ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (పాత చిత్రం)
భువనేశ్వర్ : రాష్ట్రానికి మహానదీ జలాల పంపిణీలో జరుగుతున్న అన్యాయంపట్ల ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రంలో అధికార పక్షం బిజూ జనతా దళ్ మహానది సురక్షా యాత్రను బుధవారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఝార్సుగుడ జిల్లా లఖన్‌పూర్ సమితి సుఖొసొడా, బర్‌గడ్ జిల్లా చిఖిలి ప్రాంతాల నుంచి ఈ ఉద్యమాన్ని ఒకే రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ మహానది జలాల్ని న్యాయసమ్మతంగా సాధించేంత వరకు నిరవధికంగా ఉద్యమించాలని పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి పిలుపునిచ్చారు. అన్యాయాలకు పాల్పడుతున్న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ వ్యవహారాలకు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి బహిరంగ ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం, భారతీయ జనతా పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నాయి.
వర్షాకాలం మినహా ఇతర కాలాల్లో మహా నది నీటి మట్టం తగ్గిపోయి రాష్ట్ర రైతులు అల్లాడుతున్నారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలపట్ల భారతీయ జనతా పార్టీకి వాస్తవంగా ఏమాత్రం అంకితభావం ఉన్నా మహానది ఎగువ భాగంపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు నిర్మాణాలపట్ల బహిరంగంగా వ్యతిరేకత ప్రదర్శించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సవాల్ విసిరారు. బ్యారేజీ నిర్మాణం..సమస్యను పరిష్కరిస్తుందని కొందరు బీజేపీ నాయకులు వక్కాణించడంపట్ల నవీన్ పట్నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యారేజీ నిర్మాణం నీటి నిల్వకు మాత్రమే దోహదపడుతుందన్నారు. ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్న నాయకులు ఇటువంటి వ్యాఖ్యల్ని చేసి పబ్బం గడపడం విచారకరమంటూ ఎద్దేవా చేశారు.
మహానది రాష్ట్రానికి ప్రతీక
ఝార్సుగుడ జిల్లాలో కార్యక్రమం ముగించుకుని మహానది ఆవలి తీరం బర్‌గడ్ జిల్లా అంబొభొణా సమితి చిఖిలి గ్రామంలో పర్యటించి ముఖ్యమంత్రి మహా నది సురక్షా యాత్రను ప్రారంభించారు. ఏక కాలంలో మహా నది ఉభయ తీరాల్లో బిజూ జనతాదళ్ పాదయాత్ర నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. మహానది రాష్ట్ర ప్రజల జీవన రేఖ. రాష్ట్ర సంస్కృతి, సామాజిక, ఆర్థిక రంగాలు ఈ నదీ తల్లి ప్రవాహంతో పెన వేసుకుపోయాయి. రాష్ట్ర ప్రతీక మహానది. ఈ నది సంరక్షణ మన కర్తవ్యంగా స్వీకరించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మహానది జలాల సంరక్షణ కోసం ఛత్తీస్‌గఢ్ ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని బిజూ జనతా దళ్ అ«ధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు.
15 రోజులు 15 జిల్లాలు
మహానది జలాలపై న్యాయ సమ్మతమైన హక్కులు, అధికారాల పరిరక్షణ కోసం రాష్ట్రంలో బిజూ జనతా దళ్ మహానది సురక్షా యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర 15 రోజులపాటు నిరవధికంగా కొనసాగుతుంది. మహానది ఉభయ తీరాల్లోని 15 జిల్లాల్లో బీజేడీ కార్యకర్తలు నిత్యం పాదయాత్ర నిర్వహిస్తారు. ఝార్సుగుడ, బర్‌గడ్, సంబల్‌పూర్, సువర్ణపూర్, బౌధ్, అనుగుల్, ఢెంకనాల్, నయాగడ్, కటక్, ఖుర్దా, జాజ్‌పూర్, కేంద్రాపడ, పూరీ, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లో మహానది సురక్షా యాత్ర కొనసాగుతుంది. పాదయాత్రను పురస్కరించుకుని ఈ జిల్లాల్లో దారి పొడవునా చైతన్య సభలు, సమావేశాలతో సాయంత్రం వేళల్లో వీధి నాటకాలు ఇతరేతర సామాజిక స్పృహ కార్యక్రమాల్ని బిజూ జనతా దళ్ కార్యకర్తలు నిర్వహిస్తారు. మహానది తీరం ఇరువైపులా ప్రముఖ మందిరాల్లో సామూహిక దీపారాధన చేపడతారు. ఈ కార్యక్రమాల్లో కార్మిక శాఖ మంత్రి సుశాంత సింగ్, చేనేత, జౌళి, హస్త కళల శాఖ మంత్రి స్నేహాంగిని చురియా, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ ప్రసన్న ఆచార్య ఇతరేతర పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment