రామాయంపేట (మెదక్): కాళేశ్వరం కాలువ నిర్మిస్తే తనకు ఉన్న కొద్దిపాటి భూమి పోతుందనే ఆందోళనతో గుండెపోటుకు గురై ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో చోటుచేసుకుంది. కాళేశ్వరం కాలువల కోసం రాయిలాపూర్ శివారు నుంచి సర్వే నిర్వహిస్తున్నారు.
మూడ్రోజుల క్రితం హద్దులను నిర్ణయిస్తున్న అధికారుల వద్దకు వెళ్లిన మహిళా రైతు పోచమైన భూదవ్వ (65).. కాలువ నిర్మాణంతో తనకు ఉన్న 18 గుంటల భూమి పోతుందని అధికారుల వద్ద విలపిస్తూ తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
ఈ క్రమంలో ఆదివారం సర్వే పనులు జరుగుతున్న ప్రాంతానికి భూదవ్వ వెళ్తుండగా గుండెపోటుకు గురై రోడ్డుపై కుప్పకూలింది. దీంతో గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందింది. భూదవ్వ భర్త గతంలోనే ఆమెను విడిచి వెళ్లిపోయాడు. 15 ఏళ్ల క్రితం ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా మృతి చెందాడు. దీంతో మనువడు, మనువరాలు ఆమెపై ఆధారపడి బతుకుతున్నారు. నానమ్మ మృతితో విలపిస్తున్న ఆ చిన్నారులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment