గ్రామస్తుల చేతిలో బంధీలైన ప్రేమికులు
సాక్షి, జయపురం(ఒడిశా): వేరువేరుగా వివాహాలు జరిగిన ఓ ప్రేమజంటను తాళ్లతో కాళ్లు, చేతులు కట్టి, గ్రామస్తులు బంధించారు. సుమారు 18 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి తీసుకువచ్చి, అందరి సమక్షంలో చితక్కొట్టారు. గ్రామ కోర్టు నిర్వహించి, వారిపై విచారణ జరిపి.. శిక్షించాలని తీర్మానించుకున్నారు. దీనిపై గ్రామానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి ముండిబెడ పంచాయతీలోని బాగబెడ గ్రామానికి చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి రెండేళ్ల కుమార్తె ఉంది. భర్త కుటుంబాన్ని పోషించుకొనేందుకు ఢిల్లీకి వలస కార్మికుడిగా వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఉన్న ఆమె.. అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇద్దరికీ అంతకుముందే వివాహాలు జరిగి ఉండటంతో దీనికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో 5 రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా గ్రామం నుంచి వెళ్లిపోయారు. బిడ్డను ఆమె అత్తమామల వద్ద విడిచిపోయారు.
విషయం బయటకు పొక్కడంతో గ్రామస్తులంతా జంటను వెతకడం ప్రారంభించారు. ఎట్టకేలకు డొంగరమెల గ్రామం వద్ద వారిని గుర్తించిన వ్యక్తులు.. గ్రామస్తులకు సమాచారం అందించారు. ఇరువురినీ తాళ్లతో బంధించి.. బైక్‌పై బాగబెడ గ్రామానికి తీసుకు వచ్చారు. గ్రామం మధ్యలో వారిని తీవ్రంగా కొట్టిన అనంతరం, ఏం చేయాలనే విషయంపై గ్రామకోర్టు నిర్వహించాలని తీర్మానించారు. అప్పటి వరకు యువకుడి మామ వద్ద ఇద్దరినీ ఉంచాలని ఆదేశించారు. అయితే జంటను బంధించి, కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న రాయిఘర్ పోలీసులు.. గ్రామానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment