మృత్యువై కదలిన ఆధిపత్య క్రీడ | Civil war in Syria to dominant game | Sakshi
Sakshi News home page

మృత్యువై కదలిన ఆధిపత్య క్రీడ

Published Fri, Sep 11 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

మృత్యువై కదలిన ఆధిపత్య క్రీడ

మృత్యువై కదలిన ఆధిపత్య క్రీడ

సిరియా అంతర్యుద్ధం సృష్టించిన కల్లోలం ఆధునిక సమాజపు మానవత్వాన్నే ప్రశ్నిస్తోంది.  ఈ సంక్షోభానికి కారణమైన వారిదే పరిష్కారం బాధ్యత. అంతర్జాతీయ చట్టాల ప్రకారం శరణార్థులకు ప్రామాణిక హక్కులున్నా... పశ్చిమాసియా నుంచి ప్రాణభీతితో వస్తున్న వారిని  ఐరోపా అలా స్వీకరించడం లేదు. పైకి చూడటానికి ఇది ఈజిప్ట్, లిబియాల్లోని మార్పుల ప్రభావంగానో, సిరియా అంతర్యుద్ధం, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదాల ఫలితంగానో కనిపించవచ్చు. కానీ అసలు మూలం సామ్రాజ్యవాదశక్తుల దీర్ఘకాలిక ఆధిపత్య కుట్రే అనేది విస్పష్టం.  
 
 పదకొండు, సెప్టెంబర్, 1893.  అమెరికాలోని చికాగో నగరం. ప్రపంచ సర్వమత సమ్మేళనం వేదిక ‘కొలంబస్ హాల్’ ఒక ధీర గంభీరమైన స్వరం శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ‘‘...సహనాన్ని సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను.... సమస్త మతాల నుంచి, సమస్త దేశాల నుంచీ పర పీడితులై, శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తు న్నాను. రోమన్ల నిరంకుశత్వానికి గురై తమ దేవాలయాలు తుత్తునియలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను మా కౌగిట చేర్చుకున్నామని తెలపడానికి గర్విస్తున్నాను. జొరాస్ట్ట్రియ సంఘంలో మిగి లిన వారికి శరణొసగి, నేటికీ ఆదరిస్తున్న ధర్మం నా ధర్మమని గర్విస్తు న్నాను.’’ భారతదేశ సంస్కృతీసంప్రదాయ విలువల్ని విశ్వవ్యాప్తం చేసిన స్వామీ వివేకానంద ప్రసంగంలోని భాగమిది.
 
  ‘‘జాతులవైరం, శాఖాభి మానం, మతమౌఢ్యం, ఉగ్రవాదం వంటి అరిష్టాలు ఈ భూమిని సుదీర్ఘకా లంగా చెరబట్టాయి. హింస, విధ్వంసాలతో నేలను నెత్తురుమయం చేశాయి. నాగరికతను హననం చేసి దేశాలను ముక్కముక్కలు చేశాయి. లేకుంటే, మానవ జీవన వికాసం మరెంతో ఉత్కృష్టంగా ఉండేద’’న్నారు. ‘‘...ఈ దురా గతాలకు అవసాన సమయం ఆసన్నమైంది. ఈ మహాసభ గౌరవార్థం ఉద యం మోగించిన గంట స్వమత దురభిమానానికి, పరమత ద్వేషానికీ, కత్తితో గాని, కలంతో గానీ సాగించే నానావిధాల హింసకూ, ఆ లక్ష్యాల దిశగా కొందరిని సాగేలా చేసే నిష్టుర ద్వేషభావాలకూ మృత్యుఘంటిక కాగలదని మనఃస్ఫూర్తిగా ఆశిస్తున్నా’’నంటూ స్వామీజీ తన ప్రసంగాన్ని ముగించారు.
 
 122 సంవత్సరాలు గడిచింది. పరిస్థితి మారకపోగా, మరింత తీవ్రమైంది. ప్రపంచంలో పలుచోట్ల మతమౌఢ్యాలు, జాతి విద్వేషాలు, ఉగ్రదాడులు, అంతర్యుద్ధాలు, జాతుల పోరాటాలు చెలరేగుతున్నాయి. సిరియాలో జరుగుతున్న మారణకాండకు లక్షలాది మంది ప్రాణాలు అరచేత పట్టుకొని మధ్యదరా తీరం వెంబడి యూరప్‌వైపు పరుగులు తీస్తున్న తీరు, వందలాదిగా జలసమాధి అవుతున్న తీరు కన్నీరు పెట్టిస్తోంది. సిరియాలో దాదాపు సగం జనాభా.. కోటీ యాభై లక్షల మంది దేశం వీడి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్న దుస్థితి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ పటంపై ఇంతటి భయానక దృశ్యం కానరావడం ఇదే!
 
 ఒక్క ఫొటో ప్రపంచాన్నే కదిలించింది
 నీలం చొక్కా, ఎర్ర టీషర్ట్ ధరించి టర్కీ తీరాన నిద్రపోతున్నట్టున్న మూడేళ్ల సిరియా పసివాడు ఆయలాన్ కుర్దీ శవం యావత్ప్రపంచాన్ని కలచివేసింది. ముఖ్యంగా ఐరోపా సమాజాన్ని కదిలించింది. సిరియా, మధ్యప్రాచ్యాల నుంచి వస్తున్న శరణార్థులకు ఆశ్రయమిచ్చే నూతన విధానాల రూపకల్పనకు యూరోపియన్ యూనియన్ ఆంతరంగిక మంత్రి మండలి ఈ సోమవారం అసాధారణ భేటీ జరపనుంది. సిరియాలో నాలుగేళ్లుగా సాగుతున్న నరమే ధం ఇప్పుడు భీతావహ స్థితికి చేరింది. ఈ అంతర్యుద్ధం సృష్టించిన కల్లోలం ఆధునిక సమాజపు మానవత్వాన్నే ప్రశ్నిస్తోంది. ఇప్పటికే దాదాపు రెండున్నర లక్షల మంది సిరియన్లు అక్కడే నిష్కారణంగా దుర్మరణం పాలయ్యారు.
 
 దేశం వీడితేనైనా ప్రాణాలు దక్కుతాయనుకున్న వారిలో వేలాది మంది స్మగ్లర్ల వంచనకు గురవుతున్నారు, ముష్కరుల చేతుల్లో హతమవుతున్నారు. కిక్కిరిసిన పడవలో, మోటారు బోట్లో ఎక్కినవారు... జలసమాధి అవుతు న్నారు. కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకున్న లక్షలాది మంది ఐరోపా దేశా ల శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటున్నారు. వలస వచ్చేవారిపై విధించిన సంఖ్యాపరమైన ఆంక్షలను ఐరోపా దేశాలు ఇప్పుడిప్పుడే సడలిస్తున్నాయి. ఇప్పటికే జర్మనీ ఏటా ఐదు లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తామని ప్రకటిం చింది. బ్రిటన్, ఫ్రాన్స్‌లు సైతం అలాంటి ప్రకటనలు చేశాయి. అమెరికా  సానుకూలతను తెలిపింది. రోజూ మూడు వేల మంది మేర మూడు నాలుగు మాసాలపాటు ఐరోపాకు ఈ తాకిడి తప్పదని ఐరాస తెలిపింది.
 
 శరణార్థుల్ని వలసదారులంటే ఎలా?
 మెరుగైన జీవనం కోసం వలసవచ్చే వారికి, నిర్వాసితులై ప్రాణాలు అరచేత పట్టుకొని వచ్చే శరణార్థులకు చాలా వ్యత్యాసముంది. అయినా శరణార్థులకు ఆశ్రయం ఇస్తే జనాభా నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసాలు తలెత్తుతాయని ఐరోపా దేశాలు, ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్‌లు భయపడుతున్నాయి. పైగా ఇస్లామిక్ ఉగ్రవాదం ఆ దేశాలను వణికిస్తోంది. వేర్వేరు పరిస్థితుల్లో ఐరోపాకు వచ్చి, స్థిరపడ్డ వారితో, ముఖ్యంగా ముస్లిం జనాభా పెరుగుదలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారి వాదన. అందుకే పశ్చిమాసియా శరణార్థులను కూడా ఐరోపా దేశాలు, ప్రసారమాధ్యమాలు తరచూ ‘వలస దారుల’నే అంటున్నాయి. వారిని శరణార్థులనడానికి తేలికగా అంగీకరించ టంలేదు.
 
 స్వదేశంలో కంటే మెరుగైన జీవన ప్రమాణాలకోసం ఇతర దేశా లకు అక్రమంగా వలస వచ్చేవారిని స్వదేశాలకు తిప్పి పంపే ఇమిగ్రేషన్ నిబంధనలుంటాయి. కానీ, శరణార్థులంటే అంతర్యుద్ధంలోనో, జాతుల పోరాటాల్లోనో, ఆర్థిక అత్యయిక పరిస్థితుల్లోనో తమ దేశంలో ప్రాణాలకు ముప్పున్నపుడు ఇతర దేశాల్లో తలదాచుకునే వారని నిర్వచించారు. వివిధ దేశాల చట్టాలు, నిబంధనల ప్రకారం అలాంటి వారికి గుర్తింపు, సదుపా యాలు లభిస్తాయి. 1951 శరణార్థుల సదస్సు, 1967 ప్రొటోకాల్ ప్రకారం అంతర్జాతీయ న్యాయ చట్టం కింద శరణార్థులకు ప్రామాణిక హక్కులున్నా యి. ఐరోపా కంటే టర్కీ, లెబనాన్, జోర్డాన్‌లకే వీరి తాకిడి ఎక్కువ.
 
 దుశ్చర్య ఎవరిది? బాధితులెవరు?
 సమస్యకు మూలమైన వారే పరిష్కారానికి, సంక్షోభ నివారణకు బాధ్యత తీసుకోవాలి. పశ్చిమాసియా శరణార్థుల తాకిడి ఐరోపా దేశాల ఆహార భద్ర తకు ముప్పుకావచ్చని ఐరాస ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) హెచ్చ రిస్తోంది. ఆవాసం, వైద్య సదుపాయాల విషయంలోనూ సమస్యలు తలెత్త వచ్చు. అమెరికా, దాని సామ్రాజ్యవాద మిత్రులైన నాటో దేశాల ఆధిపత్య కాంక్ష నేటి దుస్థితికి ప్రధాన కారణమని ప్రపంచానికి తెలుసు. బయటకు చూడటానికి ఇది ఈజిప్ట్, ట్యునీసియా, లిబియా వంటి దేశాల్లో వచ్చిన ప్రజా స్వామిక మార్పుల ప్రత్యక్ష ప్రభావం లాగానో, పరస్పర ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం-ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదం లాగానో, తిరుగుబాట్ల వల్ల సిరి యాలో తలెత్తిన అంతర్యుద్ధంలాగానో కనిపించినా... దీని వెనుక ఉన్న సామ్రాజ్యవాద శక్తుల దీర్ఘకాలిక కుట్ర విస్పష్టం. తమ ఆధిపత్యం కోసం నియంతల్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందెవరు? అన్నది ప్రధాన ప్రశ్న. అమెరికాకు తోడు ఐరోపాలోని బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల సామ్రాజ్య విస్తరణవాద ధోరణుల విషపుత్రికలే ఇవి. తమ ఆధిపత్యం కోసం... ఒకే భాష, ఒకే సంస్కృతి గల వారిని విడగొట్టడం, జాతి విద్వేషాల్ని రగల్చడం, పశ్చిమాసియా, మధ్యప్రాచ్యాల సరిహద్దులను ఇష్టానుసారంగా మార్చడం అశాంతికి దారితీస్తున్నాయి.
 
 ఈ కుటిల నీతిమూలాలు తెలియాలంటే, నూరే ళ్లు వెనక్కివెళ్లాలి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో సామ్రాజ్యవాదశక్తుల మధ్య 1916లో జరిగిన ‘సైకస్-పికో’ ఒప్పందాన్ని ఆసియా మైనర్ ఒప్పం దం అంటారు. ఫ్రాన్స్, బ్రిటన్‌ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ద్వారా ఒటోమెన్ సామ్రాజ్యానికి గండికొట్టి, అరబ్ ద్వీపకల్పం బయటి మధ్యప్రాచ్య భూభాగంపై ఆధిపత్యాన్ని బ్రిటన్-ఫ్రాన్స్‌లు పంచుకున్నాయి. అవే ఆధిపత్య ధోరణులు ఇంకో రూపంలో మళ్లీ తెరపైకొస్తున్నాయి. అందుకే ఈ రావణ కాష్టానికి మూలం నేటి ‘రెండవ సైకస్-పికో’ ఒప్పందమే అనాలి. సిరియా- టర్కీ-ఇరాక్ దేశాల సరిహద్దులను మార్చి నేడు ఈ మంటలను రేకెత్తించారు. దీని ఉప ఉత్పత్తే ఐఎస్‌ఐఎస్. విడగొట్టి విధ్వంసాల్ని, కలిపి కల్లోలాల్ని సృష్టిస్తూ మానవాళిని అశాంతిలోకి నెడుతున్నారు.
 
పాఠం నేర్వకుంటే ఫలితం సున్నా!
 దౌత్యం దాడులైనా, సార్వభౌమాధికారంపై స్వారీ అయినా, సంస్కృతిని, సరి హద్దుల్ని చెరచడమైనా, జాతి మత విద్వేషాల్ని రగిల్చి సామ్రాజ్యవాదాన్ని బలోపేతం చేయడమైనా... ఏదైనా, గతం నుంచి పాఠాలు నేర్చి, వర్తమా నాన్ని దిద్దుకుంటేనే భవిష్యత్తు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ‘ధరాతలమంత తడిసె రక్తమున, కాదంటే కన్నీళ్లతో...’ అతిశయోక్తేం కాదు. అశక్తుల నెత్తు టితో నేలను తడుపుతున్న క్రమంలోనే ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఉపద్రవాలు ముంచెత్తుతున్నాయి. ఉగ్రవాదం మారణహోమాలను రగిలిస్తోం ది. చమురు నిక్షేపాలపై ఆధిపత్యానికి కన్నేసి, విషపూరిత అణ్వాయుధాలతో సద్దాం హుస్సేన్ దాడికి యత్నిస్తున్నారనే మిషతో పెద్దన్న అమెరికా, ఇరాక్‌పై దాడులు చేసి విధ్వంసం సృష్టించింది. ఐరాసనూ లెక్కచేయలేదు.
 
అమెరికా ఆరోపణలకు ‘అలాంటి ఆధారాలేవీ లేవ’ని బ్రిక్స్ కమిషన్ తేల్చినా ఖాతరు చేయలేదు. అమెరికాతో చేయికలిపిన బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీల దుష్ట మూక ధ్వంస రచనకు తలపడింది. ఇక రష్యామీద వైరంతో అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లను పెంచి పోషించింది అమెరికా కాదా? అల్‌కాయిదా ఎలా పుట్టిం దో ఎవరికి తెలియదు? ఈ విపరిణామాలకు పుట్టిన ఉగ్రవాద వికృత చేష్టే... ప్రపంచవాణిజ్య కేంద్రం టవర్లపై వైమానిక దాడి. పద్నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా, మన స్మృతిపథాన్ని వీడని పీడకల, మూడున్నర వేల మందిని పొట్టనపెట్టుకున్న దుర్దినం...11 సెప్టెంబరు, 2001.  
 - దిలీప్ రెడ్డి
  ఈమెయిల్: dileepreddy@sakshi.com                                 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement