కుటుంబానికి ఆధారమైన భర్త స్వర్గస్తుడయ్యాడని కుంగిపోలేదు. కుటుంబాన్ని ఎలా ఈడ్చాలా అని దిగులు చెందలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తలుచుకుని భయాందోళనకు గురికాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పట్టణంలో పుట్టి చదువుకున్న ఓ మహిళ కుటుంబ పోషణకు వ్యవసాయాన్ని ఆధారంగా ఎంచుకుంది. సొంత భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయంలో ఒడిదుడుకులు చవిచూస్తూ ఆదర్శ వ్యవసాయ మహిళగా ప్రజలు, పాలకులతో ప్రశంసలు అందుకుంటోంది నవరంగపూర్ పట్టణానికి చెందిన సీత. –జయపురం
నవరంగపూర్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సీహెచ్ నారాయణ రావు కుమార్తె సీత ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా యంత్రాంగం ఆదర్శ మహిళగా గుర్తించి సన్మానించింది. పట్టభధ్రురాలైన ఆమెకు 22 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన రవికుమార్‌తో వివాహం జరిగింది. ఒక కుమారుడు, కుమార్తె పుట్టిన తరువాత 18 ఏళ్ల క్రితం భర్త స్వర్గస్తుడయ్యాడు. దీంతో కుటుంబ జీవనోపాధికి నవరంగపూర్ నుంచి విశాఖపట్నానికి చింతపండు, అల్లం తీసుకువెళ్లి విక్రయిస్తుండేది. వ్యవసాయ జిల్లా అయిన నవరంగపూర్‌లో పుట్టి పెరగడంతో వ్యవసాయంపై మక్కువ ఉన్నా తగిన అవకాశం, ప్రోత్సాహం లేక వ్యాపారం చేస్తుండేది.
అయితే ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వారిని చూసి ప్రభావితురాలై తాను కూడా వ్యవసాయం చేయాలని నిర్ణయించింది. ఉత్సాహం అయితే ఉంది కానీ వ్యవసాయానికి అవసరమైన పంట భూమిలేదు. ఈ క్రమంలోభూమికోసం ప్రయత్నించి చివరికి నందాహండి సమితి దహనహండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి 6 ఎకరాల కొండ ప్రాంత మెట్ట భూమిని కౌలుకు తీసుకుంది. ఆ భూమిని బాగు చేసి వ్యవసాయానికి అనువుగా తయారు చేసి మొదటి సారిగా 6 ఎకరాలలో అల్లం పంట వేసింది. మొదటి సారి కావడం, వర్షాలు సహకరించక పోవడంతో దాదాపు 40 శాతం పంట కుళ్లిపోవడంతో నష్టం వచ్చింది.
అయినా ఆమె వెనుకంజ వేయకుండా రుణాలు తెచ్చి మళ్లీ అల్లం పంట వేసింది. అల్లంతో పాటు పలు మిశ్రమ పంటలను పండించింది. వ్యవసాయ రంగంలో అడుగుపెట్టిన తరువాత పాత పద్ధతుల్లో సాగు చేస్తే అంతగా లాభాలు రావన్న విషయం గ్రహించి ఆధునిక పద్ధతులు తెలుసుకోవాలని ప్రయత్నించింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో వ్యవసాయ వైజ్ఞానికులను కలిసి ఆధునిక పరిజ్ఞానం సంపాదించింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అల్లం, ఇతర పంటలకు శ్రీకారం చుట్టింది. ఆధునిక పద్ధతిలో పండించిన అల్లం ఒక మొక్కకు కేజీన్నర నుంచి రెండు కేజీల అల్లం ఉత్పత్తి కావడం ఆమె సాధించిన విజయమనే చెప్పవచ్చు. ఇలా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ లాభాలు ఆర్జిస్తూ మరో పదిమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
సహాయ సహకారాల్లేవు
వ్యవసాయానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని రైతులకు హామీలు ఇస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. కనీసం వ్యవసాయ వైజ్ఞానిక సహాయం కూడా లేదు. అందువల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైజ్ఞానిక పద్ధతులు తెలుసుకోవలసి వచ్చింది. నాలాంటి వారికి ప్రభుత్వం సహాయం అందజేస్తే మెరుగ్గా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment