పిల్లలు మెల్లమెల్లగా పాకుతున్న, బుడిబుడి అడుగులు వేస్తున్న, ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న ఆ చర్యలన్నీ వాళ్ల వికాసానికి సూచన. ఈ పనుల్ని వారు సరిగా చేయలేకపోతే వారిలో శారీరకంగా, మానసికంగా తగినంత వికాసం లేదని తెలుసుకోవచ్చు.
నెలలు నిండకముందే పుట్టడం, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి ఏవైనా ఆరోగ్య సమస్యలు రావడం, బేబీ పుట్టాక జాండీస్, ఇన్ఫెక్షన్స్ వంటివి రావడం, కొన్ని జన్యుపరమైన కారణాలతో నడక, మాట్లాడటం కొంత ఆలస్యం కావచ్చు. పిల్లలు 11 నుంచి 16 నెలల మధ్య బుడిబుడి అడుగులతో నడక మొదలుపెడతారు.
18 నెలల పిల్లలు నడవడంతో పాటు, చేతికి దొరికినదేదైనా పట్టుకుని లాగేయడం, వస్తువులను దూరంగా నెట్టడం, పుస్తకం చేతికిస్తే... పేజీలు తిప్పడం, క్రేయాన్స్‌తో నేలమీద, గోడలపై రాయడం, నీళ్ల టబ్ దగ్గర ఉంచితే... చేత్తో నీటి మీద తపతప తట్టడం వంటివి చేస్తుంటారు. రెండేళ్లు వచ్చే సరికి తలుపులు తెరవడం, సొరుగులు లాగడం, మెట్లు ఎక్కడం చేస్తుంటారు. కొందరిలో ఈ ప్రక్రియలు కొంత ఆలస్యం కావచ్చు.
(చదవండి: ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే..)
ఇక మాటల విషయానికి వస్తే 15 నెలలు నిండాక వారు... రకరకాల శబ్దాలతో పాటు ముద్దుమాటలు (బాబ్లింగ్స్) పలుకుతుంటారు. ఒకటి రెండు నిజశబ్దాలూ పలకగలరు. 18 నుంచి 24 నెలల వయసుకు వాళ్లు 15–20 పదాలు పలకడంతో పాటు తల్లిదండ్రుల సూచనలకు రెస్పాండ్ అవుతుంటారు.
అయితే 18–20 నెలల వయసు వచ్చేటప్పటికి కొద్దిగా కూడా మాటలు రాకపోతే, శబ్దాలకు రెస్పాండ్ కాకపోతే, అలాంటి పిల్లల్లో వికాసం ఆలస్యమైందని అనుమానించాలి. అలాంటి పిల్లలను పీడియాట్రీషియన్‌కు చూపించి, వారి సూచనల మేరకు అవసరమైన తదుపరి చర్యల (ఎర్లీ ఇంటర్‌వెన్షన్ ప్రోగ్రామ్స్)తో వారిని చక్కదిద్దాలి. ఒకసారి వాళ్లలో డెవలప్‌మెంట్ డిలే ఉందని తెలిశాక... ఇంటర్‌వెన్షన్ ప్రోగ్రామ్‌ను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలి.
(చదవండి: తరుచూ పిల్లల్లో చెవినొప్పి.. ఇలా చేస్తే..)
Comments
Please login to add a commentAdd a comment