ఆత్మహత్యకు అనుమతి ఇవ్వరూ... | Will give permission to suicide ? | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు అనుమతి ఇవ్వరూ...

Published Sun, Aug 9 2015 11:10 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Will give permission to suicide ?

నాందేడ్ : వ్యవసాయ సాగు నిమిత్తం తనకు పంట రుణాలు అందజేయాలని వేడుకున్న ఆ మహిళా రైతుకు ఎస్‌బీఐ బ్యాంక్ అధికారులు మెండిచేయి చూపారు. మనస్తాపానికి గురైన ఆమె తనకు ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం లేద ని, తన బాధను అర్థం చేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంతి, హోం మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చింది. ఈ ఘనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాందేడ్ జిల్లా హిమాయత్‌నగర తాలూకాలోని ఎకాంబా గ్రామానికి చెందిన మహిళా రైతు ఇందుమతీ కంధారేకు సుమారు 3 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిపై నాలుగేళ్ల కిందట బ్యాంకులో రూ.1.60 లక్షల పంట రుణం తీసుకుంది.

పలు కారణాలతో బ్యాంకులో తీసుకున్న అప్పు కట్టెలేదు. ఇంతలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్ణవీస్ రైతు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వ ర్షాలు కురవని జిల్లాలను గుర్తించి అక్కడ కృత్రిమ వర్షాలు కురుపించే ఏర్పాట్లు చేస్తామని, రైతులు విత్తనాలు నాటాలని సూచించారు. రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఆశలు చిగురించిన ఆ మహిళ రైతు ఇందుమతీ తన ఖాతా ఉన్న తాలూకాలోని ఎస్‌బీఐ బ్యాంకును సంప్రదించింది. రుణం కోసం రెండు వారాలుగా బ్యాంకు చుట్టు తిరిగింది. అయితే ‘గతంలో తీసుకున్న రుణం చెల్లించలేదని, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు’ అని అవహేళన చేయడంతో మనస్తాపానికి గురైనట్లు ఆ మహిళా రైతు తెలిపారు. తనకు మరణం తప్ప మరో శరణ్యం లేదని, ఆత్యహత్యకు అనుమతులు ఇవ్వాలని శనివారం సాయంత్రం మహిళ రైతు ఇందుమతీ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్ణవీస్, హోం శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులకు తహసీల్దార్ కార్యాలయం ద్వారా వినతిపత్రం పంపించారు.

ఈ వివాదం హిమాయత్ నగర తహసీల్ కార్యలయం నుంచి నాందేడ్ జిల్లా కలెక్టర్ సురేష్ కాకాని అందింది. సమాచారం అందుకున్న కలెక్టర్ సురేష్ కాకాని సోమవారం వరకు దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని తహసీల్దార్ కార్యాలయం, తాలూకా పోలీస్ విభాగాలను ఆదేశించారు. ఈ వివాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14న బ్యాంకర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని సీఈటీయూ జిల్లా అధ్యక్షుడు దింగబర్ కాలే ప్రకటించారు. ఇందుమతి వివాదంపై సదరు బ్యాంక్ మేనేజర్ కిషోర్‌చంద్ జైన్ మాట్లాడుతూ ‘సదరు మహిళ తమ బ్యాంకుకు వచ్చిన మాట నిజమేనని... అయితే తాము రుణం ఇవ్వమని చెప్పలేదు..’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement