పురుషుల కన్నా మహిళలే మానసికంగా దృఢమైనవారు
నేనీస్థాయిలో ఉండటానికి తల్లి, సోదరి, భార్యే కారణం
ఏపీకి చెందిన వాడిని కావడం వల్లే సుప్రీంకోర్టు జడ్జినయ్యా
హైకోర్టులో సన్మాన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టీ
మహిళా న్యాయమూర్తులు, సీనియర్ మహిళా న్యాయవాదులకు ఘన సన్మానం
సాక్షి, అమరావతి: పురుషులు కన్నా మహిళలు మానసికంగా దృఢవంతులని, తన బిడ్డలను ప్రయోజకులుగా చేసేందుకు తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసి వెంకట నారాయణ భట్టీ అన్నారు. తల్లి త్యాగాలను వేటితోనూ వెలకట్టలేమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య సంయుక్తంగా శనివారం హైకోర్టు మహిళా న్యాయమూర్తులను, మహిళా సీనియర్ న్యాయవాదులను సన్మానించింది. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి జస్టిస్ భట్టీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కలిసి హైకోర్టు మహిళా న్యాయమూర్తులయిన జస్టిస్ బి.శ్రీభానుమతి, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, ఉపలోకాయుక్త పి.రజనీరెడ్డి, సీనియర్ న్యాయవాదులు కేఎన్ విజయలక్ష్మి, ప్రేమలత, అచ్చెమ్మలను జస్టిస్ భట్టీ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు బహూకరించారు.
అనంతరం జస్టిస్ భట్టీ, ఆయన సతీమణి అనుపమలను హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య, ఇతర న్యాయవాదులు గజమాలతో, శాలువాలతో వేదమంత్రోచ్చరణ మధ్య ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహూకరించారు. అలాగే హైకోర్టు ఉద్యోగుల సంఘం, న్యాయవాద పరిషత్ తదితర సంఘాలు కూడా జస్టిస్ భట్టీని సన్మానించాయి.
మదనపల్లి మాణిక్యం..
జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ, జస్టిస్ భట్టీని ‘మదనపల్లి మాణిక్యం’గా అభివర్ణించారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో తల్లి పాత్ర కీలకంగా మారిందన్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వేస్టేషన్ గతంలో అసాంఘిక శక్తులకు చిరునామాగా ఉండేదని, ఆ స్టేషన్ బాధ్యతలను మహిళలకు అప్పగించిన తరువాత దేశంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా మారిందన్నారు.
మహిళా శక్తికి ఇదో నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, మహిళా న్యాయవాదుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు భాస్కరలక్ష్మి, అధ్యక్షురాలు కె.అరుణ, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సమర్థత వల్లే జస్టిస్ భట్టీ సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, వృత్తిపట్ల నిబద్ధత, నిజాయితీ, సమర్థత, కష్టపడేతత్వం వల్లే జస్టిస్ భట్టీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాగలిగారని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న అసమానత్వాన్ని రూపుమాపేందుకు నిర్మాణాత్మక చర్యలు అవసరమన్నారు. మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో పలు అధికరణలున్నాయని, అవి సమర్థవంతంగా అమలయ్యేందుకు న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు ఉత్తర్వులిస్తున్నాయన్నారు.
సమాజ నిర్మాణంలో మహిళలది కీలకపాత్ర
ఈ సందర్భంగా జస్టిస్ భట్టీ మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో మహిళలదే కీలక పాత్ర అని చెప్పారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి తన తల్లి, సోదరి, భార్యే కారణమన్నారు. తన తల్లి ఇచ్చిన ధైర్యం, తన సోదరి ఇచ్చిన సలహాలు, తన సతీమణి ఇచ్చిన మద్దతు కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడిని కావడం వల్లే తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అయ్యానని చెప్పారు.
ఏపీ హైకోర్టుకు సదా రుణపడి ఉంటానని, ఎల్లవేళలా ఈ హైకోర్టుకు అండగా ఉంటానని చెప్పారు. ఉద్యోగాల పేరుతో అమాయక యువతులను మానవ అక్రమ రవాణా ఉచ్చులో దించుతున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజలను చైతన్యపరిచే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన మహిళా న్యాయవాదుల సమాఖ్య, రాష్ట్ర న్యా యసేవాధికార సంస్థలను కోరారు. ఇందుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment