
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా(Rekha Gupta) బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఢిల్లీ రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ప్రతీనెల రూ. 2,500 అందించనున్నట్లు ప్రకటించింది. దీనిపై నూతన సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటుందన్నారు. మహిళలకు మార్చి 8న రూ.2,500 మొత్తాన్ని వారి ఖాతాల్లోకి జమచేయనున్నట్లు తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) మొన్నటి ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ. 2,100 ఇస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో బీజేపీ రూ. 2,500 ఇస్తామని ప్రకటించింది. బుధవారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సీఎంగా రేఖా గుప్తా పేరును ప్రకటించిన అనంతరం ఆమె మాట్లాడుతూ బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందన్నారు.
ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలివే..
మహిళలకు నెలకు 2500 రూపాయలు
రూ. 500కే సిలిండర్. హోలీ, దీపావళికి ఒక్కో సిలిండర్ ఉచితం
గర్భిణీ స్త్రీలకు రూ.21 వేలు సాయం. ఆరు పోషకాహార కిట్లు అందజేత
మురికివాడల్లోని ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం
ఢిల్లీ పౌరులందరికీ ఉచితంగా రూ. 10 లక్షల మేరకు విలువైన వైద్య చికిత్స
ప్రధాని నరేంద్ర మోదీ కలను సాకారం చేయడం అనేది ఢిల్లీలోని 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల బాధ్యత అని రేఖా గుప్తా మీడియాతో అన్నారు. మహిళలకు ఆర్థికంగా సహాయం అందించే మా వాగ్దానాలన్నింటినీ మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. మార్చి 8 నాటికి డబ్బు ఖచ్చితంగా వారి ఖాతాలకు బదిలీ చేస్తాం’ అని అన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly elections) 70 స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దశాబ్దాల ఆప్ పాలనకు బీజేపీ ముగింపు పలికింది.
ఇది కూడా చదవండి: Delhi: కొత్త సీఎం రేఖా గుప్తా కుమారుని వీడియో వైరల్