రైతు గొంతుక | For two Decades Farmers Succumbed to Suicides | Sakshi
Sakshi News home page

రైతు గొంతుక

Published Mon, Apr 15 2019 1:36 AM | Last Updated on Mon, Apr 15 2019 1:38 AM

For two Decades Farmers Succumbed to Suicides - Sakshi

వైశాలి సుధాకర్‌ ఎడె 28 ఏళ్ల యువతి. మహారాష్ట్ర మహిళ. రైతుల కోసం గళమెత్తిన రైతు భార్య. యావత్మల్‌– వాశిమ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నేల తల్లి బిడ్డ. ‘ఫైట్‌ ఫర్‌ కాజ్‌’ అంటూ ఎన్నికల బరిలో దిగిన ధీశాలి గురించి... ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ముగిసిన సందర్భంగా చెప్పుకోవలసిన విశేషాలు చాలానే ఉన్నాయి. 

వైశాలిది యావత్మల్‌ జిల్లాలోని రాజూర్‌ గ్రామం. అది విదర్భ రీజియన్‌లో ఉంది. ఏ శాపం పీడిస్తుందో తెలియదు కానీ అక్కడి మహిళల్లో ఎక్కువ మంది భర్తను భూమాతకు అప్పగించి ఒంటరిగా బతుకీడుస్తున్నవాళ్లే. పుట్టెడు ధాన్యమిచ్చి బతుకును పండించాల్సిన భూమి తల్లి.. బతుకును బలి కోరుతుంటే ఆపగలిగిన శక్తి ఎవరికుంటుంది? ‘అంతా విధి రాత’ అని నుదురు కొట్టుకుంటూ బీడు వారిన భూమిలో భర్త వదిలి వెళ్లిన వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న మహిళలే కనిపిస్తారు... అక్కడ ఎటు చూసినా. దాదాపు రెండు దశాబ్దాలుగా రైతుల ఆత్మహత్యలతో అతలాకుతలమై పోయింది యావత్మల్‌ జిల్లా. సరాసరిన రోజుకో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు! అలాంటి క్లిష్టమైన సమయంలోనే వైశాలికి పెళ్లయింది. సినిమా కథలాగ పెళ్లితో సుఖాంతం అయిన జీవితం కాదామెది. తన జీవితం కష్టాల కడలిగా మారిందని పెళ్లి తర్వాతే తెలిసిందామెకి.

కొండంత అప్పు
ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లాలో 92వ మరాఠీ లిటరరీ మీట్‌ ‘అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్‌’ జరిగింది. జనవరి 11వ తేదీన మొదలైన మూడు రోజుల సదస్సును ప్రారంభించడానికి వైశాలికి ఒక ఆదర్శ మహిళగా ఆహ్వానం వచ్చింది. సదస్సులో ఆమె ప్రసంగం ఇలా సాగింది.‘‘మా సొంతూరు దోంగార్‌ ఖర్దా. మా తల్లిదండ్రులు వ్యవసాయకూలీలు. నాకు పద్దెనిమిదేళ్లకు పెళ్లయింది. టెన్త్‌ క్లాస్‌ చదివానంతే. అత్తగారిల్లు పెద్ద ఉమ్మడి కుటుంబం. మొత్తం పద్నాలుగు మంది ఉండేవారు. తొమ్మిదెకరాల పొలం ఉంది. రైతు కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టడం నా అదృష్టం అని మురిసిపోయారు మా అమ్మానాన్న. మా అత్తగారింట్లో అందరూ పొలం పనులు చేసేవాళ్లు. నా భర్త కూడా వ్యవసాయం చేసేవాడు. పెళ్లయిన ఏడాదికి బాబు పుట్టాడు. వ్యవసాయం యేటికేడాది కష్టంగా మారిపోయింది. పత్తి, చెరకు పంటలు చేతికి రాలేదు. వరుసగా రెండేళ్లు పంట దిగుబడి లేదు. పంటలు వేయడానికి తెచ్చిన అప్పులు కొండలా పెరిగిపోయాయి. బ్యాంకు అప్పు అలాగే ఉంది. రెండోసారి షావుకారు నుంచి అప్పు తెచ్చి పంట వేశారు. వడ్డీతో కలుపుకుని అప్పు  పెరిగిపోతోంది. షావుకారు నుంచి ఒత్తిడి కూడా పెరిగింది.

ఇంట్లో అందరి ముఖాల్లో ఒకటే దిగులు. బాబు పుట్టిన తర్వాత రెండేళ్లకు.. అంటే 2011లో నాకు మళ్లీ గర్భం వచ్చింది. నేను మా పుట్టింటికి వెళ్లాను. ఓ రోజు మా వారు నన్ను చూడడానికి మా పుట్టింటికి వచ్చారు. ఆ ఏడాది కూడా పంట వస్తుందన్న ఆశలేదని బాధగా చెప్పాడు. కానీ ఆ రోజు నాతో చాలా బాగున్నాడు. బాబు జాగ్రత్త, అని నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని మళ్లీ మళ్లీ చెప్పి ఊరికెళ్లాడు. ఆ మరుసటి రోజే వినరాని వార్త... ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు’’ అని వైశాలి మాట్లాడుతుంటే.. సాహిత్య సదస్సుకు హాజరైన అతిథుల గుండె బరువెక్కింది. ప్రాంగణం అంతా నిశ్శబ్దం ఆవరించింది. భర్త పోయిన తర్వాత ఇద్దరు పిల్లలతో బతుకు పోరాటం చేస్తున్న ఒక యోధను చూస్తున్నారు వాళ్లంతా. ఆమె ప్రసంగం పూర్తి కాగానే సభికులంతా కన్నీళ్లు తుడుచుకుంటూ చప్పట్లతో ఆమెను అభినందించారు. 

భర్త అప్పగించిన బాధ్యత
ఇరవై రెండేళ్లలోపే భర్త పోయాడు. ఇద్దరు పిల్లలను (కునాల్, జాహ్నవి) పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత కళ్ల ముందు కనిపిస్తోంది వైశాలికి. అంతకంటే ముందు మా అప్పు సంగతేంటని షావుకారు మనుషులు వచ్చి గుర్తు చేసి పోతున్నారు. కుటుంబ యజమాని మరణిస్తే ప్రభుత్వం సహాయంగా ఇచ్చే లక్షరూపాయలను అప్పులోకి జమ చేసింది. అయినా తీరలేదు, ఇంకా మిగిలే ఉన్నాయి. తన బంగారు అమ్మేసి మిగిలిన అప్పులు తీర్చింది. టైలరింగ్‌ నేర్చుకుంది. పంటలు లేక పేదరికం తాండవిస్తున్న ఊర్లో ఎంత మంది కొత్త దుస్తులు కుట్టించుకోగలుగుతారు, పగలు రాత్రి కష్టపడాలని వైశాలికి ఉన్నా చేతి నిండా పని దొరకడమూ కష్టమే. ఆ ఊరికి అంగన్‌వాడీ సెంటర్‌ వచ్చింది. 2013లో అంగన్‌వాడీ వర్కర్‌గా చేరింది. అప్పట్లో నెలకు రెండు వేలిచ్చేవాళ్లు. ఇప్పుడు మూడున్నర వేలు చేశారు. బతుకు బండి అయితే ఎలాగోలా సాగిపోతోంది.

అంగన్‌వాడీ సెంటర్‌ చూసుకుంటూ, తన పిల్లలను పోషించడంతోపాటు ఆత్మహత్య చేసుకున్న రైతుల భార్యలకు మాట సాయం చేయడం, వాళ్లను గవర్నమెంట్‌ ఆఫీసుకు తీసుకెళ్లి రావాల్సిన డబ్బు ఇప్పించడం వంటి సహాయం చేస్తోంది వైశాలి. ఆ చుట్టు పక్కల గ్రామాలకు ఆమె ఒక రోల్‌ మోడల్‌గా మారింది. ఆమెకి సాహిత్య సదస్సులో ప్రసంగించడానికి ఆహ్వానం కూడా అప్పుడే వచ్చింది. ఆ ప్రసంగం అంతా ఆమె పదేళ్ల జీవితమే. పద్దెనిమిదేళ్లకు పెళ్లయితే ఇరవై ఎనిమిదేళ్ల లోపు ఆమె పడిన కష్టాలే ఆమె ప్రసంగం. ఎదురీదుతూ నిలిచిన తీరే ఆమెలో రగులుతున్న స్ఫూర్తికి నిదర్శనం. ఇంతలో పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చాయి.

కష్టాలే అనుభవాలు
ఓ రోజు ప్రహర్‌ జన్‌శక్తి పక్ష (పి.జె.పి.) అధ్యక్షుడు ఓమ్‌ ప్రకాశ్‌ బాబారావ్, మరికొందరు నాయకులతో కలిసి వైశాలి ఇంటికి వచ్చారు. యావత్మల్‌ వాశిమ్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేయమని వాళ్ల ప్రతిపాదన. ఆమె మొదట ఆశ్చర్యపోయింది. ‘‘నాకు రాజకీయాలు తెలియవు, పంచాయితీ సర్పంచ్‌ కాదు కదా కనీసం వార్డు మెంబర్‌గా కూడా చేయలేదు. ఏకంగా లోక్‌సభ సభ్యత్వానికి పోటీ చేయమంటున్నారు’’ అని సందేహం వ్యక్తం చేసిందామె. ‘‘మన కష్టాలే మన అనుభవాలు. అంతకంటే పెద్ద పాఠం ఏముంటుంది నేర్చుకోవడానికి’’ అని ఒప్పించారామెని బాబారావు. ‘‘ప్రజలకు రైతుల కష్టాలను విడమరిచి చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు.

రైతుల అవసరాలను తీర్చడానికి ఉద్యమించాల్సిన రాజకీయ పార్టీలు ఆ పని చేయకపోతే మనలాంటి సామాన్యులే ఉద్యమిస్తారని రాజకీయ పార్టీలకు తెలియాలి’’ అని ప్రోత్సహించారాయన. ‘రైతు కుటుంబంలో పెరిగిన వాళ్లకు రైతుల స్థితిగతులు, రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి ఎదురయ్యే దుర్భరమైన పరిస్థితుల గురించి ఒకరు చెప్పాల్సిన పని లేదు. వాటినే చట్టసభలో మాట్లాడాలి. ఇందుకు నాకున్న అనుభవం నా జీవితమే. రైతుల కష్టాలను పెద్ద సభలు గుర్తించి పరిష్కరించడం కోసమే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా పోరాటంలో నేను విజయవంతమవుతాను’ అని తన తొలి ఎన్నికల సభలో అన్నారు వైశాలి.

ఓటర్లే విరాళాలిచ్చారు
వైశాలి ఎన్నికల ప్రచారం మార్చి 28వ తేదీన మొదలైంది. బస్సు, ఆటో రిక్షా, కాలి నడకన గ్రామాలను చుట్టేస్తోంది. గ్రామసభల్లో మాట్లాడుతోంది. ‘‘నాకు అవకాశం వస్తే... రైతుల ఆత్మహత్యలకు కారణాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాను. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఒక నిధిని ఏర్పాటు చేసి ఆదుకోవాలని, అందుకోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరతాను. చట్టం వచ్చే వరకు పోరాడతాను’’ అని భరోసా ఇస్తోంది. భర్తను కోల్పోయిన మహిళలతోపాటు అనేక రైతు కుటుంబాలు కూడా వైశాలికి మద్దతిచ్చాయి. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆమె ఎన్నికల ఖర్చు కోసం విరాళాలిచ్చారు.

రూపాయి నుంచి యాభై వేల రూపాయల వరకు విరాళాలు వచ్చాయి. రూపాయి, ఐదు, పది రూపాయలు ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత విరాళాల డబ్బాలో వేశారు. దుబాయ్‌ నుంచి ఒక దాత ఐదు వేలిచ్చాడు. నాసిక్‌ నుంచి రైతులు  యాభై ఒక్క వేల రూపాయలు సమీకరించి, ఆ మొత్తాన్ని పంపించారు. షోలాపూర్‌ నుంచి ఒక రైతు పది బస్తాల ధాన్యం, గోధుమలు ఇచ్చాడు. గుజరాత్‌ నుంచి ఇంకో రైతు ప్రహర్‌ జన్‌శక్తి పక్ష పార్టీ ఆఫీసుకు ఫోన్‌ చేసి వైశాలి బ్యాంకు అకౌంటు వివరాలు తెలుసుకుని నగదు జమ చేశాడు. అలా మొత్తం ఐదు లక్షల రూపాయలు సమాకూరాయి.

మీడియా వెతుక్కుంటూ వచ్చింది
వైశాలి తన ప్రచారంలో ఎప్పుడూ మీడియా సహాయం కోరలేదు. గ్రామాలు తిరుగుతూ రైతు కుటుంబాలను కలవడమే తప్ప మీడియాలో ప్రకటనలు కూడా ఇవ్వనే లేదు. అలాగని మీడియా మిన్నకుండిపోలేదు. ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటారో వెతికి పట్టుకునే పనిలో పడింది. స్థానిక, జాతీయ మీడియా సంస్థలు ఆమె ప్రచారంలో ఉంటే ఎప్పుడు ఏ గ్రామంలో దొరుకుతారో తెలుసుకుని మరీ ఆమె ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టాయి. వాళ్లకు ఆమె చెప్పిన మాట ఒకటే... ‘‘2001 నుంచి ఇప్పటి వరకు యావత్మల్‌ జిల్లాలో 4,265 మంది, వాసిమ్‌ జిల్లాలో 1,523 మంది రైతులు మరణించారు.

మరణించిన వాళ్లకు లక్ష పరిహారం ఇవ్వడంతో ప్రభుత్వం బాధ్యత తీరిపోతుందా? మన వ్యవసాయ దేశంలో రైతు జాతికి అన్నం పెట్టాలి తప్ప రైతు అన్నం లేక చచ్చిపోకూడదు. మేము పోరాడుతున్నాం, ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెడతామా లేదా అనేది కాదు. మా పోరాటం ఒక మంచి సామాజిక అవసరం కోసం. ఆ అవసరాన్ని దేశం గుర్తించే వరకు పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మేము విజయం సాధిస్తాం. మా పోరాటం పార్లమెంటు స్థానం కాదు, ఒక సామాజిక అవసరత’’ అని!

కొత్త నాయకత్వానికి స్వాగతం
యావత్మల్‌– వాశిమ్‌ సిట్టింగ్‌ ఎంపీ శివసేన అభ్యర్థి భావనా గవాలి. ఆమె 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మూడోసారి బరిలో నిలిచారు. ఆమెకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మాణిక్‌ రావు ఠాక్రే. ఇద్దరూ కుంబి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 19 లక్షల ఓటర్లుండగా వారిలో ఆరు లక్షలకు పైగా ఓటర్లు కుంబి సామాజిక వర్గానికి చెందిన వారే. అందుకే గతంలో శివసేన ఆ సామాజిక వర్గం నుంచి భావనా గవాలిని నిలబెట్టి రెండుసార్లు గెలిపించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ మరో అడుగు ముందుకేసి కుంబి సామాజికవర్గంలోని ఉపవర్గం మీద దృష్టి పెట్టింది. కుంబిలోని తిరాలే ఉపవర్గానికి చెందిన ఠాక్రేకి టికెట్‌ ఇచ్చింది. ఎందుకంటే భావన గవాలి కుంబిలోని ఘటోలే ఉపవర్గానికి చెందిన వ్యక్తి. ఆ ఉపవర్గానికంటే తిరాలే ఉపవర్గం వాళ్లే ఎక్కువ.

గతంలో కాంగ్రెస్‌ ఆ స్థానం నుంచి శివాజీ రావు మోఘేను నిలబెట్టింది. అతడు కుంబి కులస్థుడు కాదు. దాంతో కుంబి సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా భావనకు పడ్డాయి. ఇప్పుడు కుంబిలో ఉన్న రెండు ఉపవర్గాలతో కొత్త సమీకరణకు తెర తీసింది కాంగ్రెస్‌ పార్టీ. ప్రధాన పార్టీలు ఇలా కుల సమీకరణల లెక్క చూసుకుంటున్నాయి తప్ప రైతుల సమస్యలను, ఆత్మహత్యలను పట్టించుకోవడం లేదు. ఒక నాయకుడు విఫలమైనప్పుడే సమాజం మరో నాయకుడిని స్వాగతిస్తుంది. అది మరోసారి ఇప్పుడు వైశాలి విషయంలో నిజమైంది. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో ఈ స్థానంలో 61.07 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రజలు రైతు పక్షాన ఉన్నారా లేక కుల సమీకరణల వ్యూహాల్లో కొట్టుమిట్టాడుతున్నారా? ఈ సందేహానికి సమాధానం... మే నెల 23 మాత్రమే చెప్పగలుగుతుంది.

– వాకా మంజులారెడ్డి

మాకు మేమే
ఓడిపోతాననే భయం లేదు. పోరాడుతున్నాను, పోరాడడానికి ధైర్యం ఉంది. ఎవరి కష్టం వాళ్లకే బాగా తెలుస్తుంది. మా కష్టం ఏమిటో, అదెంత తీవ్రంగా ఉంటుందో మాకంటే బాగా మరెవ్వరూ చెప్పలేరు. చెప్పడానికి ఎవరైనా పెద్ద మనసుతో ముందుకు వచ్చినా... నేలలో గింజలు వేసి అవి మొలకెత్తకపోతే మనసు ఎంత తల్లడిల్లుతుందో డబ్బున్న పెద్ద పెద్ద వాళ్లకెవ్వరికీ అర్థం కాదు. మొలకెత్తిన మొక్క వెన్ను తీయకుండా వడలిపోతే ఊపిరాడక ఛాతీ ఎలా పట్టేస్తుందో వాళ్లకు అనుభవంలోకి వచ్చి ఉండదు.

నీళ్లు లేక ఎండిన భూమి నెర్రలు బారుతుంటే మా గుండెలు నిలువునా చీలిపోతాయి, విచ్చిన పత్తి రాలిపోయి నేల పగుళ్లలోకి జారిపోతుంటే అరచేతులు అడ్డు పెట్టి ఆపుదామన్నంత ఆర్తి కలుగుతుంది. బతుకంతా తోడుగా ఉంటాడనుకున్న భర్త... ప్రకృతి మాత పెట్టిన పరీక్షలో ఓడిపోతే... ఇల్లాలు పడే ఆవేదన ఎవరికి అర్థమవుతుంది? ఆ కష్టాన్ని అనుభవించిన మాకు మాత్రమే ఆ కష్టాన్ని చెప్పడానికి మాటలు వస్తాయి. చట్టసభలో దేశమంతటికీ వినిపించేలా చెప్పగలిగిన స్వరం మా గొంతులకే ఉంటుంది. అందుకే ఈ పోరాటం. రైతుల శక్తి ఏమిటో దేశానికి చాటుతాం.

వైశాలి ఎడె, యావత్మల్‌– వాశిమ్‌ లోక్‌సభ అభ్యర్థి, 
ప్రహర్‌ జన్‌శక్తి పక్ష పార్టీ

యావత్మల్‌– వాశిమ్‌ లోక్‌సభ స్థానంలో శివసేన– కాంగ్రెస్‌ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. జనతాదళ్‌ (ఎస్‌), రాష్ట్రీయ బహుజన్‌ కాంగ్రెస్‌పార్టీ, గోండ్వానా గణతంత్ర పార్టీ, ప్రబుద్ధ రిపబ్లిక్‌ పార్టీ, వాంఛిత్‌ బహుజన్‌ ఆఘాదీ, బహుజన్‌ ముక్తి పార్టీ, సన్మాన్‌ రాజ్‌కీయ పక్ష, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, ప్రహార్‌ జన్‌శక్తి పార్టీలతోపాటు ఇండిపెండెంట్‌లు రంగంలో ఉన్నారు. మొత్తం 28 మంది అభ్యర్థులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement