‘ఆమె’కు ఉండడానికి ఇల్లు లేదు | Odisha:Kamala Pujari Fails To Get Pucca House | Sakshi
Sakshi News home page

‘ఆమె’కు ఉండడానికి ఇల్లు లేదు

Published Sat, Mar 24 2018 8:26 PM | Last Updated on Sat, Mar 24 2018 8:26 PM

Odisha:Kamala Pujari Fails To Get Pucca House - Sakshi

ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు, సొంత గడ్డకే ప్రతిష్టను తీసుకువచ్చే అంతర్జాతీయ పురస్కారాలు, ఆమె పేరుతో యూనివర్సిటీలో హాస్టల్‌ భవనాలు, తాజాగా ఒడిశా రాష్ట్ర ప్రణాళిక బోర్డు సభ్యత్వం... అన్నీ ఉన్నాయి. కానీ తలదాచుకోవడానికి మాత్రం గూడు లేదు. పూరి గుడిసెలోనే బతుకు ఈడ్చాల్సిన పరిస్థితి. నీతి, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారి దుస్థితి మన దేశంలో ఇంతేనని కమలా పూజారి కథతో మరోసారి కళ్లెదుట నిలుస్తోంది. 68 ఏళ్ల వయసున్న  కమలా పూజారి ఒడిశాలో కోరాపుట్‌ జిల్లాకు చెందిన పత్రపుట్‌ నివాసి. వ్యవసాయ రంగంలో ఆమె చేసిన కృషి అనన్య సామాన్యమైనది. కోరాపుట్‌ జిల్లాలో ఆమె పేరు తెలీని వారు లేరంటే అతిశయోక్తి కాదు.

జిల్లాలో గ్రామం గ్రామం తిరుగుతూ రసాయన ఎరువుల వాడొద్దంటూ ప్రచారం చేసింది. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచింది. వ్యవసాయదారులతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తమ నేలలో ఎలాంటి పంటలు పండించాలో వివరించింది. అంతే కాదు స్థానికంగా పండే  వందలాది రకాల సంప్రదాయ వరిధాన్యాలను పరిరక్షించి ఒడిశా సర్కార్‌ ప్రశంసలు పొందింది. 2002 సంవత్సరంలో దక్షిణాఫ్రికా ఇచ్చే ఈక్వేటర్‌ ఇనీషియేటివ్‌ అవార్డుని గెలుచుకొని సొంత రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చింది. ఇన్ని చేసినా ఇప్పుడు ఆమె నివాసం ఉంటున్నది ఒక పూరిగుడిసె. కనీసం పక్కా ఇల్లు కూడా లేదు. ప్రభుత్వ పథకం కింద పక్కా ఇల్లు కేటాయించాలంటూ  ఆమె అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇందిరా ఆవాస్‌ యోజన కింద సొంతింటి కోసం కమల పూజారి చేసుకున్న  దరఖాస్తును కూడా ప్రభుత్వం తిరస్కరించింది . ఇప్పుడు పిలిచి మరీ రాష్ట్ర ప్రణాళిక బోర్డు సభ్యురాలిని చేసింది.

ప్రభుత్వ నిర్ణయం ఆమెకు కాస్త సంతోషాన్నే తీసుకువచ్చినా కమలా పూజారి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ ఈ పదవులు మాకెందుకు ? దానికి బదులుగా ప్రభుత్వం ఇల్లు ఇవ్వొచ్చు కదా. భువనేశ్వర్‌లో వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం హాస్టల్‌ భవన్‌కి మా నాన్నమ్మ పేరు పెట్టారు. ఈ గౌరవాలకి బదులుగా గౌరవంగా జీవించడానికి ఒక ఇల్లు ఇస్తే ఎంతో సంతోషించే వాళ్లం ‘ అని ఆమె మనవడు సుదామ్‌ పూజారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవానికి ఒడిశాలో ప్రణాళిక బోర్డు చాలా ఏళ్లుగా నిస్తేజంగా మారింది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ 18 ఏళ్ల పదవీకాలంలో మూడు సార్లు మాత్రమే సమావేశమైంది. అందుకే ప్రణాళిక బోర్డుని ప్రక్షాళన చేసిన ప్రభుత్వం కమలాపూజారి వంటి సమర్థులకు  చోటు కల్పించి రాష్ట్ర పురోగతి బాధ్యతలు అప్పగించింది కానీ,  ఆమెకి ఒక గూడు ఇవ్వడంలో మాత్రం నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం విఫలమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement