కొరాపుట్ జిల్లాలో రైలుమార్గం
జయపురం : అవిభక్త కొరాపుట్ జిల్లాకు కేంద్రరైల్వే బడ్జెట్‌లో సముచిత స్ధానం లభించింది. కొన్ని దశాబ్దాలుగా ప్రతిపాదిత జయపురం–మల్కన్‌గిరి, జయపురం–నవరంగ్‌పూర్ రైల్వే మార్గాలకు కేంద్ర రైల్వే శాఖ ఈ బడ్జెట్‌లో నిధులు మంజూరు చేశారు. 130 కిలోమీటర్ల జయపురం–మల్కన్‌గిరి రైల్వేలైన్ కోసం ఈ బడ్జెట్‌లో రూ.95 కోట్లు మంజూరు చేయగా 38 కిలోమీటర్ల జయపురం–నవరంగ్‌పూర్ రైల్వే మార్గానికి రూ.150 కోట్లు మంజూరుచేసింది. అదేవిధంగా 116 కిలోమీటర్ల పొడవు కొరాపుట్–జగదల్‌పూర్ మధ్య రైలు మార్గం అభివృద్ధి చేసేందుకు రూ.116 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది నామమాత్రంగా నిధులు మంజూరు చేసిన కేంద్రం ఈ ఏడాది కరుణ చూపి నిధులు మంజూరు చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నిధులతో రెండు రైల్వే మార్గాలకు భూసేకరణతో పాటు పలు రైళ్లు కూడా ప్రారంభం కావచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
రైల్వే జంక్షన్‌గా జయపురం
జయపురం–నవరంగ్‌పూర్, జయపురం–మల్కన్‌గిరి రైలు మార్గాల ఏర్పాటు జరిగితే జయపురం రైల్వేస్టేషన్ రైల్వే జంక్షన్‌గా రూపుదిద్దుకుంటుంది. దండకారణ్య ప్రాంతంలో జయపురం రైల్వేస్టేషన్ ఒక ప్రధాన రైల్వే జంక్షన్‌గా మారుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దండకారణ్యం ప్రాంతం మావోయిస్టు ప్రభావిత జిల్లా లతో కూడి ఉంది. ముఖ్యంగా మావోయిస్టులకు రక్షణ కవచంగా ఉంటున్న మల్కన్‌గిరి జిల్లాకు, నక్సల్ ప్రభావిత నవరంగ్‌పూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి జయపురం కేంద్ర బిందువు. అందువల్ల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్, నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి జిల్లాల రైలు మార్గాలకే కాకుండా జయపురం, కొరాపుట్‌ల మీదుగా విశాఖపట్నం వెళ్లే రైలు మార్గానికి జయపురం జంక్షన్ కాగలదనడంలో సందేహం లేదు. అంతేకాకుండా కొరాపుట్ నుంచి జయపురం మీదుగా జగదల్‌పూర్ వెళ్లే రైల్వే మార్గం అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.116 కోట్లు కేటాయించడంతో బహుళ ఆదివాసీ ప్రాంతంలో రైల్వే సౌకర్యాలు మెరుగుపడేందుకు దోహద పడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొత్తగా రెండు రైల్వే మార్గాలు ఏర్పడుతుండడం వల్ల రైల్వే చరిత్రలో జయపురానికి మంచిస్థానం లభించే అవకాశాలు కన్పిస్తున్నాయని భావిస్తున్నారు. ఇంతవరకు రైల్వే మార్గాలు లేని ఒడిశాలో రెండు ఆదివాసీ జిల్లాలు రైల్వే చిత్రపటంలో చోటు చేసుకోనే అవకాశం కలుగుతోంది. అవిభక్త కొరాపుట్ ప్రాంతంలో మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాల్లో నేటికీ రైలు మార్గాలు ఏర్పాటు కాలేదు. ఈ రెండు జిల్లాల్లో అత్యధిక ప్రజలు రైలు ముఖం చూసి ఉండరంటే అతిశయోక్తి కాదు. అతివిలువైన ఖనిజ సంపద, జలసంపద, వ్యవసాయ సంపద గల ఈ రెండు జిల్లాలు నేటికీ అన్ని రంగాలలోను వెనుకబడి ఉన్నాయి. ప్రయాణ సౌకర్యలు లేక నాలుగు దశాబ్దాల కాలం నుంచి ఆ రెండు జిల్లాలలోను ప్రతిపాదిత పరిశ్రమలు, కర్మాగారాలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. అందువల్ల ఒడిశా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా నవరంగ్‌పూర్, మల్కనగిరి జిల్లాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాలను జయపురం రైల్వే మార్గంతో కలిపేందుకు నిధులు మంజూరు చేయడం వల్ల ఆ రెండు జిల్లాలు అభివృద్ధి చెందగలవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment