పరిగి: పాతకక్షలను మనసులో పెట్టుకుని స్నేహితుడినే హతమార్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు నాటకం ఆడారు. పోలీసులు దర్యాప్తులో నిజం తేలడంతో కటకటాలు లెక్కపెడుతున్నారు. ఈనెల 18వ తేదీ రాత్రి పరిగి మండలంలోని బీచిగానిపల్లిలో జరిగిన యుగేంద్ర(19) హత్య కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హిందూపురం అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ బీటీ నాయుడు మీడియాకు వెల్లడించారు.
బీచిగానిపల్లికి చెందిన బూచర్ల యుగేంద్ర, రాచూరి అంజినేయులు అలియాస్ అంజి, నడింపల్లి మంజునాథ్ స్నేహితులు. హిందూపురంలోని కట్టకింద ఉన్న శివ అనే వ్యక్తి దగ్గర పెయింటింగ్ పనులు చేసేవారు. గ్రామానికే చెందిన ఓ యువతి విషయంలో అంజికి, యుగేంద్రకు విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆరునెలల క్రితం యుగేంద్ర కొత్త బైకు కొనుగోలు చేశాడు. రాత్రి ఇంటిముందు నిలపగా...నిప్పుపెట్టారు.ఈ ఘటనలో అంజి నిందితుడిగా పోలీసులు భావించారు. అయినప్పటికీ అందరూ స్నేహితులు, సమీప బంధువులు కావడంతో యథావిధిగా కలిసే పనికి వెళ్తుండేవారు.
మద్యం తాగుదామని పిలిపించి...
ఓ రోజు యజమాని శివ పని విషయంలో అంజి, మంజులను మందలిస్తూ చేయిచేసుకున్నాడు. ఇందుకు యుగేంద్రే కారణమని వారు భావించారు. అప్పటి నుంచి వారిద్దరూ యుగేంద్రపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 18న ఉదయం అంజి, మంజు సోమందేపల్లి మండలంలోని కేతగానిచెరువుకు వెళ్లి కల్లు తాగారు. అనంతరం ఎలాగైనా యుగేంద్రను హతమార్చాలని పథకం పన్నారు. అనంతరం సాయంత్రం ఇద్దరూ బీచిగానిపల్లికి వచ్చారు. అదే రోజు రాత్రి యుగేంద్రకు ఫోన్ చేసిన అంజి, మంజునాథ్ మద్యం తాగుదామని గ్రామ సమీపంలోని ఓ పొలం వద్దకు పిలిపించుకున్నారు.
అక్కడికి చేరుకున్న యుగేంద్రను తొలుత బండరాయితో ముఖంపై బలంగా కొట్టారు. ఆపై వెంట తెచ్చుకున్న సూరకత్తితో గొంతు కోశారు. అంతటితో ఆగకుండా అతని మర్మాంగాన్ని సైతం కత్తితో కోశారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు గ్రామస్తుల ముందు నటించారు. యుగేంద్ర హత్య కేసును దర్యాప్తు చేసిన హిందూపురం అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ బీటీ నాయుడు, అప్పటి ఇన్‌చార్జ్ ఎస్‌ఐ శ్రీనివాసులు... అంజి, మంజునాథ్‌లపై అనుమాన పడ్డారు. ఆ తర్వాత గ్రామస్తులతో విచారణ చేపట్టారు. పాతకక్షలతోనే అంజి, మంజునాథ్ యుగేంద్రను హత్య చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ విషయం తెలుసుకున్న నిందితులు పరారు కాగా, పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే శుక్రవారం మండలంలోని గొల్లపల్లి వద్ద అంజి, మంజునాథ్‌లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, యుగేంద్ర సెల్ ఫోన్‌ను స్వాధీనం చేశారు. అనంతరం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. కేసును వేగవంతంగా ఛేదించడంలో కృషి చేసిన ఎస్‌ఐలు నరేంద్ర, శ్రీనివాసులుతో పాటూ పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు.
(చదవండి: ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్)
Comments
Please login to add a commentAdd a comment