ఘనంగా సుబ్బులక్ష్మి జయంత్యుత్సవాలు
నెల్లూరు(బారకాసు): సింహపురి కల్చరల్ అకాడమీ, సంస్కృతి తరంగాలు సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో పురమందిరంలో నిర్వహిస్తున్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి శతజయంత్యుత్సవాలను రెండో రోజు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ డోలు విద్వాంసుడు నెల్లూరు మస్తాన్‌బాబు, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు కుమారి ఆశ్రితారెడ్డి, కుమారి లాస్యను ముఖ్యఅతిథులు సన్మానించి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పురస్కారాలను అందజేశారు. అవసరాల కన్యాకుమారితో నిర్వహించిన వయెలిన్ వాద్యం అలరించింది. ప్రముఖ డోలు విద్వాంసులు పద్మశ్రీ హరిద్వార మంగళం పళనివేల్(డోలు), పత్రి సతీష్‌కుమార్ (మృదంగం) వాద్య సహకారాన్ని అందించారు. నృత్య కళాకారిణి ఆశ్రితారెడ్డి కూచిపూడి నాట్యంతో ఆకట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి, బీవీ నరసింహం, సత్యనారాయణ, ప్రముఖ తవిల్ విద్వాన్ సుబ్రహ్మణ్యం, నిర్వాహకులు రేణిగుంట రాజశేఖర్, మునిప్రసాద్, మునిరాజ్, తదితరులు పాల్గొన్నారు.