ద్విచక్రవాహనం నడుపుతూ ఇలా
కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన భర్త.. కుటుంబ పోషణను భారంగా తలచి పిరికి వాడిలా పారిపోయాడు.. ఆమె ఆశలపై దాయాదులూ నీళ్లు చల్లారు. అయినా జీవితంలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంది. తండ్రి కష్టాన్ని పంచుకుని కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకుంది. ఐదుగురు చెల్లెళ్లను, తమ్ముడిని చదివించడమే కాదు... నలుగురు చెల్లెళ్లకు పెళ్లి చేసి అత్తింటికి సాగనంపింది. వ్యవసాయంపై మక్కువ పెంచుకుని సాగులో రాణిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అనిత విజయగాథ నేటి ‘నేను శక్తి’లో మీ కోసం..
అందరిలాగే ఆమెలో కూడా ఎన్నో ఆశలు. బాగా చదువుకోవాలని, ఉన్నతస్థాయి కొలువులు చేపట్టాలని భావించింది. అయితే అయిన వాళ్లే కాదన్నారు. అండగా నిలుస్తారనుకున్న బంధువులు ఛీదరించుకుని దూరమై పోయారు. వ్యవసాయం తప్ప అన్యమెరుగని తండ్రికి ఆరుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడం తలకు మించిన భారమే అయింది. ఇలాంటి తరుణంలో ఆ ఇంటి బరువు బాధ్యతలను ఆమె భుజాలకెత్తుకుంది. ‘నాన్నా.. నువ్వు భయపడొద్దు! నీకు తోడుగా నేనుంటాను’ అంటూ పలుగుపార చేతపట్టి పొలం పనుల్లోకి దిగింది. పంట సాగులోని మెలకువలను అవపోశన పట్టింది. తిరుగులేని మహిళా రైతుగా అతి చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకుని ‘నేను శక్తి’ అని నిరూపించుకున్న అనిత విజయగాథ మీ కోసం..
అనంతపురం , గుమ్మఘట్ట :మాదీ పెద్ద కుటుంబమే మాది గుమ్మఘట్ట మండలంలోని మారెంపల్లి గ్రామం. మా తల్లిదండ్రులు కురుబ మహదేవమ్మ, హనుమంతప్ప.మా నాన్న వాళ్లు ఐదుగురు అన్నతమ్ముళ్లు. మా నాన్నకు మేము మేము ఆరుగురం ఆడపిల్లలం. మాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. మేమంతా కలిసిమెలిసి ఉండేవాళ్లం. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మారెంపల్లిలోనే కొనసాగింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆవులదట్లలో చదువుకున్నాను. రోజూ మా ఊరి నుంచి మిగిలిన అమ్మాయిలతో కలిసి సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లి వచ్చేదాన్ని.
బైక్ నడుపుతుంటేవింతగా చూసేవారు
పొలానికి అవసరమైన మందులు, ఇతర పనులకు గ్రామంలోకి వెళ్లి రావాలంటే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సి వచ్చేది. ఆ సమయంలోనే మా నాన్న వద్ద ఉన్న బైక్‌ను నడపడం నేర్చుకోవాలని అనుకున్నాను. ఖాళీ సమయంలో దాన్ని నడిపేందుకు ప్రయత్నించి కిందపడి గాయపడేదాన్ని. అయినా అవసరం అన్నీ నేర్పించింది. కొన్ని రోజుల తర్వాత బైక్‌ను సులువగా నడపసాగాను. మా ఊళ్లో ఆడపిల్లలు బైక్ నడిపేవారు కాదు. నేను బైక్ తోలుతుంటే అందరూ ఆశ్చర్యంగా చేసేవారు. దీనిపై చాలా కామెంట్లు కూడా వచ్చాయి. అవి నన్ను కాస్త బాధపెట్టినా.. తర్వాత మెల్లిగా అలవాటైపోయింది. ఇప్పుడు మా అమ్మనాన్ననే కాదు. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వారిని దిగబెట్టి వచ్చేంందుకు బైక్‌పైనే తీసుకెళుతుంటాను.
ఉండేందుకు ఇల్లు కూడా లేదు
ఉమ్మడి కుటుంబంగా ఉంటూ వచ్చిన మేము విడిపోయిన తర్వాత ఒంటరితనం భయపెడుతూ వచ్చింది. ఆ సమయంలో మేము ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా పోయింది. భాగ పరిష్కారం కింద మా నాన్నకు వచ్చిన తొమ్మిది ఎకరాల పొలంలో రెండు చిన్న గదులు ఉన్న ఇల్లు ఉండేది. దాంట్లోకి మా నాన్న మకాం మార్చాడు. నిర్జన ప్రదేశంలో ఎప్పడు ఏం జరుగుతుందోననే భయం. ఆయన కష్టం చూస్తున్నప్పుడు లోలోన కుమిలిపోయేదాన్ని. ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారనే ఒకేఒక్క కారణంతోనే కదా మా తల్లిదండ్రులకు ఈ కష్టాలు అని తలుచుకుని కన్నీరు పెట్టేవాళ్లం. ఆ సమయంలోనే మా చెల్లెళ్లు నాకు సపోర్ట్‌గా నిలిచారు. ‘అక్క నీవే ఏదైనా చేయగలవు. మేమింకా చిన్న పిల్లలం. మా వంతు సాయం మేమూ చేస్తాం. ఎలాగైనా ఈ కష్టాల నుంచి మనం బయటపడాలి’ అంటూ వారు అన్న మాటలు నేను ఇప్పటికీ మరిచిపోలేకున్నాను.
రాత్రిళ్లు నాన్నకు తోడుగా..
కొన్ని నెలల తర్వాత ఓ అమ్మాయికి నేను జన్మనిచ్చాను. పేదరికం కారణంగా సరైన ఆహారం లేక చాలా నీరసించిపోయాను. ఆ సమయంలోనే నా ఆరోగ్యంతో పాటు పసిగుడ్డు బాగోగులు చూసుకునేందుకు మా తల్లిదండ్రులు మరింత శ్రమిస్తూ వచ్చారు. వారి కష్టాన్ని అతి దగ్గరగా చూసిన దాన్ని నేనే. దీంతో నేను కొంచెం కోలుకున్న తర్వాత నాన్నకు తోడుగా పంటకు నీరు పెట్టేందుకు రాత్రిళ్లు వెళ్లేదాన్ని. అమ్మానాన్న వద్దని వారించేవారు. అయినా నేను వినలేదు. ‘ఎలాగైనా ఈ కష్టాల నుంచి బయటపడాలి నాన్నా.. మనల్ని కాదని ఒంటరిగా వదిలేసి వెళ్లిన వారి ముందు సగర్వంగా మనం తలెత్తుకుని తిరగాలి’ అంటూ ధైర్యం చెబుతూ వచ్చాను.
ఆడపిల్లలు ఉన్నారంటూ..
నేను పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత పెద్ద చదువులు అక్కరలేదని మా నాన్నపై ఆయన అన్నతమ్ముళ్లు ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఆడపిల్లకు వెంటనే పెళ్లి చేసి పంపిస్తే మేలని చెబుతూ వచ్చారు. అయినా మా నాన్న వారి మాటలను వినేవారు కాదు. మా నాన్న అన్నతమ్ముళ్లందరి భయం ఒక్కటే. మా నాన్నకు ఆరుగురు ఆడపిల్లలు. వారందరికీ చదువులు చెప్పించి, పెళ్లి చేసి ఇస్తే ఇక ఆస్తులు ఏమీ మిగలవని భావించేవారు. దీంతో ఏదో ఒక విషయంపై ఘర్షణ పడేవారు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయేందుకు అవకాశం కోసం ఎదురు చూసేవారు.
భూమిని నమ్ముకుంటే బువ్వపెడుతుంది
వ్యవసాయం దండుగని ఎవరన్నారో గాని వారు నిజంగా మూర్ఖులే. మనసుపెట్టి పంట సాగు చేస్తే కాసుల వర్షం కురుస్తుంది. భూమిని నమ్ముకుంటే బువ్వ దొరుకుతుంది. ఒక పంట పోయినా.. మరో పంట ఆదుకుంటుంది. ఆధారం కోల్పోయామనుకుని బాధపడుతూ కూర్చొంటే ఫలితం లేదు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించగలగాలి. వ్యవసాయం ద్వారానే ఇంత మందిని నాన్న బతికించాడు.
అంగన్‌వాడీ కార్యకర్తగా..
మా ఊళ్లోని అంగన్‌వాడీ సెంటర్‌కు కార్యకర్త పోస్టు ఖాళీగా ఉందని తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నాను. అన్నీ అర్హతలూ ఉండడంతో 2015లో ఉద్యోగం వచ్చింది. ఓ వైపు పొలం పనులు చూసుకుంటూనే అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను. ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో దానిమ్మ, ఆరు ఎకరాల్లో వేరుశనగ, ఐదు ఎకరాల్లో వర్షాధారంగా వేరుశనగ సాగు చేస్తున్నాం.
పదేళ్ల క్రితం ఒంటరిని చేసి..
నాకు 20వ ఏటా మేనమామతో పెళ్లి చేశారు. పట్టుమని మూడు నెలలు కూడా కాపురం చేయలేదు. ఏవో కారణాలు చూపుతూ మా మామ (భర్త) మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. చాలా కాలం ఎదురు చూశాం. ఆయన రాలేదు. అప్పటికే నేను గర్భవతిని. ఈ విషయం మరింత నాతో పాటు అమ్మనాన్నను మరింత కుంగదీసింది. దీనినే అవకాశంగా తీసుకుని ఒక్కసారిగా మా దాయాదులు చెలరేగిపోయారు. ఆస్తుల భాగ పరిష్కారమంటూ తొమ్మిది ఎకరాలను మా నాన్న పరం చేసి, మమ్మల్ని ఒంటరివాళ్లను చేసి పదేళ్ల క్రితం వెళ్లిపోయారు.
మొదట్లో ఇబ్బంది పడ్డా..
మా నాన్నకు ధైర్యం కలిగించేందుకు ఏవో నాలుగు మాటలైతే చెప్పాను. కానీ, నిజానికి పార చేత పట్టుకుని రాత్రిళ్లు పంట పొలంలో నీళ్లు పెట్టడమంటే చిన్న విషయమేమీ కాదు. పురుగు పుట్ర తిరుగుతుంటాయి. దీనికి తోడు చీకటి. బ్యాటరీ వెలుగులోనే పనులన్నీ చక్కబెట్టుకోవాల్సి వస్తోంది. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతు కష్టం మాటల్లో చెప్పలేను. ఆ కష్టాలన్నీ అనుభవించాను. అయితే ఇష్టపడి చేస్తుండడంతో వాటిని ఏనాడూ నేను కష్టంగా భావించలేదు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను.
తోబుట్టువులను కాపాడుకుంటూ
వ్యవసాయ పనులపై నెమ్మదిగా నేను పట్టు సాధించాను. అనుకున్నట్లుగానే మా జీవితాల్లో మార్పులు రాసాగాయి. చెల్లెళ్లు కూడా వారికి చేతనైనా సాయం చేస్తూ వచ్చారు. నాల్గో చెల్లెలు నాతో సమానంగా పొలం పనుల్లో పాల్గొంటూ వచ్చింది. మిగిలిన వారిని చదువులపై దృష్టి మళ్లించేలా చేశాను. ఇక మా అందరిలోనూ చిన్నోడు మా తమ్ముడు. వాడు ఇక్కడే ఉంటే మా లాగే పొలం పనులు అంటూ వ్యవసాయంలో దిగుతాడని భావించి, దూరంగా హాస్టల్‌లో ఉంచి చదివిస్తూ వచ్చాను. ప్రస్తుతం వాడు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. చిన్న చెల్లెలు అనంతపురంలో ఉంటూ డిగ్రీ చేస్తోంది. ఇక మిగిలిన చెల్లెళ్లకు పెళ్లి చేసి ఇచ్చాను. ఇవన్నీ చేస్తూనే ఇల్లు కూడా కట్టుకున్నాం. దీంతో పాటు మరో ఆరు ఎకరాల పొలాన్ని కూడా కొనుగోలు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment