koraput district
-
ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ సాగు.. రైతులకు ఊహించని లాభాలు
స్ట్రాబెర్రీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఎర్రని రంగుతో అత్యంత ఆకర్షవంతంగా ఉండే ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఒక్కసారి తింటే ఆ ఫల మాధుర్యం మనల్ని మరిచిపోనివ్వదు. ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన ఈ పంట ప్రస్తుతం మన రాష్ట్రంలో విస్తరిస్తోంది. కొరాపుట్ జిల్లాలోని కొటియా ప్రాంతంలో పంట సాగు కొత్తపుంతలు తొక్కుతోంది. అధికారుల సాయంతో రైతులు అధిక దిగుబడి సాధిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. భువనేశ్వర్: కొరాపుట్ జిల్లాలోని కొటియా ప్రాంతం స్ట్రాబెర్రీ సాగులో దూసుకుపోతోంది. ఇక్కడ పండించే స్ట్రాబెర్రీ రుచి అద్భుతంగా ఉందని సీఎం నవీన్ పట్నాయక్ కొనియాడడం విశేషం. వాస్తవానికి దక్షిణ, నైరుతి ఒడిశా జిల్లాల కొండ చరియ ప్రాంతాలు స్ట్రాబెర్రీ సాగుకు అనుకూల ప్రాంతాలు. సముద్ర మట్టానికి సుమారు 3,000 అడుగుల ఎత్తులో ఉన్న కొరాపుట్, నువాపడా జిల్లాల్లో స్ట్రాబెర్రీ పండించవచ్చు. దీంతో వాణిజ్యపరంగా ఇక్కడ పంటను అభివృద్ధి చేసేందుకు అధికారులు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. 5 ఎకరాల్లో ప్రారంభం కొరాపుట్ జిల్లాలోని ఐటీడీఏ, వ్యవసాయ శాఖ అధికారులు స్ట్రాబెర్రీ పండించడంలో రైతులకు శిక్షణ అందించి ప్రోత్సహించారు. తొలుత 5 ఎకరాల పొలంలో ఈ సాగు ప్రారంభించారు. పూణే నుంచి 55,000 స్ట్రాబెర్రీ మొక్కలు తెప్పించారు. 3 స్వయం సహాయక బృందాలు, 45 రైతు కుటుంబాలకు స్ట్రాబెర్రీ సాగు శిక్షణ కలి్పంచారు. 50 రోజుల స్వల్ప వ్యవధిలో సాగు ఫలితాలు కనిపించడంతో సాగుపై అసక్తి పెరిగింది. ఊహాతీత ఫలితాలు కొరాపుట్ జిల్లా పొట్టంగి మండలం కొటియాలో స్ట్రాబెర్రీ ప్రయోగాత్మక సాగు ఊహాతీత ఫలితాలు సాధించింది. వ్యవసాయం, రైతు సాధికారత విభాగం జిల్లా యంత్రాంగం క్రియాశీల సహకారంతో 20 ఎకరాల విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం, రైతు సాధికారత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ అరబింద కుమార్ పాఢీ ఇటీవల కొటియా పర్యటన పురస్కరించుకొని స్టాబెర్రీ సాగు రైతులతో సమావేశమయ్యారు. స్ట్రాబెర్రీ సాగుకు పూర్తిస్థాయిలో సహాయం అందజేయనున్నట్లు తెలియజేశారు. సాగు విస్తరణకు అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రైతులు నారు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్ట్రాబెర్రీ సాగు ఒకసారి విజయవంతమైతే ఇతర పండ్ల సాగు కంటే చాలా లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్యాకెట్ ధర రూ.100 ప్రస్తుతం ఇక్కడ స్ట్రాబెర్రీ పంట లాభసాటిగా మారింది. ఒక చిన్న ప్యాకెట్ అమ్మకంతో రూ.100 వరకు లాభం వస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి ఏడాదే టర్నోవర్ రూ.4.60 లక్షలకు తాకడం విశేషం. గత సీజన్లో కొరాపుట్ జిల్లా డోలియాంబ, జానిగూడ, గాలిగదూర్, ఫతుసినేరి గ్రామాల్లో 50 ఎకరాల విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ సాగుకు సంకలి్పంచినా 20 ఎకరాల్లో మాత్రమే సాగుకు అనుకూలించింది. ఈ విస్తీర్ణంలో 6 లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా ప్రోగ్రామ్ కో–ఆర్డినేషన్ వర్గాలు తెలిపాయి. రుచి అద్భుతం: సీఎం నవీన్ పట్నాయక్ కొరాపుట్ జిల్లా కొటియా ప్రాంతంలో పండించిన స్ట్రాబెర్రీ పండ్లను సీఎం నవీన్ పటా్నయక్ రుచి చూశారు. రుచి అద్భుతంగా ఉందని కొనియాడారు. కొటియాలో స్ట్రాబెర్రీ పండించడం అభినందనీయమని పేర్కొన్నారు. స్ట్రాబెర్రీ సాగుతో మన రైతులు తియ్యదనానికి కొత్త ఒరవడి దిద్దారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతాంగానికి వెన్ను తట్టి ప్రోత్సహించిన జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. రైతులకు ఇటువంటి వినూత్న మార్గాల్లో సాధికారత కలి్పంచిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని కొనియాడారు. -
Mali mountain forest: వాళ్లు అడవిని సృష్టించారు
కోరాపుట్ (ఒడిశా): అది ఒడిశాలోని మారుమూల కోరాపూట్ జిల్లా. అందులో మరింత మారుమూలన ఉండే గిరిజన గ్రామం. పేరు ఆంచల. 1990ల నాటి సంగతి. వంట చెరుకు కోసమని, ఇతర అవసరాలకని ఊరి పక్కనున్న పవిత్ర ‘మాలీ పర్వతం’ మీది చెట్లను విచక్షణారహితంగా నరికేస్తూ పోయారు. ఫలితం...? చూస్తుండగానే పచ్చదనం జాడలనేవే లేకుండా గుట్ట పూర్తిగా బోసిపోయింది. జరిగిన నష్టాన్ని గుర్తించేలోపే మరుభూమిగా మారింది. దాని పై నుంచి వచ్చే అందమైన సెలయేటి ధార కూడా శాశ్వతంగా ఆగిపోయింది. దాంతో అడవి బిడ్డలైన ఆ గిరిజనులు తల్లడిల్లారు. ముందుగా మహిళలే కళ్లు తెరిచారు. చిట్టడవికి తిరిగి జీవం పోసి పవిత్ర పర్వతానికి పూర్వపు కళ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 30 ఏళ్లు అకుంఠిత దీక్షతో శ్రమించారు. తమకు ప్రాణప్రదమైన అడవికి పునఃసృష్టి చేసి నారీ శక్తిని మరోసారి చాటారు. ఫలితంగా నేడు కొండమీది 250 ఎకరాల్లోనే గాక ఊరి చుట్టూ పచ్చదనం దట్టంగా పరుచుకుని కనువిందు చేస్తోంది. ఒక్కతాటిపై నిలిచి... అయితే ఈ బృహత్కార్యం చెప్పినంత సులువుగా ఏమీ జరగలేదు. ఇందుకోసం గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి కష్టపడ్డారు. మొదట్లో మూణ్నాలుగు కుటుంబాలు ఒకేచోట వండుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా వంట కోసం కట్టెలపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటూ వచ్చారు. సేంద్రియ సాగుకు మళ్లారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకున్నారు. అంతేగాక చెట్లను నరికే వారికి రూ.500 జరిమానా విధించారు. ముక్కు పిండి మరీ వసూలు చేయడమే గాక నలుగురిలో నిలబెట్టి నలుగు పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. చెట్లు నరికేందుకు దొంగతనంగా ఎవరూ కొండపైకి వెళ్లకుండా ఒక కుటుంబాన్ని కాపలాగా పెట్టారు. వారికి జీతమిచ్చేందుకు డబ్బుల్లేకపోవడంతో ఊరంతా కలిసి వారికి 10 కిలోల రాగులిస్తూ వచ్చామని సుపర్ణ అనే గ్రామస్తురాలు గుర్తు చేసుకుంది. ఈ ఉద్యమం మొదలైన రోజుల్లోనే 15 ఏళ్ల వయసులో నవ వధువుగా తాను ఊళ్లో అడుగు పెట్టానని చెప్పుకొచ్చింది. ‘‘మా శ్రమ ఫలించి మేం నాటిన చెట్లు చిగురించడం మొదలు పెట్టినప్పటి మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’’ అని చెబుతూ సవిత అనే మరో గ్రామస్తురాలు సంబరపడిపోయింది. కొసమెరుపు 30 ఏళ్ల కింద మూగబోయిన జలధార కూడా మహిళల మొక్కవోని ప్రయత్న ఫలితంగా మళ్లీ ప్రాణం పోసుకుంది. కొండ మీది నుంచి జలజలా పారుతూ ఒకప్పట్లా కనువిందు చేస్తోంది! (క్లిక్: లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!) -
ప్రేమజంట ఆత్మహత్య.. కారణం అదేనా..?
కొరాపుట్: ఒకే చెట్టు కొమ్మకు ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన నబరంగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని డాబుగాం పోలీస్‌స్టేషన్ పరిధి పపడాహండి సమితి జబాగుడ గ్రామ సమీపంలోని జీడితోటలో అదే గ్రామానికి చెందిన తిలై హరిజన్(18), దమాపల్లి గ్రామానికి చెందిన డోంబురు హరిజన్(19)లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ మంగళవారం రాత్రి నుంచి కనిపించకపోవడంతో గ్రామస్తులు తీవ్రంగా గాలించారు. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గుర్తించారు. మృతురాలి అన్న మృతుడి అక్కను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరిద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బంధువులు అయినప్పటికీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. (మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com) ఇది కూడా చదవండి: మీరు నాకు నచ్చారు.. పెళ్లి చేసుకుందాం.. చివరికి ఊహించని ట్విస్ట్ -
సొంత సంస్థకే కన్నం.. రూ .2.30 కోట్లు నొక్కేశారు
కొరాపుట్: తిన్నింటి వాసాలే లెక్కపెట్టారు కొంతమంది ప్రబుద్ధులు. అంతా కుమ్మకై సొంత సంస్థకే టోపీ వేసి, 2.30 కోట్లు నొక్కేసారు. దీనికి సంబంధించిన వివరాలను కొరాపుట్ ఐఐసీ ధిరేన్‌కుమార్ పట్నాయక్ సోమవారం వివరించారు. పట్టణంలోని బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న బ్రాంచి మేనేజర్, క్యాషియర్, సేల్స్ మేనేజర్, ఆఫీసు బాయ్ కలిసి సంస్థకు చెందిన డబ్బును మాయం చేశారు. కంపెనీ ఆడిట్లో వ్యక్తిగత ఖర్చులు కోసం సొమ్మును దారి మళ్లించినట్లు బయట పడింది. దీంతో యాజమాన్య ప్రతినిధులు కొరాపుట్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులలో ఇద్దరు కొరాపుట్, జయపురం, బరంపురం నకు చెందినవారు. ఈ మేరకు వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించారు. -
కొఠియాలో ఆంధ్ర పెన్షన్లు
ఒడిశా, కొరాపుట్: వివాదాస్పద కొఠియా గ్రామ పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు తరచూ ప్రవేశిస్తూ ప్రజలను ఆకర్షించే తీరులో పలు ప్రజా సంక్షేమ పథకాలు అందజేయడం పట్ల ఆ ప్రాంత సర్పంచ్‌లు కొరాపుట్ జిల్లా అధికారులపై మండిపడుతున్నారు. ఇటీవల అటవీ భూముల పట్టాలను ఆంధ్రప్రదేశ్ అధికారులు అందజేశారని, అలాగే బుధవారం తొలగంజాపొదర్, ఉపరగంజపొదర్, తొలసెంబి, ఉపరసెంబి, ధుయిపొదర్ గ్రామస్తులకు 40మందికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసి, రూ. 2, 250 ప్రతి ఒక్క లబ్ధిదారునికి చెల్లించినట్లు తొలగంజపొదర్ మాజీ సర్పంచ్ బిసు గెమేల్ విలేకరులకు సమాచారం అందజేశారు. త్వరలో మరో వందమందికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు హామీ ఇచ్చి వెళ్లినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు 19 మంది లబ్ధిదారులకు ఆంధ్రప్రభుత్వం తరఫున అటవీ భూముల పట్టాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ మాదిరి తరచూ ఆంధ్రప్రదేశ్ అధికారులు వివాదాస్పద కొఠియా ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలు సమకూరుస్తున్న విషయమై పొట్టంగి తహసీల్దారు కొరాపుట్ జిల్లా అధికారులకు సమాచారం అందివ్వకపోవడం ఏమిటని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. -
టిక్కెట్ ఇస్తే ఆందోళనకు దిగుతా..
సాక్షి, కొరాపుట్: కులధ్రువీకరణ పత్రాన్ని మాజీ ఎమ్మెల్యే రఘురాం పడాల్ అక్రమ మార్గంలో పొందారని బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు సోమనాథ్ ఖొరా ఆరోపించారు. ఇదే విషయమై ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో ఆయనకు కులధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారని, అయితే ప్రస్తుతం ఆయనకు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో గతంలో సెమిలిగుడ తహసీల్దార్ కార్యాలయం తిరస్కరించిన కాపీని విలేకరుల ముందు ప్రదర్శించారు. కొరాపుట్ విధానసభ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఆశిస్తున్నందు వల్లే రఘురాం కుల ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించారని పేర్కొన్నారు. ఒకవేళ కొరాపుట్ ఎమ్మెల్యే సీటును ఆయనకు కేటాయిస్తే తాను ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. కొరాపుట్ జిల్లా ఓటరుగా తాను ఆయనను విచారణ చేసేందుకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
‘ఆమె’కు ఉండడానికి ఇల్లు లేదు
ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు, సొంత గడ్డకే ప్రతిష్టను తీసుకువచ్చే అంతర్జాతీయ పురస్కారాలు, ఆమె పేరుతో యూనివర్సిటీలో హాస్టల్ భవనాలు, తాజాగా ఒడిశా రాష్ట్ర ప్రణాళిక బోర్డు సభ్యత్వం... అన్నీ ఉన్నాయి. కానీ తలదాచుకోవడానికి మాత్రం గూడు లేదు. పూరి గుడిసెలోనే బతుకు ఈడ్చాల్సిన పరిస్థితి. నీతి, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారి దుస్థితి మన దేశంలో ఇంతేనని కమలా పూజారి కథతో మరోసారి కళ్లెదుట నిలుస్తోంది. 68 ఏళ్ల వయసున్న కమలా పూజారి ఒడిశాలో కోరాపుట్ జిల్లాకు చెందిన పత్రపుట్ నివాసి. వ్యవసాయ రంగంలో ఆమె చేసిన కృషి అనన్య సామాన్యమైనది. కోరాపుట్ జిల్లాలో ఆమె పేరు తెలీని వారు లేరంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో గ్రామం గ్రామం తిరుగుతూ రసాయన ఎరువుల వాడొద్దంటూ ప్రచారం చేసింది. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచింది. వ్యవసాయదారులతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తమ నేలలో ఎలాంటి పంటలు పండించాలో వివరించింది. అంతే కాదు స్థానికంగా పండే వందలాది రకాల సంప్రదాయ వరిధాన్యాలను పరిరక్షించి ఒడిశా సర్కార్ ప్రశంసలు పొందింది. 2002 సంవత్సరంలో దక్షిణాఫ్రికా ఇచ్చే ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డుని గెలుచుకొని సొంత రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చింది. ఇన్ని చేసినా ఇప్పుడు ఆమె నివాసం ఉంటున్నది ఒక పూరిగుడిసె. కనీసం పక్కా ఇల్లు కూడా లేదు. ప్రభుత్వ పథకం కింద పక్కా ఇల్లు కేటాయించాలంటూ ఆమె అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇందిరా ఆవాస్ యోజన కింద సొంతింటి కోసం కమల పూజారి చేసుకున్న దరఖాస్తును కూడా ప్రభుత్వం తిరస్కరించింది . ఇప్పుడు పిలిచి మరీ రాష్ట్ర ప్రణాళిక బోర్డు సభ్యురాలిని చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఆమెకు కాస్త సంతోషాన్నే తీసుకువచ్చినా కమలా పూజారి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ ఈ పదవులు మాకెందుకు ? దానికి బదులుగా ప్రభుత్వం ఇల్లు ఇవ్వొచ్చు కదా. భువనేశ్వర్‌లో వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం హాస్టల్ భవన్‌కి మా నాన్నమ్మ పేరు పెట్టారు. ఈ గౌరవాలకి బదులుగా గౌరవంగా జీవించడానికి ఒక ఇల్లు ఇస్తే ఎంతో సంతోషించే వాళ్లం ‘ అని ఆమె మనవడు సుదామ్ పూజారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవానికి ఒడిశాలో ప్రణాళిక బోర్డు చాలా ఏళ్లుగా నిస్తేజంగా మారింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 18 ఏళ్ల పదవీకాలంలో మూడు సార్లు మాత్రమే సమావేశమైంది. అందుకే ప్రణాళిక బోర్డుని ప్రక్షాళన చేసిన ప్రభుత్వం కమలాపూజారి వంటి సమర్థులకు చోటు కల్పించి రాష్ట్ర పురోగతి బాధ్యతలు అప్పగించింది కానీ, ఆమెకి ఒక గూడు ఇవ్వడంలో మాత్రం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం విఫలమైంది. -
జయపురం, కొట్‌పాడ్‌లలో విస్తృతంగా దర్యాప్తు
జయపురం/కొరాపుట్: కొరాపుట్ జిల్లా కుందులి గ్యాంగ్‌రేప్ బాధితురాలి కేసులో నిజానిజాలు వెలికితీసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ పంపించిన దర్యాప్తు బృందం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ దర్యాప్తు చేస్తోంది. కొరాపుట్, కుందులి, బాధితురాలి గ్రామం ముషి గుడలను సందర్శించి ఆయా ప్రాంతాలలో అనేక మందిని, ముఖ్యంగా ఆమె బంధువర్గాన్ని ఆమెకు వైద్యసేవలందించిన డాక్టర్లను, పోలీసులు విచారణ చేసిన తరువాత జయపురం, కొట్‌పాడ్‌లలో పర్యటించింది. ఈ పర్యటనలో ఆమెను ఉంచిన ప్రాంతాలను, వైద్య చికిత్స చేసిన జయపురం ప్రభుత్వ సబ్‌డివిజన్ ఆస్పత్రిని సందర్శించి అనేక విషయాలను తెలుసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ టీమ్‌లో కొంతమంది జయపురం, కొట్‌పాడ్‌లలో పర్యటించి అనేక విషయాలపై దర్యాప్తు జరిపినట్లు సమాచారం. రవిసింగ్ నేతృత్వంలో టీమ్ మొదట కొట్‌పాడ్ వెళ్లి అక్కడ శిశు పరిరక్షణ కేంద్రాన్ని సందర్శించింది. ఆ కేంద్రంలో కుందులి బాధితురాలిని అధికారులు కొన్ని రోజులు ఉంచారు. ఆమె అక్కడ ఉన్న సమయంలో ఇతరులతో ఎలా ఉండేది, ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండేది. ఆమె అక్కడ ఉన్న వారితో ఏమైనా చెప్పిందా? ఎన్నాళ్లు కేంద్రంలో ఉంది? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పూర్తి వివరాలు సేకరించిన టీమ్ జయపురం వచ్చి బాధితురాలిని అధికారులు కొద్దిరోజులు ఉంచిన స్టేహోంను సందర్శించింది. అక్కడ ఉన్నవారిని బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకుంది. వైద్యాధికారి విచారణ ఆమె స్టేహోంలో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం ఎక్కడికి తీసుకు వెళ్లారని స్టే హోం నిర్వాహకులను అడిగి తెలుసుకుంది. ఆ సమయంలో బాధితురాలిని జయపురం సబ్‌డివిజన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలుసుకుని ఆస్పత్రిని సందర్శించింది. హాస్పిటల్లో బాధితురాలు ఉన్న సమయంలో ఆమెకు ఎవరు ట్రీట్మెంట్ చేశారు. ఆమె పరిస్థితి ఎలా ఉండేదని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో టీమ్ ప్రతినిధులు పలువురు ఆస్పత్రి ఉద్యోగులను విచారణ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా జయపురం హాస్పిటల్లో ఉన్న సమయంలో బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయంపై సబ్‌డివిజన్ ప్రభుత్వ హాస్పిటల్ అధికారి డాక్టర్ దొధిబామణ త్రిపాఠిని ప్రశ్నించినట్లు తెలిసింది. అక్కడి నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్ టీమ్ భరిణిపుట్ గ్రామ పంచాయతీ బి.మాలిగుడలో బాధితురాలి బంధువుల ఇంటికి వెళ్లి వారికి తెలిసిన వివరాలు సేకరించారు. ఈ పర్యటనలో మానవ హక్కుల కమిషన్ బృందంతో పాటు కొరాపుట్ జాల్లా శిశు సురక్షా సమితి అధికారి, పోలీసులు ఉన్నారు. -
విజ్ఞాన ప్రదర్శనలతో.. వెలుగులోకి సృజనాత్మక శక్తి
కొరాపుట్ : విద్యార్థుల సృజనాత్మక శక్తి విజ్ఞాన ప్రదర్శనల ద్వారా వ్యక్తమవుతుందని జిల్లా విద్యాధికారి మర్కట కేసరి రాయ్ అన్నారు. జిల్లా విద్యావిభాగం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏర్పాటు చేసిన కొన్ని విజ్ఞాన ప్రదర్శనలు ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార సూచనలుగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రతి విద్యార్థి విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొనే విధంగా అందరి విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా సైన్స్ సూపర్వైజర్ శివ పట్నాయక్ మాట్లాడుతూ ఆన్లైన్లో పోటీపడిన 382 ప్రాజెక్టులలో 42 ప్రాజెక్టులను పోటీలో పాల్గొనేందుకు ఎంపిక చేసి ప్రదర్శనకు ఆహ్వానించినట్లు చెప్పారు. వాటిలో 34 ప్రాజెక్టులు ప్రదర్శనలో పాల్గొన్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొన్న వాటిల్లో 4 ప్రాజెక్టులను ఎంపిక చేసి భువనేశ్వర్‌లో రాష్ట్రస్థాయిలో ఈ నెల 12,13 తేదీలలో జరగనున్న విజ్ఞాన ప్రదర్శనలకు పంపనున్నామన్నారు. కార్యక్రమంలో సునాబెడ ఏఈఎఫ్ కళాశాల అధ్యాపకుడు ఉదయనాథ్ సామల్, కొరాపుట్ కళాశాల అధ్యాపకులు దీపక్ పట్నాయక్, తపన్ కుమార్ బెహర, కొరాపుట్ ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వికాస్చంద్ర సర్కార్ పాల్గొన్నారు. -
కొరాపుట్‌పై కరుణ
జయపురం : అవిభక్త కొరాపుట్ జిల్లాకు కేంద్రరైల్వే బడ్జెట్లో సముచిత స్ధానం లభించింది. కొన్ని దశాబ్దాలుగా ప్రతిపాదిత జయపురం–మల్కన్‌గిరి, జయపురం–నవరంగ్‌పూర్ రైల్వే మార్గాలకు కేంద్ర రైల్వే శాఖ ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేశారు. 130 కిలోమీటర్ల జయపురం–మల్కన్‌గిరి రైల్వేలైన్ కోసం ఈ బడ్జెట్లో రూ.95 కోట్లు మంజూరు చేయగా 38 కిలోమీటర్ల జయపురం–నవరంగ్‌పూర్ రైల్వే మార్గానికి రూ.150 కోట్లు మంజూరుచేసింది. అదేవిధంగా 116 కిలోమీటర్ల పొడవు కొరాపుట్–జగదల్పూర్ మధ్య రైలు మార్గం అభివృద్ధి చేసేందుకు రూ.116 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది నామమాత్రంగా నిధులు మంజూరు చేసిన కేంద్రం ఈ ఏడాది కరుణ చూపి నిధులు మంజూరు చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నిధులతో రెండు రైల్వే మార్గాలకు భూసేకరణతో పాటు పలు రైళ్లు కూడా ప్రారంభం కావచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. రైల్వే జంక్షన్‌గా జయపురం జయపురం–నవరంగ్‌పూర్, జయపురం–మల్కన్‌గిరి రైలు మార్గాల ఏర్పాటు జరిగితే జయపురం రైల్వేస్టేషన్ రైల్వే జంక్షన్‌గా రూపుదిద్దుకుంటుంది. దండకారణ్య ప్రాంతంలో జయపురం రైల్వేస్టేషన్ ఒక ప్రధాన రైల్వే జంక్షన్‌గా మారుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దండకారణ్యం ప్రాంతం మావోయిస్టు ప్రభావిత జిల్లా లతో కూడి ఉంది. ముఖ్యంగా మావోయిస్టులకు రక్షణ కవచంగా ఉంటున్న మల్కన్‌గిరి జిల్లాకు, నక్సల్ ప్రభావిత నవరంగ్‌పూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి జయపురం కేంద్ర బిందువు. అందువల్ల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్, నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి జిల్లాల రైలు మార్గాలకే కాకుండా జయపురం, కొరాపుట్ల మీదుగా విశాఖపట్నం వెళ్లే రైలు మార్గానికి జయపురం జంక్షన్ కాగలదనడంలో సందేహం లేదు. అంతేకాకుండా కొరాపుట్ నుంచి జయపురం మీదుగా జగదల్పూర్ వెళ్లే రైల్వే మార్గం అభివృద్ధికి బడ్జెట్లో రూ.116 కోట్లు కేటాయించడంతో బహుళ ఆదివాసీ ప్రాంతంలో రైల్వే సౌకర్యాలు మెరుగుపడేందుకు దోహద పడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొత్తగా రెండు రైల్వే మార్గాలు ఏర్పడుతుండడం వల్ల రైల్వే చరిత్రలో జయపురానికి మంచిస్థానం లభించే అవకాశాలు కన్పిస్తున్నాయని భావిస్తున్నారు. ఇంతవరకు రైల్వే మార్గాలు లేని ఒడిశాలో రెండు ఆదివాసీ జిల్లాలు రైల్వే చిత్రపటంలో చోటు చేసుకోనే అవకాశం కలుగుతోంది. అవిభక్త కొరాపుట్ ప్రాంతంలో మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాల్లో నేటికీ రైలు మార్గాలు ఏర్పాటు కాలేదు. ఈ రెండు జిల్లాల్లో అత్యధిక ప్రజలు రైలు ముఖం చూసి ఉండరంటే అతిశయోక్తి కాదు. అతివిలువైన ఖనిజ సంపద, జలసంపద, వ్యవసాయ సంపద గల ఈ రెండు జిల్లాలు నేటికీ అన్ని రంగాలలోను వెనుకబడి ఉన్నాయి. ప్రయాణ సౌకర్యలు లేక నాలుగు దశాబ్దాల కాలం నుంచి ఆ రెండు జిల్లాలలోను ప్రతిపాదిత పరిశ్రమలు, కర్మాగారాలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. అందువల్ల ఒడిశా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా నవరంగ్‌పూర్, మల్కనగిరి జిల్లాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాలను జయపురం రైల్వే మార్గంతో కలిపేందుకు నిధులు మంజూరు చేయడం వల్ల ఆ రెండు జిల్లాలు అభివృద్ధి చెందగలవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
అవమానం భరించలేక..
సాక్షి, జయపురం: ఒడిశాలో సంచలనం రేపిన సామూహిక అత్యాచారం బాధితురాలు సోమవారం ఆత్మహత్య చేసుకుంది. కొరాపుట్ జిల్లా కుందులి ప్రాంతంలో సామూహిక లైంగికదాడికి గురైన బాలిక అవమాన భారం భరించలేక ఉరి వేసుకుని తనువు చాలించింది. గత ఏడాది అక్టోబర్‌లో జవాను దుస్తులతో ఉన్న నలుగురు తనను ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు 9వ తరగతి విద్యార్థిని ఆరోపించిన విషయం విదితమే. బాధితురాలు ఆరోపిస్తున్న సంఘటనపై వివిధ రాజకీయ పార్టీలు, మానవ హక్కుల కమిటీలు, పలు స్వచ్ఛంద సంస్థలు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. తర్వాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ నిర్వహించింది. క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. ఇన్ని జరిగినా ఆమెకు న్యాయం జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. కేసు నమోదైన నాటి నుంచి ఆమె బంధువులను, ఆమెను పోలీసులు అనుమానిస్తూనే వచ్చారు. అసలు ఆమెపై లైంగికదాడి జరిగినట్లు ఏ మెడికల్ రిపోర్టులోనూ లేదని కొరాపుట్ ఎస్పీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆమె అబద్ధం చెబుతోందని అప్పట్లో పోలీసులు ఆరోపించారు. చివరకు విచారణకు కొరాపుట్ జిల్లా జడ్జిని నియమించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు అవమానం భరించలేక కందులి కమ్యూనిటీహెల్త్ సెంటర్లో ఉరి వేసుకుంది. బాధితురాలి బంధువులను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి కలసి ఓదార్చారు. -
ఆస్పత్రి డ్రైనేజిలో ప్రసవించిన మహిళ
కొరాపుట్ : ఓ ఆదివాసీ మహిళ అత్యంత దయనీయ స్థితిలో ఆస్పత్రి ప్రాంగణంలోని డ్రైనేజీలో ప్రసవించిన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కొరాపుట్ జిల్లా దస్మంత్పూర్ బ్లాక్, జానిగూడకు చెందిన మహిళ.. తన తల్లి, సోదరితో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఎస్ఎల్ఎన్ఎంసీహెచ్)కు వచ్చారు. జ్వరంతో బాధపడుతూ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న తన భర్తను చూసేందుకు వచ్చిన ఆమెకు ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి... కుటుంబీకులు ఆమెను గైనకాలజీ వార్డుకు తీసుకెళ్లగా.. చికిత్స అందించేందుకు సిబ్బంది నిరాకరించారు. నొప్పులను దిగమింగుతూ ఆస్పత్రి బయటికి వచ్చేసిన ఆ మహిళ.. పక్కనున్న డ్రైనేజీలో పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి సిబ్బంది స్పందించి, వారిని లోనికి తీసుకెళ్లారు. ‘‘పిల్లకు నొప్పులుస్తున్నాయని ఎంత ప్రాధేయపడినా వాళ్లు వినలేదు. ఇంతకుముందు డాక్టర్ దగ్గర చూపించుకున్న కాగితాలు తెమ్మని అడిగారు. మా ఊరు చాలా దూరం అప్పటికప్పుడు తేలేమన్నా వినిపించుకోలేదు’’ అని బాధిత మహిళ తల్లి మీడియాతో చెప్పారు. మూత్రవిసర్జనకు వెళ్లి.. : కాగా, డ్రైనేజీలో ప్రసవం ఘటనపై ఉన్నతాధికారులు భిన్నంగా స్పందించారు. వారసలు గైనకాలజీ వార్డుకే రాలేదని, మూత్రవిసర్జన కోసం వెళ్లి డ్రైనేజీలో బిడ్డను కన్నారని కొరాట్పూర్ జిల్లా వైద్య అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రసవం తర్వాత మహిళను ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్న సిబ్బంది -
దారుణ ఘటనపై ఏడు గంటల బంద్
భువనేశ్వర్(ఒడిశా): గిరిజన బాలికపై గ్యాంగ్‌రేప్ ఘటనపై విచారణ చేపట్టి, కారకులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ నిర్వహించిన బంద్ విజయవంతమయింది. ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లాకు చెందిన 9వ తరగతి చదివే గిరిజన బాలిక ఈనెల 10వ తేదీన గ్యాంగ్‌రేప్‌నకు గురయింది. ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న జవానులు, మావోయిస్టులు తాము ఈ కారణం కాదంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ ఏడుగంటల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో కొరాపుట్ జిల్లాలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు దుకాణాలు, బ్యాంకులు, వివిధ వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోలను విడిచి బయటకు రాలేదు. బంద్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ నాయకత్వం తెలిపింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిందితులను శిక్షించి బాధితురాలికి రూ.50లక్షల పరిహారం సాయంగా అందించాలని అసెంబ్లీలో కాంగ్రెస్ విప్, స్థానిక ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినిపతి డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దారుణ ఘటన జరిగి ఏడురోజులైనా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేకపోయారని విమర్శించారు. కాగా, ఈ కేసులో ఎటువంటి ఆధారం లభ్యం కాకపోవడంతో పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. -
రేపు కొరాపుట్‌లో బందు
జయపురం: కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీసు స్టేషన్ పరిధి సోరిసపొదర్ గ్రామం అడవిలో ఆదివాసీ విద్యార్థినిపై ఇటీవల జరిగిన సామూహిక లైంగికదాడిని మావోయిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ అమానుష సంఘటనతో మావోయిస్టులకు సంబంధం ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులు వెల్లబుుచ్చిన అభిప్రాయంపై ఆంధ్ర–ఒడిశా బోర్డర్ మావో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు జగబందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులతో శనివారం ఆయన ఫోన్లో మాట్లాడారు. సంఘటన జరిగి నాలుగు రోజులు అయినా దోషులను గుర్తించి, అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు, క్రైం బ్రాంచ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇటువంటి అమానుష ఘటనలో పోలీసులు మమేకమయ్యారని ఆరోపించారు. పోలీసుల తీరును ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ సంఘటనలో దోషులను శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని ఆందోళనలు జరుపుతున్న వారికి మావోయిస్టులు పూర్తి మద్దతు ఇస్తారని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం కొరాపుట్ జిల్లా బందుకు మావోలు పిలుపునిస్తున్నారని తెలిపారు. మరోపక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ సోమవారం కొరాపుట్ జిల్లా బందుకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క మావోయిస్టులు బందుకు పిలుపునీయటంతో పోలీసులు, ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బందుకు పిలుపు ఇవ్వగా, మావోయిస్టులు సమయ నిర్ధారణ లేకుండా బందుకు పిలుపునిచ్చారు. మావోలు బందుకు పిలుపునివ్వడంతో మావో ప్రభావిత ప్రాంతాలు ముఖ్యంగా నారాయణపట్న, బందుగాం, పొట్టంగి, సెమిలిగుడ, నందపూర్ లమతాపుట్, లక్ష్మీపూర్ తదితర ప్రాంతాలలో బందు తీవ్రంగా ఉండవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బందుతో జనజీవనం, రవాణా స్తంభించవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దోషులను అరెస్టు చేయండి జయపురం:కొరాపుట్ జిల్లా కుందులి సమీప సోరిసిపొదర్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ముసాసగుడ గ్రామం విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి చేయడం దారుణమని కొరాపుట్ జిల్లా భారతీయ కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా పార్టీ నాయకులు జయపురంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. జయనగర్‌లోని జయపురం çసబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర గవర్నర్‌కు ఉద్దేశించి రాసిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో ఈ సంఘటన జరగటంతో దోషులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాలికపై సామూహిక లైంగికదాడి చేసిన దుండగులు ఎవరైనా వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనకు కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జుధిష్టర రౌళో, సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమోదకుమార్ మహంతి తదితరులు నాయకత్వం వహించారు. -
నడిచివెళ్తున్న బాలికపై నలుగురు కలిసి..
జయపురం/కొరాపుట్: తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను నలుగురు కామాంధులు కాటేశారు. అయితే బీఎస్ఎఫ్ జవాన్లే బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఒడిశాలోని కొరాపుట్ జిల్లాను కుదిపేశాయి. జిల్లాలో మావోయిస్టుల దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు, మావోలను నియంత్రించేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బెటాలియన్లను ఏర్పాటుచేశారు. మంగళవారం కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివాసీ బాలికను నలుగురు బీఎస్ఎఫ్ జవానులు ఎత్తుకుపోయి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు సంచలనమయ్యాయి. నడిచివెళ్తుండగా.. హటపొదర్ గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక పాఠశాలలో ఇచ్చేందుకు అవసరమైన ఫొటోలు తీయించుకునేందుకు మంగళవారం కుందులి సంత వద్దకు వెళ్లింది. ఫొటోలు తీసుకుని సొంత ఊరు ముషాగుడకు బయలుదేరింది. కుందులిలో ఆటోలో బయలుదేరి తమ గ్రామ జంక్షన్లో దిగి నడిచి వెళ్తుండగా ముసుగులు వేసుకుని జవాన్ల దుస్తులతో ఉన్న నలుగురు వ్యక్తులు ఆ బాలికను బలవంతంగా ఎత్తుకుపోయారు. సమీప అడవిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, అనంతరం అడవిలో పడేసి వెళ్లిపోయారు. కొంత సమయానికి తెలివి వచ్చిన బాలిక అతికష్టంమీద నడుచుకుంటూ ఇంటికి చేరింది. ఆమె దుస్థితిని చూసిన తల్లిదండ్రులు, బంధువులు ఆరాతీయగా తనపై జరిగిన లైంగికదాడి ఉదంతాన్ని బాలిక వెల్లడించింది. దీనిపై బాధితురాలి సోదరుడు పొట్టంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలికను కుందులి ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించి అక్కడి నుంచి కొరాపుట్ సహిద్ లక్ష్మణ్‌నాయక్ మెడికల్ కళాశాలకు తరలించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో లైంగికదాడి వార్త దావానంలా వ్యాపించడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు భగ్గుమన్నారు. 26వ నంబర్ జాతీయ రహదారిలో కుందిలి సంతతోట వద్ద బుధవారం రాస్తారోకోకు దిగారు. నిందితులను శిక్షించాలని కొరాపుట్ ఎమ్మెల్యే కృష్ణచంద్ర సాగరియ ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు చేశారు. విద్యార్థినిపై లైంగిక దాడి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ బాధిత బాలిక వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఈ ఘటనతో జవాన్లకు ఎటువంటి సంబంధం లేదని బీఎస్ఎఫ్ బెటాలియన్ పబ్లిక్ రిలేషన్స్ డీఎస్పీ జేసీ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. -
భారీ డంప్ స్వాధీనం
ఏవోబీలో భారీగా మావోయిస్టుల డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరాపూట్ జిల్లా నారాయణ పట్నం బ్లాక్ కుంబర పుట్టి సమీపంలో డంప్ ఉందన్న సమాచారంతో.. కూంబింగ్ నిర్వహించిన పోలీసులు.. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు సీజ్ చేశారు. డంప్ లో రెండు ల్యాండ్ మైన్స్, పెద్ద ఎత్తున జిలిటెన్ స్టిక్స్, వైర్ కట్టలను స్వాధీనంచేసుకున్నారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు.