భువనేశ్వర్: బెంగళూరులో సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు ముక్తి రంజన్ రాయ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఒడిషాలోని తన సొంత ఊరికి పారిపోయిన అతను.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళను చంపి ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ కేసులో ముక్తీ రంజన్ రాయ్‌ను తొలి నుంచి అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో భద్రక్(ఒడిషా) జిల్లా పాండి గ్రామానికి పారిపోయిన రాయ్.. సమీపంలోని కూలేపాడు గ్రామానికి వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు.
ఘటనా స్థలంలో ఓ స్కూటీ, అందులో నోట్ బుక్ ఉన్నాయని ఒడిషా పోలీసులు చెబుతున్నారు. అందులో మహాలక్ష్మిని తానే చంపానని, ఆ బాధతోనే బలవనర్మణానికి పాల్పడుతున్నట్లు ముక్తి రంజన్ రాయ్ రాసినట్లు నోట్ దొరికిందని తెలిపారు. అయితే.. బెంగళూరు పోలీసులు దీనిని ధృవీకరించుకోవాల్సి ఉంది.
గత శనివారం ఫ్రిజ్‌లో ఉన్న శవం వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. అయితే చాలా తొందరగానే బెంగళూరు పోలీసులు ఈ కేసును చేధించగలిగారు. సెప్టెంబర్ 1 నుంచి మహాలక్ష్మి మాల్‌కు వెళ్లడం లేదు. అదే రోజు నుంచి ముక్తి కూడా పనికి వెళ్లలేదు. బహుశా హత్య సెప్టెంబర్2వ తేదీనే జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
మహాలక్ష్మి(26) బెంగళూరులోని ఓ మాల్‌లో పని చేస్తోంది. భర్త నుంచి ఆమె దూరంగా ఉంది. ఈ క్రమంలో మాల్‌లోనే పని చేస్తున్న ముక్తి రంజన్‌కు దగ్గరైంది. అయితే గత కొంతకాలంగా మహాలక్ష్మి.. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని భర్త హేమంత్ దాస్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిపై కోపం పెంచుకున్న ముక్తి రంజన్.. ఆమెను కిరాతకంగా హత్య చేసి ఉంటాడని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment