సాక్షి, హైదరాబాద్: జొన్నలు, సజ్జలు, రాగుల వంటి తృణధాన్యాలతో కూడిన ఆహారం పిల్లల శారీరక ఎదుగుదలను ఎక్కువ చేస్తుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) నేతృత్వంలో జరిగిన ఒక పరిశోధనలో వెల్లడైంది. మూడు నెలలపాటు తృణధాన్యాలతో కూడిన భోజనం తినడం ద్వారా విద్యార్థుల ఎదుగుదలలో 50 శాతం వృద్ధి కనిపించిందని ఈ పరిశోధన లో స్పష్టమైంది. ఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉద్దేశించిన సాధికార సంస్థ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ దళవాయి ఈ పరిశోధన వివరాలను వెల్లడించారు. ‘స్మార్ట్‌ఫుడ్ స్టడీ’పేరుతో ఇక్రిశాట్ కర్ణాటకలో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేసే అక్షయపాత్రతో కలిసి ఈ పరిశోధన చేపట్టింది. బెంగళూరు పరిసరాల్లోని నాలుగు గ్రామాల్లో కొంతమంది విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు.
ఒక గ్రూపునకు తృణధాన్యాలతో తయారుచేసిన ఇడ్లీ, కిచిడీ, ఉప్మా, బిసిబేళేబాత్‌లను అందించారు. బియ్యం స్థానంలో సజ్జలు, రాగులు, సామలను ఉపయోగించారు. ఇదే సమయంలో మరో గ్రూపు విద్యార్థులకు సాంబార్ అన్నం ఆహారంగా ఇచ్చారు. నిర్దిష్ట కాలం తర్వాత రెండు గ్రూపుల్లోని పిల్లల ఎదుగుదలను పోల్చి చూశారు. తృణధాన్యాలు ఆహారంగా తీసుకున్న వారి శరీర కొలతలు ఇతరుల కంటే చాలా మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. మధ్యాహ్న భోజన పథకంలో తృణధాన్యాల ఆహారంపై శాస్త్రీయంగా జరిగిన తొలి అధ్యయనం ఇదేనని ఇక్రిశాట్‌కు చెందిన న్యూట్రిషినిస్ట్ డాక్టర్ ఎస్.అనిత తెలిపారు. కేవలం తృణధాన్యాలను వాడటం కాకుండా ఏ రకమైన తృణధాన్యాన్ని ఉపయోగిస్తున్నాం? ఎలా వండుతున్నాం? ఏ ఇతర ఆహార పదార్థాలతో కలిసి తింటున్నాం? అన్న అంశాలూ ముఖ్యమేనని స్పష్టం చేశారు.
పోషకాహార లోపాలకు చెక్..
రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్రం ఆలోచన సాకారం కావాలంటే తృణధాన్యాల సాగుకు ప్రోత్సాహం అవసరమని ఈ పరిశోధన చెబుతోందని డాక్టర్ అశోక్ దళవాయి తెలిపారు. ఇక్రిశాట్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌తో కలిసి మెరుగైన వంగడాల సృష్టికి కృషిచేస్తోందని ఇక్రిశాట్ డైరెక్టర్ డా. పీటర్ కార్‌బెర్రీ తెలిపారు. పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో తృణధాన్యాలను చేర్చడం ద్వారా పోషకాహార లోపాలను సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. చౌక ధర దుకాణాల ద్వారా తృణధాన్యాల పంపిణీ చేపడితే రైతు లకూ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మరిన్ని పోషకాలు ఉన్న తృణ ధాన్యాలను గుర్తించి వాటి సాగుకు ప్రోత్సాహకాలు అందించడం అవసరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment