కుమార్తెతో శ్రీకాంత్, అనురాధ దంపతులు (ఫైల్)
సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన మైలాపూర్ వృద్ధ దంపతుల హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంట్లో బిడ్డగా ఆదరిస్తే...చివరకు వృద్ధ దంపతుల పాలిట ఆ నేపాలీ డ్రైవర్ యముడయ్యాడు. రూ.40 కోట్ల కోసం ఆ ఇద్దర్ని చిత్ర హింసలకు గురి పెట్టి చంపేశాడు. నగదు దొరక్క పోవడంతో ఇంట్లో ఉన్న నగలతో ఉడాయించి ఆంధ్ర రాష్ట్రం ఒంగోలులో పట్టుబడ్డాడు. ఫిర్యాదు వచ్చిన 6 గంటలలోనే ఆంధ్రా పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మైలాపూర్ అసిస్టెంట్ కమిషనర్ కన్నన్ తెలిపారు.
చదవండి: బ్యాచిలర్స్ అద్దెకుంటున్న ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి
నేపథ్యం ఇదీ..
చెన్నై మైలాపూర్‌లో వృద్ధ దంపతుల్ని హతమార్చి బంగారు నగలు, వెండి వస్తువులతో తప్పించుకు వెళ్తున్న నేపాల్‌కు చెందిన లాల్ కృష్ణ(45), అతడి మిత్రుడు రవి రాయ్(45)ను ఒంగోలు వద్ద శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పట్టుబడ్డ నిందితులను చెన్నైకు తీసుకొచ్చి ప్రశ్నించారు.
11 ఏళ్లుగా ఇంట్లో ఒకడిగా..
మైలాపూర్‌కు చెందిన ఆడిటర్ శ్రీకాంత్(60), అనురాధ(55) దంపతులకు చెన్నై శివారులోని నెమలిచ్చేరిలో ఫామ్ హౌస్ ఉంది. ఇక్కడ నేపాల్‌కు చెందిన లాల్ కిషన్ 20 ఏళ్లుగా సెక్యూరిటీగా పనిచేశాడు. ఆ కుటుంబానికి ఎంతో నమ్మకస్తుడిగా ఉండే వాడు. అనారోగ్య సమస్యలతో లాల్ కిషన్ నేపాల్‌కు వెళ్లి పోయాడు. అదే సమయంలో నేపాల్ నుంచి వచ్చిన లాల్ కిషన్ కుమారుడు లాల్ కృష్ణ ఆ ఇంట్లో డ్రైవర్‌గా చేరారు. 11 ఏళ్ల పాటుగా ఆ ఇంట్లో ఒకడిగా లాల్ కృష్ణ మెలిగాడు.
మూడు నెలలుగా పథకం..
మూడు నెలల క్రితం కారులో వెళ్తున్న సమయంలో ఓ స్థలం అమ్మకం విషయంగా ఎవరితోనో శ్రీకాంత్ ఫోన్లో మాట్లాడటాన్ని లాల్ కృష్ణ గమనించాడు. ఆ బేరం రూ.40 కోట్లకు కుదిరినట్టు, ఆ సొమ్ము ఇంట్లో ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. ఈ సొమ్ముపై కన్నేసిన లాల్‌కృష్ణ జీవితంలో స్థిర పడేందుకు ఇదే సమయంగా భావించాడు. అదే సమయంలో ఈ దంపతులు ఇద్దరు తమ కుమార్తె సునంద ప్రసవం నిమిత్తం అమెరికాకు వెళ్లి పోయారు. ఆ నగదు కోసం ఫామ్ హౌస్, ఇళ్లు అంతా గాలించినా ఎక్కడ చిక్కలేదు. ఈ పరిస్థితుల్లో డార్జిలింగ్‌కు చెందిన మరో డ్రైవర్ రవిరాయ్‌కు తన పథకాన్ని వివరించారు. అతడు అంగీకరించడంతో విదేశాల నుంచి ఆ దంపతులు రాగానే అమలుకు ఇద్దరూ సిద్ధమయ్యారు.
ముందుగానే గోతిని తవ్వి
శుక్రవారం వేకువ జామున దుబాయ్ మీదుగా చెన్నైకు వచ్చి దంపతుల్ని లాల్ కృష్ణ కారులో ఎక్కించుకుని మైలాపూర్ ఇంటికి వెళ్లారు. అక్కడ రవిరాయ్ సాయంతో ఇద్దర్ని కట్టి పడేశాడు. రూ. 40 కోట్ల కోసం చిత్ర హింసలు పెట్టారు. చెప్పకపోవడంతో శ్రీకాంత్, అనురాధను కర్రతో కొట్టి చంపేశారు. చివరికి నగదు దొరక్క పోగా, దంపతుల వద్ద ఉన్న తాళం తీసుకుని ఇంట్లోని లాకర్, అలమారాల్లో ఉన్న నగలు, వెండి వస్తువుల్ని ఎత్తుకుని కారులో పెట్టారు. అలాగే, ఆ దంపతుల మృత దేహాల్ని గోనెసంచుల్లోకి కుక్కి కారులో పడేశారు. ఇంటిని శుభ్రం చేసి, అక్కడి నుంచి నెమలిచ్చేరిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ముందుగా అక్కడ తవ్వి పెట్టిన గోతిలో ఇద్దర్ని పాతి పెట్టి నేపాల్‌కు తప్పించుకు వెళ్లే యత్నం చేశారు.
మృతదేహాల వెలికితీత..
ఒంగోలు నుంచి నిందితులు ఇద్దరిని చెన్నైకు ఆదివా రం పట్టుకొచ్చారు. వీరి వద్ద నుంచి 9 కేజీల బంగా రు ఆభరణాలు, 70 కేజీల వెండి వస్తువుల్ని, విదేశా ల నుంచి ఆ దంపతులు తీసుకొచ్చిన ఐదు బ్యాగుల్ని, అందులో ఉన్న వస్తువుల్ని స్వా«దీనం చేసుకున్నా రు. శ్రీకాంత్, అనురాధా దంపతుల్ని పాతి పెట్టిన చోటే వారి సెల్‌ఫోన్లను ఈ నిందితులు తగల పెట్టి ఉండటం వెలుగు చూసింది. వైద్యులు, రెవిన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాల్ని వెలికి తీశారు. పోస్టుమార్టం అనంతరం రాయపేట ఆస్పత్రికి తర లించారు.
అసిస్టెంట్ కమిషనర్ కన్నన్ మాట్లాడుతూ ఆడిటర్ కారు, నిందితులు ఉపయోగించిన సెల్ నెంబర్ల ఆధారంగా తమ ప్రత్యేక బృందాలు ఆంధ్రా వైపుగా దూసుకెళ్లాయని వివరించారు. ఆంధ్రా పోలీసుల సహకారంతో ఒంగోలులో అరెస్టు చేశామని తెలిపారు. వీరు నేపాల్‌కు పారి పోయి ఉంటే, ఇంటర్ పోల్‌సాయంతో పట్టుకునేందుకు కనీసం రెండేళ్లు సమయం పట్టి ఉండేదన్నారు. రూ. 40 కోట్ల కోసమే ఈ హత్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేవని, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వివరించారు.
6 గంటల్లోనే కేసు ఛేదించాం..
తల్లిదండ్రుల ఫోన్లు పనిచేయక పోవడం, లాల్ కృష్ణ స్పందించక పోవడంతో అనుమానం వచ్చిన కుమార్తె సునంద బంధువులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం తమకు ఫిర్యాదు రాగానే, మైలాపూర్ అసిస్టెంట్ కమిషనర్ కన్నన్ సీసీ కెమెరాలను పరిశీలించారు. శ్రీకాంత్ ఇన్నోవా కారు తొలుత నెమలిచ్చేరి వైపుగా వెళ్లడం, మళ్లీ నగరంలోకి వచ్చి ఆంధ్రా వైపుగా వెళ్లడాన్ని గుర్తించారు. ఆంధ్రా పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో ఒంగోలు టోల్‌గేట్ వద్ద నిందితులు ఇద్దరూ పట్టుబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment