modern society
-
ప్రతిభా మూర్తులకు పది విశ్వపీఠాలు
మహిళాభ్యుదయం అంటే... అవనిలో సగం – ఆకాశంలో సగం, నేల నీదే – నింగీ నీదే... అని స్ఫూర్తి పొందడం ఒక్కటే కాదు. సామాజిక చైతన్యంలో మహిళ సేవను గుర్తు చేసుకోవడం. సమకాలీన సమాజ నిర్మాణంలో మహిళ పాత్రను గుర్తెరగడం. మహిళ మేధను, నిష్ణాతను, నైపుణ్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలియచేయడం. కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ఉద్దేశం కూడా ఇదే. ప్రాచీన, ఆధునిక సమాజంలో సామాజిక వివక్షకు ఎదురొడ్డి మరీ సమాజాన్ని చైతన్యవంతం చేసి, తమ పాదముద్రలతో తర్వాతి తరాలకు మార్గదర్శనం చేసిన మహిళల గుర్తుగా యూనివర్సిటీలలో పది పీఠాలను (అకడమిక్ చెయిర్) ఏర్పాటు చేయనుంది. ఆ పీఠాలను ‘అలంకరించనున్న’ మహిళామూర్తుల వివరాలివి. లల్లేశ్వరి క్రీ.శ 14వ శతాబ్దంలో కశ్మీర్లో మహిళాభ్యుదయం కోసం అక్షర పోరాటం చేసిన మహిళ. కశ్మీర్ సాహిత్యంలో ఆమెది ప్రత్యేకస్థానం. స్త్రీకి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు చదువుతోనే సాధ్యమవుతాయన్నారు. స్త్రీకి చదువుకునే సౌకర్యం కల్పించే ఉదారవాద సమాజస్థాపన ఆమె ఆకాంక్ష. న్యూఢిల్లీలో 2000లో ఆమె రచనల మీద జాతీయ స్థాయి సెమినార్ జరిగింది. ‘రిమెంబరింగ్ లాల్ దేద్ ఇన్ మోడరన్ టైమ్స్’ పుస్తకం కూడా ఆవిష్కృతమైంది. లీలావతి గణితశాస్త్రవేత్త. క్రీ.శ. 16వ శతాబ్దం నాటి ప్రముఖ గణితశాస్త్రవేత్త రెండవ భాస్కరుని కుమార్తె. గణితంలో ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే నోటి లెక్కగా చెప్పేదని నాటి గ్రంథాల్లో ఉంది. భాస్కరుడు తాను రాసిన గణితశాస్త్ర గ్రంథానికి కూడా ‘లీలావతి’ అనే పేరు పెట్టాడు. అహల్యాబాయ్ హోల్కర్ స్వస్థలం మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌కు సమీపంలోని చొండి గ్రామం. ఆడవాళ్లు ఇల్లు దాటి బయట అడుగుపెట్టడానికి సమాజం అంగీకరించని 18వ శతాబ్దంలో ఆమె ఇంట్లోనే చదవడం, రాయడం నేర్చుకున్నారు. అహల్యాబాయ్ భర్త మాల్వా రాజు ఖండేరావ్ హోల్కర్ కుంభేర్ యుద్ధంలో మరణించాడు. భర్త మరణించిన సమయంలో ఆమె సతిని పాటించాలా వద్దా అనే మీమాంస తలెత్తింది. రాజ్య నిర్వహణ బాధ్యత చేపట్టగలిగిన మహిళ తనను తాను సబలగా నిరూపించుకోవాలి తప్ప అబలగా అగ్నికి ఆహుతి కాకూడదనే నిర్ణయానికి వచ్చారు. అప్పటినుంచి ఆమె మామ మల్హర్‌రావ్ ఆమెను రాజ్యపాలనలో నిష్ణాతురాలిని చేశారు. మల్హర్ రావ్ హోల్కర్ మరణించినప్పటి నుంచి అహల్యాబాయ్ పూర్తిస్థాయిలో రాజ్య నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. రాజధానిని మాల్వా నుంచి మహేశ్వర్‌కు మార్చడం వంటి నిర్ణయాలతో పరిపాలనలో అనేక స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నారామె. అమృతాదేవి బెనివాల్ (బిష్ణోయి) చెట్లను కాపాడేందుకు ప్రాణాలు వదిలిన త్యాగశీల పర్యావరణవేత్త అమృతాదేవి. రాజస్థాన్, జో«ద్‌పూర్‌లోని ఖేజార్లి గ్రామంలో పుట్టిన అమృతాదేవి ఖేజ్రీ చెట్ల పరిరక్షణ కోసం పోరాడిన మహిళ. క్రీ.శ 1730లో భవననిర్మాణానికి అవసరమైన కలప కోసం రాజోద్యోగులు ఖేజార్లి గ్రామం సమీపంలోని అడవులకు వచ్చారు. చెట్లను ప్రేమించే బిష్ణోయి తెగ వాళ్లు కలప కోసం ఎండిన కొమ్మలను మాత్రమే ఉపయోగిస్తారు తప్ప చెట్లను నరకరు. సాటి బిష్ణోయి తెగకు చెందిన మహిళలను కూడగట్టి.. చెట్లను నరకడానికి వచ్చిన రాజు మనుషులను అడ్డుకుంది అమృతాదేవి. ఆ ఘర్షణలో ముగ్గురు కూతుళ్లతోపాటు అమృతాదేవి, మరో మూడు వందలకు పైగా బిష్ణోయి మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అనందీబాయ్ జోషి మనదేశంలో తొలి లేడీడాక్టర్. పద్నాలుగేళ్లకే బిడ్డకు తల్లయ్యారు ఆనందీబాయ్. కానీ ఆ బిడ్డ సరైన వైద్యం అందని కారణంగా పది రోజులకే మరణించడంతో ఆమె దృష్టి వైద్యరంగం మీదకు మళ్లింది. సంస్కృతం, ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికా, పెన్సిల్వేనియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజ్‌లో వైద్యశాస్త్రాన్ని చదివారామె. ఇండియాకి తిరిగి వచ్చి కొల్హాపూర్‌లోని ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో వైద్యసేవలందించారు. హన్షా మెహతా సూరత్‌లో పుట్టిన హన్షామెహతా గుజరాతీ భాషలో తొలి నవల రాసిన రచయిత. ఆమె విద్యావంతురాలు, సంఘసంస్కర్త, సామాజిక కార్యకర్త, స్వతంత్ర భావాలు కలిగిన మహిళ. ఆమె తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసి ఇంగ్లండ్‌లో జర్నలిజం, సోషియాలజీ చదివారు. మహాదేవి వర్మ ఆమె ఉన్నత విద్యావంతురాలు, ప్రముఖ హిందీ కవయిత్రి. ఛాయావాద సాహిత్య ఉద్యమంలో ఆమె తన భావాలను స్పష్టంగా వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో కీలకంగా సేవలందించారు. అలహాబాద్‌లోని ‘ప్రయాగ మహిళా విద్యాపీuŠ‡’కు వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వర్తించారామె. రాణి గైదిన్లియు మణిపూర్‌కు చెందిన రాణి గైదిన్లియుకి 78 ఏళ్లు. ఆమె ఆధ్యాత్మిక, రాజకీయ నాయిక. బ్రిటిష్ పాలను వ్యతిరేకంగా గళమెత్తిన ధీర. పదమూడేళ్ల వయసులోనే హరక్కా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మణిపూర్ నుంచి బ్రిటిష్ వారిని తరిమివేయడానికి ఉద్యమించారు. పదహారేళ్ల వయసులో బ్రిటిష్ పాలకుల చేతిలో అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడిపారామె. జవహర్లాల్ నెహ్రూ ఆమెకు రాణి అని ప్రశంసించారు. ఆ తర్వాత ఆమె పేరులో రాణి అనే మకుటం చేరింది. జాతీయోద్యమ నాయకురాలిగా ఆమె సేవలకు భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. – మంజీర ఎం.ఎస్ సుబ్బులక్ష్మి ఎం.ఎస్. పేరుతోపాటు గుర్తుకు వచ్చే పాట ‘రఘుపతి రాఘవ రాజారామ్’. గాంధీజీకి ఇష్టమైన పాట. తమిళనాడు, మధురైలో పుట్టిన సుబ్బులక్ష్మి కర్నాటక సంగీతంతో నిష్ణాతురాలు. భారతరత్న పురస్కారం, రామన్ మెగసెసె అవార్డు అందుకున్న తొలి సంగీతకారిణి ఆమె. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సంగీతాలాపన చేసిన తొలి భారతీయురాలు కూడా. పద్మభూషణ్, పద్మ విభూషణ్, సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ అవార్డులు కూడా అందుకున్నారు ఎం.ఎస్ సుబ్బులక్ష్మి. ఆమె పేరులోని ఎం.ఎస్ అంటే మధురై షణ్ముఖవాడివు. కమలా సోహోనీ మధ్యప్రదేశ్, ఇందోర్‌కు చెందిన కమలా సోహోనీ సైన్స్ రంగంలో పీహెచ్డీ అందుకున్న తొలి భారతీయ మహిళ. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఆమె పరిశోధనలు చేశారు. అంతేకాదు, ఆమె ఆ సంస్థలో మహిళల ప్రవేశానికి మార్గం సుగమం చేసిన మహిళ కూడా. వరి, పప్పుధాన్యాలలో ఉండే పోషకాలు, విటమిన్ల గురించి పరిశోధించారు. తాటి చెట్టు నుంచి స్రవించే ద్రవం ‘నీరా’లో ఉండేæ పోషకాలు– వాటి ప్రయోజనాల మీద చేసిన పరిశోధనకు ఆమె రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ►పై ఐదుగురు (ఎడమ నుంచి కుడికి) ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, కమలా సొహోనీ, దేవీ అహల్యాబాయ్ హోల్కర్, రాణీ గైడిన్లీ, హన్సా మెహ్తా ►కింది ఐదుగురు (పై నుంచి సవ్యదిశలో) లీలావతి, లల్లేశ్వరి, అమృతాదేవి బెనీవాల్, మహదేవీ వర్మ, ఆనందీబాయ్ గోపాల్రావ్ -
మృత్యువై కదలిన ఆధిపత్య క్రీడ
సిరియా అంతర్యుద్ధం సృష్టించిన కల్లోలం ఆధునిక సమాజపు మానవత్వాన్నే ప్రశ్నిస్తోంది. ఈ సంక్షోభానికి కారణమైన వారిదే పరిష్కారం బాధ్యత. అంతర్జాతీయ చట్టాల ప్రకారం శరణార్థులకు ప్రామాణిక హక్కులున్నా... పశ్చిమాసియా నుంచి ప్రాణభీతితో వస్తున్న వారిని ఐరోపా అలా స్వీకరించడం లేదు. పైకి చూడటానికి ఇది ఈజిప్ట్, లిబియాల్లోని మార్పుల ప్రభావంగానో, సిరియా అంతర్యుద్ధం, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాల ఫలితంగానో కనిపించవచ్చు. కానీ అసలు మూలం సామ్రాజ్యవాదశక్తుల దీర్ఘకాలిక ఆధిపత్య కుట్రే అనేది విస్పష్టం. పదకొండు, సెప్టెంబర్, 1893. అమెరికాలోని చికాగో నగరం. ప్రపంచ సర్వమత సమ్మేళనం వేదిక ‘కొలంబస్ హాల్’ ఒక ధీర గంభీరమైన స్వరం శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ‘‘...సహనాన్ని సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను.... సమస్త మతాల నుంచి, సమస్త దేశాల నుంచీ పర పీడితులై, శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తు న్నాను. రోమన్ల నిరంకుశత్వానికి గురై తమ దేవాలయాలు తుత్తునియలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను మా కౌగిట చేర్చుకున్నామని తెలపడానికి గర్విస్తున్నాను. జొరాస్ట్ట్రియ సంఘంలో మిగి లిన వారికి శరణొసగి, నేటికీ ఆదరిస్తున్న ధర్మం నా ధర్మమని గర్విస్తు న్నాను.’’ భారతదేశ సంస్కృతీసంప్రదాయ విలువల్ని విశ్వవ్యాప్తం చేసిన స్వామీ వివేకానంద ప్రసంగంలోని భాగమిది. ‘‘జాతులవైరం, శాఖాభి మానం, మతమౌఢ్యం, ఉగ్రవాదం వంటి అరిష్టాలు ఈ భూమిని సుదీర్ఘకా లంగా చెరబట్టాయి. హింస, విధ్వంసాలతో నేలను నెత్తురుమయం చేశాయి. నాగరికతను హననం చేసి దేశాలను ముక్కముక్కలు చేశాయి. లేకుంటే, మానవ జీవన వికాసం మరెంతో ఉత్కృష్టంగా ఉండేద’’న్నారు. ‘‘...ఈ దురా గతాలకు అవసాన సమయం ఆసన్నమైంది. ఈ మహాసభ గౌరవార్థం ఉద యం మోగించిన గంట స్వమత దురభిమానానికి, పరమత ద్వేషానికీ, కత్తితో గాని, కలంతో గానీ సాగించే నానావిధాల హింసకూ, ఆ లక్ష్యాల దిశగా కొందరిని సాగేలా చేసే నిష్టుర ద్వేషభావాలకూ మృత్యుఘంటిక కాగలదని మనఃస్ఫూర్తిగా ఆశిస్తున్నా’’నంటూ స్వామీజీ తన ప్రసంగాన్ని ముగించారు. 122 సంవత్సరాలు గడిచింది. పరిస్థితి మారకపోగా, మరింత తీవ్రమైంది. ప్రపంచంలో పలుచోట్ల మతమౌఢ్యాలు, జాతి విద్వేషాలు, ఉగ్రదాడులు, అంతర్యుద్ధాలు, జాతుల పోరాటాలు చెలరేగుతున్నాయి. సిరియాలో జరుగుతున్న మారణకాండకు లక్షలాది మంది ప్రాణాలు అరచేత పట్టుకొని మధ్యదరా తీరం వెంబడి యూరప్‌వైపు పరుగులు తీస్తున్న తీరు, వందలాదిగా జలసమాధి అవుతున్న తీరు కన్నీరు పెట్టిస్తోంది. సిరియాలో దాదాపు సగం జనాభా.. కోటీ యాభై లక్షల మంది దేశం వీడి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్న దుస్థితి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ పటంపై ఇంతటి భయానక దృశ్యం కానరావడం ఇదే! ఒక్క ఫొటో ప్రపంచాన్నే కదిలించింది నీలం చొక్కా, ఎర్ర టీషర్ట్ ధరించి టర్కీ తీరాన నిద్రపోతున్నట్టున్న మూడేళ్ల సిరియా పసివాడు ఆయలాన్ కుర్దీ శవం యావత్ప్రపంచాన్ని కలచివేసింది. ముఖ్యంగా ఐరోపా సమాజాన్ని కదిలించింది. సిరియా, మధ్యప్రాచ్యాల నుంచి వస్తున్న శరణార్థులకు ఆశ్రయమిచ్చే నూతన విధానాల రూపకల్పనకు యూరోపియన్ యూనియన్ ఆంతరంగిక మంత్రి మండలి ఈ సోమవారం అసాధారణ భేటీ జరపనుంది. సిరియాలో నాలుగేళ్లుగా సాగుతున్న నరమే ధం ఇప్పుడు భీతావహ స్థితికి చేరింది. ఈ అంతర్యుద్ధం సృష్టించిన కల్లోలం ఆధునిక సమాజపు మానవత్వాన్నే ప్రశ్నిస్తోంది. ఇప్పటికే దాదాపు రెండున్నర లక్షల మంది సిరియన్లు అక్కడే నిష్కారణంగా దుర్మరణం పాలయ్యారు. దేశం వీడితేనైనా ప్రాణాలు దక్కుతాయనుకున్న వారిలో వేలాది మంది స్మగ్లర్ల వంచనకు గురవుతున్నారు, ముష్కరుల చేతుల్లో హతమవుతున్నారు. కిక్కిరిసిన పడవలో, మోటారు బోట్లో ఎక్కినవారు... జలసమాధి అవుతు న్నారు. కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకున్న లక్షలాది మంది ఐరోపా దేశా ల శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటున్నారు. వలస వచ్చేవారిపై విధించిన సంఖ్యాపరమైన ఆంక్షలను ఐరోపా దేశాలు ఇప్పుడిప్పుడే సడలిస్తున్నాయి. ఇప్పటికే జర్మనీ ఏటా ఐదు లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తామని ప్రకటిం చింది. బ్రిటన్, ఫ్రాన్స్‌లు సైతం అలాంటి ప్రకటనలు చేశాయి. అమెరికా సానుకూలతను తెలిపింది. రోజూ మూడు వేల మంది మేర మూడు నాలుగు మాసాలపాటు ఐరోపాకు ఈ తాకిడి తప్పదని ఐరాస తెలిపింది. శరణార్థుల్ని వలసదారులంటే ఎలా? మెరుగైన జీవనం కోసం వలసవచ్చే వారికి, నిర్వాసితులై ప్రాణాలు అరచేత పట్టుకొని వచ్చే శరణార్థులకు చాలా వ్యత్యాసముంది. అయినా శరణార్థులకు ఆశ్రయం ఇస్తే జనాభా నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసాలు తలెత్తుతాయని ఐరోపా దేశాలు, ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్‌లు భయపడుతున్నాయి. పైగా ఇస్లామిక్ ఉగ్రవాదం ఆ దేశాలను వణికిస్తోంది. వేర్వేరు పరిస్థితుల్లో ఐరోపాకు వచ్చి, స్థిరపడ్డ వారితో, ముఖ్యంగా ముస్లిం జనాభా పెరుగుదలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారి వాదన. అందుకే పశ్చిమాసియా శరణార్థులను కూడా ఐరోపా దేశాలు, ప్రసారమాధ్యమాలు తరచూ ‘వలస దారుల’నే అంటున్నాయి. వారిని శరణార్థులనడానికి తేలికగా అంగీకరించ టంలేదు. స్వదేశంలో కంటే మెరుగైన జీవన ప్రమాణాలకోసం ఇతర దేశా లకు అక్రమంగా వలస వచ్చేవారిని స్వదేశాలకు తిప్పి పంపే ఇమిగ్రేషన్ నిబంధనలుంటాయి. కానీ, శరణార్థులంటే అంతర్యుద్ధంలోనో, జాతుల పోరాటాల్లోనో, ఆర్థిక అత్యయిక పరిస్థితుల్లోనో తమ దేశంలో ప్రాణాలకు ముప్పున్నపుడు ఇతర దేశాల్లో తలదాచుకునే వారని నిర్వచించారు. వివిధ దేశాల చట్టాలు, నిబంధనల ప్రకారం అలాంటి వారికి గుర్తింపు, సదుపా యాలు లభిస్తాయి. 1951 శరణార్థుల సదస్సు, 1967 ప్రొటోకాల్ ప్రకారం అంతర్జాతీయ న్యాయ చట్టం కింద శరణార్థులకు ప్రామాణిక హక్కులున్నా యి. ఐరోపా కంటే టర్కీ, లెబనాన్, జోర్డాన్లకే వీరి తాకిడి ఎక్కువ. దుశ్చర్య ఎవరిది? బాధితులెవరు? సమస్యకు మూలమైన వారే పరిష్కారానికి, సంక్షోభ నివారణకు బాధ్యత తీసుకోవాలి. పశ్చిమాసియా శరణార్థుల తాకిడి ఐరోపా దేశాల ఆహార భద్ర తకు ముప్పుకావచ్చని ఐరాస ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) హెచ్చ రిస్తోంది. ఆవాసం, వైద్య సదుపాయాల విషయంలోనూ సమస్యలు తలెత్త వచ్చు. అమెరికా, దాని సామ్రాజ్యవాద మిత్రులైన నాటో దేశాల ఆధిపత్య కాంక్ష నేటి దుస్థితికి ప్రధాన కారణమని ప్రపంచానికి తెలుసు. బయటకు చూడటానికి ఇది ఈజిప్ట్, ట్యునీసియా, లిబియా వంటి దేశాల్లో వచ్చిన ప్రజా స్వామిక మార్పుల ప్రత్యక్ష ప్రభావం లాగానో, పరస్పర ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం-ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం లాగానో, తిరుగుబాట్ల వల్ల సిరి యాలో తలెత్తిన అంతర్యుద్ధంలాగానో కనిపించినా... దీని వెనుక ఉన్న సామ్రాజ్యవాద శక్తుల దీర్ఘకాలిక కుట్ర విస్పష్టం. తమ ఆధిపత్యం కోసం నియంతల్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందెవరు? అన్నది ప్రధాన ప్రశ్న. అమెరికాకు తోడు ఐరోపాలోని బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల సామ్రాజ్య విస్తరణవాద ధోరణుల విషపుత్రికలే ఇవి. తమ ఆధిపత్యం కోసం... ఒకే భాష, ఒకే సంస్కృతి గల వారిని విడగొట్టడం, జాతి విద్వేషాల్ని రగల్చడం, పశ్చిమాసియా, మధ్యప్రాచ్యాల సరిహద్దులను ఇష్టానుసారంగా మార్చడం అశాంతికి దారితీస్తున్నాయి. ఈ కుటిల నీతిమూలాలు తెలియాలంటే, నూరే ళ్లు వెనక్కివెళ్లాలి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో సామ్రాజ్యవాదశక్తుల మధ్య 1916లో జరిగిన ‘సైకస్-పికో’ ఒప్పందాన్ని ఆసియా మైనర్ ఒప్పం దం అంటారు. ఫ్రాన్స్, బ్రిటన్ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ద్వారా ఒటోమెన్ సామ్రాజ్యానికి గండికొట్టి, అరబ్ ద్వీపకల్పం బయటి మధ్యప్రాచ్య భూభాగంపై ఆధిపత్యాన్ని బ్రిటన్-ఫ్రాన్స్‌లు పంచుకున్నాయి. అవే ఆధిపత్య ధోరణులు ఇంకో రూపంలో మళ్లీ తెరపైకొస్తున్నాయి. అందుకే ఈ రావణ కాష్టానికి మూలం నేటి ‘రెండవ సైకస్-పికో’ ఒప్పందమే అనాలి. సిరియా- టర్కీ-ఇరాక్ దేశాల సరిహద్దులను మార్చి నేడు ఈ మంటలను రేకెత్తించారు. దీని ఉప ఉత్పత్తే ఐఎస్ఐఎస్. విడగొట్టి విధ్వంసాల్ని, కలిపి కల్లోలాల్ని సృష్టిస్తూ మానవాళిని అశాంతిలోకి నెడుతున్నారు. పాఠం నేర్వకుంటే ఫలితం సున్నా! దౌత్యం దాడులైనా, సార్వభౌమాధికారంపై స్వారీ అయినా, సంస్కృతిని, సరి హద్దుల్ని చెరచడమైనా, జాతి మత విద్వేషాల్ని రగిల్చి సామ్రాజ్యవాదాన్ని బలోపేతం చేయడమైనా... ఏదైనా, గతం నుంచి పాఠాలు నేర్చి, వర్తమా నాన్ని దిద్దుకుంటేనే భవిష్యత్తు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ‘ధరాతలమంత తడిసె రక్తమున, కాదంటే కన్నీళ్లతో...’ అతిశయోక్తేం కాదు. అశక్తుల నెత్తు టితో నేలను తడుపుతున్న క్రమంలోనే ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఉపద్రవాలు ముంచెత్తుతున్నాయి. ఉగ్రవాదం మారణహోమాలను రగిలిస్తోం ది. చమురు నిక్షేపాలపై ఆధిపత్యానికి కన్నేసి, విషపూరిత అణ్వాయుధాలతో సద్దాం హుస్సేన్ దాడికి యత్నిస్తున్నారనే మిషతో పెద్దన్న అమెరికా, ఇరాక్‌పై దాడులు చేసి విధ్వంసం సృష్టించింది. ఐరాసనూ లెక్కచేయలేదు. అమెరికా ఆరోపణలకు ‘అలాంటి ఆధారాలేవీ లేవ’ని బ్రిక్స్ కమిషన్ తేల్చినా ఖాతరు చేయలేదు. అమెరికాతో చేయికలిపిన బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీల దుష్ట మూక ధ్వంస రచనకు తలపడింది. ఇక రష్యామీద వైరంతో అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లను పెంచి పోషించింది అమెరికా కాదా? అల్‌కాయిదా ఎలా పుట్టిం దో ఎవరికి తెలియదు? ఈ విపరిణామాలకు పుట్టిన ఉగ్రవాద వికృత చేష్టే... ప్రపంచవాణిజ్య కేంద్రం టవర్లపై వైమానిక దాడి. పద్నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా, మన స్మృతిపథాన్ని వీడని పీడకల, మూడున్నర వేల మందిని పొట్టనపెట్టుకున్న దుర్దినం...11 సెప్టెంబరు, 2001. - దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
మీతోనే నవ సమాజం
జస్టిస్ చంద్రకుమార్ అనంతపురం లీగల్: ‘మీలోనే శక్తి ఉంది.. మీతోనే నవసమాజం ఏర్పడుతుంది.. బాగా చదివి మంచి ఆలోచనలతో మంచి సమాజాన్ని నిర్మించటం మీవల్లే సాధ్యం’ అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు జస్టిస్ చంద్రకుమార్. స్థానిక కేఎస్ఆర్ ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విద్యార్థులే ఆశాకిరణాలుగా..భావిభారత నిర్మాణంలో వారిదే కీలక పాత్రగా పేర్కొంటూ వారి ఆలోచనలను పదునుపెట్టటానికి ఆలోచనే ఆయుధంగా మలుస్తున్నానన్నారు. ఎక్కడినుంచి వచ్చాను..ఎక్కడికి వెళుతున్నాను.. అనే చిన్ని ఆలోచనతో మొదలైన తన సత్యాన్వేషణ ఈ కార్యక్రమాలకు ప్రేరణ అన్నారు. పలు విషయాలను ఆయన సూటిగాను సోదాహరణంగా వివరించారు. మనసులోని భయంవల్లే అన్ని అనర్థాలన్నారు. దానిని పారదోలితే అంతా ధైర్యమేనన్నారు. పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల కోసం చదివే చదువులు జీవితానికి ఉపయోగపడవన్నారు. పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకుంటేనే ఉపయోగకరమన్నారు. మౌర్య వంశ స్థాపన ఒక స్త్రీ వల్లే సాధ్యపడిందని, అలాంటి చారిత్రక అంశాలు, కథలు జీవితాలను మరింత తేజోవంతం చేస్తాయన్నారు. మంచి పనులు మనిషికి శక్తినిస్తాయని, ఆ శక్తితో గొప్పవాళ్లు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్వార్థ భారతి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ (హైదరాబాదు)మోహన్‌రావు చిన్ని చిన్ని ప్రశ్నలతోనే తన సందేశాత్మక ఝరిని ఆవిష్కరించారు. ప్రతిప్రశ్నకు విద్యార్థులే ముక్తకంఠంతో చెప్పే సమాధానం ఆయన ప్రసంగసారాంశమైంది. ప్రజాగాయకుడు లెనిన్ జస్టిస్ రచించిన కవితను గానం చేశారు. చల్లని వెలుగులనిచ్చే చందమామదే కులం?..చీకట్లను తరిమివేసే సూర్యునిదేకులం?...అంటూ కులం కుళ్లు కడిగేద్దాం నవయుగాన్ని నిర్మిద్దామంటూ ఆ కవితలో చంద్రకుమార్ విద్యార్థులకు పిలుపునందించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కుల రిజర్వేషన్లు ఎందుకు?, అనుభవం గొప్పదా? జ్ఞానం గొప్పదా?, కోర్టు శిక్షలు, రాజకీయాల్లో అక్రమ ధనార్జన తదితర అంశాలపై విద్యార్థునులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థునులను ఆయన అభినందించారు. వారికి బహుమతులుగా పుస్తకాలను బహూకరించారు. తాను రచించిన రెండు పుస్తకాలను కళాశాల గ్రంథాలయానికి అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్మిక న్యాయస్థానం న్యాయమూర్తి సుమలత, నగర మేయర్ మదమంచి స్వరూప, ఆచార్య కొలకలూరి ఇనాక్ పాల్గొన్నారు. -
చక్కర్లు కొడుతుంది.. నెట్ సౌకర్యమిస్తుంది
ఫొటో ఫీచర్ ఆధునిక సమాజంలో ఇంటర్నెట్ ఒక భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదేమోగానీ.. గ్రామీణులతోపాటు చాలా పేదదేశాల్లో ఇది ఇప్పటికీ గగన కుసుమమే. ఈ కొరతను తీర్చేందుకు, ఆపత్కాలాల్లో ఆదుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరింది... పోర్చుగీస్‌కు చెందిన క్వార్క్సన్ అనే కంపెనీ. చిన్న చిన్న డ్రోన్ల సాయంతో ఇంటర్నెట్ను అందరికీ అందుబాటులోకి తేవాలన్నది ఈ కంపెనీ చేపట్టిన ‘స్కై ఆర్బిటర్’ ప్రాజెక్టు లక్ష్యం. ఫొటోలో కనిపించేది క్వార్క్సన్ తయారు చేసిన ఆరు రకాల డ్రోన్లలో ఒకటి మాత్రమే. వీటిల్లో కొన్ని తక్కువ ఎత్తులో ఎగురుతూ కొన్ని వారాలపాటు ఇంటర్నెట్ సంకేతాలను ప్రసారం చేయగలిగితే... మిగలినవి భూమి నుంచి 72 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఏళ్లతరబడి నిరంతరం పనిచేస్తూంటాయి. -
చల్తా హై.. చెల్లదు
ప్రేరణ మీరు ఒక ఊరికి వెళ్లొద్దామని అనుకుంటున్నారు. కానీ, అక్కడికి వెళ్లడానికి దారి తెలియదు. ఏం చేస్తారు? కంప్యూటర్ ఆన్ చేసి, వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి. చాలా మ్యాప్‌లు కనిపిస్తాయి. వీటి ద్వారా ఆ ఊరికి ఎలా వెళ్లాలో దారి తెలుసుకొని, ప్రయాణం ప్రారంభించొచ్చు. జీవితంలో మాత్రం కోరుకున్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఈ వెసులుబాటు లేదు. టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు రోడ్‌మ్యాప్ అందజేసే వెబ్సైట్లు మనకు అందుబాటులో లేవు. దగ్గరి దారులొద్దు నేటి ఆధునిక సమాజంలో యువతకు చాలా లక్ష్యాలున్నాయి. స్థిర, చరాస్తులు సమకూర్చుకోవాలి. డబ్బు, పేరు, మంచి హోదా రావాలి. కుటుంబంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. ఇలాంటి లక్ష్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. లక్ష్యం దిశగా ప్రయాణం ప్రారంభించినప్పుడు ఎదురుగా రెండు మార్గాలు కనిపిస్తాయి. ఒకటేమో.. సులభమైన దగ్గరి దారి. గతుకుల్లేని చక్కటి దారి. మరొకటి.. కఠినమైన దూర మార్గం. ఆ దారిలో చాలా ఎత్తుపల్లాలు, అడ్డంకులు ఉంటాయి. మనం దేన్ని ఎంచుకుంటాం? కచ్చితంగా దగ్గరి దారినే. అసలైన అంతర్గత శక్తిని వెలికితీయాలి దగ్గరి దారుల్లోనే ప్రయాణించడం ఇప్పుడు మనకు ఒక అలవాటుగా మారిపోయింది. షార్ట్‌కట్స్ కోసం వెతుక్కుంటున్నాం. రాజీ పడిపోతున్నాం. విజయం సాధించేందుకు మనల్ని మనం కష్టపెట్టుకోలేకపోతున్నాం. శ్రమకు వెనుకాడుతున్నాం. సక్సెస్ రాకున్నా ఫర్వాలేదు.. ఫెయిల్యూర్ మాత్రం రాకూడదు అనే దృక్పథం మనుషుల్లో పెరిగిపోయింది. విజయం కోసం కృషి చేయడం లేదు. కానీ, పరాజయం రావొద్దని అనుకుంటున్నాం. ఫలానా సబ్జెక్టులో మూడు చాప్టర్లు చదువుకుంటే చాలు 35 మార్కులు వస్తాయి. పరీక్షల్లో గట్టెక్కుతాం. వారానికి నాలుగుసార్లు క్లాస్‌కు వెళ్తే చాలు బ్లాక్‌లిస్టులో మన పేరు ఉండదు.. ఇలాంటి టిప్స్ పాటించేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటివి మన జీవితాల్లో భాగంగా మారుతున్నాయి. నిజానికి మనలోని శక్తిసామర్థ్యాలతో ఎంతో సాధించొచ్చు. కానీ, సాధించలేకపోతున్నాం. కారణం.. షార్ట్‌కట్స్‌ను, టిప్స్‌ను నమ్ముకోవడమే. మనలోని అసలైన శక్తిని వెలికితీయడం లేదు. ‘చల్తా హై..’ అనేది ఆలోచనా విధానంగా మారింది. అది చెల్లదని తెలుసుకోవాలి. కచ్చితత్వం.. లోపలి నుంచి వస్తుంది ఓ చిన్నపట్టణంలో గొప్ప శిల్పకారుడు ఉండేవాడు. స్థానికంగా ఉన్న ఆలయంలో ప్రతిష్టించేందుకు దేవత విగ్రహాన్ని చెక్కడం ప్రారంభించాడు. ఓ రోజు ఓ యువకుడు అటువైపు వచ్చాడు. శిల్పి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయాడు. శిల్పి చెక్కుతున్న విగ్రహం పక్కనే అలాంటిదే మరొకటి పడి ఉండడం గమనించాడు. ఆలయానికి రెండు విగ్రహాలు అవసరమా? అని ప్రశ్నించాడు. కాదు ఒకటేనని శిల్పి బదులిచ్చాడు. మరి రెండు ఎందుకు చెక్కుతున్నారని సందేహం వ్యక్తం చేయగా.. ఆ విగ్రహం చెక్కుతుండగా చిన్న పొరపాటు వల్ల దెబ్బతిన్నదని అందుకే మరొకటి చెక్కుతున్నానని వివరించాడు. కిందపడి ఉన్న విగ్రహాన్ని యువకుడు నిశితంగా పరిశీలించాడు. అంతా సక్రమంగానే ఉంది, ఎక్కడా దెబ్బతిన్నట్లు కనిపించలేదు. విగ్రహం బాగుందని, ఎలాంటి లోపం కనిపించడం లేదని అన్నాడు. జాగ్రత్తగా చూడు, ఎడమ కంటి కింద చిన్న పగులు ఉంది అని శిల్పి చెప్పాడు. విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్టిస్తారని యువకుడు అడగ్గా.. ఆలయం లోపల ఎత్తయిన వేదికపై ప్రతిష్టిస్తామని శిల్పి వివరించాడు. అంత ఎత్తులో ఉండే విగ్రహంలో సూక్ష్మమైన పగులు ఎవరికి కనిపిస్తుందని యువకుడు ప్రశ్నించాడు. నాకు కనిపిస్తుంది అంటూ.. ఆ శిల్పి చిరునవ్వుతో బదులిచ్చాడు. పనిలో పరిపూర్ణత సాధించడం అంటే ఇదే. కచ్చితత్వం అనేది బయటినుంచి రాదు, మనిషి లోపలి నుంచే వస్తుంది. పనిలో పరిపూర్ణత కోసం సాధన చేయాలి. కచ్చితత్వాన్ని అలవర్చుకోవాలి. శీల నిర్ణయం ఇలా శ్రమించే విషయంలో రాజీపడొద్దు. శరీరంలోని 100 శాతం శక్తిని వెలికితీసి, ఆచరణలో పెట్టాలి. చేసే పని ఏదైనా 100 శాతం పరిపూర్ణంగా, ఉత్తమంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలి. ఎవరో ఆదేశించారని ఇష్టం లేని పనులు బలవంతంగా చేయొద్దు. దానివల్ల పరిపూర్ణత రాదు. మీరు ప్రేమించే, కోరుకొనే పనులను ఇష్టంతో చేయండి. వాటిలో పరిపూర్ణత సాధించండి. చేసే పనులను ఎల్లప్పుడూ సరైన విధంగానే చేయాలి. దగ్గరి దారులు, అడ్డ దారులు, దొంగ దారుల ద్వారా వెళ్లొద్దు. కష్టమైనా సరే సరైన మార్గంలోనే పయనించాలి. నన్ను ఎవరూ చూడటం లేదు కదా! నేను చేస్తుందే కరెక్టు.. అని భావిస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మీరు చేస్తున్న పనులను ఎవరూ చూడటం లేదని అనుకోవద్దు. ఒకరు మాత్రం కచ్చితంగా చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అదెవరో కాదు.. మీరే. ఇతరులు చూస్తున్నప్పుడు మీరెలా ప్రవర్తిస్తున్నారు అని కాకుండా.. ఎవరూ చూడనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టే మీ శీలాన్ని (క్యారెక్టర్) నిర్ణయించవచ్చు. ఎవరూ కనిపెట్టలేరు లే! అనే ఆలోచనతో విగ్రహాన్ని చెక్కుతుంటే.. అందులో చాలా తప్పులు దొర్లుతాయి. ఆ పనిలో లోపాలుంటాయి. చివరకు వాటిని సరిచేసేందుకు ఎక్కువ సమయం, శ్రమను వెచ్చించాల్సి వస్తుంది. మంచి శిల్పకారుడిగా మారాల్సిన మీరు కేవలం ప్యాచ్-అప్ ఆర్టిస్టుగా మిగిలిపోతారు. ఆశించిన ఎదుగుదల లేక జీవితం నిస్సారంగా మారిపోతుంది. మనిషి ప్రగతికి అతడిలోని స్కిల్ కాదు, ఆలోచనా దృక్పథమే ప్రధానం. శిల్పకారుడి దృక్పథాన్ని అలవర్చుకోవాలి. పనిలో పరిపూర్ణత సాధించాలి. లైఫ్‌ను ఒక మాస్టర్‌పీస్‌గా మార్చుకోవాలి. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో...