
జయపురం/ఒడిశా: నవరంగపూర్ జిల్లాలోని డాబుగాం సమితి, ఘొడాఖంటి గ్రామపంచాయతీలో ఉన్న మఝిగుడ గ్రామ జీడిమామిడి తోటలో అనుమానాస్పదంగా యువతి లిలిఫా హరిజన్(22) మృతి చెందిన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. సరిగ్గా వారం రోజుల క్రితం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈమె ఒక్కసారిగా ఇలా విగతజీవిగా కనిపించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీడి చెట్టుపై కూర్చొని ఉన్నట్లుగా ఈమె మృతదేహం ఉండడంతో ఈమెని ఖచ్చితంగా ఎవరో హత్య చేసి ఉంటారన్న అనుమానాలకు బలం చేకూరుస్తుండడం విశేషం. ఒకవేళ ఈమె ఆత్మహత్య చేసుకుంటే చెట్టుకి మృతదేహం వేలాడుతుండాలి కదా.. అని కొంతమంది అంటుండగా, మరికొంతమంది ఎవరో ఈమెని హత్య చేసి సందేహం రాకుండా ఉండేందుకే ఇలా చెట్టుపై మృతదేహం ఉంచి వెళ్లారని ఆరోపిస్తున్నారు.
ఇదే విషయం తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు కూతురు మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని డాబుగాం ఆస్పత్రికి మృతదేహం తరలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. అయితే ప్రస్తుతం యువతి వారం రోజుల క్రితం ఎక్కిడికి వెళ్లింది.. ఆమె మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు డాబుగాం సబ్‌ఇన్‌స్పెక్టర్ కైలాస చంద్ర బెహరా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment