ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ సాగు.. రైతులకు ఊహించని లాభాలు | Experimental Strawberry Farming At Koraput District In Odisha | Sakshi
Sakshi News home page

ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ సాగు.. అధిక లాభాలు.. రుచికి సీఎం ఫిదా

Published Wed, Feb 8 2023 7:07 AM | Last Updated on Wed, Feb 8 2023 7:27 AM

Experimental Strawberry Farming At Koraput District In Odisha - Sakshi

స్ట్రాబెర్రీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఎర్రని రంగుతో అత్యంత ఆకర్షవంతంగా ఉండే ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఒక్కసారి తింటే ఆ ఫల మాధుర్యం మనల్ని మరిచిపోనివ్వదు. ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన ఈ పంట ప్రస్తుతం మన రాష్ట్రంలో విస్తరిస్తోంది. కొరాపుట్‌ జిల్లాలోని కొటియా ప్రాంతంలో పంట సాగు కొత్తపుంతలు తొక్కుతోంది. అధికారుల సాయంతో రైతులు అధిక దిగుబడి సాధిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. 

భువనేశ్వర్‌: కొరాపుట్‌ జిల్లాలోని కొటియా ప్రాంతం స్ట్రాబెర్రీ సాగులో దూసుకుపోతోంది. ఇక్కడ పండించే స్ట్రాబెర్రీ రుచి అద్భుతంగా ఉందని సీఎం నవీన్‌ పట్నాయక్‌ కొనియాడడం విశేషం. వాస్తవానికి దక్షిణ, నైరుతి ఒడిశా జిల్లాల కొండ చరియ ప్రాంతాలు స్ట్రాబెర్రీ సాగుకు అనుకూల ప్రాంతాలు. సముద్ర మట్టానికి సుమారు 3,000 అడుగుల ఎత్తులో ఉన్న కొరాపుట్, నువాపడా జిల్లాల్లో స్ట్రాబెర్రీ పండించవచ్చు. దీంతో వాణిజ్యపరంగా ఇక్కడ పంటను అభివృద్ధి చేసేందుకు అధికారులు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. 

5 ఎకరాల్లో ప్రారంభం 
కొరాపుట్‌ జిల్లాలోని ఐటీడీఏ, వ్యవసాయ శాఖ అధికారులు స్ట్రాబెర్రీ పండించడంలో రైతులకు శిక్షణ అందించి ప్రోత్సహించారు. తొలుత 5 ఎకరాల పొలంలో ఈ సాగు ప్రారంభించారు. పూణే నుంచి 55,000 స్ట్రాబెర్రీ మొక్కలు తెప్పించారు. 3 స్వయం సహాయక బృందాలు, 45 రైతు కుటుంబాలకు స్ట్రాబెర్రీ సాగు శిక్షణ కలి్పంచారు. 50 రోజుల స్వల్ప వ్యవధిలో సాగు ఫలితాలు కనిపించడంతో సాగుపై అసక్తి పెరిగింది. 

ఊహాతీత ఫలితాలు 
కొరాపుట్‌ జిల్లా పొట్టంగి మండలం కొటియాలో స్ట్రాబెర్రీ ప్రయోగాత్మక సాగు ఊహాతీత ఫలితాలు సాధించింది. వ్యవసాయం, రైతు సాధికారత విభాగం జిల్లా యంత్రాంగం క్రియాశీల సహకారంతో 20 ఎకరాల విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం, రైతు సాధికారత శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ అరబింద కుమార్‌ పాఢీ ఇటీవల కొటియా పర్యటన పురస్కరించుకొని స్టాబెర్రీ సాగు రైతులతో సమావేశమయ్యారు. స్ట్రాబెర్రీ సాగుకు పూర్తిస్థాయిలో సహాయం అందజేయనున్నట్లు తెలియజేశారు. సాగు విస్తరణకు అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రైతులు నారు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్ట్రాబెర్రీ సాగు ఒకసారి విజయవంతమైతే ఇతర పండ్ల సాగు కంటే చాలా లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు.  

ప్యాకెట్‌ ధర రూ.100 
ప్రస్తుతం ఇక్కడ స్ట్రాబెర్రీ పంట లాభసాటిగా మారింది. ఒక చిన్న ప్యాకెట్‌ అమ్మకంతో రూ.100 వరకు లాభం వస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి ఏడాదే టర్నోవర్‌ రూ.4.60 లక్షలకు తాకడం విశేషం. గత సీజన్‌లో కొరాపుట్‌ జిల్లా డోలియాంబ, జానిగూడ, గాలిగదూర్, ఫతుసినేరి గ్రామాల్లో 50 ఎకరాల విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ సాగుకు సంకలి్పంచినా 20 ఎకరాల్లో మాత్రమే సాగుకు అనుకూలించింది. ఈ విస్తీర్ణంలో 6 లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేషన్‌ వర్గాలు తెలిపాయి. 

రుచి అద్భుతం: సీఎం నవీన్‌ పట్నాయక్‌  
కొరాపుట్‌ జిల్లా కొటియా ప్రాంతంలో పండించిన స్ట్రాబెర్రీ పండ్లను సీఎం నవీన్‌ పటా్నయక్‌ రుచి చూశారు. రుచి అద్భుతంగా ఉందని కొనియాడారు. కొటియాలో స్ట్రాబెర్రీ పండించడం అభినందనీయమని పేర్కొన్నారు. స్ట్రాబెర్రీ సాగుతో మన రైతులు తియ్యదనానికి కొత్త ఒరవడి దిద్దారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతాంగానికి వెన్ను తట్టి ప్రోత్సహించిన జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. రైతులకు ఇటువంటి వినూత్న మార్గాల్లో సాధికారత కలి్పంచిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని కొనియాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement