైనా ఇట్టే విముక్తి కల్పించవచ్చు. అయితే ఆ మంత్రదండాన్ని సాధించడం తేలిగ్గా జరిగే పని కాదు. సాహసాలు చెయ్యాలి, ప్రమాదపు అంచుల్లోకి వెళ్లి రావాలి. అయినా సరే స్క్విరల్ కార్యదీక్షకు పూనుకుంటుంది. చివరికి విజయం సాధిస్తుంది. తన జన్మ పరమార్థాన్ని, జన్మ రహస్యాన్ని తెలుసుకుంటుంది. ఆ ఆయుధం మరేదో కాదు, తన శక్తిని తాను తెలుసుకోవడం! రాధికా ధరీవాల్ను మంచి రచయిత్రిగా నిలబెట్టే నవల ఇది. పాత్రలను, సందర్భాలను, సన్నివేశాలను చాలా పకడ్బందీగా అక్షరబద్ధం చేశారు రాధిక. ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కాలిన్స్ ఇండియా నుంచి వెలువడిన ఈ రచన... రచయిత్రి పడ్డ నాలుగేశ్ల శ్రమకు ఫలితం. పాఠకులకు మనోల్లాసం. నాలుగేళ్ల క్రితం ఓ రోజు.. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. నా గ్రేట్ డేన్ (కుక్కపిల్ల)ను తీసుకుని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి కారులో వెళ్తుంటే ఓ చోట సిగ్నల్ పడింది. కారును ఆపి, విండోలోంచి బయటికి చూస్తుంటే ఓ ఉడుత కనిపించింది. ఎక్కడ సంపాదించిందో ఓ బ్రెడ్డు ముక్కను కొరికి తింటోంది. ఇంతలో ఓ కాకి గబాల్న వాలి, ఉడుత చేతుల్లోంచి బ్రెడ్డు ముక్కను లాగేసుకుని తినడం మొదలు పెట్టింది. కొద్ది క్షణాల తర్వాత అక్కడికో కుక్క వచ్చి కాకిని తరిమేసి బ్రెడ్డు ముక్కను నోట కరచుకుంది. ఇదంతా చూస్తున్నప్పుడు నాకేమీ అనిపించలేదు కానీ, ఆ రాత్రి నిద్రపట్టలేదు. పట్టినా నిద్రలోకి ఉడుత, కాకి, కుక్క వచ్చేస్తున్నాయి. రోజూ ఆలస్యంగా నిద్ర లేచే దాన్ని ఆ వేళ ఉదయం ఐదు గంటలకే లేచి కూర్చున్నాను. ఏదో రాయాలనే తపన. జీవన పోరాటంలో భాగంగా ప్రాణులు ప్రవర్తించే తీరును థీమ్‌గా తీసుకుని ఆరోజే ఒక కథను అల్లుకున్నాను. పాత్రల్ని కల్పించాను. అది నవలగా రూపాంతరం చెందడానికి ఏడాదిన్నర పట్టింది. కానీ ఏదో అసంతృప్తి. తర్వాతి రెండున్నర ఏళ్లలో ముప్పైసార్లు నవలను తిరగరాశాను. అలా ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’ ఒక కొలిక్కి వచ్చింది. - రాధికా ధరీవాల్