పెంటకుప్పపై పారవేసిన శిశువును రక్షించిన మహిళలు
నేనింకా పూర్తిగా కళ్లు కూడా తెరవలేదు. ఈ లోకం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను భూమి మీదకి రాగానే ఎందుకు పెంటకుప్పలో విసిరేశారు. నేను ఆడపిల్లగా పుట్టడం నా తప్పా? క్షమించరాని నేరమా? అందుకే నన్ను విసిరేశారా? పెద్దయ్యాక మీకు చెడ్డ పేరు తీసుకువస్తానని ఆందోళన చెందారా? మీ పరువు ప్రతిష్టలు చెడగొడతానని ఎవరైనా భయపెట్టారా? నేను పెద్దయ్యాక బాగా చదువుకుని ఉన్నత విద్యావంతురాలినయ్యే దాన్నేమో? తల్లిదండ్రులు తలెత్తుకునేలా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకునేదాన్నేమో? అందరితోనూ బంగారు తల్లి అనిపించుకునేదాన్నేమో? ఎందుకు నన్ను విసిరేశారన్నట్లుగా నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ పట్టణంలోని డీఎన్‌కే జంక్షన్ గులిపట్న మధ్య గల ఒక పెంటకుప్పలో అప్పుడే పుట్టిన పసికందు రోదిస్తోంది.
జయపురం: కుటుంబ సమస్యలో? ఆర్థిక పరిస్థితులో? వివాహేతర సంబంధమో కానీ మానవత్వం మంటగలిసింది. నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ పట్టణంలోని డీఎన్‌కే జంక్షన్, గులిపట్న మధ్య గల ఒక పెంట కుప్పపై అప్పుడే పుట్టిన బిడ్డను మంగళవారం ఎవరో పెంటకుప్పలో పారవేసి వెళ్లిపోయారు. పెంట కుప్ప నుంచి ఆ శిశువు ఏడుపు విన్న పరిసర ప్రాంత మహిళలు అక్కడికి చేరుకుని పసికందును రక్షించి అక్కున చేరుకున్నారు. తరువాత ఉమ్మరకోట్ సామాజిక హాస్పిటల్‌కు తీసుకువెళ్లి డాక్టర్లకు చూపించారు. పసికందును పరీక్షించి ఆరోగ్యంగానే ఉందని, ఐసీయూలో ఉంచామని డాక్టర్‌లు వెల్లడించారు. ఎవరు ఆ శిశువును పెంటకుప్పపై పారవేశారు. అందుకుగల కారణం ఏమిటా అన్నది చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: నిండు గర్భిణిని 3 కి.మీ. నడిపించినందుకు..
పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి!
Comments
Please login to add a commentAdd a comment