ఒడిశా: గంజాం జిల్లా హింజిలికాట్ నియోజకవర్గం పరిధి బదిఅంబొ గ్రామంలో ఆదివారం ఘోరం జరిగింది. ఒకరి దాడిలో చిన్నారి, వృద్ధురాలు మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసిన నేరస్తుడిని గ్రామస్తులు విద్యుత్ స్తంభానికి కట్టి చిత్ర హింసలకు గురిచేశారు. సమాచారం తెలుసుకున్న హింజిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నేరస్తుడికి రక్షణ కల్పించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై ఐఐసీ ప్రశాంత్ కుమార్ సాహు, గ్రామస్తులు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. హింజిలికాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బదిఅంబొ గ్రామంలో వృద్ధురాలు కోమ్మ సెఠి(67) తన ఇంటి బయట అరుగుపై శనివారం ఉదయం కూర్చొని ఉంది. ఆమె పక్కనే ఆమె మనుమరాలు శ్రీయా సెఠి(4) ఆడుకుంటుంది.
అయితే అదే గ్రామానికి చెందిన రంజన్ సెఠి ఒక్కసారిగా కోమ్మ సెఠిపై కత్తితో దాడి చేసి తీవ్రగాయాల పాలుచేశాడు. తర్వాత శ్రీయాసెఠిపై కూడా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలతో పడివున్న నాయనమ్మ, మనుమరాలిని గ్రామస్తుల సహాయంతో బంధువులు హింజిలికాట్ ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్సలు జరిపారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం ఎంకేసీజీ మెడికల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా కోమ్మసెఠి, శ్రీయాసెఠి మృతి చెందారు. జరిగిన సంఘటనపై బదిఅంబో గ్రామస్తులు ఆగ్రహానికి గురై నేరస్తుడు రంజన్ సెఠిని పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టి చిత్ర హింసలు పెట్టారు. సమాచారం అందుకున్న హింజిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నేరస్తుడు రంజన్ సెఠికి రక్షణ కల్పించారు. అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడికి కారణాలు పాతకక్షలు లేదా వైవాహిక సంబంధం ఉండవచ్చునని ఐఐసీ అధికారి ప్రశాంత్ కుమార్ సాహు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment