Orissa State
-
హాకీ ప్రపంచకప్ చాంపియన్ అర్జెంటీనా.. కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టుకు నిరాశ..
భువనేశ్వర్: సొంతగడ్డపై జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో కనీసం కాంస్య పతకమైనా సాధించాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. మూడో స్థానం కోసం ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఫ్రాన్స్ ఆటగాడు క్లెమెంట్ టిమోతి హ్యాట్రిక్ గోల్స్ (26, 34, 47వ నిమిషాల్లో)తో భారత్‌కు చెక్ పెట్టాడు. టీమిండియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను సుదీప్ (42వ నిమిషంలో) సాధించాడు. చాంపియన్ అర్జెంటీనా టైటిల్ పోరులో ఆరుసార్లు చాంపియన్ జర్మనీకి అర్జెంటీనా షాక్ ఇచ్చింది. ఫైనల్లో అర్జెంటీనా 4–2 తో జర్మనీపై గెలిచింది. జూనియర్ ప్రపంచకప్‌ను అర్జెంటీనా గెలవడం ఇది రెండోసారి. 2005లో తొలిసారి అర్జెంటీనా విజేతగా నిలిచింది. చదవండి: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే.. -
మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి హత్య
రాయపూర్: దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. వివరాల ప్రకారం.. ఉమేష్ మర్కం గత కొంత కాలంగా 'గోప్నియా సైనిక్' (రహస్య పోలీసు ఇన్ఫార్మర్)గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను తన స్వగ్రామమైన కాటేకల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటం గ్రామం నుంచి దంతెవాడ పట్టణానికి వెళ్తుండగా మావోయిస్టులు కొందరు మార్కంపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో మార్కం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.రాజధాని రాయ్‌పూర్‌కు 400 కి.మీ దూరంలో ఉన్న తేటమ్ గ్రామంలో గత ఏడాది పోలీసు శిబిరాన్ని ఏర్పాటు చేయడంలో అధికారులకు మద్దతు ఇవ్వడంలో మార్కం కీలకపాత్ర పోషించారు. గత సంవత్సరం డిసెంబర్లో నుంచి అతను 'గోప్నియా సైనిక్'గా పని చేయడం ప్రారంభించాడు. ఈ రహస్య ఇన్ఫార్మర్లను నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల కోసం, ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను సేకరించడం కోసం స్థానిక స్థాయిలో జిల్లా పోలీసులు నియమిస్తారు. నిందితుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: శ్రీకి లీలలు!!.. జన్ ధన్ అకౌంట్ల నుంచి 6వేల కోట్ల సొమ్ము మాయమైందన్న కుమారస్వామి -
ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా సబ్సిడీలు ఇస్తున్న ఒరిస్సా
ఎలక్ట్రిక్ వాహనాల కొనేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నట్లు కొన్ని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. చమురు ధరలు ఆకాశాన్ని తాకడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది. దీంతో ఈవీ తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో ముందుకు వస్తున్నాయి. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా ఒరిస్సా రాష్ట్రం వచ్చి చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలపై విధించే మోటారు వాహనం(ఎంవీ)పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం అక్టోబర్ 30న ప్రకటించింది. కాలుష్యాన్ని అరికట్టడం కోసం, ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారిని ప్రోత్సహించడం కోసం ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. బ్యాటరీతో నడిచే అన్ని రకాల వాహనాలపై మోటారు వాహన పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజులను 100 శాతం మినహాయింపును ఇస్తున్నట్లు ఒరిస్సా రాష్ట్ర వాణిజ్య, రవాణా శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. "ఒరిస్సా మోటారు వాహనాల పన్నుల చట్టం, 1975లోని సెక్షన్ 15 సబ్ సెక్షన్(1) క్లాజ్(1) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈవీలకు మోటారు వాహన పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% మినహాయింపును ఇస్తున్నట్లు ప్రకటించింది" అని ఒరిస్సా వాణిజ్య రవాణా శాఖ ట్వీట్ పేర్కొంది. ఈ మినహాయింపు డిసెంబర్ 31, 2025 వరకు వర్తిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా ఎలక్ట్రిక్ వాహన విధానం 2021ను సెప్టెంబర్ 2న ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులను ప్రోత్సహించే లక్ష్యంతో నీతి ఆయోగ్ సలహాతో ఒరిస్సా ఈవీ విధానాన్ని రూపొందించింది. Using the powers conferred by clause (ii) of sub-section (1) of section 15 of the #OdishaMotorVehiclesTaxationAct, 1975, the state government has allowed a 100% exemption on #MotorVehicleTax and #RegistrationFees for EVs. pic.twitter.com/RjcT4DyUDa — ବାଣିଜ୍ଯ ଓ ପରିବହନ ବିଭାଗ । Commerce & Transport (@CTOdisha) October 30, 2021 వినియోగదారులు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు, బ్యాటరీలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల డెవలపర్లకు సబ్సిడీ అందించాలని ఈ విధానంలో ప్రతిపాదించింది. ఐదేళ్లపాటు అమల్లోకి వచ్చే ఒడిశా ఈవీ విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు ఈవీ బేస్ ధరపై 15 శాతం సబ్సిడీని అందించనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ వినియోగదారులు గరిష్టంగా ₹5,000కి సబ్సిడీ అందుకోనుండగా, ఎలక్ట్రిక్ త్రీ & ఫోర్ వీలర్ వినియోగదారులు వరుసగా ₹10,000, ₹50,000 ప్రోత్సాహకాలను అందుకొనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఫేమ్-2 పథకం కింద వినియోగదారులకు లభించే ప్రయోజనాలకు మించి ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. -
18 నెలలుగా వేతనం లేదు.. ఇప్పించండి సార్
భవనేశ్వర్: జిల్లాలోని కలిమెల పంచాయతీ ఈఓగా పని చేస్తున్న తనకు గత 18 నెలలుగా వేతనం అందడం లేదని మధు హంతాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం సమితి కార్యాలయం ముందు బైఠాయించారు. గిరిజనుడినైన తన ఎల్‌పీసీని అధికారులు కలిమెల సమితికి పంపక పోవడంతో జీతం నిలిచి పోయిందని వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఎన్ని వినతులు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని, గత ఏడాదిన్నరగా అప్పులు చేసి, కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోందని వాపోయారు. పిల్లల చదువులు సైతం భారంగా మారిందన్నారు. తన తండ్రిని మావోయిస్టులు నాలుగేళ్ల క్రితం హత్య చేశారని, అధికారులు స్పందించకపోతే కుటంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టంచేశారు. -
ఎమ్మెల్యే ఇంటిపై బాంబు దాడి
సాక్షి, భువనేశ్వర్: గంజాం జిల్లాలోని కళ్లికోట్ ఎమ్మెల్యే సూర్యమణి బైద్య ఇంటిపై కొంతమంది గుర్తుతెలియని దుండగులు బాంబులు విసిరి పరారయ్యారు. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే మద్దతుదారుల్లోని నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న కళ్లికోట్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం క్షతగాత్రులను కళ్లికోట్ ప్రభుత్వాస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందజేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వారిని బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించామని ఎస్డీపీఓ గౌతమ్ కృష్ణ తెలిపారు. నిమ్మజర గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరగగా, ఈ ఘటన వెనక ఉన్న కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉందని గంజాం జిల్లా ఎస్పీ బ్రజేష్‌కుమార్ రాయ్ పేర్కొన్నారు. -
మరోసారి భక్తులు లేకుండానే పూరి జగన్నాథ రథయాత్ర!
భువనేశ్వర్: వచ్చే నెలలో జరగనున్న పూరి రథయాత్ర మరోసారి భక్తులు లేకుండానే జరగనుంది. కోవిడ్-19 కారణంగా భక్తులు లేకుండా రథయాత్ర జరగడం ఇది రెండోసారి. ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పి కె జెనా మాట్లాడుతూ.. పూర్తిగా టీకా డోసులు వేసుకున్న వారు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ రథయాత్రలో కోవిడ్ నెగటివ్ వచ్చిన సేవకులను మాత్రమే వాడనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది సుప్రీంకోర్టు జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను ఈసారి కూడా పాటించనున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్పవాలకు కచ్చితంగా కోవిడ్-19 ప్రోటోకాల్స్ అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. కాగా జగన్నాథ రథయాత్రకు కేవలం 500 మంది సేవకులు మాత్రమే రథాన్ని లాగేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఉత్సవాలను భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చునని తెలిపారు. కాగా ప్రస్తుతం పూరి ప్రాంతంలో ప్రతిరోజూ సుమారు 300 వరకు కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని జిల్లా కలెక్టర్ సమర్త్ వర్మ పేర్కొన్నారు. చదవండి: భంవురి ఉత్సవంతో మొదలైన రథం పనులు -
ఆస్పత్రి నుంచి ఉడాయించిన గ్యాంగ్‌స్టర్ షేక్ హైదర్
భువనేశ్వర్: కేంద్రపడా ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రి నుంచి గ్యాంగ్‌స్టర్ షేక్ హైదర్ శనివారం రాత్రి 7 గంటల సమయంలో పరారయ్యాడు. ఈ ఘటనపై ఉలిక్కిపడిన పోలీస్ అధికార యంత్రాంగం అతడి ఆచూకీ కోసం మొత్తం 5 ప్రత్యేక బృందాలను నియమించింది. కటక్ మహానగరం నలువైపులా ఉన్న ఇన్, ఔట్ పోస్ట్ ప్రాంతాలతో పాటు కేంద్రాపడా, జాజ్‌పూర్, జగత్సింగ్పూర్, మయూర్భంజ్, బాలాసోర్ జిల్లాల సరిహద్దుల్లో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, విమానాశ్రయాల్లో కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పోలీస్ ఠాణాలకు కూడా పరారైన గ్యాంగ్‌స్టర్ ఫొటోని జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. 2011లో జరిగిన షేక్ సులేమాన్ సోదరుడు షేక్ చున్నా అలియాస్ మాలిక్ హనాన్ హత్య కేసులో హైదర్‌కి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టు విధించి, ఝరపడా జైలుకి తరలించింది. అయితే అక్కడ 2017లో దలసామంత్ సోదరులతో జరిగిన ఘర్షణ కారణంగా ఇతడిని సంబల్పూర్ సర్కిల్ జైలుకి తరలించారు. బుర్లా విమ్సార్ ఆస్పత్రిలో.. ఇక్కడి జైలులో ఉంటుండగా, తీవ్రఅనారోగ్యానికి గురైన ఇతడిని వైద్యసేవల నిమిత్తం మార్చి 28వ తేదీన బుర్లా విమ్సార్ ఆస్పత్రిలో చేర్చారు. శస్త్ర చికిత్స చేయాలన్న అక్కడి వైద్యుల సూచనల మేరకు ఇతడిని కటక్ ఎస్సీబీ మెడికల్‌కి తరలించారు. అక్కడే చికిత్స పొందుతుండగా పోలీసులు, అధికారుల కళ్లుగప్పి హైదర్ పారిపోయాడు. దీనికి సంబంధించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను అతడికి కాపలాగా వెళ్లిన ఆరుగురు పోలీసులపై అధికారులు సస్పెన్షన్ వేటువేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో జవాన్లు బుల్బుల్ సాహు, దీపక్ సాహు, మహ్మద్ మౌసిమ్, ఉమాకాంత బెహరా, సుధాంశు మాఝి, హవల్దారు రమేష్ చంద్ర దెహురి ఉన్నట్లు సంబల్పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బత్తుల గంగాధర్ తెలిపారు. చదవండి: స్నేహితులతో మద్యం తాగి.. తల పగిలి రక్తపు మడుగులో -
వావ్... వాట్ ఏ టైగర్....
భువనేశ్వర్: నలుపు రంగు డబ్బా ఏదీ దీని మీద పడలేదు.. ఇది అచ్చంగా నల్ల పులే(మెలనిస్టిక్ టైగర్).. ఇది ఎంత అరుదైనది అంటే.. ప్రపంచం మొత్తం మీద ఇలాంటివి ఆరేడే ఉన్నాయి.. అందులో ఇదొకటి. ఇంకో విశేషం ఏమిటంటే.. ఉన్న ఆరేడు కూడా మన పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోనే ఉన్నాయి. అక్కడి సిమ్లిపాల్ రిజర్వులో ఈ నల్ల పులులు ఉన్నాయి. ఈ మధ్య కోల్‌కతాకు చెందిన ఫొటోగ్రాఫర్ సౌమన్ ఈ టైగర్ రిజర్వులోకి ఫొటోలు తీయడానికి వెళ్లారట. జీవిత కాలంలో ఒకే ఒక్కసారి వచ్చే చాన్స్ నా తలుపు తట్టింది. ఆ పులి కొన్ని సెకన్లపాటే కనిపించింది. చాలా వేగంగా స్పందించి.. చిత్రాలు తీయాల్సి వచ్చింది. నల్ల చిరుతలు చాలా ఉన్నాయి.. ఇది నల్ల పులి. అదీ బయటకు కనిపించడం చాలా అరుదు.. ఫుల్ హ్యాపీ అని ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. జన్యుపరమైన మార్పుల వల్ల ఈ పులులు ఇలా నల్లటి చారలను కలిగి ఉంటాయి. -
బ్యాంక్ క్యాషియర్ దారుణ హత్య
బరంపురం: గంజాం జిల్లా ధారకోట్ సమితి ముంటమరాయి గ్రామంలో ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ముండమరాయి గ్రామంలో గల కళాశాల ప్రాంగణంలో ఓ మృతదేహాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. సమాచారం అందుకున్న ధారకోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తం మడుగులో పడి ఉన్న మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతదేహం దగ్గర దొరికిన కొన్ని ఆధారాలను బట్టి మృతుడిని వినోదర్ బెహరాగా గుర్తించారు. ఆయన ముండమోరై ఆంధ్రా బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన అనంతరం హత్యకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పర్యాటక మార్గాల్లో విరామ కేంద్రాలు
భువనేశ్వర్ ఒరిస్సా : రాష్ట్ర పర్యాటక రంగం బహుముఖ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రాల మార్గంలో పలు చోట్ల విరామ కేంద్రాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ఆయన ఈ విరామ కేంద్రాల్ని ప్రారంభించారు. పర్యాటక కేంద్రాల్ని అనుసంధాపరిచే జాతీయ, రాష్ట్ర రహదారుల పరిసరాల్లో వేర్వేరు ప్రాంతాల్లో 50 విరామ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 34 కేంద్రాల నిర్మాణం పూర్తి చేసి మంగళవారం ప్రారంభించారు. 4 కేంద్రాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించగా మిగిలిన కేంద్రాల్ని ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతరేతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో రాష్ట్ర రవాణా–నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ నృసింహ చరణ్ సాహు, పర్యాటక, సాంస్కృతిక, ఒడియా భాష అభివృద్ధి శాఖ మంత్రి అశోక్ చంద్ర పండా, నిర్మాణ శాఖ కార్యదర్శి నళినీ కాంత ప్రధాన్ పాల్గొన్నారు. పర్యాటకులకు దోహదం పర్యాటక మార్గాల్లో విరామ కేంద్రాలు పర్యాటకులకు ఎంతగానో దోహదపడతాయి. ప్రధానంగా మహిళలకు ఎంతగానో ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. తొలి విడతలో 34 పర్యాటక విరామ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాల్లో మరుగుదొడ్లు, సురక్షిత తాగు నీరు, కెఫేటేరియా సదుపాయాలు కల్పించారు. ప్రయాణంలో పర్యాటకుల అవసరాల దృష్ట్యా ఈ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించడం విశేషంగా పేర్కొన్నారు. పర్యాటకులకు చక్కటి పర్యావరణంతో ఈ కేంద్రాలు స్వల్ప కాలిక విడిది కేంద్రాలుగా సేద తీర్చుతాయి. త్వరలో మరిన్ని సదుపాయాలు పర్యాటక విరామ కేంద్రాల్లో మరిన్ని సదుపాయాల్ని త్వరలో ప్రవేశ పెట్టనున్నట్లు రాష్ట్ర నిర్మాణ శాఖ కార్యదర్వి నళినీ కాంత ప్రధాన్ తెలిపారు. దీర్ఘకాల ప్రయాణంలో చోదకులు, పర్యాటకులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఉపశమనం కల్పించేందుకు పర్యాటక మార్గాల్లో విరామ కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ప్రాంగణాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఆహార కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని తమ విభాగం ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్లు తెలిపారు. పాతబడిన పర్యవేక్షక బంగళాలు, బహిరంగ ప్రభుత్వ స్థలాల్ని సద్వినియోగపరుచు కోవడం ఈ ప్రణాళిక ప్రధాన ధ్యేయంగా ఆయన పేర్కొన్నారు. ఇటువంటి 50 కేంద్రాల నిర్మాణానికి పనులు చేపట్టారు. ఇప్పటివరకు 34 కేంద్రాల నిర్మాణం పూర్తయింది. వీటిని ముఖ్యమంత్రితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు వగైరా ప్రజా ప్రతినిధులు మంగళవారం ప్రారంభించారు. మరి కొన్ని చోట్ల ఇటువంటి కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. అవసరమైన చోట్ల ప్రైవేట్ స్థలాల కొనుగోలుకు ఆయన ఆదేశించినట్లు నిర్మాణ శాఖ కార్యదర్శి తెలిపారు. హైవేలపై ట్రామా కేంద్రాలు జాతీయ (ఎన్‌హెచ్) రాష్ట్ర జాతీయ రహదారు(ఎస్‌హెచ్)ల పొడవునా తరచూ దుర్ఘటనలు సంభవిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో బాధితులకు తక్షణ ఆరోగ్య, చికిత్స సేవల్ని కల్పించేందుకు పర్యాటక విరామ కేంద్రాల పరిసరాల్లో ట్రామా కేంద్రాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని నిర్మాణ శాఖ కార్యదర్శి వివరించారు. ఈ ప్రాంగణాల్లో వాహనాల మరమ్మతు కేంద్రాలు, పిల్లల కోసం ఆట స్థలాలు, వై–ఫై సదుపాయం, మందుల దుకాణాలు కూడా ఏర్పాటు చేసేందుకు విభాగం యోచిస్తోందని తెలిపారు. పర్యాటక విరామ కేంద్రాల నిర్వహణ బాధ్యతల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్మాణ విభాగానికి కట్టబెట్టినట్లు ప్రకటించారు. గుణుపురం, కాశీపూర్‌లలో.. రాయగడ: రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా యాత్రికులు, పర్యాటకులకు వసతి సౌకర్యం కల్పించే భవనాలను ప్రభుత్వం నిర్మించి జాతీయ రహదారుల వద్ద పర్యాటకులు, పాదచారులు, విశ్రాంతి తీసుకునేందుకు సదుపాయం కల్పించింది. ఈ విశ్రాంతి భవనాల్లో భోజన సదుపాయం, సౌచాలయ సదుపాయం ఉంటుంది. వీటికి రుసుం చెల్లించవలసి ఉంటుంది. రాష్ట్రంలో ఇంతవరకు 50భవనాల నిర్మాణం చేపట్టగా అందులో 35భవనాలు పూర్తయ్యాయి. వాటిలో రాయగడ జిల్లాలోని కాశీపూర్, గుణుపురంలో ఒక్కో భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాశీపూర్ భవనం ప్రారంభోత్సవానికి కలెక్టర్ గుహపూనాంతపస్‌కుమార్, రాయగడ ఎంఎల్ఏ లాల్‌బిహారీ హిమరిక, బీజేడీ నాయకుడు మహాపాత్రో ఇతర సభ్యులు హాజరయ్యారు. అలాగే గుణుపురంలో భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుణుపురం ఎంఎల్ఏ త్రినాథ్గొమాంగో, రాజ్యసభ సభ్యుడు ఎన్.భాస్కరరావులు హాజరయ్యారు. -
మళ్లీ తెరపైకి
భువనేశ్వర్ : రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు చేయాలనే యోచన మరోసారి తెరపైకి వచ్చింది. దీర్ఘకాలం కిందట ఈ ప్రతిపాదన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని ప్రేరేపించింది. రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు పురస్కరించుకుని ఇరుగు పొరుగు రాష్ట్రాలు బిహార్, ఆంధ్రప్రదేశ్ సందర్శించి అక్కడ కొనసాగుతున్న ఈ విధానాన్ని పర్యవేక్షక బృందం పరిశీలిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ప్రకటించారు. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో విధా న పరిషత్ పని తీరు, కార్యాచరణ సమీక్షిస్తాయి. డాక్టర్ నృసింహ చరణ్ అధ్యక్షతన విధాన పరిషత్ పర్యవేక్షక కమిటీ ఏర్పాటు అయింది. ఆయన అధ్యక్షతన ప్రమీలా మల్లిక్, భుజొబొలొ మాఝి, మనోహర్ రంధారి, నితీష్ గంగదేవ్ సభ్యులుగా బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఏర్పాటు శైలి,పనితీరు, కార్యాచరణని పరిశీలిస్తారు. లోగడ 2015 సంవత్సరంలో రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ సభ్యులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం 169 ఆర్టికల్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో విధాన పరిషత్ విధానం కొనసాగుతుంది. బిహారు, జమ్మూ–కశ్మీరు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విధాన పరిషత్ వ్యవస్థ కొనసాగుతుంది. పలు రంగాల్లో నిపుణుల్ని చట్టపరమైన వ్యవహారాల్లో ప్రతినిథులుగా అవకాశం కల్పించేందుకు వీలు అవుతుంది. -
‘బీజేపీది మొసలి కన్నీరు’
భువనేశ్వర్ : రాష్ట్రానికి మహానదీ జలాల పంపిణీలో జరుగుతున్న అన్యాయంపట్ల ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రంలో అధికార పక్షం బిజూ జనతా దళ్ మహానది సురక్షా యాత్రను బుధవారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఝార్సుగుడ జిల్లా లఖన్‌పూర్ సమితి సుఖొసొడా, బర్గడ్ జిల్లా చిఖిలి ప్రాంతాల నుంచి ఈ ఉద్యమాన్ని ఒకే రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ మహానది జలాల్ని న్యాయసమ్మతంగా సాధించేంత వరకు నిరవధికంగా ఉద్యమించాలని పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి పిలుపునిచ్చారు. అన్యాయాలకు పాల్పడుతున్న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ వ్యవహారాలకు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి బహిరంగ ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం, భారతీయ జనతా పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నాయి. వర్షాకాలం మినహా ఇతర కాలాల్లో మహా నది నీటి మట్టం తగ్గిపోయి రాష్ట్ర రైతులు అల్లాడుతున్నారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలపట్ల భారతీయ జనతా పార్టీకి వాస్తవంగా ఏమాత్రం అంకితభావం ఉన్నా మహానది ఎగువ భాగంపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు నిర్మాణాలపట్ల బహిరంగంగా వ్యతిరేకత ప్రదర్శించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సవాల్ విసిరారు. బ్యారేజీ నిర్మాణం..సమస్యను పరిష్కరిస్తుందని కొందరు బీజేపీ నాయకులు వక్కాణించడంపట్ల నవీన్ పట్నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యారేజీ నిర్మాణం నీటి నిల్వకు మాత్రమే దోహదపడుతుందన్నారు. ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్న నాయకులు ఇటువంటి వ్యాఖ్యల్ని చేసి పబ్బం గడపడం విచారకరమంటూ ఎద్దేవా చేశారు. మహానది రాష్ట్రానికి ప్రతీక ఝార్సుగుడ జిల్లాలో కార్యక్రమం ముగించుకుని మహానది ఆవలి తీరం బర్గడ్ జిల్లా అంబొభొణా సమితి చిఖిలి గ్రామంలో పర్యటించి ముఖ్యమంత్రి మహా నది సురక్షా యాత్రను ప్రారంభించారు. ఏక కాలంలో మహా నది ఉభయ తీరాల్లో బిజూ జనతాదళ్ పాదయాత్ర నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. మహానది రాష్ట్ర ప్రజల జీవన రేఖ. రాష్ట్ర సంస్కృతి, సామాజిక, ఆర్థిక రంగాలు ఈ నదీ తల్లి ప్రవాహంతో పెన వేసుకుపోయాయి. రాష్ట్ర ప్రతీక మహానది. ఈ నది సంరక్షణ మన కర్తవ్యంగా స్వీకరించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మహానది జలాల సంరక్షణ కోసం ఛత్తీస్‌గఢ్ ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని బిజూ జనతా దళ్ అ«ధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. 15 రోజులు 15 జిల్లాలు మహానది జలాలపై న్యాయ సమ్మతమైన హక్కులు, అధికారాల పరిరక్షణ కోసం రాష్ట్రంలో బిజూ జనతా దళ్ మహానది సురక్షా యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర 15 రోజులపాటు నిరవధికంగా కొనసాగుతుంది. మహానది ఉభయ తీరాల్లోని 15 జిల్లాల్లో బీజేడీ కార్యకర్తలు నిత్యం పాదయాత్ర నిర్వహిస్తారు. ఝార్సుగుడ, బర్గడ్, సంబల్పూర్, సువర్ణపూర్, బౌధ్, అనుగుల్, ఢెంకనాల్, నయాగడ్, కటక్, ఖుర్దా, జాజ్‌పూర్, కేంద్రాపడ, పూరీ, జగత్సింగ్పూర్ జిల్లాల్లో మహానది సురక్షా యాత్ర కొనసాగుతుంది. పాదయాత్రను పురస్కరించుకుని ఈ జిల్లాల్లో దారి పొడవునా చైతన్య సభలు, సమావేశాలతో సాయంత్రం వేళల్లో వీధి నాటకాలు ఇతరేతర సామాజిక స్పృహ కార్యక్రమాల్ని బిజూ జనతా దళ్ కార్యకర్తలు నిర్వహిస్తారు. మహానది తీరం ఇరువైపులా ప్రముఖ మందిరాల్లో సామూహిక దీపారాధన చేపడతారు. ఈ కార్యక్రమాల్లో కార్మిక శాఖ మంత్రి సుశాంత సింగ్, చేనేత, జౌళి, హస్త కళల శాఖ మంత్రి స్నేహాంగిని చురియా, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ ప్రసన్న ఆచార్య ఇతరేతర పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఒడియాలోనే సైన్‌బోర్డులు
బరంపురం: ఒడిశా ప్రభుత్వం అమలు చేసిన కొత్త చట్టం ప్రకారం ఇక నుంచి అన్ని వ్యాపార సంఘాల దుకాణాల బోర్డులు ఒడియా భాషలోనే ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో స్పష్టం చేశారు. గంజాం చాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక కొమ్మబాల వీధిలో గల కార్యాలయంలో 50వ వార్షికోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వీవీ రామ నరసింగ రావు అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవాల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి సూర్జో పాత్రో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్తచట్టాన్ని అమలు చేసిందని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన ప్రత్యేక ఒడిశా అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త చట్టం అనుసారంగా ఒడిశా రాష్ట్రంలో ప్రతి వ్యాపార దుకాణం ముందు వ్యాపార బోర్డులపై మాతృ భాష ఒడియాలోనే పేర్లు ఉండాలని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో కూడా తప్పని సరిగా ఒడియా భాషలో బోర్డుల్లో పేరు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇక రాష్ట్రంలో గల కలెక్టరేట్ కార్యాలయాల నుంచి అన్ని ప్రభుత్వ కార్యలయాల్లో కూడా ఒడియా భాషలోనే బోర్డులు ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్టర్లకు ఒడియా భాషలోనే లేఖలు, కరస్పాండింగ్ చేయగలరని లేఖలో కూడా కింద ఒడియా భాషలో తప్పనిసరిగా సంతకం ఉండాలని స్పష్టం చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం చేసిన కరస్పాండింగ్ లేఖలు మాత్రం ఆంగ్లంలో ఉంటాయని అన్నారు. తెలుగులో కూడా బోర్డులు ఇదే విధంగా రాష్ట్రంలో 4.17 కోట్ల మంది జనాభా ఉన్నా వారిలో రెండో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కువ శాతం తెలుగు ప్రజలు ఉన్న ఊళ్లలో మాత్రం తెలుగులో కూడా బోర్డులు అమర్చగలరని చెప్పారు. వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉల్లి, బంగాళా దుంపల ధరలు పెరగనున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలుగా బంగాళాదుంపలు, ఉల్లిపాయల నిల్వలు ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిదని చెప్పారు. వ్యాపారస్తులు ఆన్లైన్ బిల్లింగ్ ద్వారా ప్రభుత్వానికి సక్రమంగా పన్ను చెల్లించాలని కోరారు. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ వల్ల జాతీయ రహదారులలో చెక్‌పోస్ట్‌లు ఎత్తివేశామని అన్నారు. ఉత్తమ వ్యాపారస్తులకు సన్మానం అనంతరం గంజాం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వావీ రామ నరసింగ రావు కొత్తగా సంఘంలో చేరిన, ప్రభుత్వానికి సక్రమంగా, సరైన పన్ను చెల్లించిన ఉత్తమ వ్యాపారస్తులను పేరుపేరున పిలవగా మంత్రి సూర్జో పాత్రో వారికి గౌరవ సన్మానం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి సంతోష్ కుమార్ సాహు, గౌరవ అతిథి మనోజ్ కుమార్ పాఢితో సహా జిల్లాలో గల వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొరాపుట్‌పై కరుణ
జయపురం : అవిభక్త కొరాపుట్ జిల్లాకు కేంద్రరైల్వే బడ్జెట్లో సముచిత స్ధానం లభించింది. కొన్ని దశాబ్దాలుగా ప్రతిపాదిత జయపురం–మల్కన్‌గిరి, జయపురం–నవరంగ్‌పూర్ రైల్వే మార్గాలకు కేంద్ర రైల్వే శాఖ ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేశారు. 130 కిలోమీటర్ల జయపురం–మల్కన్‌గిరి రైల్వేలైన్ కోసం ఈ బడ్జెట్లో రూ.95 కోట్లు మంజూరు చేయగా 38 కిలోమీటర్ల జయపురం–నవరంగ్‌పూర్ రైల్వే మార్గానికి రూ.150 కోట్లు మంజూరుచేసింది. అదేవిధంగా 116 కిలోమీటర్ల పొడవు కొరాపుట్–జగదల్పూర్ మధ్య రైలు మార్గం అభివృద్ధి చేసేందుకు రూ.116 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది నామమాత్రంగా నిధులు మంజూరు చేసిన కేంద్రం ఈ ఏడాది కరుణ చూపి నిధులు మంజూరు చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నిధులతో రెండు రైల్వే మార్గాలకు భూసేకరణతో పాటు పలు రైళ్లు కూడా ప్రారంభం కావచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. రైల్వే జంక్షన్‌గా జయపురం జయపురం–నవరంగ్‌పూర్, జయపురం–మల్కన్‌గిరి రైలు మార్గాల ఏర్పాటు జరిగితే జయపురం రైల్వేస్టేషన్ రైల్వే జంక్షన్‌గా రూపుదిద్దుకుంటుంది. దండకారణ్య ప్రాంతంలో జయపురం రైల్వేస్టేషన్ ఒక ప్రధాన రైల్వే జంక్షన్‌గా మారుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దండకారణ్యం ప్రాంతం మావోయిస్టు ప్రభావిత జిల్లా లతో కూడి ఉంది. ముఖ్యంగా మావోయిస్టులకు రక్షణ కవచంగా ఉంటున్న మల్కన్‌గిరి జిల్లాకు, నక్సల్ ప్రభావిత నవరంగ్‌పూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి జయపురం కేంద్ర బిందువు. అందువల్ల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్, నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి జిల్లాల రైలు మార్గాలకే కాకుండా జయపురం, కొరాపుట్ల మీదుగా విశాఖపట్నం వెళ్లే రైలు మార్గానికి జయపురం జంక్షన్ కాగలదనడంలో సందేహం లేదు. అంతేకాకుండా కొరాపుట్ నుంచి జయపురం మీదుగా జగదల్పూర్ వెళ్లే రైల్వే మార్గం అభివృద్ధికి బడ్జెట్లో రూ.116 కోట్లు కేటాయించడంతో బహుళ ఆదివాసీ ప్రాంతంలో రైల్వే సౌకర్యాలు మెరుగుపడేందుకు దోహద పడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొత్తగా రెండు రైల్వే మార్గాలు ఏర్పడుతుండడం వల్ల రైల్వే చరిత్రలో జయపురానికి మంచిస్థానం లభించే అవకాశాలు కన్పిస్తున్నాయని భావిస్తున్నారు. ఇంతవరకు రైల్వే మార్గాలు లేని ఒడిశాలో రెండు ఆదివాసీ జిల్లాలు రైల్వే చిత్రపటంలో చోటు చేసుకోనే అవకాశం కలుగుతోంది. అవిభక్త కొరాపుట్ ప్రాంతంలో మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాల్లో నేటికీ రైలు మార్గాలు ఏర్పాటు కాలేదు. ఈ రెండు జిల్లాల్లో అత్యధిక ప్రజలు రైలు ముఖం చూసి ఉండరంటే అతిశయోక్తి కాదు. అతివిలువైన ఖనిజ సంపద, జలసంపద, వ్యవసాయ సంపద గల ఈ రెండు జిల్లాలు నేటికీ అన్ని రంగాలలోను వెనుకబడి ఉన్నాయి. ప్రయాణ సౌకర్యలు లేక నాలుగు దశాబ్దాల కాలం నుంచి ఆ రెండు జిల్లాలలోను ప్రతిపాదిత పరిశ్రమలు, కర్మాగారాలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. అందువల్ల ఒడిశా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా నవరంగ్‌పూర్, మల్కనగిరి జిల్లాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాలను జయపురం రైల్వే మార్గంతో కలిపేందుకు నిధులు మంజూరు చేయడం వల్ల ఆ రెండు జిల్లాలు అభివృద్ధి చెందగలవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
పోలీసుల ఆధ్వర్యంలో వలస కార్మికుల నమోదు
రాయగడ : రాయగడ జిల్లాలోని 11 సమితుల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది గ్రామీ ణులు ఉపాధి కోసం కూలిపనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస కార్మికులుగా వెళ్తుంటా రు. కొన్ని సమయాల్లో వారు ఇతర రాష్ట్రాల్లో ప్రమాదాలకు గురి కావడం దళారుల గుప్పిట్లో నలిగిపోవడం, దోపిడీకి గురి కావడంతో పాటు సరైన వసతి, తిండి, లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆపైన ఒడిశా ప్రభుత్వం విషయం తెలుసుకుని కార్మికశాఖ ద్వారా వారిని వెతికి పట్టుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన దళారుల ద్వారా కార్మిక శాఖలో తమపేర్లు, వివరాలు, వెళ్లే ప్రాంతం, పనిచేసే పరిశ్రమల వివరాలను నమోదు చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని ప్రభుత్వం నియమ నిబంధనలు ఖరారు చేసినప్పటికి ఫలితం కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం రాయగడ జిల్లా పోలీసు అధికారి రాహుల్ పీఆర్ నేతృత్వంలో జిల్లాలో మొట్టమొదటిసారిగా గ్రామపంచాయతీల ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి పేర్ల నమోదు కార్యక్రమాన్ని మొదటిసారిగా జిల్లాలోని మునిగుడ సమితిలో కొత్తగా పంచాయతీ ఏర్పాటైన గుమిటిగుడలో బుధవారం ప్రారంభించారు. జిల్లా అంతటా నమోదు కార్యక్రమంలో భాగంగా సమితి సర్పంచ్, సమితి సభ్యుల ద్వారా పంచాయతీలో ఉన్నవారి పేర్లు, వేరే రాష్ట్రాలకు వెళ్లే వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఏఏ పరిశ్రమల్లో పనిచేస్తున్నది, ఎన్నిరోజులు వెళ్లారన్న సంపూర్ణ వివరాలు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ పీఆర్ మాట్లాడు తూ ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 11సమితుల్లో 181గ్రామ పంచాయతీల్లోనూ సంపూర్ణ నమో దు కార్యక్రమం పూర్తిచేసి కార్మికశాఖ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందు కోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ రాహుల్‌పీఆర్, అడిషనల్ ఏఎస్పీ అశోక్ సాహు, ఎన్జీఓ డాని యల్, రీజనల్‌డైరెక్టర్ ఉమేజయల్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చొట్రాయిడు, సర్పంచ్ మంజు ల బిడ్రిక, సమితి సభ్యులు దాలింబనాయక్, ఎస్డీపీఓ ఎ.పి.మాలిక్‌తో సహా ఇతర అధికా రులు పాల్గొన్నారు. -
రూ.7 కోట్ల గంజాయి పంటకు నిప్పు
సాక్షి, మల్కన్‌గిరి: చిత్రకొండ సమితి తర్లకోట పంచాయతీ కొల్లాగుడ గ్రామ సమీప అడవుల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను బలిమెల ఐఐసీ సుమిత్రా జెన్నా సిబ్బందితో వెళ్ళి ధ్వంసం చేశారు. కొల్లాగుడ అడవుల్లో మావోయిస్టుల సహకారంతో గిరిజనులు సుమారు 15 ఎకరాల్లో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారు. మావోయిస్టుల ప్రభావంతో ఆ ప్రాంతానికి ఇదివరలో ఎవరూ వెళ్లేవారు కాదు. అయితే ఇటీవల పోలీస్ దళాలు కూంబింగ్ విస్తృతంగా నిర్వహిస్తుండడంతో వారి కంటబడుతున్న గంజాయి తోటలను గుర్తించి సమచారం తెలియజేస్తుండడంతో అటవీశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది దాడి చేసి గంజాయి మొక్కలను కాల్చి ధ్వంసం చేస్తున్నారు. ఎన్నోసార్లు గిరిజనులను హెచ్చరిస్తున్నా మావోయిస్టుల అండతో గంజాయి సాగును యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది దాడులు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వరుస దాడులతో సుమారు రూ.15కోట్ల విలువైన సాగును ధ్వంసం చేశారు. శుక్రవారం కాల్చివేసిన గంజాయి సాగు విలువ సుమారు రూ.7 కోట్లు ఉండవచ్చని పోలీస్ అధికారి తెలియజేశారు. -
ఐదు కుటుంబాలకు... గ్రామ బహిష్కరణ
సాక్షి, మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి బోడ్డగెట్ట పంచాయతీలోని కూర్చు గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలను మావోయిస్టులు గ్రామ బహిష్కరణ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆదివారం రాత్రి గ్రామంలోకి సుమారు 30మంది మావోయిస్టులు వచ్చి గ్రామస్తులను పిలిపించి మాట్లాడారు. ఈ గ్రామంలోని ఐదు కుటుంబాలు పోలీసులకు ఎక్కువగా సహకరిస్తున్నారని, అలాగే రోడ్డు పనులు, సెల్ టవర్స్ పనులకు హాజరవుతూ సహకారం అందిస్తున్నారని గద్దించారు. ఆ ఐదు కుటుంబాలవారూ గ్రామం వదిలి వెళ్లిపోవాలని తీర్మానించారు. లేని పక్షంలో మరణ దండన తప్పదని హెచ్చరించారు. దీంతో భయాందోళన చెందిన ఆ గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల్లోని 20మంది సభ్యులు రాత్రికి రాత్రి సామాన్లు సర్దుకుని కొంతమంది బంధువుల ఇళ్లకు, మరికొంతమంది కలిమెల సమితి కేంద్రానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గామోహన్ మిశ్రాను సంప్రదించగా మావోయిస్టుల గ్రామ బహిష్కరణకు గురైన కుటుంబాలకు న్యాయం చేస్తామని, వారికి ఎక్కడైనా కొంత భూమిని చూపించి నివాసితులను చేస్తామని హామీ ఇచ్చారు. -
‘మిడిల్ కొలాబ్’ రాష్ట్రానికి గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదికి ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతిని ఒడిసిపట్టేం దుకు ఒడిశా రాష్ట్రం మిడిల్ కొలాబ్ ప్రాజెక్టును చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిం ది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, నీటి వినియోగం మొదలు పెడితే ఇంద్రావతి దిగువ రాష్ట్రమైన తెలంగాణకు నీటి లభ్యత తగ్గిపోతుందని గుర్తించింది. ఇంద్రావతి నీటి లభ్యత తగ్గడం మొదలు పెడితే మన రాష్ట్రం లో చేపట్టే బోఢాఘాట్ జల విద్యుత్ ప్రాజెక్టుకు నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం ఉంటుం దని అంచనాకు వచ్చింది. ఈ ప్రభావం దిగువన దేవాదుల ఎత్తిపోతలపైనా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మంత్రి ఆదేశాలతో నివేదిక.. ఈ నేపథ్యంలో ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ ఉన్నతాధికారులతో చర్చించారు. మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్టాలపై లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో నీటిపారుదల అధికారులు ఓ నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ఇంద్రావతి, కొలాబ్ నది కలిసేచోట మిడిల్ కొలాబ్ ప్రాజెక్టును 536.5 మీటర్ల నీటి మట్టంతో కొలాబ్ నదికి అడ్డంగా జోర్నాల వద్ద ఒడిశా చేపడుతోంది. కొలాబ్ దగ్గర వరద నీటిని తరలించేందుకు 35.50 కి.మీ. కాల్వ తవ్వనున్నారు. ఈ నీటిని కొలాబ్‌కు ఉపనది అయిన కెరజోడిపైన 4.19 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న డ్యామ్ కు తరలించేలా ప్రతిపాదించారు. ఇక్కడ 75 శాతం నీటి లభ్యత లెక్కన 36.88 టీఎంసీల నీరు లభ్యతగా ఉంటోంది. అలాగే డ్యామ్ వద్ద పవర్‌హౌస్‌ను ప్రతిపాదించారు. ఇక్కడ విద్యుదుత్పత్తికి వాడిన నీరు కొలాబ్ నదికి చేరేలా 264 మీటర్ల ఎత్తుతో మరో బ్యారేజీని నిర్మించనున్నారు. దీంతో 63,117 ఎకరాలకు ఈ బ్యారేజీ కింద సాగుకు నీరివ్వవచ్చు. ఈ ప్రాజెక్టుతో దిగువకు వచ్చే నీరు గోదావరిలోకి రాకుండా శబరిలోకి వెళ్లడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటున్నారు. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం దీనిపై ఇటీవలే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలిపింది. నదీ పరీవాహకంలో పర్యావరణ, వాతావరణ సమతు ల్యత ఉండేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించగా, ఈ అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సీడబ్ల్యూసీ, ఛత్తీస్‌గఢ్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే.. మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ బుధవారం ప్రభుత్వం గోదావరి బోర్డుకు లేఖ రాసింది. ఒడిశా ప్రాజెక్టుతో దిగువన తెలంగాణకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా, ప్రాజెక్టు ప్రతిపాదనలను మార్చాలని, డిజైన్లలో మార్పులు చేసి సవరించిన ప్రతిపాదనలు కోరాలని లేఖలో కోరింది. నీటి వినియోగం వివరాలు కూడా అందించేలా చూడాలని బోర్డుకు విన్నవించింది. ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరింది. -
ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
సాక్షి, భువనేశ్వర్: ఉత్తర భారత దేశంలో మంచు ప్రభావంతో రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లు బయల్దేరే వేళల్ని సవరించి ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఆలస్యంగా నడుపుతోంది. పూరీ నుంచి సోమవారం రాత్రి బయల్దేరాల్సిన 12801 పూరీ-న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం 7.15 గంటలకు బయల్దేరిందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ నెల 2వ తేదీ (మంగళవారం) ఉదయం 10.55 గంటలకు బయల్దేరాల్సిన 12875 పూరీ-న్యూఢిల్లీ నీలాచల్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 10 గంటలకు ఆలస్యంగా బయల్దేరుతుంది. సంబల్పూర్ నుంచి జమ్మూ-తావి ఎక్స్‌ప్రెస్ వేళను రీషెడ్యూల్ చేసి మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు ఆలస్యంగా నడిపిస్తున్నారు. -
తహసీల్దార్‌కు జైలు శిక్ష
సాక్షి, భువనేశ్వర్: లంచగొండి మహిళా తహసీల్దారు విజయిని విశ్వాల్‌కు న్యాయ స్థానం కారాగార శిక్ష విధించింది. ఆమె ప్రస్తుతం కేంద్రాపడా జిల్లా డిప్యుటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లోయిసింగి తహసీల్దార్‌గా పని చేసిన రోజుల్లో రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా ఆమె విజిలెన్స్ వలకు చిక్కారు. 2013వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక విజిలెన్స్ కోర్టు విజయిని విశ్వాల్‌కు 2 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ. 2వేల జరిమాన విధించింది. -
ఘోరం: కూర్చున్న వారిపై కత్తితో దాడి
ఒడిశా: గంజాం జిల్లా హింజిలికాట్ నియోజకవర్గం పరిధి బదిఅంబొ గ్రామంలో ఆదివారం ఘోరం జరిగింది. ఒకరి దాడిలో చిన్నారి, వృద్ధురాలు మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసిన నేరస్తుడిని గ్రామస్తులు విద్యుత్ స్తంభానికి కట్టి చిత్ర హింసలకు గురిచేశారు. సమాచారం తెలుసుకున్న హింజిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నేరస్తుడికి రక్షణ కల్పించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై ఐఐసీ ప్రశాంత్ కుమార్ సాహు, గ్రామస్తులు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. హింజిలికాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బదిఅంబొ గ్రామంలో వృద్ధురాలు కోమ్మ సెఠి(67) తన ఇంటి బయట అరుగుపై శనివారం ఉదయం కూర్చొని ఉంది. ఆమె పక్కనే ఆమె మనుమరాలు శ్రీయా సెఠి(4) ఆడుకుంటుంది. అయితే అదే గ్రామానికి చెందిన రంజన్ సెఠి ఒక్కసారిగా కోమ్మ సెఠిపై కత్తితో దాడి చేసి తీవ్రగాయాల పాలుచేశాడు. తర్వాత శ్రీయాసెఠిపై కూడా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలతో పడివున్న నాయనమ్మ, మనుమరాలిని గ్రామస్తుల సహాయంతో బంధువులు హింజిలికాట్ ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్సలు జరిపారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం ఎంకేసీజీ మెడికల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా కోమ్మసెఠి, శ్రీయాసెఠి మృతి చెందారు. జరిగిన సంఘటనపై బదిఅంబో గ్రామస్తులు ఆగ్రహానికి గురై నేరస్తుడు రంజన్ సెఠిని పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టి చిత్ర హింసలు పెట్టారు. సమాచారం అందుకున్న హింజిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నేరస్తుడు రంజన్ సెఠికి రక్షణ కల్పించారు. అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడికి కారణాలు పాతకక్షలు లేదా వైవాహిక సంబంధం ఉండవచ్చునని ఐఐసీ అధికారి ప్రశాంత్ కుమార్ సాహు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
మనస్తాపంలో 8ఎకరాల పంటను తగులబెట్టిన రైతు
వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని అన్నదాత బతుకు నానాటికీ అధ్వానంగా తయారవుతోంది. ఏటికేడాది అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి రైతుల కంట కన్నీరొలికిస్తున్నాయి. దొరికిన దగ్గర అప్పులు తెచ్చి, ఇంటిలో ఉన్న కాడికి బంగారాన్ని కుదువ పెట్టి ఆరుగాలం స్వేదం చిందించి పంట పొలాన్నే నమ్ముకునే రైతన్న ఏటా ఏదోలా దగా పడుతున్నాడు. రాయగడ జిల్లాకు చెందిన ఓ రైతు కష్టం, పెట్టుబడి అక్కరకు రాకుండా పోవడంతో కడుపుమండి పండించిన పంటను తగులబెట్టాడు. రాయగడ: రాయగడ జిల్లా గుణుపురం సబ్‌డివిజన్ రామన్నగుడ సమితి గజ్జిలిగుడ గ్రామానికి చెందిన రైతు ఎన్.అనంతరావు తన 8ఎకరాల వరిపంటను గురువారం తగులబెట్టాడు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అనంతరావు 8 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా పంట కోత దశకు వచ్చే సమయానికి సరైన ధాన్యం పండకుండా పొల్లు ధాన్యం పండాయి. అలాగే ధాన్యపు పంటకు బీబీహెచ్, చొకొడొ పురుగు పట్టడంతో వ్యవసాయం పూర్తిగా నష్టపోయాడు. ఇప్పటికే అనంతరావు తన బంగారాన్ని గుణుపురం ఇండియన్ బ్యాంక్‌లో కుదువ పెట్టాడు. అలాగే కుజేంద్రి బ్యాంక్‌లోను, రామన్నగుడలో వ్యవసాయ రుణాలు చేసి మదుపులు పెట్టాడు. వరికి పురుగు పట్టడంతో వ్యవసాయశాఖ అధికారుల సలహా తీసుకుని పురుగు మందులను వేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెంది పంటకు నిప్పు అటించాడు. విషయం తెలుసుకున్న గ్రామప్రజలు నిప్పును ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే ఈ ఘటనపై రామన్నగుడ బీడీఓ గులాంమక్సద్, ఇతర అధికారుల బృందం ఘటటాస్థలానికి వెళ్లి విచారణ చేశారు. ఈ సందర్భంగా రైతు అనంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అధికారుల ముందు వాపోయాడు. దీంతో బీడీఓతో సహా వ్యవసాయ శాఖ అధికారులు అనంతరావుకు కీటక నాశన మందులు సరఫరా చేసిన మందుల దుకాణంపై దాడులు చేయగా ఆ పురుగు మందులు నకిలీవని తెలియవచ్చింది. దీనిపై బీడీఓ విచారణ జరిపి జిల్లా అధికారులకు నివేదిక పంపనున్నారు. -
ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
రాయగడ: విహారం కోసం రాయగడ పట్నానికి వచ్చిన ఇద్దరు యువతులు నాగావళి నదిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది. విశాఖపట్నానికి చెందిన 9మంది యువతులు గురువారం ఉదయం సమతా ఎక్స్‌ప్రెస్‌లో రాయగడ వచ్చి స్థానిక మజ్జిగౌరి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం స్థానిక పర్యాటక స్థలం, నిషేధ ప్రాంతమైన జోళాబ్రిడ్జిని చూసేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. నిషేధ స్థలంలో క్రీడలు, స్నానాలతో సహా వివిధ భంగిమల్లో సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో ఒక యువతి నీటిలో మునిగిపోగా ఆమెను రక్షించే క్రమంలో మరో యువతి కూడా నది నీటిలో మునిగి మృతిచెందింది. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను వెతకగా నాగావళి నది ఒడ్డుకు 5కిలోమీటర్ల దూరంలో గల గురుంగుడ వద్ద లభ్యమయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒకరిని రక్షించబోయి మరొకరు కూడా విశాఖపట్నంలో పనిచేస్తున్న 9మంది యువతులు దీపావళి పండగ సెలవుల సందర్భంగా రాయగడ మజ్జిగౌరి మందిరం దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ఆటో డ్రైవర్‌ను రూ.300కు మాట్లాడి పర్యాటక స్థలాలు చూసేందుకు వెళ్లారు. మొదట నాగావళి నదిపై గల జోళా బ్రిడ్జిని చూసేందుకు వెళ్లి బ్రిడ్జిని చూసిన అనంతరం నాగావళి నదిలో దిగి సెల్ఫీల కోసం విభిన్న భంగిమల్లో డ్యాన్సులు చేస్తూ నీటి మధ్య ఫొటోలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో విశాఖపట్నంలోని మురళీనగర్‌కు చెందిన ఇమంది జ్యోతి(27) ముందుగా నీటిలో పడిపోయింది. ఆమెను రక్షించే క్రమంలో విజయనగరం పట్టణానికి చెందిన సింగపురి దేవి(21) కూడా నదిలో కొట్టుకుపోయింది. వీరితో పాటు ఉన్న టి.సుభాషిణి(32) సి.లక్ష్మి(31) పి.స్వర్ణలేఖ(25) జి.రూప(27) జి.లక్ష్మి(21)ఎం.స్వాతి(25) సి.దేవి(22)ఉన్నారు. వీరంతా ప్రమాదస్థలంలో కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు తెలియజేశారు. పోస్ట్‌మార్టం వాయిదా తక్షణమే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి గాలింపు చేపట్టారు. మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చిన అనంతరం పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మిగిలిన 7గురు యువతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేసి కేసులు నమోదు చేశారు. సాయంత్రం 5గంటల వరకు మృతుల కుటుంబసభ్యులు చేరుకోలేకపోవడంతో పోస్ట్‌మార్టం శుక్రవారం జరగనున్నట్లు తెలిసింది. -
ఆ తూటాలు రెండవ ప్రపంచ యుద్ధం నాటివి..
జయపురం(ఒడిశా): జయపురంలోని జిల్లా పారిశ్రామిక కేంద్రం కార్యాలయం వెనుక ప్రాంతంలో ఇటీవల ఒక పాయికానా ట్యాంక్‌లో 700కు పైగా లభించిన తుపాకీ తూటాలు 1925 నాటివని అనుమానిస్తున్నారు. ట్యాంక్‌లో లభించిన తూటాలపై ఉన్న వివరాల ప్రకారం అవి జపాన్, ఇంగ్లండ్ దేశాలలో తయారైనవిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ తూటాలు 1935–1945 మధ్యకాలంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో వినియోగించేవారని అభిప్రాయ పడుతున్నారు. దాదాపు నాలుగు అంగుళాల పొడవున ఉన్న ఆ తూటాలు ఆ కాలంలోనే వినియోగించేవారు. జయపురంలో లభించిన తూటాలు వాడనివి. ఆ తూటాలు ఇక్కడికి ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో వాడిన తూటాలు నేడు జయపురంలో ఒక పాయికానా ట్యాంక్‌లో బయటపడడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళా ఫార్మసిస్టు మృతి
ఒడిశా ,భువనేశ్వర్ : నగరానికి చెందిన ఓ మహిళా ఫార్మసిస్టు అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతిచెందింది. ఆమె హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక చంద్రశేఖర్‌పూర్ కానన్ విహార్ ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన మేరకు ఆమె మెడపై కత్తి గాట్లను గుర్తించారు. ఈ పరిస్థితుల్లో ఆమె హత్యకు గురైనట్లు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఫోరెన్సిక్ విభాగం రంగంలోకి దిగి ఈ మృతిపై దర్యాప్తు చేపట్టింది. నగర కమిషనరేట్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. జగత్సింగ్పూర్ జిల్లా ఎరసమాకు చెందిన హసీనా దాస్ స్థానిక అపోలో ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పని చేస్తోంది. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని స్థానిక క్యాపిటల్ ఆస్పత్రికి తరలించినట్లు జంట నగరాల పోలీసు కమిషనర్ వై బి ఖురానియా తెలిపారు. -
స్వపక్షంలో విపక్షం
రాయగడ(ఒడిశా): జిల్లాలో ప్రతి అభివృద్ధి పనిలో అధికారపార్టీ నాయకుల జోక్యంతో అవినీతి పెరిగిపోతోంది. ప్రతి ఒక్క సంఘటనలో అధికార పార్టీ నాయకులు కలుగచేసుకుని శాంతిభద్రతలకు సంపూర్ణంగా విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు కలుగచేసుకోవాలని రాయగడ జిల్లా పరిషత్ సభ్యుడు అధికార పార్టీకి చెందిన పట్నాన గౌరీశంకర్ నిలదీశారు. జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా లాల్‌బిహారీ హిమరికను నియమించిన తరువాత రాయగడ డీఆర్డీఏ కాన్ఫరెన్స్ సమావేశ భవనంలో ఆయన అధ్యక్షతన తొలి సమావేశాన్ని(16వ జిల్లా ప్రణాళిక కమిటీ) శనివారం నిర్వహించారు. గోపబంధు గ్రామీణ యోజన 2017–18 యాక్షన్ ప్లాన్ ఆమోదానికి సంబంధిత కమిటీ సమావేశాన్ని నిర్వహించగా ప్రజాప్రతినిధుల చర్చలు, సమస్యలు, వివరించే సమయంలో బీజేడీకి చెందిన జెడ్పీ సభ్యుడు మాట్లాడుతూ భారీపరిశ్రమల్లో అధికార పార్టీ నాయకులు కలుగచేసుకోవడం వల్ల జిల్లాలో వేదాంత అల్యుమిన, ఇంఫా, పరి శ్ర మ, జేకే పరిశ్రమ, ఉత్కళ అల్యుమిన పరిశ్రమల్లో జిల్లాకు సంబంధించి ఏ ఒక్క నిరుద్యోగికీ ఉద్యోగావకాశం లభించడం లేదని వాపోయారు. ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగావకాశాలు కల్పించగా ఈ జిల్లాలో యువత నిరుద్యోగులుగా మారి స మాజంలో సంఘవిద్రోహలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిళ్లకు అధికారులు లొంగొద్దు జిల్లాలో దాదాగిరి, గుండాయిజం, దౌర్జన్యాలు, పెరిగిపోయాయి. జిల్లా అధికారులు అధికారపార్టీ నాయకుల ఒత్తిడికి లొంగకూడదు. పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి రాజకీయ ఒత్తిడి లేకుండా అధికారులు విధులను నిర్వహిస్తూ జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని నేరుగా అధికారపార్టీ నాయకులను ఉద్దేశించి ఆవేదన వెలిబుచ్చారు. సబ్సిడీలు అందుకుని మూసివేత చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం రుణాలు, సబ్సిడీలు ఇస్తుండగా ఏ ఒక్క చిన్న తరహా పరిశ్రమలో కూడా స్థానిక విద్యార్థులకు ఉద్యోగావకాశం కల్పించలేదని సబ్సిడీ అందిన పిదప పరిశ్రమలను మూసివేస్తున్నారని గౌరీశంకర్ ఆరోపించారు. కంపెనీలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని కూలీలు, కార్మికులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పనిచేయిస్తున్నారని స్థానికులకు అవకాశం కల్పించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చేపట్టే అభివృద్ధి పథకాలు తక్కువ రోజుల్లో కూలిపోతున్నాయని జిల్లా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలవంచకుండా పనిచేయాలని అభ్యర్థించారు. ఈ సమయంలో వేదికపై ఉన్న అధికారపార్టీ రాజకీయ నాయకుల ముఖాలు కళావిహీనంగా మారాయి. -
ఘోరం.. నడిరోడ్డుపై ప్రసవం
జయపురం(ఒడిశా): నడిరోడ్లపైన, ఆటోలలోను, ఆరుబయట ప్రదేశాలలోను గర్భిణులు ప్రసవిస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి సంఘటనలు పునరావృతం కాకండా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు శూన్యంగా ఉన్నాయి. అందుచేత గర్భిణులు పురిటి నొప్పులతో రోడ్లపై ప్రసవిస్తున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితిలో ఒక గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు 102 అంబులెన్స్ రాకపోవడంతో బంధువులు ఆమెను మోసుకు వెళ్తుండగా రోడ్డుపైనే జోలిలో మగబిడ్డను ప్రసవించింది. ఈ సంఘటన జిల్లాలో జననీ సురక్షా పథకాలు, 102 అంబులెన్స్‌ల పనితీరును, మారుమూల గ్రామీణ ప్రాంతాల దురావస్థను చాటి చెబుతోంది. కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితిలోని మారుమూల దుర్గమ ప్రాంతం ముర్జ గ్రామ పంచాయతీలోని కుసుమపుట్ గ్రామం. గ్రామానికి చెందిన జునేశ్ జానీ భార్య సువాలొంగ్ గర్భిణి. ఆమె శనివారం పురిటి నొప్పులతో మెలికలు తిరుగుతూ బాధపడుతుంటే భర్త వెంటనే ఈ విషయం గ్రామంలోని ఆశా కార్యకర్తకు తెలియజేశాడు. ఆమె వచ్చి పరిస్థితిని చూచి 102 అంబులెన్స్‌కు ఫోన్‌చేసి వెంటనే రమ్మని కోరింది. అయితే మచ్ఛపుట్–కుసుముపుట్ గ్రామాల మధ్య రహదారి బాగులేక పోవడం వల్ల అంబులెన్స్ రాలేక పోయింది. మరోమార్గం లేక గర్భిణి బంధువులు ఆమెను ఒక జోలీలో మోసుకువెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఆమె ప్రసవించింది. అయితే అమెను హాస్పిటల్‌కు చేర్చాలన్న లక్ష్యంతో అంబులెన్న ఉన్న చోటువరకు తల్లీబిడ్డలను బంధువులు మోసుకువెళ్లారు. అక్కడినుంచి తల్లీబిడ్డలను దశమంతపూర్ కమ్యూనిటీ వైద్య కేంద్రానికి తరలించారు. అధ్వానంగా రహదారులు ముఖ్యంగా జిల్లాలో అనేక గ్రామాలకు రహదారులు లేకపోవడం, ఉన్నా అవి గతకుల మయమై వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, తదితర కారణాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామప్రాంతాలలో రహదారులను అభివృద్ధి చేసేందుకు, పంచాయతీలతో గ్రా మ ప్రాంతాలను సంధానపరిచేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నా అత్యధిక గ్రామాలు, ముఖ్యంగా మారు మూల దర్గమ ప్రాంతాలలో గల గ్రామాలకు రోడ్లు లేకపోవడం వల్ల ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. -
ఏజెన్సీలో ఎదురుకాల్పులు
♦ మావోయిస్టుల స్థావరంపై పోలీసుల దాడి ♦ తప్పించుకున్న ముఖ్యనేతలు సునీల్, సురేష్ ♦ కూంబింగ్ జరుపుతున్న రెండు రాష్ట్రాల బలగాలు అరకులోయ: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల కంచుకోటలా చెప్పుకునే గన్నెల పంచాయతీ చీడివలస, కెంటిసడి, సబక, ఒడిశా రాష్ట్రం సింగర్గుడ్డి, ముట్టిసింగ, తైడా, బంగారుగుడ్డి గ్రామాల మధ్య కొండపై మావోయిస్టుల స్థావరంపై పోలీసులు దాడి చేయడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఉదంతానికి సంబంధించి సంఘటన ప్రాంతంలో లభించిన ఆధారాలు, గిరిజనులు, అధికారుల కథనం ప్రకారం వివరాలు.. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ డివిజన్ కార్యదర్శి సునీల్, ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యుడు సురేష్‌లు ఏఓబీ సెక్రటరీ దయ ఆదేశాల మేరకు గురువారం రాత్రి దాదాపు 60 మంది మావోయిస్టులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమాచారం ఆంధ్రా పోలీసులకు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని ముట్టడించారు. గమనించిన మావోలు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. సునీల్, సురేష్‌లతోపాటు కొందరు మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. సంఘటన స్థలం వద్ద మూడు, నాలుగు ఎస్ఎల్ఆర్ తుపాకీలు, 40 కిట్ బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా, మావోలు తప్పించుకుపోతున్న సమాచారాన్ని ఆంధ్రా పోలీసులు కోరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్‌కు చేరవేశారు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ రంగంలోకి దిగి కోరాపుట్ నుంచి మావోయిస్టులకు ఎదురు వస్తూ కూంబింగ్ మొదలుపెట్టింది. సంఘటన స్థలం నుంచి పోలీసులను, కిట్ బ్యాగులను హెలికాప్టర్లలో తరలించారు. ఏడాదిగా ఇక్కడ మావోలు స్థావరం ఏర్పరుచుకున్నట్టు సమాచారం. -
లోగుట్టేంటి?
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఒడిశా రాష్ట్రం నుంచి పొట్టచేత పట్టుకుని వలస వచ్చిన కూలీలు తాడిపత్రి వద్ద ఉన్న ‘గెర్డెవ్ స్టీల్స్’ కంపెనీలో ఇరుక్కుపోయారు. ఊరుగాని ఊరు.. భాష తెలియదు.. వీరిని కంపెనీ యాజమాన్యం నిర్బంధించి కూలి డబ్బులు కూడా ఇవ్వకుండా రెండు నెలలుగా పని చేయించుకుంటోంది. సమాచారం బయటి ప్రపంచానికి తెలియకుండా కూలీల వద్ద సెల్ఫోన్లను కూడా కాంట్రాక్టరు లాక్కున్నాడు. ఈ పరిస్థితుల్లో ఒక కూలీ అతి కష్టంపై సెల్ ఫోన్ సంపాదించి తమ కష్టాల గురించి ఒడిశాలోని బంధువులకు చెప్పుకున్నాడు. వారు ఆ రాష్ట్రంలోని గంజాం జిల్లా కలెక్టర్‌కు విషయాన్ని చేరవేసి తమ వారిని కాపాడండని మొర పెట్టుకున్నారు. దీంతో అక్కడి కలెక్టర్ మన రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌కు విషయం తెలిపి నిర్బంధంలో ఉన్న కూలీలను విడిపించి సొంత ఊర్లకు పంపేందుకు చర్యలు తీసుకోమని కోరారు. ఒడిశా కూలీలు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కాంట్రాక్టరు నిర్బంధలో ఉండి పోయారని, వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందన్న వార్తలు పీటీఐ (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)లో మంగళవారమే వెలువడ్డాయి. పీటీఐ వార్తలో అనంతపురం జిల్లా అని మాత్రమే పేర్కొన్నారు కానీ నిర్దిష్టంగా కార్మికులు ఎక్కడ వెట్టి చాకిరి చేస్తున్నారో తెలపలేదు. దీంతో ఈ విషయాన్ని ‘సాక్షి’ మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకువచ్చింది. ఒడిశా ప్రభుత్వ అధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారమూ రాలేదని వారిద్దరూ తెలిపారు. అయితే వాస్తవంగా ఈ సమయానికే (మంగళవారం సాయంత్రం) జిల్లా కార్మిక శాఖ అధికారులు 18 మంది కార్మికులను గుట్టుచప్పుడు కాకుండా తాడిపత్రి నుంచి అనంతపురం తీసుకు వచ్చి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కించి ఒడిశాకు పంపించేశారు. జిల్లా అధికారులకు కానీ, తాడిపత్రిలోని రెవిన్యూ, పోలీసు అధికారులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కనీసం బాధితులను మీడియా ముందుకు కూడా తేకుండా ఇలా గుట్టు చప్పుడు కాకుండా ఆ కూలీలను పంపించిన తీరు చూస్తే జిల్లా కార్మిక శాఖ అధికారుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యంతో లాలూచీనే కారణమా..? కూలీలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న యాజమాన్యం, కాంట్రాక్టరుతో జిల్లా కార్మిక శాఖ అధికారులు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని.. కూలీలను ఇలా గుట్టుచప్పుడు కాకుండా తరలించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే అంత రహస్యంగా వారిని తరలించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోనీ మంగళవారం సాయంత్రం 7 గంటలకు కూలీలను అనంతపురంలో రైలు ఎక్కించే ముందు అయినా, ఎక్కించాక అయినా ఈ విషయాన్ని మీడియాకు తెలిపేందుకు వారికి కావాల్సినంత సమయం ఉన్నా వారు ఆ పని చేయలేదు. వారిని రైలు ఎక్కించి, ఆ కూలీలు రాష్ట్ర సరిహద్దు కూడా దాటిపోయాక తీరిగ్గా బుధవారం రాత్రి మీడియాకు కూలీలను విడిపించామని నాలుగు వాక్యాల పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారం అంతా చూస్తే కార్మిక శాఖ అధికారులు ఆ కంపెనీ యాజమాన్యంతోనో, కంట్రాక్టరుతోనో లాలూచీ పడి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. యాజమాన్యంపై కేసేదీ..? కార్మిక శాఖ అధికారులు ఇచ్చిన ప్రకటన మేరకే ఒడిశా కార్మికులు గరుడ స్టీల్స్ ప్రాంగణంలో కాంట్రాక్టరు నిర్బంధంలో పనిచేస్తున్నారు. వీరికి రెండు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. ఆ కార్మికులకు చెల్లించాల్సిన రెండు నెలల వేతనాలు ఇప్పించామని తమ ‘ఘనకార్యాన్ని’కూడా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటనలో అక్రమ నిర్భంధం, బెదిరించడం, వేతనాలు చెల్లించకపోవడం, తదితర చట్ట ఉల్లఘనలకు ఆ యాజమాన్యం పాల్పడ్డట్లు స్పష్టం అవుతోంది. అలాంటప్పుడు వలస కూలీలను రెలైక్కించి తమ పని పూర్తయిపోయిందన్నట్లుగా కార్మిక శాఖ అధికారులు వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఐపీసీ, లేబర్ చట్టాల కింద సంబంధిత కంట్రాక్టరు, యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిన అధికారులు అసలు ఆ ఊసే ఎత్తకపోవడం చూస్తుంటే భారీ మొత్తంలోనే ఒప్పందం కుదిరిందేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అధికారులు కూలీలను రైలు ఎక్కించే సమయంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు కొందరు కూలీలు గాయాలతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు ఏమి జరిగిందన్న విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
దయనీయం.. భయానకం
ఒడిశా రాష్ట్రంలోని భాగ్వాడ జిల్లాకు చెందిన వలస కార్మికులు జిల్లాలోని ఇటుక బట్టీల్లో దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. పొట్ట చేతపట్టుకొని పిల్లాపాపలతో ఇక్కడికి వచ్చిన అభాగ్యుల పట్ల ఇటుక బట్టీల నిర్వాహకులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో బట్టీల వద్ద గుడిసెల్లో బంధించి వారి చేత బలవంతంగా పనులు చేయిస్తున్నారు. తమ బాధలు చెప్పుకుందామంటే భాష రాక, నిర్బంధం నుంచి బయటపడే దారి తెలియక కన్నీళ్లతో కష్టాలను దిగమింగుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఒడిశా కార్మికులు, వారి కుటుంబాల పట్ల బట్టీల యజమానుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తుండగా, అది నిజమేనని చొప్పదండి ఘటనతో వెల్లడైంది. హైదరాబాద్‌లోని ఓ ఎన్జీవో పలుమార్లు అధికారులతో సంప్రదించి కార్మికుల దుర్భర జీవితాన్ని, ఇటుక బట్టీల యజమాని వికృత చేష్టలను కరీంనగర్ జిల్లా లోక్‌సత్తా ఉద్యమ సంస్థ నాయకుల సహకారంతో బయటపెట్టింది. ఇటుక బట్టీ యజమాని లింగంపల్లి కిషన్ ముక్కుపచ్చలారని ముగ్గురు బాలికలపై లైంగికదాడికి పాల్పడగా, పోలీసులు నిర్భయ చట్టం కేసు నమోదు చేశారు. -
ఒడిశా నుంచి గంజాయి రవాణా
సాలూరు/టౌన్, న్యూస్‌లైన్ : గంజాయి అక్రమ రవాణాకు ఎక్సైజ్ పోలీసులు చెక్ పెట్టారు. ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రా మీదుగా కటక్‌కు రవాణా అవుతున్న గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి పాచిపెంట మండలం పి.కోనవలస వద్దనున్న ఎక్సైజ్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నా రు. అదే సమయంలో జైపూర్ నుంచి ఆంధ్రా సరిహద్దు మీదుగా కటక్ వెళ్తున్న బస్సును సోదా చేశారు. బస్సు లో అక్రమంగా తరలిస్తున్న 21 కిలోల గంజాయిని చెక్‌పోస్ట్ సీఐ సతీష్‌కుమార్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నాలుగు మూటల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మూటలను తరలిస్తున్న నీలాంబర్కిలోతోపాటు అతని భార్య సైథీకిలో, కుమార్తె కలమాకిలో, సమీప బంధువు బల్లు సీసాలను అదుపులోకి తీసుకున్నారు. వీరిది ఒడిశాలోని చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరి ధి గ్రామంగా గుర్తించామని సాలూరు ఎక్సైజ్ సీఐ ఎస్వీ రమణమూర్తి తెలిపారు. వీరు జైపూర్ నుంచి కటక్‌కు ఈ మూటలను తరలిస్తున్నారని, గంజాయి విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. బొడ్డవరలో 9.9 కిలోల స్వాధీనం శృంగవరపుకోట : ఆర్టీసీ బస్సులో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని స్థానిక ఎక్సైజ్ శాఖ సిబ్బంది శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. ఎస్.కోట ఎక్సైజ్ సీఐ డి.గోపాలకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల విధుల్లో భాగంగా బొడ్డవరలో ఏర్పాటు చేసిన ఔట్‌పోస్టు వద్ద హెచ్.సి రాముడు, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు సత్యనారాయణ, జయరామ్‌నాయుడు వాహన తనిఖీ లు చేపడుతున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో కించుమండ నుంచి విశాఖ వెళ్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీ చేశారు. బస్సులో ముగ్గురు వ్యక్తుల వద్ద ఉన్న రెండు సంచులను తనిఖీ చేయగా.. గంజాయి బయటపడింది. ఒక వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్‌లో 4.8 కిలోలు, మరొక వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్‌లో 5.1 కిలోల గంజాయి లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న సీఐ గోపాలకృష్ణ, ఎస్సై పద్మావతి అక్కడకు చేరుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, సరుకును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడ్డ వ్యక్తులు మహరాష్ట్ర థానే జిల్లాలో భీవాండి పట్టణానికి చెందిన అక్రముద్దీన్ షేక్, అబ్దుల్ ఖయామ్ అన్సారీ, సంజయ్ చంగ్లానీలుగా గుర్తించామని సీఐ చెప్పారు. వీరు రవాణా చేస్తున్న గంజాయి శీలావతి రకానికి చెందినదని, దీని విలువ రూ.20 వేలు ఉంటుందని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. వారపు సంతలే అడ్డాగా అక్రమ రవాణా కురుపాం : ఏజెన్సీలో నిర్వహిస్తున్న వారపు సంతలే అడ్డాగా కొంతమంది అక్రమార్కులు గంజాయిని అక్రమంగా తరలించేస్తున్నారు. ముఖ్యంగా మండలంలోని మొండెంఖల్, నీల కంఠాపురం ఏజెన్సీ వారపు సంతల్లో అధిక మొత్తంలో గంజాయిని సేకరించి నీకలంఠాపురం సరిహద్దులు, శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మీదుగా మైదాన ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల నిఘా లేకపోవడంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోతోంది. ఇదే అదునుగా అక్రమార్కులు దొంగనోట్ల చెలామణి కూడా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దొంగనోట్ల మార్పిడికి కూడా వారపు సంతల నే కేంద్రంగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. -
కోణాదిత్యుడికి కోటి దండాలు..
సూర్యభగవానుడు అన్ని జీవులపట్ల సమదృష్టి కలిగిన వాడు. ఆరోగ్యప్రదాత. సకల శాస్త్రపారంగతుడు, మహా వ్యాకరణవేత్త అయిన ఆంజనేయునికే గురువు. ఆయన లేనిదే వృక్షజాతులు మనలేవు. నేత్రవ్యాధులు, శత్రుబాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మండలం రోజులపాటు ఆదిత్యహృదయాన్ని పారాయణ చేస్తే ఆయా బాధలు పటాపంచలవుతాయని ప్రతీతి. సూర్యునికి ప్రపంచవ్యాప్తంగా గల ఆలయాల్లో ఒడిశా రాష్ట్రంలోని కోణార్కలో గల సూర్యదేవాలయం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ ఆలయ విశేషాలివి... పదమూడవ శతాబ్దంలో గంగవంశానికి చెందిన నరసింహదేవుడు నిర్మించిన కోణార్క సూర్యదేవాలయ నిర్మాణ వైశిష్ట్యం అత్యద్భుతం, అనితర సాధ్యం. ఏడుగుర్రాలు లాగుతున్నట్లుగా ఉన్న 24 చక్రాలు గల సూర్యరథంపై రాతితో నిర్మించిన ఈ ఆలయంలో కొలువై ఉంటాడు ఏడుగుర్రాల రేడు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడి కుమారుడే ఇక్కడి సూర్యభగవానుడి మూర్తిని ప్రతిష్టించినట్లు ఓ ఆసక్తికరమైన కథనం ప్రాచుర్యంలో ఉంది. శ్రీకృష్ణునికి, జాంబవతికి పుట్టిన సాంబుడనే వాడు ఆకతాయితనంతో అంతఃపురస్త్రీలు స్నానం చేస్తున్న ప్రదేశానికి వెళ్లాడు. దాంతో కోపించిన శ్రీకృష్ణుడు కుష్టువ్యాధిగ్రస్థుడవు కావలసిందని సాంబుణ్ణి శపించాడు. సాంబుని ప్రార్థన మేరకు ఆ వ్యాధిని పోగొట్టుకోవాలంటే సూర్యారాధన చేయాలని చెబుతాడు కృష్ణుడు. తండ్రి చెప్పినట్లుగా సాంబుడు సూర్యారాధనకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ, ఓఢ్రదేశం (నేటి ఒడిశా) చేరతాడు. అక్కడ చంద్రభాగానదిలో స్నానం చేస్తూ, అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్యుని పూజిస్తుంటాడు. ఓ రోజు స్నానం చేస్తుండగా తామరపుష్పంపై కొలువై ఉన్నట్లుగా ఉన్న సూర్యభగవానుని మూర్తి నదిలో దొరుకుతుంది. ఆశ్చర్యంగా సాంబుడి వ్యాధి కూడా తగ్గిపోతుంది. అందుకు సంతోషించిన సాంబుడు సూర్యుడికి ఆలయం నిర్మించి, ఆ ప్రతిమను అందులో ప్రతిష్ఠిస్తాడు. శిథిలమైన ఆ ఆలయాన్నే నరసింహదేవుడు పునర్నిర్మించి, సూర్యవిగ్రహాన్ని పునఃప్రతిష్టించాడన్నమాట. నేత్ర, చర్మవ్యాధులతో బాధపడేవారు కోణాదిత్యుని సేవించి, తమ వ్యాధులకు ఉపశమనం పొందుతుంటారు. - డి.వి.ఆర్.