సాక్షి, తిరువొత్తియూరు: పేకాట సందర‍్భంగా ఏర‍్పడిన ఘర‍్షణ ఒక యువకుని హత‍్యకు దారితీసింది. నలుగురి ఎదుట ఘర‍్షణకు దిగడంతో అవమానంగా భావించిన యువకుడు స్నేహితుడిని మందు పార్టీకి పిలిచి కత్తితో పొడిచి హత‍్యచేశాడు. ఈ సంఘటన తమిళనాడులో సోమవారం చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండికు తరలించారు. చెన్నై ఐసీఎఫ్ కక్కన్‌జీ నగర్‌కు చెందిన దిలీప్ కుమారుడు ప్రకాశ్ (20) విల్లివాక్కంలో ప్రవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
అదే ప్రాంతానికి చెందిన సూర్య (22)తో ఇతనికి స్నేహం ఉంది. వీరిద్దరూ రెండు రోజుల కిందట పేకాట ఆడుతుండగా ఘర్షణ ఏర్పడింది. ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో పక్కనున్నవారు సర్దిచెప్పి పంపారు. అయితే ప్రకాశ్‌పై సూర్య కక్ష పెంచుకున్నాడు. ఈ స్థితిలో సోమవారం ఉదయం 7.00 గంటలకు ప్రకాశ్ ఇంటికి వెళ్ళిన సూర్య కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుందాం రమ‍్మని పిలిచాడు. ఇద్దరూ ఐసీఎఫ్ సమీపంలో ఉన్నముళ్ల పొదల్లోకి వెళ్లి మద్యం సేవించారు.
ఆ సమయంలో సూర్య తాను తెచ్చుకున్న కత్తితో ప్రకాశ్‌ను విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. సూర్య అనుమానాస్పదంగా పరిగెత‍్తడం గమనించిన స్థానికులు ముళ్లపొదల్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ప్రకాశ్ ప్రకాశ్ పడిఉండడాన్ని చూసి ఐసీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రకాశ్ మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి సూర్యను అరెస్టు చేశారు. ప్రకాశ్ తనపై దాడి చేయడంతో అవమానంగా భావించి హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment